ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ..! | A Hallmark Of India's Earliest Textile-Making Civilization Was Craftsmanship | Sakshi
Sakshi News home page

ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ..!

Published Sun, Aug 4 2024 12:43 AM | Last Updated on Sun, Aug 4 2024 12:43 AM

A Hallmark Of India's Earliest Textile-Making Civilization Was Craftsmanship

పొందూరు ఖద్దరు చీరలు

ఉప్పాడ జాంధానీ చీరలు

సిద్దిపేట గొల్లభామ చీరలు

పోచంపల్లి ఇక్కత్‌ చీరలు

పుట్టపాక రుపియన్‌ చీరలు

ధర్మవరం రాజ్‌వాడీ చీరలు

వెంకటగిరి పత్తి చేనేత చీరలు

మానవ పరిణామంలోని తొలి నాగరిక కళ చేనేత. నాగరికతల ప్రస్థానంలో ఇది పడుగు పేకల పోగుబంధం. ఇది తరతరాల చేనేత కళాకారుల రంగుల కళ. ఆచ్ఛాదనతో అందానికి మెరుగులు దిద్దే అరుదైన కళ. ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ. ఒంటికి హత్తుకుపోయే చేనేత వస్త్రాల సుతిమెత్తదనాన్ని ఆస్వాదించాలనుకోవడం ఒక రంగుల కల.

నాగరికతకు తొలి గుర్తు వస్త్ర«ధారణ. వస్త్రాలను తయారు చేసే చేనేత తొలి నాగరిక కళ. చేనేత వెనుక సహస్రాబ్దాల చరిత్ర ఉంది. పత్తి నుంచి నూలు వడికి వస్త్రాలను నేయడం క్రీస్తుపూర్వం 3000 నాటికే విరివిగా ఉండేది. ఉన్ని కంటే పత్తితో వస్త్రాలు నేయడం సులువు కావడంతో వివిధ ప్రాచీన నాగరికతల ప్రజలు చేనేత వస్త్రాలవైపే మొగ్గు చూపేవారు. సింధులోయ నాగరికత వర్ధిల్లిన మొహెంజదారో శిథిలాల్లో ప్రాచీన చేనేతకు సంబంధించిన ఆనవాళ్లు, నాణ్యమైన నూలు దారపు పోగులు, అద్దకానికి ఉపయోగించే రంగుల అవశేషాలు ఉన్న కుండలు దొరికాయి.

ఇవి మన దేశంలో చేనేత కళ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మరమగ్గాల వినియోగం పెరిగినప్పటి నుంచి చేనేత ప్రాభవం కొంత తగ్గుముఖం పట్టిందేగాని, అదృష్టవశాత్తు కొన్ని ఇతర ప్రాచీన కళల మాదిరిగా అంతరించిపోలేదు. చేనేతకు మన దేశంలో ఇప్పటికీ అద్భుతమైన ఆదరణ ఉంది. కొన్ని నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేతకు చిరునామాగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా చేనేతను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీ కోసం...

మన దేశంలో వారణాసి, చందేరి, జైపూర్, సూరత్, పానిపట్, లక్నో, భదోహీ, అల్మోరా, బాగేశ్వర్, కోటా, మహేశ్వర్, చెన్నై, కంచి, కన్నూర్, కాసర్‌గోడ్, మైసూరు, మంగళూరు, భాగల్‌పూర్, బంకా, ముర్షిదాబాద్, బిష్ణుపూర్, ధనియాఖలి, సంబల్‌పూర్, బరంపురం వంటి ఎన్నో నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేత కళను, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. తమ ప్రత్యేకతను చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019–20లో విడుదల చేసిన లెక్కల ప్రకారం మన దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు పూర్తిగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. చేనేత రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 43 లక్షలకు పైగానే ఉంటుంది. చేనేత రంగంలో నేత, అద్దకం, నేతకు సంబంధించిన ఇతర పనులను చేసే ఈ కార్మికుల్లో దాదాపు 70 శాతం మహిళలే! దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయగలగడమే కాకుండా, తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నారు.

ఫ్యాషన్లలోనూ చేనేత ముద్ర..
యంత్రాల ద్వారా తయారయ్యే వస్త్రాల్లోని యాంత్రికతకు భిన్నంగా ఉండటమే చేనేత వస్త్రాల ప్రత్యేకత. అందుకే, ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా, చేనేత వస్త్రాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూనే వస్తున్నాయి. చేనేత కార్మికుల కళానైపుణ్యం, ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కే వారి సృజనాత్మకత కారణంగా కూడా ఆధునిక ఫ్యాషన్ల పోటీని చేనేత వస్త్రాలు సమర్థంగా తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. రంగులు, డిజైన్లు, అద్దకం పద్ధతుల్లో చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మన దేశంలో తయారయ్యే చేనేత చీరలు, పంచెలు, తువ్వాళ్లు, దుప్పట్లు, ఇతర వస్త్రాలకు విదేశాల్లో కూడా బాగా గిరాకీ ఉంది.

మన దేశం నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లండ్స్, గ్రీస్, పోర్చుగల్, స్వీడన్, యూఏఈ, మలేసియా, ఇండోనేసియా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఇరవైకి పైగా దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్‌ డాలర్లు (రూ. 93,931 కోట్లు) విలువ చేసే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల కంటే 6.71 శాతం ఎక్కువ. ఆధునిక ఫ్యాషన్ల హవాలోనూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా, పెరుగుతూ వస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.

తెలుగు రాష్ట్రాల్లో చేనేత చిరునామాలు..
మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతకు చిరునామాలైన ఊళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొందూరు మొదలుకొని వెంకటగిరి వరకు, తెలంగాణలో పోచంపల్లి మొదలుకొని గద్వాల వరకు చేనేత కళలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఊళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణం ఖద్దరు చేనేతకు చిరకాలంగా ప్రసిద్ధి పొందింది. పొందూరు ఖద్దరు హోదాకు చిహ్నంగా గుర్తింపు పొందింది. పొందూరు ఖద్దరు పంచెలను అమితంగా ఇష్టపడేవారిలో మహాత్మాగాంధీ సహా ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి సినీ ప్రముఖులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. పొందూరు ఖద్దరు నాణ్యత చూసి ముచ్చటపడిన గాంధీజీ, ఆ నేత మెలకువలను నేర్చుకునేందుకు తన కొడుకు దేవదాస్‌ గాంధీని పొందూరుకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పొందూరు చేనేత కళాకారులు బల్ల భద్రయ్య, జల్లేపల్లి కాంతమ్మ గత ఏడాది ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

కాకినాడ జిల్లా ఉప్పాడ చేనేత కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని ఉప్పాడ పరిసరాలకు చెందిన ఎనిమిది గ్రామాల్లోని చేనేత కార్మికులు సంప్రదాయ జాంధానీ చీరల నేతలో అత్యంత నిష్ణాతులు. ఈ గ్రామాల్లో తయారయ్యే చీరలు ఉప్పాడ జాంధానీ చీరలుగా ప్రసిద్ధి పొందాయి. బంగారు, వెండి జరీ అంచులతో రూపొందించే ఉప్పాడ జాంధానీ చీరలకు జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) గుర్తింపు లభించింది. కర్నూలు జిల్లా కోడుమూరు చేనేత కార్మికులు గద్వాల చీరల నేతకు ప్రసిద్ధి పొందారు. ఇదే జిల్లా ఆదోనిలో చేనేత కార్పెట్లు, యోగా మ్యాట్లు వంటివి తయారు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ప్రాచీన కాలంలోనే అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన ఘనత సాధించారు. ఇక్కడి చీరలకు కూడా జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) దక్కింది. బంగారు తాపడం చేసిన జరీతో రూపొందించిన ధర్మవరం చీరలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఫ్యాషన్‌ ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులకు దీటుగా ఇక్కడి చేనేత కళాకారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తూ, తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారు. 

తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్‌ చీరలకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి ఇక్కత్‌ చీరలు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లినప్పుడు ఫ్రాన్స్‌ అధ్యక్షుడి భార్య బ్రిగేటే మెక్రాన్‌కు పోచంపల్లి ఇక్కత్‌ చీరను ప్రత్యేకంగా బహూకరించారు. పోచంపల్లిలో తయారయ్యే పట్టు, నూలు చీరలు, డ్రెస్‌ మెటీరియల్స్, దుప్పట్లు, రజాయిలు, స్టోల్స్‌ స్కార్వ్స్, కర్టెన్లు వంటి వాటికి సూడాన్, ఈజిప్ట్, ఇండోనేసియా, యూఏఈ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పోచంపల్లి మండలం జలాల్‌పూర్‌ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రాపోలు రామలింగం 2015లో జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వచ్చినప్పుడు పోచంపల్లి చేనేత కళాకారులు భోగ బాలయ్య, సరస్వతి దంపతులు తాము స్వయంగా నేసిన భారత చిత్రపటం గల వస్త్రాన్ని బహూకరించారు.

నల్లగొండ జిల్లా పుట్టపాక గ్రామం తేలియా రుమాల్‌ వస్త్రాల తయారీకి ప్రసిద్ధి పొందింది. నేతకు ముందుగా దారాన్ని నువ్వుల నూనెలో నానబెట్టి తయారు చేసే ఈ వస్త్రాలకు జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) గుర్తింపు కూడా లభించింది. పుట్టపాక గ్రామం తేలియా రుమాల్‌ వస్త్రాలతో పాటు దుపియన్‌ చీరలకు కూడా అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. పుట్టపాక వస్త్రాలు ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మనసు దోచుకున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటివారు పుట్టపాక వస్త్రాలకు ఫిదా అయిన వారే! ఇక్కడి తేలియా రుమాల్‌ వస్త్రాలు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, లండన్‌ మ్యూజియంలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. పుట్టపాక చేనేత కళాకారులు గజం గోవర్ధన్, గజం అంజయ్య ‘పద్మశ్రీ’ అవార్డు పొందారు. ఇక్కడకు సమీపంలోని ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం ఆసు యంత్రం తయారీకి గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పొందారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ‘పద్మశ్రీ’ అవార్డు పొందడం దేశంలోనే అరుదైన విశేషం.

మన దేశంలో 5000 ఏళ్ల చరిత్ర!
మన దేశంలో చేనేతకు ఐదువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. సింధులోయ నాగరికత కాలం నుంచి ఇక్కడి జనాలు వస్త్రాలను నేసేవారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ చేనేతకారుల కుటుంబం కనీసం ఒక్కటైనా ఉండేది. పదహారో శతాబ్ది నాటికి చేనేత ఉత్కృష్టమైన కళ స్థాయికి ఎదిగింది. మంచి నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులకు రాజాదరణ ఉండేది. ఎందరో రాజులు తమ విజయగాథల చిత్రాలను చేనేత వస్త్రాలపై ప్రత్యేకంగా నేయించుకునేవారు. మొగల్‌ పరిపాలన కొనసాగినంత కాలం మన దేశంలో చేనేతకు అద్భుతమైన ఆదరణ ఉండేది.

బ్రిటిష్‌ హయాంలో మరమగ్గాలు ప్రవేశించడంతో చేనేతకు గడ్డురోజులు మొదలయ్యాయి. బ్రిటిష్‌వారు ఇక్కడి నుంచి నూలును ఇంగ్లండ్‌కు తరలించి, అక్కడి మిల్లుల్లో తయారయ్యే వస్త్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మేవారు. ఈ పరిస్థితి కారణంగానే ఖద్దరు ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మారాయి. బెంగాల్‌ విభజనకు వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమం’ 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైంది. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7ను కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా అప్పట్లో మహాత్మాగాంధీ స్వయంగా రాట్నం నుంచి నూలు వడికేవారు.

అప్పట్లో ఊరూరా ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు గాంధీజీ పంథాలోనే రాట్నంపై నూలు వడికి, ఆ నూలుతో నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. బ్రిటిష్‌ పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైంది. సంప్రదాయ కుటీర పరిశ్రమగా చేనేత పరిశ్రమ ఈనాటికీ కొనసాగుతోంది. వస్త్రధారణలో వస్తున్న మార్పులను, జనాల అభిరుచుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, తనను తాను నవీకరించుకుంటూ చేనేత పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

దేశవ్యాప్తంగా ఉన్న 16 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌), 28 చేనేతకారుల సేవా కేంద్రాలు ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాయి. పలుచోట్ల చేనేత వస్త్రాల ప్రదర్శనలను నిర్వహిస్తాయి.

చేనేతలో మన ఘనత..
– చేనేత చీరలు కేవలం చీరలు మాత్రమే కాదు, ఏ చీరకు ఆ చీరను ఒక కళాఖండంగా పరిగణిస్తారు ఫ్యాషన్‌ నిపుణులు. అంతర్జాతీయ ఫ్యాషన్‌ నిపుణులు తమ సేకరణలో భారత్‌ చేనేత చీరలను తప్పకుండా చేర్చుకోవడమే మన చేనేత ఘనతకు నిదర్శనం.

– ప్రపంచవ్యాప్తంగా వినిగించే చేనేత వస్త్రాల్లో మన దేశంలో తయారైనవి 95 శాతం వరకు ఉంటాయి. చేనేతలో ఇప్పటికీ మనది తిరుగులేని స్థానం.

– చేనేత వస్త్రాల తయారీలో బెనారస్‌ మొదలుకొని కంచి వరకు ఏ ప్రాంతానికి చెందిన వైవిధ్యం ఆ ప్రాంతానికే సొంతం. చేనేత కళలోని ఈ వైవిధ్యం కారణంగానే వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) గుర్తింపును సాధించగలిగాయి.

– చేనేత పరిశ్రమ మన దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. వస్త్రాల రూపకల్పన శైలిలో సంప్రదాయ పరంపర, ప్రాంతీయ వైవిధ్యం, సృజనాత్మకత, అసాధారణ నైపుణ్యం ఫలితంగా మన చేనేత కళాకారులు అంతర్జాతీయంగా కూడా మన్ననలు పొందగలుగుతున్నారు.

– భారత గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నది చేనేత రంగమే!

– మన దేశం నలుమూలలకు చెందిన 65 చేనేత ఉత్పత్తులకు, ఆరు ఉత్పత్తి చిహ్నాలకు జాగ్రఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) ఉంది. ఇన్ని ఉత్పత్తులకు జీఐ లభించడం చేనేత పరిశ్రమ వైవిధ్యానికి నిదర్శనం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement