Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత? | Role Of Farmers And Laborers In The Development Of The Country Funday Cover Story | Sakshi
Sakshi News home page

Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత?

Published Sun, Apr 28 2024 8:54 AM | Last Updated on Sun, Apr 28 2024 8:54 AM

Role Of Farmers And Laborers In The Development Of The Country Funday Cover Story

ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశంలోని కర్షకులు, కార్మికుల పాత్ర కీలకం. కార్మికశక్తిని సద్వినియోగం చేసుకుంటున్న దేశాలు, కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న దేశాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే, కార్మిక సంక్షేమాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేసిన దేశాలు దిగజారుతున్నాయి. కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకోని దేశాలు ఆర్థిక, సామాజిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ తరచు అలజడులకు, అశాంతికి ఆలవాలంగా ఉంటున్నాయి. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు మాత్రమే కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకుంటున్నాయి. కార్మికులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. చట్టబద్ధంగా మెరుగైన వేతనాలు అందేలా చూస్తున్నాయి. భారత్‌ సహా చాలా దేశాలు కార్మిక సంక్షేమాన్ని తగిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయా దేశాల్లో కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.

అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి గుర్తుగా ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నా, కార్మికుల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడిన దాఖలాలు లేకపోవడం విచారకరం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశ దేశాల్లోని కార్మికుల స్థితి గతులు, కార్మిక సంక్షేమంలో వివిధ దేశాలు సాధించిన సాఫల్య వైఫల్యాలపై ఒక పరిశీలన. కార్మికుల హక్కులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్న దేశాలలో, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లిస్తున్న దేశాలలో అతిపెద్ద ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్‌ వంటి దేశాలు లేకపోవడం విడ్డూరం.

కార్మికుల హక్కులకు భరోసా కల్పించడంలోను, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడంలోనూ యూరోపియన్‌ దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. వీటితో పోల్చుకుంటే, అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ప్రపంచ విపణిలో జబ్బలు చరుచుకుంటున్న దేశాల్లో కార్మికుల పరిస్థితులు అంత గొప్పగా లేవు. చాలా దేశాల్లో కార్మికుల పని పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం గగనంగా ఉంటోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) ఏటా విడుదల చేసే కార్మిక హక్కుల సూచిని (లేబర్‌ రైట్స్‌ ఇండెక్స్‌) పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఐఎల్‌ఓ గత ఏడాది విడుదల చేసిన లేబర్‌ రైట్స్‌ ఇండెక్స్‌–2022 జాబితా ప్రకారం...

వారంలో పనిగంటలు, వార్షిక కనీస వేతనాలు మాత్రమే కాకుండా, కార్మికుల సగటు వార్షిక వేతనాలు, సమానమైన విలువ కలిగిన పనికి సమానమైన వేతనాల చెల్లింపు, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఏడాదిలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రభుత్వ సెలవు దినాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘన సంఘటనల సంఖ్య, కార్మికులు పనిచేసే చోట పని పరిస్థితులు, పని ప్రదేశంలో ప్రమాద నివారణ ఏర్పాట్లు, కార్మికుల ఆరోగ్య భద్రత, కార్మికులకు వైద్య సౌకర్యాలు, కార్మికులకు సంఘటితమయ్యే అవకాశాలు, సామాజిక భద్రత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎల్‌ఓ ఏటా లేబర్‌ రైట్స్‌ ఇండెక్స్‌ను రూపొందిస్తుంది.

ఈ జాబితాలోని మొదటి పది దేశాల్లో ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న దేశాలేవీ లేవు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలలోనైతే కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంటోంది. సాంకేతికత అభివృద్ధి చెంది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటివి అందుబాటులోకి వచ్చినా, మురుగు కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు ఇంకా మనుషులే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.

‘కోవిడ్‌’ దెబ్బకు పెరిగిన నిరుద్యోగం..
‘కోవిడ్‌’ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై విపరీతంగా ప్రభావం చూపింది. దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘కోవిడ్‌’ కారణంగా నిరుద్యోగం బాగా పెరిగింది. ఉపాధి కోసం తగిన అవకాశాలు లేక కార్మికులు అసంఘటిత రంగంలోకి చేరుతున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు వంటివి దక్కే పరిస్థితులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్న కార్మికుల్లో 58 శాతం– అంటే, దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి పనిచేసే చోట ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేవు.

సంఘటిత రంగంలో అవకాశాలు దక్కకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే కార్మికులు అసంఘటిత రంగం వైపు మళ్లుతున్నారని, విపరీతమైన శ్రమదోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పలు ఆఫ్రికా దేశాలు, భారత్‌ సహా దక్షిణాసియా దేశాలలో అసంఘటిత కార్మికులు 75 శాతానికి పైగానే ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. భారత్‌లోని మొత్తం కార్మికుల్లో అసంఘటిత రంగంలో పనిచేసేవారు 83 శాతంగా ఉన్నారు. ‘కోవిడ్‌’కు ముందు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 22.2 శాతం ఉంటే, ‘కోవిడ్‌’ తర్వాత 23.5 శాతానికి పెరిగారు.

వీరెవరూ చదువు కొనసాగించడమో, నైపుణ్యం పెంచుకోవడానికి శిక్షణ పొందడమో చేయడం లేదు. చిన్నా చితకా పనులు కూడా చేయడం లేదు. ఇలా పూర్తిగా ఖాళీగా ఉన్న యువత సంఖ్య ‘కోవిడ్‌’ తర్వాత 28.90 కోట్లకు చేరుకుంది. పనిచేసే వయసులో ఉన్న యువత ఇలా ఖాళీగా ఉండటం వల్ల ప్రపంచ ఆర్థికరంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ‘కోవిడ్‌’కు ముందు మన దేశంలో 7.22 శాతం ఉన్న నిరుద్యోగం, లాక్‌డౌన్‌ ప్రకటించిన నెల్లాళ్లకే 23.52 శాతానికి చేరుకుంది. ‘కోవిడ్‌’ పరిస్థితులు చక్కబడటంతో లాక్‌డౌన్‌ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు తిరిగి యథావిధిగా పనులు ప్రారంభించడంతో గత ఏడాది చివరి నాటికి దేశంలో నిరుద్యోగం 8.7 శాతంగా నమోదైంది.

కనీస వేతనాలకూ కరవు..
ఏ పని దొరికితే ఆ పని చేసుకుని బతికే సాధారణ కార్మికులకు కనీస వేతనాలు దక్కే పరిస్థితులు కూడా మన దేశంలో లేవు. అట్టడుగు స్థాయి సాధారణ కార్మికులకు రోజుకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ప్రభుత్వం 2022లో రూ.178గా నిర్ణయించింది. కనీసావసరాల ధరలు పెరిగినా, 2023లోను, 2024లోను కూడా ఈ మొత్తంలో మార్పు చేయలేదు. కనీస వేతనాల మొత్తాన్ని రోజుకు రూ.375కు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. స్వయంఉపాధి కార్మికులు, సంఘటిత కార్మికుల పరిస్థితులు సాధారణ కార్మికుల కంటే బాగున్నా, వారి వేతనాల్లో కూడా గడచిన రెండేళ్లల్లో పెద్దగా పెరుగుదల లేదు.

‘కోవిడ్‌’ ముందు రోజులతో పోల్చుకుంటే, ఈ కార్మికుల ఆదాయం స్వల్పంగా తగ్గడం శోచనీయం. ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా’–2023 నివేదిక ప్రకారం స్వయంఉపాధి కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ.12,988గా ఉంటే, 2021–22 నాటికి ఆదాయం రూ.12,089కి పడిపోయింది. సంఘటిత కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ19,690గా ఉంటే, 2021–22 నాటికి 19,456కు పడిపోయింది. సాధారణ కార్మికుల్లో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని కూడా ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా’–2023 నివేదిక పేర్కొంది.

ఇదిలా ఉంటే, సంఘటిత రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత తగ్గినట్లు ‘పిరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే’–2023 నివేదిక వెల్లడించింది. ప్రావిడెంట్‌ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు వంటి వాటికి అర్హతలేని సంఘటిత కార్మికులు 2017–18లో 49.6 శాతం ఉంటే, వీరి సంఖ్య 2022–23 నాటికి 53.8 శాతానికి పెరిగింది. స్వయంఉపాధి పొందుతున్న మహిళల ఆదాయం కూడా తగ్గింది. స్వయం ఉపాధి మహిళల ఆదాయం 2017–18లో నెలకు 5,995గా ఉంటే, 2022–23లో 5,337గా ఉంది. అయితే, 2017–18లో స్వయం ఉపాధి పొందే గ్రామీణ మహిళలు 55.9 శాతం ఉంటే, 2022–23 నాటికి వీరి సంఖ్య 70.1 శాతానికి పెరిగింది.

ఇదేకాలంలో స్వయం ఉపాధి పొందే పట్టణ మహిళల సంఖ్య 45 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. వీరిలో ఎక్కువమంది కుటుంబమంతా కలసి చేసే స్వయంఉపాధి వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా సహాయకులుగా పనిచేస్తున్నవారేనని ‘స్టేట్‌ ఆఫ్‌ వర్కింగ్‌ ఇండియా’–2023 నివేదిక తేల్చింది. కార్మికుల ఉత్పాదకత 1982–2017 మధ్యకాలంలో ఆరురెట్లు పెరిగితే, వారికి వచ్చే వాస్తవ ఆదాయం ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగిందని, అంటే, కార్మికులు తమ శ్రమకు తగిన న్యాయమైన వాటాను పొందలేకపోతున్నారని ఈ నివేదిక తెలిపింది.

పేదరికం నిర్మూలనకు ప్రతిపాదనలు..
కార్మికుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి కనీస వేతన (మినిమం వేజెస్‌) విధానం స్థానంలో జీవన వేతన (లివింగ్‌ వేజెస్‌) విధానాన్ని వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పును అమలులోకి తేవడానికి తగిన సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థను (ఐఎల్‌ఓ) కోరింది. ప్రస్తుతం ఉన్న కనీస వేతన విధానం ప్రకారం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రోజుకు రూ.178గా కనీస వేతనాన్ని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు తమ తమ పరిధిలో కనీస వేతనాలను నిర్ణయించుకున్నాయి.

ఉదాహరణకు బిహార్‌లో కనీస వేతనం రోజుకు రూ.160గా ఉంటే, ఢిల్లీలో రోజుకు రూ.423గా ఉంది. దేశంలోని దాదాపు 50 కోట్లకు పైగా ఉన్న కార్మికుల్లో 90 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే కావడంతో, వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం జీవన వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కనీస వేతనం అంటే, చట్టం నిర్దేశించిన అతి తక్కువ మొత్తం వేతనం. అలా కాకుండా, దేశ కాల పరిస్థితులను బట్టి సాధారణ పనిగంటల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి తగినట్లుగా చెల్లించే వేతనాన్ని ఐఎల్‌ఓ జీవన వేతనంగా నిర్వచించింది.

జీవన వేతనం కార్మికులు, వారి కుటుంబాల ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం సహా ఇతర అవసరాలకు తగినట్లుగా లెక్కించడం జరుగుతుంది. జీవన వేతన విధానం అమలులోకి వచ్చినట్లయితే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. జీవన వేతన విధానాన్ని జాతీయస్థాయిలో అమలులోకి తెస్తే, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని, వాటిని అధిగమించుకుంటూ ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీస వేతన విధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తే, ఇది చిన్న మధ్య తరహా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు భారం కాగలదని, ఫలితంగా వాటి ఆదాయం తగ్గడమే కాకుండా, కొన్ని సంస్థలు నష్టాల్లో పడే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అలాగే, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జీవన వ్యయంలో వ్యత్యాసాలు ఉన్నాయని, కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కట్టుబడిన నేపథ్యంలో 2025లోనే కనీస వేతన వి«ధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తేవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8.4 శాతం ఉండటంతో కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త విధానం కార్మికుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచగలదని ఆశించవచ్చు.

విద్యావంతుల్లోనే ఎక్కువ నిరుద్యోగం..
ఉపాధికి సంబంధించి చాలా దేశాల్లో లేని విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. చదువులేని వారు,  నామమాత్రపు చదువులు ఉన్నవారితో పోల్చుకుంటే, మన దేశంలో ఉన్నత విద్యావంతుల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు మొదలుకొని ప్రాథమిక స్థాయితోనే చదువులు ఆపేసిన వారిలో నిరుద్యోగం 1.13 శాతం వరకు ఉంటే, గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి చదువుకున్న వారిలో నిరుద్యోగం 14.70 శాతం వరకు ఉన్నట్లు ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), లక్నో, బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌), పిలానీ సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.

విద్యావంతులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో మన దేశం విఫలమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించడానికి మన దేశం కార్మికుల కొరత ఎదుర్కొంటున్న తైవాన్, ఇజ్రాయెల్‌ వంటి దేశాలతో కార్మిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. నైపుణ్యాలు లేని కార్మికులను, అరకొర నైపుణ్యాలు ఉన్న కార్మికులను ఆ దేశాలకు తరలించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందాలపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పాలస్తీనాతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మన దేశం నుంచి కార్మికులను తరలించడమంటే, వారి జీవితాలను కోరి మరీ ప్రమాదంలోకి నెడుతున్నట్లేనని, ఉపాధి కల్పనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రప్రభుత్వం కార్మికుల ప్రాణాలనే పణంగా పెడుతోందని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

గత ఏడాది మే నెలలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దేశం 42 వేల మంది భవన నిర్మాణ కార్మికులను, నర్సింగ్‌ నిపుణులను ఇజ్రాయెల్‌కు పంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్‌తో కూడా మన ప్రభుత్వం ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తైవాన్‌ కార్మిక మంత్రి భారత్‌ నుంచి వచ్చేవారిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ప్రాధాన్యమివ్వాలంటూ చేసిన వివక్షాపూరితమైన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై మీడియా దుమ్మెత్తిపోయడంతో తైవాన్‌ కార్మిక మంత్రి వెనక్కు తగ్గి, భారత్‌ నుంచి వచ్చే ఏ కార్మికులనైనా ఒకే రీతిలో చూస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement