అర్లీ రిటైర్‌మెంట్‌.. ఫరెవర్‌ ఎంజాయ్‌మెంట్‌! | Gen Z Representative Business Analyst Chilukur Soumya Special Life Story | Sakshi
Sakshi News home page

అర్లీ రిటైర్‌మెంట్‌.. ఫరెవర్‌ ఎంజాయ్‌మెంట్‌!

Published Sun, Sep 15 2024 12:19 AM | Last Updated on Sun, Sep 15 2024 12:19 AM

Gen Z Representative Business Analyst Chilukur Soumya Special Life Story

ఉన్నది ఒకటే జీవితం! దాన్ని జీతానికి తాకట్టు పెడితే ఆర్జిస్తున్నామనే ఆనందం కూడా మిగలదు! ఉద్యోగం వేతనాన్నే కాదు చేస్తున్న పని పట్ల సంతృప్తినీ ఇవ్వాలి.. ఆస్వాదించే  సమయాన్నుంచాలి.. మన జీవితాన్ని మనకు మిగల్చాలి! ఇది జెన్‌ జెడ్‌ ఫిలాసఫీ! అందుకే వాళ్లు రెజ్యుమే ప్రిపేర్‌ చేయట్లేదు. పోర్ట్‌ఫోలియో కోసం తాపత్రయపడుతున్నారు. వర్క్‌ స్టయిల్‌ని మార్చేస్తున్నారు. ఆఫీస్‌ డెకోరమ్‌ నుంచి ఫ్రేమ్‌ అవుట్‌ అవుతున్నారు. ముందుతరాల ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. మేనేజ్‌మెంట్‌కి ఆప్షన్‌ లేకుండా చేస్తున్నారు.

‘చూసేవాళ్లకు కేర్‌ఫ్రీగా కనిపిస్తున్నామేమో కానీ చేసే పని పట్ల, మా ఫ్యూచర్‌ పట్ల క్లారిటీతోనే ఉంటున్నాం. జాబ్‌ అండ్‌ జిందగీ, ప్యాకేజ్‌ అండ్‌ ఫ్యాషన్‌ల మధ్య ఉన్న డిఫరెన్స్‌ తెలుసు మాకు. అందుకే మేము మా స్కిల్‌ని నమ్ముకుంటున్నాం.. లాయల్టీని కాదు’ అంటోంది జెన్‌ జెడ్‌ ప్రతినిధి, బిజినెస్‌ అనలిస్ట్‌ చిలుకూరు సౌమ్య.

నిజమే.. తమకేం కావాలి అన్నదాని పట్ల జెన్‌ జెడ్‌కి చాలా స్పష్టత ఉంది. వాళ్లు దేన్నీ దేనితో ముడిపెట్టట్లేదు. దేనికోసం దేన్నీ వదులుకోవట్లేదు. నైపుణ్యం కంటే విధేయతకే ప్రాధాన్యమిస్తున్న సంస్థల్లో పని వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అపాయింట్‌మెంట్‌ ఆర్డర్‌ అందుకున్న నాటి నుంచి రిటైర్మెంట్‌ వరకు ఒకే సంస్థలో ఉద్యోగాన్నీడ్చే ముందు తరాల మనస్తత్వాన్ని ఔట్‌ డేటెడ్‌గా చూస్తున్నారు. తక్కువ సర్వీస్‌లో వీలైనన్ని జంప్‌లు, వీలైనంత ఎక్కువ ప్యాకెజ్‌ అనే ఐడియాను ఇంప్లిమెంట్‌ చేస్తున్నారు.

వాళ్ల రూటే వేరు..
సంప్రదాయ జీవన శైలినే కాదు ట్రెడిషనల్‌ వర్క్‌ స్టయిల్‌నూ ఇష్టపడట్లేదు జెన్‌ జెడ్‌. ‘పదహారు.. పద్దెనిమిదేళ్లు చదువు మీద పెట్టి, తర్వాత లైఫ్‌ అంతా 9 టు 5 పనిచేస్తూ,  కార్పొరేట్‌ కూలీలుగా ఉండటం మావల్ల కాదు’ అంటున్నారు బెంగళూరుకు చెందిన కొందరు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు. ‘జెన్‌ జెడ్‌.. మాలాగా కాదు. వాళ్లు సంస్థ ప్రయోజనాల కోసం చెమటోడ్చట్లేదు. అలాంటి  షరతులు, డిమాండ్లకూ తలొగ్గట్లేదు. వాళ్లకు పనికొచ్చే, వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించుకునే కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్, రైటింగ్, డిజైన్‌ లాంటి టాస్క్స్‌నే తీసుకుంటున్నారు. అంతే నిర్మొహమాటంగా గుర్తింపును, కాంప్లిమెంట్స్‌నూ కోరుకుంటున్నారు. కొలీగ్స్‌తో మాట్లాడినంత క్యాజువల్‌గా సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడేస్తున్నారు. సీనియర్స్, సుపీరియర్స్‌ని ‘సర్‌’ అనో, ‘మేడమ్‌’ అనో పిలవడం వాళ్ల దృష్టిలో ఫ్యూడల్, ఓల్డ్‌ ఫ్యాషన్డ్‌. పేరుతో పిలవడాన్ని అప్‌ డేటెడ్‌గా, ఈక్వల్‌గా ట్రీట్‌ చేస్తున్నారు’ అని చెబుతున్నారు మిలేనియల్‌ తరానికి చెందిన కొందరు బాస్‌లు. దీన్నిబట్టి జెన్‌ జెడ్‌కి ఆఫీస్‌ మర్యాదల మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు యజమాని – ఉద్యోగి సంబంధాన్ని సింపుల్‌గా ‘మీకు అవసరమైన పని చేసిపెడుతున్నాం.. దానికి చార్జ్‌ చేసిన డబ్బును తీసుకుంటున్నాం’ అన్నట్లుగానే పరిగణిస్తున్నారు తప్ప ఎలాంటి అటాచ్‌మెంట్లు, సెంటిమెంట్లకు చోటివ్వట్లేదు.

40 కల్లా..
చేసే ఉద్యోగం, జీతం, పని వేళలు, ఆఫీస్‌ వాతావరణమే కాదు ఎన్నాళ్లు పనిచేయాలనే విషయంలోనూ జెన్‌ జెడ్‌కి ఒక అవగాహన ఉంది. తర్వాత ఏం చేయాలనేదాని పట్లా ఆలోచన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘జీవిక కోసం జీతం.. ప్యాషన్‌ కోసం జీవితం’ అని నమ్ముతున్నారు వాళ్లు. 35– 40 ఏళ్ల కల్లా రిటైర్మెంట్‌ అంటూ పెద్దవాళ్లు విస్తుపోయేలా చేస్తున్నారు. ‘మేము 60 ఏళ్లకు రిటైరైన తర్వాత కూడా ఏదో ఒక జాబ్‌ చేయాలని చూస్తుంటే మా పిల్లలేమో 35 – 40 ఏళ్ల వరకే ఈ ఉద్యోగాలు.. తర్వాత అంతా మాకు నచ్చినట్టు మేం ఉంటామని చెబుతున్నారు. ఆశ్చర్యమేస్తోంది వాళ్ల ధైర్యం, భరోసా, నమ్మకం చూస్తుంటే’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. 40 ఏళ్ల కల్లా రిటైరైపోయి తమకు నచ్చిన రంగంలో సెకండ్‌ కెరీర్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. దీనికోసం ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే అన్నిరకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు. పొదుపుతో జాగ్రత్తపడుతున్నారు. సిప్‌లు,షేర్లలో మదుపు చేస్తున్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో అప్‌డేట్‌ అవుతున్నారు. తమ లక్ష్యాలకు సరిపోయే ప్యాకేజ్‌ని కోట్‌ చేస్తూ అర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తున్నారు.

రెజ్యుమే టు పోర్ట్‌ఫోలియో..
ఒక వ్యక్తి కొన్నాళ్లు ఓడరేవులో పని చేస్తాడు. అక్కడి నుంచి చెరుకు తోటలకు కూలీగా వెళ్తాడు. ఇంకొన్నాళ్లు బడిలో పాఠాలు చెబుతాడు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా కనపడతాడు. మరికొన్నాళ్లకు ఇంకో కొలువును చేపడతాడు. ఆఖరికి ఏ సైంటిస్ట్‌గానో, రాజకీయవేత్తగానో, రచయితగానో తన మజిలీ చేరుకుంటాడు. ఇలాంటివన్నీ సాధారణంగా పాశ్చాత్య నవలలు, ఆటోబయోగ్రఫీలు, సినిమాల్లో కనపడతాయి. కానీ ఈ ధోరణిని ఇప్పుడు జెన్‌ జెడ్‌లోనూ కనపడుతోంది. 60 ఏళ్లకు రిటైర్మెంట్‌నే కాదు రిటైర్మెంట్‌ వరకు ఒకే కొలువు అనే కాన్సెప్ట్‌నూ ఇష్టపడట్లేదు వాళ్లు. కెరీర్‌లో రెండుమూడు జంప్‌ల తర్వాత ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్‌ కన్నా ఫ్రీలాన్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక, మనసుకు నచ్చిన పనిచేసుకునే అవకాశమూ దొరుకుతోంది అంటున్నారు.

వివిధ రంగాల్లోని చాలామంది జెన్‌ జెడ్‌ ఉద్యోగులు పలు స్టార్టప్స్‌కి పనిచేస్తున్నారు, స్టార్టప్స్‌ నడుపుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి కంట్రిబ్యూట్‌ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో కంటెంట్‌ క్రియేట్‌ చేస్తున్నారు. వ్లాగర్స్, యూట్యూబర్స్‌గా కొనసాగుతున్నారు. అడ్వర్టయిజ్‌మెంట్‌ కాపీ రైటర్స్‌గా, ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌కి క్యురేటర్స్‌గా సేవలందిస్తున్నారు. యోగా టీచర్స్‌గా, అనువాదకులుగా, కేర్‌ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. వాయిస్‌ ఓవర్‌ చెబుతున్నారు. డిస్కవరీ, జాగ్రఫీ, యానిమల్‌ ప్లానెట్‌ లాంటి చానళ్ల కోసం పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్స్‌ రాస్తున్నారు. ఎడిటింగ్‌ చేస్తున్నారు. గ్రాఫిక్స్‌ అందిస్తున్నారు. వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్‌ డిజైన్, మోడలింగ్‌లో ఉన్నారు. ఐడియా బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో.. వైవిధ్యమైన పని అనుభవాలతో రెజ్యుమే ప్లేస్‌లో పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బుతోపాటు జాబ్‌ శాటిస్‌ఫాక్షన్‌ను పొందుతున్నారు.

ఫిన్‌ఫ్లుయెన్సర్స్‌..
40 ఏళ్లకే రిటైరై.. సెకండ్‌ కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన వాళ్లు, రకరకాల ఉద్యోగాలతో ఫ్రీలాన్స్‌ చేçస్తున్న వాళ్లు ఆర్థిక క్రమశిక్షణలోనూ ఆరితేరుతున్నారు. పలు స్టార్టప్స్‌లో, సేవల రంగంలో పెట్టుబడులు పెడుతూ ఫిన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారుతున్నారు.

ఈ ధోరణికి కారణం.. 
ఇంటర్నెట్, ఏఐ లాంటి ఫాస్ట్‌మూవింగ్‌ టెక్నాలజీ, కరోనా పరిస్థితులు ..  కెరీర్, ఆఫీస్‌ వర్క్‌కి సంబంధించి ఎన్నో మార్పులను తెచ్చాయి. అవి జెన్‌ జెడ్‌ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. 
ఈ మధ్య చోటుచేసుకున్న రష్యా– ఉక్రెయిన్‌ యుద్ధం, తత్ఫలితంగా ఏర్పడ్డ ఆర్థికమాంద్యం, ఉద్యోగాల కోత వంటి పరిణామాలు కూడా ఆ ధోరణిని కొనసాగేలా చేస్తున్నాయి. దీనికి పేరెంటింగ్‌నూ మరో కారణంగా చూపుతున్నారు సామాజిక విశ్లేషకులు.  ఇంజినీరింగ్, మెడిసిన్‌ తప్ప ఇంకో చదువు లేదు, మరో కెరీర్‌ కెరీర్‌ కాదనే పెంపకమూ ఫ్రీలాన్సింగ్, అర్లీ రిటైర్‌మెంట్‌ ట్రెండ్‌కి ఊతమవుతోందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.

  • జెన్‌ జెడ్‌ ఫ్రీలాన్స్‌ వర్కింగ్‌ ట్రెండ్‌ మీద అమెరికా, శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అప్‌వర్క్‌ ఆన్‌లైన్‌ ఫ్రీలాన్స్‌ నెట్‌వర్కింగ్‌’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అనుగుణమైన పనివేళలు, ఆదాయ భరోసా ఉండటం వల్లే వాళ్లు ఏ రంగంలోనైనా ఫ్రీలాన్స్‌ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ఎక్కువమంది కోవిడ్‌ చరమాంకం నుంచి ఈ ఫ్రీలాన్స్‌ వర్క్‌ కల్చర్‌లో కొనసాగుతున్నారట. వాళ్లంతా  వారానికి 40 గంటలు, పలురకాల పనుల్లో ఫ్రీలాన్స్‌ చేస్తున్నారు. కొందరేమో పనిచోట సీనియర్స్‌– జూనియర్స్, కుల, మత, జాతి, లింగ వివక్షను భరించలేక, ఆ వాతావరణం నుంచి దూరంగా ఉండటానికి ఫ్రీలాన్స్‌ని ఎంచుకున్నట్లు చెప్పారు. మరికొందరు వ్యక్తిగత జీవితం తమ చేతుల్లోనే ఉంటుందని, సొంతంగా ఎదిగే వీలుంటుందని ఫ్రీలాన్స్‌ చేస్తున్నట్లు తెలిపారు.

  •     టిక్‌టాక్‌ నిషేధం తర్వాత చాలామంది క్రియేటర్స్‌కి ఇన్‌స్టాగ్రామ్‌ ఓ ప్రత్యామ్నాయ వేదికగా మారడంతో వాళ్లంతా మళ్లీ ఫ్రీలాన్స్‌కి మళ్లారు.

  •     మైక్రోసాఫ్ట్, లింక్డిన్‌ డేటా ప్రకారం జెన్‌ జెడ్‌ ఫ్రీలాన్సర్స్‌.. సంస్థలు ఇచ్చే శిక్షణ మీద ఆధారపడకుండా సొంతంగా శిక్షణ తీసుకుని ఏఐ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలను చాలా చక్కగా వాడుకుంటున్నారు.

  •     మిలేనియల్స్‌ మాదిరి జెన్‌ జెడ్‌.. లాప్‌టాప్‌ను, కంప్యూటర్‌ను ఎక్స్‌ట్రా ఆర్గాన్‌గా మోయట్లేదు. ఆఫీస్‌ను మొదటి ఇల్లుగా చేసుకోవట్లేదు. ఉన్న చోటు నుంచే తమ దగ్గరున్న డివైస్‌లోంచే పనిచేసుకుంటున్నారు.. ఆడుతూ.. పాడుతూ.. హ్యాపీగా!

  •     పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌నీ జెన్‌ జెడ్‌కి ఫ్రీలాన్సింగ్‌  ఇచ్చేలా కొందరు బిజినెస్‌ లీడర్లు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కొన్ని సంస్థలూ ఆలోచిస్తున్నాయి.

ఉరుకులు, పరుగులు నచ్చక..
చదువైపోయిన వెంటనే అమెజాన్‌లో జాబ్‌ వచ్చింది. 9 టు 5 వర్క్‌ వల్ల పర్సనల్‌గా నేను బావుకుంటున్నదేమీ లేదని రియలైజ్‌ అయ్యాను. అందుకే లాస్టియర్‌ జాబ్‌ మానేసి ఫ్రీలాన్సర్‌గా మారాను. దీనివల్ల డబ్బుతో పాటు జాబ్‌ శాటిస్‌ఫాక్షన్‌ కూడా దొరుకుతోంది. అంతేకాదు చుట్టుపక్కలవాళ్లకు తోచిన సాయం చేయగలుగుతున్నాను. నాకు ట్రావెల్, మ్యూజిక్‌ అంటే ఇష్టం. ఇప్పుడు టైమ్‌ నా చేతిలో ఉంటోంది కాబట్టి, మ్యూజిక్‌ షోస్‌ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన చోటికి వెళ్తున్నాను. – కార్తిక్‌ సిరిమల్ల, హైదరాబాద్‌

డబ్బును కాదు టైమ్‌ని చేజ్‌ చేస్తోంది
జర్మనీలో మాస్టర్స్‌ చేసి, అక్కడే మంచి జాబ్‌ కూడా సంపాదించుకున్నాను. అయినా హ్యాపీనెస్‌ లేదు. ఆఫీస్‌లో అన్నేసి గంటలు చేసిన వర్క్‌కి ఎండ్‌ ఆఫ్‌ ద డే అంతే ఔట్‌పుట్‌ కనిపించలేదు! అంతే శ్రమ నాకు నచ్చిన దాని మీద పెడితే ఆ శాటిస్‌ఫాక్షనే వేరు కదా అనిపించింది! అందుకే ఇండియాకు వచ్చేసి, థీమ్‌ రెస్టరెంట్‌ పెట్టాను. ఆన్‌లైన్‌లో జర్మన్‌ లాంగ్వేజ్‌ నేర్పిస్తున్నాను. ఫ్యూచర్‌లో కొంతమంది ఫ్రెండ్స్‌మి కలసి మాకు నచ్చిన ఓ పల్లెలో కొంచెం ల్యాండ్‌ కొనుక్కొని మినిమలిస్టిక్‌ లైఫ్‌ని లీడ్‌ చేయాలనుకుంటున్నాం. మా జెనరేషన్‌ డబ్బును చేజ్‌ చేయట్లేదు. టైమ్‌ని చేజ్‌ చేస్తోంది. – వుల్లి సృజన్, హైదరాబాద్‌

టాక్సిక్‌ వాతావరణం..
యూకేలో ఏంబీఏ చేశాను. కొన్ని రోజులు హెచ్‌ఆర్‌ జాబ్‌లో ఉన్నాను. కానీ ఆఫీస్‌లోని టాక్సిక్‌ వాతావరణం నచ్చక వదిలేశాను. నాకు ముందు నుంచీ ఫ్యాషన్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్‌. అయితే జాబ్‌ వదిలేయగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. నాకు బ్యూటీపార్లర్‌ పెట్టాలనుందని చెప్పాను. పెళ్లి ఖర్చులకు ఎంతనుకున్నారో అందులో సగం నా బిజినెస్‌కి హెల్ప్‌ చేయమని అడిగాను. ఏడాదిలో పికప్‌ కాకపోతే పెళ్లికి ఓకే అనాలనే షరతు మీద డబ్బిచ్చారు నాన్న. ఇంకొంత లోన్‌ తీసుకుని పార్లర్‌ అండ్‌ స్పా పెట్టాను. ఏడాదిన్నర అవుతోంది. మంచిగా పికప్‌ అయింది. – ప్రత్యూష వావిలాల, కరీంనగర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement