ఐటీ ఉద్యోగి ఆశ..
అట్టర్ ఫ్లాప్ కథ..
‘వెల్ డన్! నీ సీనియర్స్‌ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్‌ని ఇన్సెంటివ్‌గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.
‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్‌మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్‌ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్‌ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్‌ఫీరియర్‌గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.
ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్‌ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్‌ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్‌తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్‌ని సంపాదించుకుంది.
మరో పదిహేను రోజులకు..
ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్‌మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్‌నిచ్చింది. వర్కింగ్ అవర్స్‌లో సెల్ ఫోన్‌ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్‌నిచ్చింది. ఈసారి మేనేజ్‌మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్‌నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్‌లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్‌కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్‌లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.
ఒక ఉదయం..
పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్‌లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్‌లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్‌లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్‌లోకి వెళ్లాడు.
ఆ షాప్‌కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్‌లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్‌క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్‌ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్‌ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్‌లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్‌లో దొరికిన డైమండ్స్‌లోంచి ఒక డైమండ్‌ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.
‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్‌కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!
పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్‌గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్‌ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్‌చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్‌మెంట్‌కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్‌లోని డైమండ్స్‌ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్‌లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్‌ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.
( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది
Comments
Please login to add a commentAdd a comment