Sharadi
-
జ్యూల్ థీఫ్.. సేల్స్ గర్ల్ శ్రమ!
‘వెల్ డన్! నీ సీనియర్స్‌ని బీట్ చేసి.. శాలరీ కన్నా డబుల్ అమౌంట్‌ని ఇన్సెంటివ్‌గా తీసుకుంటున్నావ్.. కంగ్రాట్స్’ అని ప్రశంసిస్తూ ఆమె చేతిలో ఓ ఎన్వలప్ పెట్టాడు మేనేజర్.‘థాంక్యూ సర్’ అని వినమ్రంగా బదులిచ్చి, బయటకు వచ్చింది. ఆమెకోసం బయట వెయిట్ చేస్తున్న కొలీగ్స్ ‘పార్టీ ఇస్తున్నావ్ కదా!’ అంటూ ఆమెను చుట్టుముట్టారు. కుడిచేతితో ఆ ఎన్వలప్ కొసను పట్టుకుని మరో చివరను ఎడమ అరచేతిలో కొడుతూ ‘ఈ డబ్బు పార్టీ కోసం కాదు. నా ఫస్ట్ అసైన్మెంట్ జ్ఞాపకంగా దాచుకోడానికి’ అన్నది తనకు మాత్రమే వినిపించేలా! ‘ఏం సణుగుతున్నవ్ పిల్లా?’ వేళాకోళమాడింది ఆ గుంపులోని ఓ కొలీగ్. ‘ఈ మొహాలకు పార్టీనా.. అని అనుకుంటుందేమోలేవే’ అంది ఇంకో కొలీగ్. ‘అనుకోదా మరి.. ఫ్లూయెంట్ ఇంగ్లిష్, హిందీతో కస్టమర్స్‌ని కన్విన్స్ చేస్తూ తన సెక్షన్ జ్యూల్రీ సేల్స్‌ని పెంచిన ఆమె కాన్ఫిడెన్స్ ఎక్కడా.. ప్రతిదానికి భయపడుతూ ఇన్ఫీరియర్గా ఉండే మీరెక్కడా!’ అన్నాడు సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్. ‘అయ్యో.. అలా ఏం కాదన్నా! ఫస్ట్ శాలరీ.. వెరీ ఫస్ట్ ఇన్సెంటివ్ కదా.. దీన్ని మా ఇంట్లో వాళ్ల కోసమే ఖర్చుపెడదామనుకుంటున్నా!’ అందామె.ఆ సిటీలోనే అతిపెద్ద జ్యూల్రీ షాప్ అది. దానికున్న మూడు బ్రాంచెస్ని వరుసగా యజమాని ముగ్గురు కొడుకులు, కార్పొరేట్ ఆఫీస్‌ని యజమాని చూసుకుంటున్నారు. ఆమె మెయిన్ బ్రాంచ్‌లో పనిచేస్తోంది. నెల కిందటే జాయిన్ అయింది. సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ చెప్పినట్టుగా కమ్యూనికేషన్ స్కిల్స్‌తో నెల రోజులకే సీనియర్స్ కన్నా ఇంపార్టెన్స్‌ని సంపాదించుకుంది.మరో పదిహేను రోజులకు.. ఆ ఏటికే మేటైన అమ్మకాన్నొకటి అందించిందామె! మేనేజ్మెంట్ ఖుషీ అయిపోయి ఇంకో ఇన్సెంటివ్నిచ్చింది. వర్కింగ్ అవర్స్‌లో సెల్ ఫోన్‌ను క్యారీ చేసే అవకాశాన్ని కూడా! తర్వాత వారంలో మరో బిగ్ సేల్నిచ్చింది. ఈసారి మేనేజ్మెంట్ ఆమెను సీనియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ప్రమోట్ చేసి.. క్యాష్, జ్యూల్రీ, గోల్డ్ బిస్కట్స్, డైమండ్స్ లాకర్స్ యాక్సెస్నిచ్చింది. అంతేకాదు ఆ షాప్ యజమాని ఇంట్లో జరిగే ఫంక్షన్లకూ ఆమెను పిలవసాగింది.. కుటుంబ సభ్యులకు సాయమందించడానికి. స్టాఫ్ అంతా ముక్కున వేలేసుకున్నారు.. ‘ఎంత ఎఫిషియెంట్ అయితే మాత్రం అంత నెత్తినపెట్టుకోవాలా?’ అని! ఎవరెలా కామెంట్ చేసుకున్నా యాజమాన్యానికి మాత్రం ఆమె ‘యాపిల్ ఆఫ్ ది ఐ’ అయింది. తరచుగా ఆమెను అన్ని బ్రాంచ్‌లు తిప్పుతూ అక్కడున్న సేల్స్ స్టాఫ్‌కి ఆమెతో ట్రైనింగ్ ఇప్పించసాగింది. తనకున్న చొరవతో కార్పొరేట్ ఆఫీస్‌లోని కీలకమైన విషయాల్లోనూ నేర్పరితనం చూపించి, ఆ బాధ్యతల్లోనూ ఆమె పాలుపంచుకోసాగింది. అలా చేరిన రెణ్ణెళ్లకే ఆ షాప్ ఆత్మను పట్టేసింది. ప్రతి మూలనూ స్కాన్ చేసేసింది.ఒక ఉదయం.. పదిన్నరకు ఎప్పటిలాగే ఆ జ్యూల్రీ షాప్ అన్ని బ్రాంచ్‌లూ తెరుచుకున్నాయి. కార్పొరేట్ ఆఫీస్ కూడా. అన్నిచోట్లా ఒకేసారి దేవుడికి దీపం వెలిగిస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఆ నాలుగు చోట్లతోపాటు ఆ జ్యూల్రీ షాప్ యజమాని ఇంటికీ ఐటీ టీమ్స్ వెళ్లాయి. మెయిన్ బ్రాంచ్‌లో ఆమె సహా స్టాఫ్ అంతటినీ ఓ పక్కన నిలబడమన్నారు. సోదా మొదలైంది. ఆమె నెమ్మదిగా ఫోన్ తీసి స్క్రీన్ లాక్ ఓపెన్ చేయబోయింది. అది గమనించిన ఐటీ టీమ్‌లోని ఓ ఉద్యోగి గబుక్కున ఆమె ఫోన్ లాక్కుని, పూజ గదిలా ఉన్న చిన్న పార్టిషన్లోకి వెళ్లాడు.ఆ షాప్‌కి సంబంధించి రెయిడ్ చేసిన అన్ని చోట్లా దాదాపు అయిదు గంటలపాటు సోదాలు సాగాయి. పెద్దమెత్తంలో డబ్బు, బంగారం, డైమండ్స్ దొరికాయి. ఆ ఏడాది అతిపెద్ద రెయిడ్ అదే అనే విజయగర్వంతో ఉంది ఐటీ స్టాఫ్! ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుని, ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేయసాగారు. మెయిన్ బ్రాంచ్‌లో కూడా అంతా పూర్తయి, ఆ టీమ్ ఆఫీసర్ ఫైనల్ కాల్ చేయబోతుండగా.. కౌంటర్ దగ్గర నుంచి మేనేజర్ గబగబా ఆ బ్రాంచ్ చూసుకుంటున్న యజమాని పెద్దకొడుకు దగ్గరకు వచ్చి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే అతను అలర్ట్ అయ్యి.. ‘ఎక్స్క్యూజ్ మి సర్..’ అంటూ ఐటీ టీమ్ ఆఫీసర్ని పిలిచాడు. ఫోన్ చెవి దగ్గర పెట్టుకునే ‘యెస్..’ అంటూ చూశాడు. ‘ఒక్కసారి ఇలా రండి’ అంటూ కౌంటర్ దగ్గరకు నడిచాడు. డయల్ చేసిన కాల్ని కట్ చేస్తూ ఫాలో అయ్యాడు ఆఫీసర్. మేనేజర్ వంక చూశాడు యజమాని పెద్ద కొడుకు. కౌంటర్ టేబుల్ మీదున్న కంప్యూటర్ స్క్రీన్‌లో అంతకు కొన్ని క్షణాల ముందే రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ ప్లే చేశాడు మేనేజర్. పూజ గదిలో సోదా చేస్తున్న ఐటీ ఉద్యోగి ఒక సీక్రెట్ సేఫ్‌లో దొరికిన డైమండ్స్లోంచి ఒక డైమండ్‌ని జేబులో వేసుకోవడం కనిపించింది అందులో. చూసి నివ్వెరపోయాడు ఆఫీసర్. ఏం జరుగుతోందో అంచనా వేసుకుంటున్న ఆ ఉద్యోగి మొహంలో నెత్తరు చుక్క లేదు.‘సర్.. మీడియాను పిలవమంటారా?’ స్థిరంగా పలికాడు యజమాని పెద్ద కొడుకు. వెంటనే ఆ ఐటీ ఆఫీసర్ మిగిలిన చోట్లలో ఉన్న టీమ్స్‌కి ఫోన్ చేసి ‘రెయిడ్ క్యాన్సల్.. అంతా వదిలేసి వచ్చేయండి’ అన్న ఒక్క మాట చెప్పి గబగబా బయటకు నడిచాడు. అనుసరించింది టీమ్. వాళ్ల వంకే అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది ఆమె!పదేళ్ల కిందట జరిగిన రెయిడ్ ఇది. ఆమె ఐటీ న్యూ ఎంప్లాయీ. ఆ షాప్స్, ఆ యజమాని ఇంటికి సంబంధించిన సమాచారాన్ని చేరవేయడానికి అందులో సేల్స్ గర్ల్‌గా చేరింది. చాకచక్యంతో ఫోన్ యాక్సెస్‌ను సంపాదించుకున్న ఆమె, డీటెయిల్స్ అన్నిటినీ స్కాన్‌చేసి ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్కి పంపేది. వాటి ఆధారంగానే రెయిడ్ చేశారు. ఫోన్ చూస్తున్నట్టు నటించడం, దాన్ని లాక్కోవడం అంతా కూడా ఐటీ వాళ్ల డ్రామా, యాజమాన్యానికి అనుమానం రాకుండా! అంతా సవ్యంగానే జరిగేదే.. ఆ ఉద్యోగికి సేఫ్‌లోని డైమండ్స్‌ని చూసి ఆశ పుట్టకపోయుంటే! ఆ పార్టీషన్లో సీసీ కెమెరా ఉందన్న విషయాన్ని మరచిపోయి గబుక్కున డైమండ్‌ని జేబులో వేసుకుని దొరికిపోయాడు. అంత పెద్ద రెయిడ్ క్యాన్సల్ అవడానికి కారణమయ్యాడు.( ఓ వాస్తవ సంఘటనకు కాస్త ఫిక్షన్‌ను జోడించి రాసిన కథనం ఇది. అందుకే ఊరు పేరు , వ్యక్తుల పేర్లు ఇవ్వలేదు. ప్రతివారం ఇలాంటి ఆసక్తికర కథనాన్ని ఇక్కడ చదవొచ్చు.) – శరాది -
అంతా.. ఆ ఏడుకొండల వాడి దయ!
‘ఇంకెన్ని గల్లీలు తిప్పుతారు?’ పక్కనే ఉన్న సహోద్యోగిని అడిగింది ఆమె. ‘అదే కదా.. ఎక్కడ బండి ఆగినా, ఆ స్ట్రీట్‌లోనే రెయిడేమో అనుకుంటున్నా’ అన్నాడు సహోద్యోగి. ఆ జీప్ మరో రెండు మలుపులు తిరిగి, ఆగింది. ‘వార్నీ.. తిరిగి తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చాం!’ అంది ఆమె. ఆ మాటకు ఆ జీప్‌లో వెనకాలకూర్చున్న మిగతా ముగ్గురూ చిన్నగా నవ్వుకోసాగారు. అంతలోకే ఆ టీమ్‌ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ జీప్ దిగి, ఆ పరిసరాలను మార్చి మార్చి చూడసాగాడు. అది గమనించిన నలుగురు ఉద్యోగులూ జీప్ దిగారు. టార్గెట్ వైపు నడకసాగించాడు ఆఫీసర్. ఆ నలుగురూ అతన్ని అనుసరించారు.వంద అడుగులు నడిచి, ఒక చిన్న పెంకుటిల్లు చేరుకున్నారు. ఒకసారి వాచ్ చూసుకున్నాడు ఆఫీసర్. సరిగ్గా రెండు నిమిషాలకు ‘పదండి’ అన్నట్టుగా ఆ ఇంటి ప్రహరీ గేటు తీశాడు. ఇంట్లోకి నడిచే దారి మా్రతమే ఫ్లోరింగ్‌తో, మిగతా ముంగిటంతా పూలు, పళ్ల చెట్లు, కూరగాయల పాదులతో ఉంది. గేటు పక్కనున్న మామిడి చెట్టుకు కాస్త ఆవల పూల చెట్లకు వేసిన ఫెన్సింగ్‌కి కట్టేసున్న కుక్క అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఇంట్లోంచి ఒకతను బయటకు వచ్చాడు. సర్వెంట్లా కనపడ్డాడతను వాళ్లకు.‘ఎవరు మీరు?’ కుక్క అరుపులను లెక్క చేయకుండా ముందుకు వస్తున్న వాళ్లనడిగాడతను. బదులు చెప్పకుండానే ఆ ఇంట్లోకి వెళ్లారు వాళ్లు. ఆ అలికిడికి, హాల్లో.. రాకింగ్ చెయిర్లో కూర్చుని నిద్రపోతున్న ఒక పెద్దాయన కళ్లు తెరిచి, లేవబోయి మళ్లీ కుర్చీలోనే కూలబడ్డాడు. డైనింగ్ టేబుల్ మీద ఏదో సర్దుతున్న ఒకావిడ, ‘అమ్మగారూ, ఎవరో వచ్చారండీ’ అంటూ లోపలికి కేకేసింది. ఆ మాటకు లోపలి నుంచి ఒక పెద్దావిడ వచ్చింది, బొడ్లో దోపుకున్న నాప్కిన్కి చేయి తుడుచుకుంటూ! ఆమెతో ఆ ఆఫీసర్ ‘వి ఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్’ అంటూ తన ఐడీ చూపించి, ‘సెర్చ్ వారంట్ ఉంది’ అని చెప్పి తన టీమ్‌కి ఆ ఇంటికున్న నాలుగు గదులను చూపిస్తూ ‘సెర్చ్’ అన్నట్టుగా సైగ చేశాడు.‘షో మీ?’ అడిగాడు రాకింగ్ చెయిర్ పెద్దాయన. అర్థంకానట్టుగా ఆయన్ని చూశాడు ఆఫీసర్. ‘సెర్చ్ వారంట్’ రెట్టించాడాయన! చూపించాడు ఆఫీసర్. వెంటనే ఆ పెద్దాయన తన పక్కనే చిన్న స్టూల్ మీదున్న ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు. లాక్కున్నాడు ఆఫీసర్ ఆ చర్యను ముందే గ్రహించినట్టుగా! నిశ్చేష్టుడయ్యాడు పెద్దాయన. ఇదంతా చూసి విస్తుపోతున్న ఆ పెద్దావిడను మహిళా ఉద్యోగి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చోబెట్టి.. చేష్టలుడిగిన పనమ్మాయితో ‘మంచి నీళ్లు’ అన్నట్టుగా సైగ చేసింది.పరిస్థితిని పసిగట్టిన మేల్ సర్వెంట్ బయటకు పరుగెత్తబోయాడు. గేట్ దగ్గరున్న జీప్ డ్రైవర్ అడ్డుపడ్డాడు. చేసేదిలేక మళ్లీ లోపలకి వచ్చేశాడు మేల్ సర్వెంట్. మహిళా ఉద్యోగి ఆ ఇంటి పెద్దావిడను ఏవో ప్రశ్నలడుగుతుండగా, మిగిలిన వాళ్లు ఆ ఇంటిని చుట్టబెట్టసాగారు.ఓ గంట గడిచింది.. ఆ టీమ్ అంతా ‘ప్చ్..’ అంటూ తల అడ్డంగా ఆడిస్తూ హాల్లోకి వచ్చారు. ఆ ఆఫీసర్ నిరాశతో బయటకు వచ్చి, చూరు కిందున్న వరండాలో నిలబడ్డాడు. రెండు చేతులతో జుట్టును సరిచేసుకుంటూ చూరు వైపు చూశాడు. తన తలపైన చూర్లో ఏదో అబ్నార్మల్ థింగ్‌లా కనిపించింది దూలాల రంగులో కలసిపోయి! పరీక్షగా చూస్తే తప్ప తెలియడం లేదది. తన స్టాఫ్‌లోని ఒక వ్యక్తిని పిలిచి, చూరు చూపించాడు. అది ఒక స్లయిడ్లా కనిపించింది. వెంటనే మేల్ సర్వెంట్‌ని పిలిచి పెద్ద స్టూల్ అడిగారు. ‘లేదండీ’ చెప్పాడతను. ‘నిచ్చెన?’ అడిగాడు ఉద్యోగి. ఉందన్నట్టుగా తలూపుతూ వెళ్లి నిచ్చెన తీసుకొచ్చాడు.పైకెక్కి స్లయిడ్‌ని పక్కకు జరిపాడు ఉద్యోగి. అందులో వెడల్పుగా, పలకలా కనపడిన ఓ ఇనప్పెట్టెను కిందకు దించాడు. ఈలోపు వెనుక పెరట్లోనూ గాలించి, ఏమీ లేదంటూ మిగిలిన ఉద్యోగులూ వరండాలోకి వస్తూ ఆ బాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. ‘ఎక్కడ దొరికింది?’ అడిగాడు ఒక కొలీగ్. చూరు చూపించాడు ఆ బాక్స్ తీసినతను. బాక్స్‌లో డాక్యుమెంట్స్, డైమండ్స్ కనిపించాయి. దాన్ని లోపలికి తీసుకెళ్లి, ఆ ఇంటి ల్యాండ్ లైన్‌తో ఎవరికో ఫోన్ చేశాడు ఐటీ ఆఫీసర్. విషయం చెప్పి, ‘అవునా.. సరే’ అంటూ ఫోన్ పెట్టేశాడు. ‘వీళ్లబ్బాయింట్లో ఏమీ దొరకలేదట. అంటే అంతా ఇక్కడే దాచుంటాడు. ఇంకా సెర్చ్ చేయాలి’ అంటూ ఇంట్లోంచి మళ్లీ బయటకు వచ్చాడు ఆ ఆఫీసర్.ఇంటి ముందున్న గార్డెన్ ఏరియా అంతా కలియతిరిగాడు. అతన్ని చూస్తూ ఆ కుక్క మొరుగుతూనే ఉంది. ‘ఇది ఎందుకింతలా అరుస్తోంది’ అనుకుంటూ మామిడి చెట్టు వైపు వచ్చాడు. దాని కింద పొదలా పెరిగిన గడ్డీగాదం మధ్యలో ఓ సిమెంట్ గచ్చు కనిపించిందతనికి. అనుమానంతో ముందుకు కదిలాడు. ఆగకుండా కుక్క అరుస్తూనే ఉంది. ఆ అరుపుకి మిగిలిన స్టాఫ్ కూడా బయటకు వచ్చి ఆఫీసర్ని చేరుకున్నారు. ఆ గచ్చును చూపించాడతను. మేల్ సర్వెంట్‌ని పిలిచి ఆ కుక్కను అరవకుండా చూడమని పురమాయించి, గచ్చు దగ్గరికి వెళ్లి.. గడ్డి, పిచ్చి మొక్కలను పీకేశారు స్టాఫ్. ఆ గచ్చుకు మ్యాన్‌హోల్‌కి ఉండే ఐరన్ లిడ్ లాంటిది ఉంది. ‘అది పాత సంప్’ అన్నాడు సర్వెంట్ కంగారుగా. పట్టించుకోలేదు వాళ్లు్ల. మూత తీశారు. అదొక నేలమాళిగ. అందులో డబ్బులు, బంగారం, వెండి దొరికాయి.దాదాపు పాతికేళ్లనాటి ఆ రెయిడ్ అప్పటి సంచలనం. ఆ ఇంటి యజమాని గల్ఫ్ ఏజెంట్, ‘హుండీ’ వ్యాపారి. చిన్న పెంకుటింట్లో సాధారణ జీవితం గడిపే తన తల్లిదండ్రుల దగ్గర తన సంపాదనను దాస్తే ఏ భయమూ ఉండదని అక్కడ దాచాడు. ఆ రెయిడ్ జరిగిన ఏడు ఆ యజమాని తిరుపతి హుండీలో భారీ విరాళం వేయడంతో ఆ వార్త పేపర్కెక్కి.. ఐటీ దృష్టిలో పడి రెయిడ్కి దారితీసింది! అందుకే రెయిడ్ అయిపోయి తిరిగివెళ్లిపోతూ ‘ఆ ఏడుకొండలవాడి దయ’ అంటూ నవ్వుకున్నారు స్టాఫ్!ఇవి చదవండి: 'బేరం'.. బెండకాయలెంత కిలో..? -
ఫ్లాట్ నెం-420.. అదొక గేటెడ్ కమ్యూనిటీ..
‘మేడం.. టీ’ అంటూ కస్తూరికి టీ ఇచ్చింది వంటమనిషి. ‘థాంక్స్’ అన్నట్టుగా నవ్వుతూ ట్రేలోంచి టీ కప్ తీసుకుంది కస్తూరి. వంటమనిషి వంటింట్లోకి వెళ్లేవరకు ఆగి, టీ సిప్ చేస్తూ ‘మొత్తానికి మీకు బాగానే ఆసరా అయినట్టుంది కదండీ ఈమె?’ అంది కస్తూరి ఎదురుగా సింగిల్ సీటర్‌లో కూర్చున్న ఆ ఫ్లాట్ ఓనర్ మంగళతో. ‘బాగానే ఏంటండీ.. చాలా బాగా! అందుకు మీకే థాంక్స్ చెప్పాలి. అమ్మాయి డెలివరీకి వచ్చింది.. ఆమె అత్తగారు వాళ్లు, చుట్టాల హడావిడి.. నా ఒక్కదానితో అయ్యేనా అని టెన్షన్ పడ్డాను. కరెక్ట్ టైమ్‌లో ఆ దేవుడు పంపించినట్లే మీరు ఆమెను మా ఇంటికి పంపారు. తనకు రాని వంట, రాని పనంటూ లేదండీ బాబూ! మా అమ్మాయికైతే ఎంత నచ్చిందో! ఆయిల్ మసాజ్ దగ్గర్నుంచి , అమ్మాయికి తినాలనిపించినవన్నీ వండి పెట్టేవరకు పనంతా తన మీదే వేసేసుకుంటోంది. డెలివరీ అయ్యి తనింటికి వెళ్లేప్పుడు వంటమనిషిని తోడు తీసుకెళ్లిపోతానంటోందండీ అమ్మాయి’ అంటూ నిశ్చింతగా నవ్వింది మంగళ. ‘మీ అమ్మాయికి నచ్చితే మరింకేం అండీ.. బ్రహ్మాండం’ అంటూ టీ కప్ టీ పాయ్ మీద పెడుతూ వంటింటి వైపు చూసింది కస్తూరి. వంటమనిషీ కస్తూరిని చూసింది.అదొక గేటెడ్ కమ్యూనిటీ. మంగళ, కస్తూరి వాళ్లవి పక్కపక్క ఫ్లాట్లే! ఆ వంటమనిషిది బీదర్ అని, భర్తపోయి పుట్టెడు దుఃఖం, అంతకన్నా పుట్టెడు అప్పుల్లో మునిగిపోయిందని, వంటపని బాగా చేస్తుందంటూ ఆమెను కస్తూరి వాళ్ల పనమ్మాయి అన్నపూర్ణ తీసుకొచ్చింది. మంగళ అవసరాన్ని గ్రహించి, ఆమె మాతృభాష కూడా కన్నడ కావడంతో కన్నడ వంటమనిషైతే ఆమెకు చక్కగా సరిపోతుందని ఆ వంటమనిషిని మంగళ ఇంటికి పంపింది కస్తూరి. మంగళకు ఆ వంటమనిషి చురుకుదనం, పర్ఫెక్షన్, మర్యాద, మన్నన బాగా నచ్చాయి. అందుకే ఆమె త్వరగా మంగళకు ఆప్తురాలైపోయింది.ఒకరోజు.. ‘అమ్మా.. ఈ రోజు సాయంకాలం అన్నపూర్ణ వాళ్లతో కలసి బిర్లా మందిర్‌కి వెళ్లొస్తానమ్మా’ రిక్వెస్ట్ చేసింది వంటమనిషి.. దిండు గలీబులు మారుస్తూ. ‘వాళ్లతో ఎందుకూ? మన డ్రైవర్‌తో కార్లో పంపిస్తాలే’ చెప్పింది మంగళ తమ బెడ్రూమ్లోని స్విచ్ బోర్డ్‌లా కనిపిస్తున్న సీక్రెట్ సేఫ్ తెరిచి అందులో ఏవో డాక్యుమెంట్స్ సర్దుతూ! ‘అయ్యో కార్లో ఎందుకమ్మా.. చక్కగా అన్నపూర్ణ వాళ్లతో వెళ్తాలే! వాళ్లతో సరదాగా గడిపినట్టు ఉంటుంది’ అంది బెడ్ కిందున్న సొరుగులాగి కొత్త బెడ్‌షీట్ తీస్తూ! దాన్ని బయటకు తీయబోతుంటే బెడ్‌షీట్ పోగొకటి ఏదో స్క్రూకి తట్టినట్టయింది. షీట్ చిరగకుండా పోగును తెంపబోతుండగా గబగబా మంగళ వచ్చి వంటమనిషిని నెమ్మదిగా పక్కకు నెట్టి, సొరుగును లోపలికి తోసేసి, ‘ఆ బెడ్ షీట్ వద్దులే.. ఇంకోటి ఇస్తా’ అంటూ వార్డ్ రోబ్ దగ్గరకు వెళ్లింది. అయోమయంగా నిలబడిపోయింది వంటమనిషి.ఆమె మొహంలోని ఫీలింగ్‌ని ఇంకోలా అర్థం చేసుకున్న మంగళ కూతురు ‘తన ఫ్రెండ్స్‌తో పోతానంటోంది కదా.. పోనీలే మమ్మీ..’ అంటూ వంటమనిషి తరపున తల్లికి సిఫారసు చేసింది.‘సరే వెళ్లిరా..’ అంటూ వార్డ్‌రోబ్‌లోంచి తీసిన మరో బెడ్ షీట్‌ని వంటమనిషి చేతుల్లో పెట్టింది మంగళ. ఆరోజు సాయంకాలం అయిదింటికి అన్నపూర్ణ వాళ్లతో కలసి బయటకు వెళ్లింది వంటమనిషి. రాత్రి తొమ్మిది అయినా తిరిగిలేదు. కంగారు పడిపోయారు మంగళ కుటుంబ సభ్యులు. కస్తూరికి ఫోన్ చేసి అన్నపూర్ణ వివరం అడిగి, ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్‌ను క్రెడిల్ చేసిందో లేదో ఆ ఫోన్ మోగింది. క్షణంలో లిఫ్ట్ చేసి ‘హలో.. ’ అంది మంగళ. ‘హలో అమ్మగారేనా..’ అంటూ మంగళ స్వరాన్ని నిర్ధారించుకుని, ‘అమ్మా.. బిర్లా మందిర్ దగ్గర మా చుట్టాలమ్మాయి కలిసింది.బలవంతపెడితే వాళ్లింటికి వచ్చానమ్మా! ఈ రాత్రికి ఉండిపొమ్మంటున్నారు. రేప్పొద్దున్నే వచ్చేస్తానమ్మా.. వాళ్లు దిగబెడతామంటున్నారు’ అంటూ వంటమనిషి ఠక్కున ఫోన్ పెట్టేసింది.. మంగళ ఏదో అడగబోయేంతలోనే! వంటమనిషి ఆ తీరు ఆమెకు కోపాన్ని తెప్పించింది. ‘చూశావుగా.. అందుకే పంపనన్నా..’ అంది కూతురితో అసహనంగా. ‘వాట్ హ్యాపెండ్?’ అడిగింది సోఫాలో పడుకుని ఏదో మ్యాగజీన్ చదువుతున్న కూతురు లేచి కూర్చుంటూ. ‘వాళ్ల చుట్టాలమ్మాయి కలిసిందట, వాళ్లింటికి వెళ్లిందట, రేపు ఉదయం వస్తుందట’ చెప్పింది మంగళ విసురుగా. ‘అబ్బా మమ్మీ.. వస్తుందిలే రేపు.. కూల్’ అని సర్దిచెప్పింది కూతురు. ‘అన్నీ కథలు.. అది నీ అలుసే తీసుకుంది’ హెచ్చు స్వరంతో అంటూ బెడ్రూమ్లోకి వెళ్లింది మంగళ. తెల్లవారి ఆరు గంటలు.. అది చలికాలం కావడం వల్ల ఇంకా చీకటిగానే ఉంది. మంగళ వాళ్ల ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. రెండుసార్లకు.. మంగళ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఒక స్త్రీ, ఇద్దరు మగవాళ్లున్నారు. మంగళకేం అర్థంకాలేదు. ‘ఎవరు మీరు?’ అంది. ‘ఫ్రమ్ ఐటీ’ అంటూ ఐడీ కార్డ్స్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. ఆ త్రీ బెడ్రూమ్ ఫ్లాట్‌లోని వంటిల్లు, రెండు బెడ్రూమ్స్ గోడల్లోని సీక్రెట్ సేఫ్స్, మంచం కింది సొరుగులోని సీక్రెట్ అరలను సోదా చేస్తే 70 తులాల బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, నాలుగు కోట్ల క్యాష్ బయటపడింది. అది ఒక ఆర్డీవో ఫ్లాట్. నంబర్ 420.అతని బ్లాక్ మనీ గురించి ఐటీ డిపార్ట్మెంట్కి టిప్ అందించింది కస్తూరే! ఆమె రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఆమె సహకారంతోనే ఐటీ మహిళా ఉద్యోగి వంటమనిషిగా మంగళ వాళ్లింట్లోకి చేరింది. ఆ ఫ్లాట్‌ని కళ్లతోనే స్కాన్ చేసి, అన్నపూర్ణ ద్వారా డిపార్ట్మెంట్కి చేరవేసింది. అన్నపూర్ణకూ తెలియదు తాను ఏవో వివరాలను ఐటీ డిపార్ట్మెంట్కి మోస్తున్నట్లు వంటమనిషి, తన కొలీగ్ ఓ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుని అన్నపూర్ణ ద్వారా ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకున్నారు. సెర్చ్ వారంట్ సిద్ధమయ్యాక.. బిర్లామందిర్ మిషతో ఆ ఇంట్లోంచి బయటపడింది ఆ వంటమనిషి. కాయిన్ బాక్స్ ఫోన్స్ కాలం నాటి ఈ ఆపరేషన్ అప్పట్లో ఓ మోస్తరు సంచలనాన్ని సృష్టించింది. – శరాది -
మగ్దూం షాయరీలంటే పిచ్చి
జావేద్ అఖ్తర్.. సాహిత్యంలో సుస్థిరమైన పేరు! సినిమారంగానికొస్తే ఆ పేరు తెలియనివారు లేరు! హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అఖ్తర్సాబ్ కాసేపు సాగించిన చిట్‌చాట్.. భాష.. ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు.. సంస్కృతికి ప్రతిబింబం. ప్రపంచాన్ని అనుసంధానం చేసే వారధి. ప్రతి భాష దేనికదే గొప్పది. అయితే ప్రపంచంతో కమ్యూనికేషన్ కొనసాగాలంటే ఓ కామన్ భాష మాత్రం ఉండాలి. అందుకే మాతృభాషతో పాటు విధిగా దేశంలో అయితే జాతీయ భాష హిందీని, అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌ను తప్పకుండా నేర్చుకోవాలి. మాతృభాష చెట్టుకు వేరులాంటిదైతే.. ప్రపంచంతో మనం మాట్లాడే భాష కొమ్మలాంటిది. చెట్టుకు కొత్త రెమ్మలతో కొమ్మలు విస్తరించడం ఎంత అవసరమో, నేలలో బలంగా వేళ్లూనుకోవడమూ అంతే అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే చెట్టు పచ్చగా ఉంటుంది. నీ భాషను ప్రేమించడమంటే ఇతర భాషలను ద్వేషించడమని కాదుకదా! సాహిత్యం.. భాషకు ప్రాణం సాహిత్యం. భాష ద్వారా సంస్కృతిని చాటేది సాహిత్యమే. అలాంటి విలువైన ప్రపంచ సాహిత్యాన్ని చదవాలంటే అనువాదాలు తప్పనిసరి. ఈ అనువాదాలే లేకుండా మాక్సిమ్ గోర్కి నవల ‘అమ్మ’ను మనం చదివుండేవాళ్లం కాదు. ఇలాంటివెన్నో! నా కవిత్వం నాకు తెలియని కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ లాంటి ఎన్నో భాషల్లోకి అనువాదమైంది. ఉర్దూ.. హైదరాబాద్ పేరు లేకుండా ఉర్దూని ఊహించలేం. ఇక్కడి ఉర్దూ అయితే దక్కనీగా ఓ ప్రత్యేకతను పొందింది. ఈ నేల ఉర్దూ సాహిత్యంతో తరించిపోయింది. మగ్దూం మొహియుద్దీన్లాంటి కవులు తమ కవిత్వంతో ఉర్దూ భాష ఉన్నతిని చాటారు. నిన్న జైపూర్ లిటరరీ ఫెస్టివ ల్లో కూడా ఆయన షాయరీల గురించి ప్రస్తావన వచ్చింది.. కొన్ని షాయరీల్లో ఆయన వ్యక్తపరిచిన భావాలు అద్భుతం. అంతకుముందు నేనెప్పుడూ చదవలేదు. అలాగే షాద్సాబ్.. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన గజల్స్, షాయరీలంటే నాకు ప్రాణం. నేటి అభివృద్ధికి అద్దం పడుతున్నట్టు ఉంటాయి. ఇలా ఉర్దూ సాహిత్యంలో హైదరాబాద్ కంట్రిబ్యూషనూ వెలకట్టలేనిది. హైదరాబాద్‌తో అనుబంధం.. చాలా ఉంది. ఇప్పుడే అన్నీ చెప్పేస్తే.. లిటరరీ ఫెస్టివల్ కీనోట్లో చెప్పడానికి ఏమీ ఉండదు. అందుకే చాలా దాస్తున్నాను (నవ్వుతూ) ఇక్కడివాడైన మగ్దూం మొహియుద్దీన్కి పిచ్చి అభిమానిని. అంటే పరోక్షంగా హైదరాబాద్‌తో అనుబంధం ఉన్నట్టే కదా. ఇక ప్రత్యక్షంగా చూసుకున్నా సంబంధం, అనుబంధం ఉంది. నా భార్య షబానాది హైదరాబాదే.. అంటే ఈ సిటీ నా అత్తగారిల్లన్నట్టే కదా! మా ఇల్లంతా ఇప్పటికీ బగారా బైంగన్, కట్టాసాలన్ వంటలతో ఘుమఘమలాడుతూనే ఉంటుంది. - శరాది