గోడల్లో సీక్రెట్ సేఫ్స్..
కాయిన్ బాక్స్ కాలం..
వంటమనిషిగా ఐటీ ఉమన్
‘మేడం.. టీ’ అంటూ కస్తూరికి టీ ఇచ్చింది వంటమనిషి. ‘థాంక్స్’ అన్నట్టుగా నవ్వుతూ ట్రేలోంచి టీ కప్ తీసుకుంది కస్తూరి. వంటమనిషి వంటింట్లోకి వెళ్లేవరకు ఆగి, టీ సిప్ చేస్తూ ‘మొత్తానికి మీకు బాగానే ఆసరా అయినట్టుంది కదండీ ఈమె?’ అంది కస్తూరి ఎదురుగా సింగిల్ సీటర్‌లో కూర్చున్న ఆ ఫ్లాట్ ఓనర్ మంగళతో. ‘బాగానే ఏంటండీ.. చాలా బాగా! అందుకు మీకే థాంక్స్ చెప్పాలి. అమ్మాయి డెలివరీకి వచ్చింది.. ఆమె అత్తగారు వాళ్లు, చుట్టాల హడావిడి.. నా ఒక్కదానితో అయ్యేనా అని టెన్షన్ పడ్డాను. కరెక్ట్ టైమ్‌లో ఆ దేవుడు పంపించినట్లే మీరు ఆమెను మా ఇంటికి పంపారు. తనకు రాని వంట, రాని పనంటూ లేదండీ బాబూ! మా అమ్మాయికైతే ఎంత నచ్చిందో! ఆయిల్ మసాజ్ దగ్గర్నుంచి , అమ్మాయికి తినాలనిపించినవన్నీ వండి పెట్టేవరకు పనంతా తన మీదే వేసేసుకుంటోంది. డెలివరీ అయ్యి తనింటికి వెళ్లేప్పుడు వంటమనిషిని తోడు తీసుకెళ్లిపోతానంటోందండీ అమ్మాయి’ అంటూ నిశ్చింతగా నవ్వింది మంగళ. ‘మీ అమ్మాయికి నచ్చితే మరింకేం అండీ.. బ్రహ్మాండం’ అంటూ టీ కప్ టీ పాయ్ మీద పెడుతూ వంటింటి వైపు చూసింది కస్తూరి. వంటమనిషీ కస్తూరిని చూసింది.
అదొక గేటెడ్ కమ్యూనిటీ. మంగళ, కస్తూరి వాళ్లవి పక్కపక్క ఫ్లాట్లే! ఆ వంటమనిషిది బీదర్ అని, భర్తపోయి పుట్టెడు దుఃఖం, అంతకన్నా పుట్టెడు అప్పుల్లో మునిగిపోయిందని, వంటపని బాగా చేస్తుందంటూ ఆమెను కస్తూరి వాళ్ల పనమ్మాయి అన్నపూర్ణ తీసుకొచ్చింది. మంగళ అవసరాన్ని గ్రహించి, ఆమె మాతృభాష కూడా కన్నడ కావడంతో కన్నడ వంటమనిషైతే ఆమెకు చక్కగా సరిపోతుందని ఆ వంటమనిషిని మంగళ ఇంటికి పంపింది కస్తూరి. మంగళకు ఆ వంటమనిషి చురుకుదనం, పర్‌ఫెక్షన్, మర్యాద, మన్నన బాగా నచ్చాయి. అందుకే ఆమె త్వరగా మంగళకు ఆప్తురాలైపోయింది.
ఒకరోజు.. ‘అమ్మా.. ఈ రోజు సాయంకాలం అన్నపూర్ణ వాళ్లతో కలసి బిర్లా మందిర్‌కి వెళ్లొస్తానమ్మా’ రిక్వెస్ట్ చేసింది వంటమనిషి.. దిండు గలీబులు మారుస్తూ.
‘వాళ్లతో ఎందుకూ? మన డ్రైవర్‌తో కార్లో పంపిస్తాలే’ చెప్పింది మంగళ తమ బెడ్‌రూమ్‌లోని స్విచ్ బోర్డ్‌లా కనిపిస్తున్న సీక్రెట్ సేఫ్ తెరిచి అందులో ఏవో డాక్యుమెంట్స్ సర్దుతూ! ‘అయ్యో కార్లో ఎందుకమ్మా.. చక్కగా అన్నపూర్ణ వాళ్లతో వెళ్తాలే! వాళ్లతో సరదాగా గడిపినట్టు ఉంటుంది’ అంది బెడ్ కిందున్న సొరుగులాగి కొత్త బెడ్‌షీట్ తీస్తూ! దాన్ని బయటకు తీయబోతుంటే బెడ్‌షీట్ పోగొకటి ఏదో స్క్రూకి తట్టినట్టయింది. షీట్ చిరగకుండా పోగును తెంపబోతుండగా గబగబా మంగళ వచ్చి వంటమనిషిని నెమ్మదిగా పక్కకు నెట్టి, సొరుగును లోపలికి తోసేసి, ‘ఆ బెడ్ షీట్ వద్దులే.. ఇంకోటి ఇస్తా’ అంటూ వార్డ్ రోబ్ దగ్గరకు వెళ్లింది. అయోమయంగా నిలబడిపోయింది వంటమనిషి.
ఆమె మొహంలోని ఫీలింగ్‌ని ఇంకోలా అర్థం చేసుకున్న మంగళ కూతురు ‘తన ఫ్రెండ్స్‌తో పోతానంటోంది కదా.. పోనీలే మమ్మీ..’ అంటూ వంటమనిషి తరపున తల్లికి సిఫారసు చేసింది.
‘సరే వెళ్లిరా..’ అంటూ వార్డ్‌రోబ్‌లోంచి తీసిన మరో బెడ్ షీట్‌ని వంటమనిషి చేతుల్లో పెట్టింది మంగళ. ఆరోజు సాయంకాలం అయిదింటికి అన్నపూర్ణ వాళ్లతో కలసి బయటకు వెళ్లింది వంటమనిషి. రాత్రి తొమ్మిది అయినా తిరిగిలేదు. కంగారు పడిపోయారు మంగళ కుటుంబ సభ్యులు. కస్తూరికి ఫోన్ చేసి అన్నపూర్ణ వివరం అడిగి, ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్‌ను క్రెడిల్ చేసిందో లేదో ఆ ఫోన్ మోగింది. క్షణంలో లిఫ్ట్ చేసి ‘హలో.. ’ అంది మంగళ. ‘హలో అమ్మగారేనా..’ అంటూ మంగళ స్వరాన్ని నిర్ధారించుకుని, ‘అమ్మా.. బిర్లా మందిర్ దగ్గర మా చుట్టాలమ్మాయి కలిసింది.
బలవంతపెడితే వాళ్లింటికి వచ్చానమ్మా! ఈ రాత్రికి ఉండిపొమ్మంటున్నారు. రేప్పొద్దున్నే వచ్చేస్తానమ్మా.. వాళ్లు దిగబెడతామంటున్నారు’ అంటూ వంటమనిషి ఠక్కున ఫోన్ పెట్టేసింది.. మంగళ ఏదో అడగబోయేంతలోనే! వంటమనిషి ఆ తీరు ఆమెకు కోపాన్ని తెప్పించింది. ‘చూశావుగా.. అందుకే పంపనన్నా..’ అంది కూతురితో అసహనంగా. ‘వాట్ హ్యాపెండ్?’ అడిగింది సోఫాలో పడుకుని ఏదో మ్యాగజీన్ చదువుతున్న కూతురు లేచి కూర్చుంటూ. ‘వాళ్ల చుట్టాలమ్మాయి కలిసిందట, వాళ్లింటికి వెళ్లిందట, రేపు ఉదయం వస్తుందట’ చెప్పింది మంగళ విసురుగా. ‘అబ్బా మమ్మీ.. వస్తుందిలే రేపు.. కూల్’ అని సర్దిచెప్పింది కూతురు. ‘అన్నీ కథలు.. అది నీ అలుసే తీసుకుంది’ హెచ్చు స్వరంతో అంటూ బెడ్‌రూమ్‌లోకి వెళ్లింది మంగళ.
తెల్లవారి ఆరు గంటలు.. అది చలికాలం కావడం వల్ల ఇంకా చీకటిగానే ఉంది. మంగళ వాళ్ల ఫ్లాట్ కాలింగ్ బెల్ మోగింది. రెండుసార్లకు.. మంగళ వచ్చి తలుపు తీసింది. ఎదురుగా ఒక స్త్రీ, ఇద్దరు మగవాళ్లున్నారు. మంగళకేం అర్థంకాలేదు. ‘ఎవరు మీరు?’ అంది. ‘ఫ్రమ్ ఐటీ’ అంటూ ఐడీ కార్డ్స్ చూపిస్తూ లోపలికి వెళ్లారు. ఆ త్రీ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లోని వంటిల్లు, రెండు బెడ్‌రూమ్స్ గోడల్లోని సీక్రెట్ సేఫ్స్, మంచం కింది సొరుగులోని సీక్రెట్ అరలను సోదా చేస్తే 70 తులాల బంగారం, ల్యాండ్ డాక్యుమెంట్స్, నాలుగు కోట్ల క్యాష్ బయటపడింది. అది ఒక ఆర్డీవో ఫ్లాట్. నంబర్ 420.
అతని బ్లాక్ మనీ గురించి ఐటీ డిపార్ట్‌మెంట్‌కి టిప్ అందించింది కస్తూరే! ఆమె రెవెన్యూ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి. ఆమె సహకారంతోనే ఐటీ మహిళా ఉద్యోగి వంటమనిషిగా మంగళ వాళ్లింట్లోకి చేరింది. ఆ ఫ్లాట్‌ని కళ్లతోనే స్కాన్ చేసి, అన్నపూర్ణ ద్వారా డిపార్ట్‌మెంట్‌కి చేరవేసింది. అన్నపూర్ణకూ తెలియదు తాను ఏవో వివరాలను ఐటీ డిపార్ట్‌మెంట్‌కి మోస్తున్నట్లు వంటమనిషి, తన కొలీగ్ ఓ కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుని అన్నపూర్ణ ద్వారా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేసుకున్నారు. సెర్చ్ వారంట్ సిద్ధమయ్యాక.. బిర్లామందిర్ మిషతో ఆ ఇంట్లోంచి బయటపడింది ఆ వంటమనిషి. కాయిన్ బాక్స్ ఫోన్స్ కాలం నాటి ఈ ఆపరేషన్ అప్పట్లో ఓ మోస్తరు సంచలనాన్ని సృష్టించింది. – శరాది
Comments
Please login to add a commentAdd a comment