టిప్ ఇచ్చిన ఏడుకొండల వాడి హుండీ
లింక్ చూపించిన చూరు
టార్గెట్ చేర్చిన డాగ్
‘ఇంకెన్ని గల్లీలు తిప్పుతారు?’ పక్కనే ఉన్న సహోద్యోగిని అడిగింది ఆమె. ‘అదే కదా.. ఎక్కడ బండి ఆగినా, ఆ స్ట్రీట్‌లోనే రెయిడేమో అనుకుంటున్నా’ అన్నాడు సహోద్యోగి. ఆ జీప్ మరో రెండు మలుపులు తిరిగి, ఆగింది. ‘వార్నీ.. తిరిగి తిరిగి బయలుదేరిన చోటుకే వచ్చాం!’ అంది ఆమె. ఆ మాటకు ఆ జీప్‌లో వెనకాలకూర్చున్న మిగతా ముగ్గురూ చిన్నగా నవ్వుకోసాగారు. అంతలోకే ఆ టీమ్‌ని లీడ్ చేస్తున్న ఆఫీసర్ జీప్ దిగి, ఆ పరిసరాలను మార్చి మార్చి చూడసాగాడు. అది గమనించిన నలుగురు ఉద్యోగులూ జీప్ దిగారు. టార్గెట్ వైపు నడకసాగించాడు ఆఫీసర్. ఆ నలుగురూ అతన్ని అనుసరించారు.
వంద అడుగులు నడిచి, ఒక చిన్న పెంకుటిల్లు చేరుకున్నారు. ఒకసారి వాచ్ చూసుకున్నాడు ఆఫీసర్. సరిగ్గా రెండు నిమిషాలకు ‘పదండి’ అన్నట్టుగా ఆ ఇంటి ప్రహరీ గేటు తీశాడు. ఇంట్లోకి నడిచే దారి మా్రతమే ఫ్లోరింగ్‌తో, మిగతా ముంగిటంతా పూలు, పళ్ల చెట్లు, కూరగాయల పాదులతో ఉంది. గేటు పక్కనున్న మామిడి చెట్టుకు కాస్త ఆవల పూల చెట్లకు వేసిన ఫెన్సింగ్‌కి కట్టేసున్న కుక్క అరవడం మొదలుపెట్టింది. దాని అరుపులకు ఇంట్లోంచి ఒకతను బయటకు వచ్చాడు. సర్వెంట్‌లా కనపడ్డాడతను వాళ్లకు.
‘ఎవరు మీరు?’ కుక్క అరుపులను లెక్క చేయకుండా ముందుకు వస్తున్న వాళ్లనడిగాడతను. బదులు చెప్పకుండానే ఆ ఇంట్లోకి వెళ్లారు వాళ్లు. ఆ అలికిడికి, హాల్లో.. రాకింగ్ చెయిర్‌లో కూర్చుని నిద్రపోతున్న ఒక పెద్దాయన కళ్లు తెరిచి, లేవబోయి మళ్లీ కుర్చీలోనే కూలబడ్డాడు. డైనింగ్ టేబుల్ మీద ఏదో సర్దుతున్న ఒకావిడ, ‘అమ్మగారూ, ఎవరో వచ్చారండీ’ అంటూ లోపలికి కేకేసింది. ఆ మాటకు లోపలి నుంచి ఒక పెద్దావిడ వచ్చింది, బొడ్లో దోపుకున్న నాప్‌కిన్‌కి చేయి తుడుచుకుంటూ! ఆమెతో ఆ ఆఫీసర్ ‘వి ఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్‌మెంట్’ అంటూ తన ఐడీ చూపించి, ‘సెర్చ్ వారంట్ ఉంది’ అని చెప్పి తన టీమ్‌కి ఆ ఇంటికున్న నాలుగు గదులను చూపిస్తూ ‘సెర్చ్’ అన్నట్టుగా సైగ చేశాడు.
‘షో మీ?’ అడిగాడు రాకింగ్ చెయిర్ పెద్దాయన. అర్థంకానట్టుగా ఆయన్ని చూశాడు ఆఫీసర్. ‘సెర్చ్ వారంట్’ రెట్టించాడాయన! చూపించాడు ఆఫీసర్. వెంటనే ఆ పెద్దాయన తన పక్కనే చిన్న స్టూల్ మీదున్న ల్యాండ్ లైన్ ఫోన్ రిసీవర్ తీసుకున్నాడు. లాక్కున్నాడు ఆఫీసర్ ఆ చర్యను ముందే గ్రహించినట్టుగా! నిశ్చేష్టుడయ్యాడు పెద్దాయన. ఇదంతా చూసి విస్తుపోతున్న ఆ పెద్దావిడను మహిళా ఉద్యోగి అక్కడే ఉన్న డైనింగ్ టేబుల్ కుర్చీ మీద కూర్చోబెట్టి.. చేష్టలుడిగిన పనమ్మాయితో ‘మంచి నీళ్లు’ అన్నట్టుగా సైగ చేసింది.
పరిస్థితిని పసిగట్టిన మేల్ సర్వెంట్ బయటకు పరుగెత్తబోయాడు. గేట్ దగ్గరున్న జీప్ డ్రైవర్ అడ్డుపడ్డాడు. చేసేదిలేక మళ్లీ లోపలకి వచ్చేశాడు మేల్ సర్వెంట్. మహిళా ఉద్యోగి ఆ ఇంటి పెద్దావిడను ఏవో ప్రశ్నలడుగుతుండగా, మిగిలిన వాళ్లు ఆ ఇంటిని చుట్టబెట్టసాగారు.
ఓ గంట గడిచింది.. ఆ టీమ్ అంతా ‘ప్చ్..’ అంటూ తల అడ్డంగా ఆడిస్తూ హాల్లోకి వచ్చారు. ఆ ఆఫీసర్ నిరాశతో బయటకు వచ్చి, చూరు కిందున్న వరండాలో నిలబడ్డాడు. రెండు చేతులతో జుట్టును సరిచేసుకుంటూ చూరు వైపు చూశాడు. తన తలపైన చూర్లో ఏదో అబ్‌నార్మల్ థింగ్‌లా కనిపించింది దూలాల రంగులో కలసిపోయి! పరీక్షగా చూస్తే తప్ప తెలియడం లేదది. తన స్టాఫ్‌లోని ఒక వ్యక్తిని పిలిచి, చూరు చూపించాడు. అది ఒక స్లయిడ్‌లా కనిపించింది. వెంటనే మేల్ సర్వెంట్‌ని పిలిచి పెద్ద స్టూల్ అడిగారు. ‘లేదండీ’ చెప్పాడతను. ‘నిచ్చెన?’ అడిగాడు ఉద్యోగి. ఉందన్నట్టుగా తలూపుతూ వెళ్లి నిచ్చెన తీసుకొచ్చాడు.
పైకెక్కి స్లయిడ్‌ని పక్కకు జరిపాడు ఉద్యోగి. అందులో వెడల్పుగా, పలకలా కనపడిన ఓ ఇనప్పెట్టెను కిందకు దించాడు. ఈలోపు వెనుక పెరట్లోనూ గాలించి, ఏమీ లేదంటూ మిగిలిన ఉద్యోగులూ వరండాలోకి వస్తూ ఆ బాక్స్ చూసి ఆశ్చర్యపోయారు. ‘ఎక్కడ దొరికింది?’ అడిగాడు ఒక కొలీగ్. చూరు చూపించాడు ఆ బాక్స్ తీసినతను. బాక్స్‌లో డాక్యుమెంట్స్, డైమండ్స్ కనిపించాయి. దాన్ని లోపలికి తీసుకెళ్లి, ఆ ఇంటి ల్యాండ్ లైన్‌తో ఎవరికో ఫోన్ చేశాడు ఐటీ ఆఫీసర్. విషయం చెప్పి, ‘అవునా.. సరే’ అంటూ ఫోన్ పెట్టేశాడు. ‘వీళ్లబ్బాయింట్లో ఏమీ దొరకలేదట. అంటే అంతా ఇక్కడే దాచుంటాడు. ఇంకా సెర్చ్ చేయాలి’ అంటూ ఇంట్లోంచి మళ్లీ బయటకు వచ్చాడు ఆ ఆఫీసర్.
ఇంటి ముందున్న గార్డెన్ ఏరియా అంతా కలియతిరిగాడు. అతన్ని చూస్తూ ఆ కుక్క మొరుగుతూనే ఉంది. ‘ఇది ఎందుకింతలా అరుస్తోంది’ అనుకుంటూ మామిడి చెట్టు వైపు వచ్చాడు. దాని కింద పొదలా పెరిగిన గడ్డీగాదం మధ్యలో ఓ సిమెంట్ గచ్చు కనిపించిందతనికి. అనుమానంతో ముందుకు కదిలాడు. ఆగకుండా కుక్క అరుస్తూనే ఉంది. ఆ అరుపుకి మిగిలిన స్టాఫ్ కూడా బయటకు వచ్చి ఆఫీసర్‌ని చేరుకున్నారు. ఆ గచ్చును చూపించాడతను. మేల్ సర్వెంట్‌ని పిలిచి ఆ కుక్కను అరవకుండా చూడమని పురమాయించి, గచ్చు దగ్గరికి వెళ్లి.. గడ్డి, పిచ్చి మొక్కలను పీకేశారు స్టాఫ్. ఆ గచ్చుకు మ్యాన్‌హోల్‌కి ఉండే ఐరన్ లిడ్ లాంటిది ఉంది. ‘అది పాత సంప్’ అన్నాడు సర్వెంట్ కంగారుగా. పట్టించుకోలేదు వాళ్లు్ల. మూత తీశారు. అదొక నేలమాళిగ. అందులో డబ్బులు, బంగారం, వెండి దొరికాయి.
దాదాపు పాతికేళ్లనాటి ఆ రెయిడ్ అప్పటి సంచలనం. ఆ ఇంటి యజమాని గల్ఫ్ ఏజెంట్, ‘హుండీ’ వ్యాపారి. చిన్న పెంకుటింట్లో సాధారణ జీవితం గడిపే తన తల్లిదండ్రుల దగ్గర తన సంపాదనను దాస్తే ఏ భయమూ ఉండదని అక్కడ దాచాడు. ఆ రెయిడ్ జరిగిన ఏడు ఆ యజమాని తిరుపతి హుండీలో భారీ విరాళం వేయడంతో ఆ వార్త పేపర్‌కెక్కి.. ఐటీ దృష్టిలో పడి రెయిడ్‌కి దారితీసింది! అందుకే రెయిడ్ అయిపోయి తిరిగివెళ్లిపోతూ ‘ఆ ఏడుకొండలవాడి దయ’ అంటూ నవ్వుకున్నారు స్టాఫ్!
ఇవి చదవండి: 'బేరం'.. బెండకాయలెంత కిలో..?
Comments
Please login to add a commentAdd a comment