మగ్దూం షాయరీలంటే పిచ్చి
జావేద్ అఖ్తర్.. సాహిత్యంలో సుస్థిరమైన పేరు! సినిమారంగానికొస్తే ఆ పేరు తెలియనివారు లేరు! హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అఖ్తర్‌సాబ్ కాసేపు సాగించిన చిట్‌చాట్..
భాష.. ఒక కమ్యూనికేషన్ టూల్ మాత్రమే కాదు.. సంస్కృతికి ప్రతిబింబం. ప్రపంచాన్ని అనుసంధానం చేసే వారధి. ప్రతి భాష దేనికదే గొప్పది. అయితే ప్రపంచంతో కమ్యూనికేషన్ కొనసాగాలంటే ఓ కామన్ భాష మాత్రం ఉండాలి. అందుకే మాతృభాషతో పాటు విధిగా దేశంలో అయితే జాతీయ భాష హిందీని, అంతర్జాతీయంగా ఇంగ్లిష్‌ను తప్పకుండా నేర్చుకోవాలి.
మాతృభాష చెట్టుకు వేరులాంటిదైతే.. ప్రపంచంతో మనం మాట్లాడే భాష కొమ్మలాంటిది. చెట్టుకు కొత్త రెమ్మలతో కొమ్మలు విస్తరించడం ఎంత అవసరమో, నేలలో బలంగా వేళ్లూనుకోవడమూ అంతే అవసరం. ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటే చెట్టు పచ్చగా ఉంటుంది. నీ భాషను ప్రేమించడమంటే ఇతర భాషలను ద్వేషించడమని కాదుకదా!
సాహిత్యం..
భాషకు ప్రాణం సాహిత్యం. భాష ద్వారా సంస్కృతిని చాటేది సాహిత్యమే. అలాంటి విలువైన ప్రపంచ సాహిత్యాన్ని చదవాలంటే అనువాదాలు తప్పనిసరి. ఈ అనువాదాలే లేకుండా మాక్సిమ్ గోర్కి నవల ‘అమ్మ’ను మనం చదివుండేవాళ్లం కాదు. ఇలాంటివెన్నో! నా కవిత్వం నాకు తెలియని కన్నడ, గుజరాతీ, బెంగాలీ, మరాఠీ లాంటి ఎన్నో భాషల్లోకి అనువాదమైంది.
ఉర్దూ..
హైదరాబాద్ పేరు లేకుండా ఉర్దూని ఊహించలేం. ఇక్కడి ఉర్దూ అయితే దక్కనీగా ఓ ప్రత్యేకతను పొందింది. ఈ నేల ఉర్దూ సాహిత్యంతో తరించిపోయింది. మగ్దూం మొహియుద్దీన్‌లాంటి కవులు తమ కవిత్వంతో ఉర్దూ భాష ఉన్నతిని చాటారు. నిన్న జైపూర్ లిటరరీ ఫెస్టివ ల్‌లో కూడా ఆయన షాయరీల గురించి ప్రస్తావన వచ్చింది.. కొన్ని షాయరీల్లో ఆయన వ్యక్తపరిచిన భావాలు అద్భుతం. అంతకుముందు నేనెప్పుడూ చదవలేదు. అలాగే షాద్‌సాబ్.. ఆయనకు నేనంటే చాలా ఇష్టం. ఆయన గజల్స్, షాయరీలంటే నాకు ప్రాణం. నేటి అభివృద్ధికి అద్దం పడుతున్నట్టు ఉంటాయి. ఇలా ఉర్దూ సాహిత్యంలో హైదరాబాద్ కంట్రిబ్యూషనూ వెలకట్టలేనిది.
హైదరాబాద్‌తో అనుబంధం..
చాలా ఉంది. ఇప్పుడే అన్నీ చెప్పేస్తే.. లిటరరీ ఫెస్టివల్ కీనోట్‌లో చెప్పడానికి ఏమీ ఉండదు. అందుకే చాలా దాస్తున్నాను (నవ్వుతూ) ఇక్కడివాడైన మగ్దూం మొహియుద్దీన్‌కి పిచ్చి అభిమానిని. అంటే పరోక్షంగా హైదరాబాద్‌తో అనుబంధం ఉన్నట్టే కదా. ఇక ప్రత్యక్షంగా చూసుకున్నా సంబంధం, అనుబంధం ఉంది. నా భార్య షబానాది హైదరాబాదే.. అంటే ఈ సిటీ నా అత్తగారిల్లన్నట్టే కదా! మా ఇల్లంతా ఇప్పటికీ బగారా బైంగన్, కట్టాసాలన్ వంటలతో ఘుమఘమలాడుతూనే ఉంటుంది.
- శరాది