
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ చర్చాగోష్టిలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు
దావోస్ ఒప్పందాలు పెట్టుబడులుగా మారేలా చూడాలి
రాజకీయాల్లో నైతిక సంస్కరణలు తీసుకురావాలి
మండల స్థాయి నుంచి ప్రధాని దాకా
రాజకీయవేత్తలను ఒప్పించడం కష్టమని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కార్మిక, పెట్టు బడులు, భూములు, పన్నులు, పాలన వంటి అంశాల్లో వ్యవస్థీకృత సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. దావోస్‌లో సీఎంలు, కేంద్ర మంత్రులు పలు ఒప్పందాలు చేసుకున్నారని.. ఆ పెట్టుబడిదారులు ఇక్కడికి వచ్చాక పెట్టుబడులు పెట్టేందుకు వారు సుముఖంగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు. శనివారం హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌లో ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రం మై లైఫ్ అండ్ కెరీర్’పుస్తకంపై చర్చాగోష్టి నిర్వహించారు. రచయిత సుచిత్ర షెనాయ్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ చర్చాగోష్టిలో దువ్వూరి సుబ్బారావు మాట్లాడారు.
రాజకీయాల్లో నైతిక సంస్కరణలు తేవాలి
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారంలోకి రావడంతోపాటు ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల సమయం ఉండటం, కూటమి బలంగా ఉండటం వల్ల రాజకీయపరంగా నైతిక సంస్కరణలు (పొలిటికల్లీ ఎథికల్ రిఫామ్స్) తెచ్చేందుకు ఇదే సరైన సమయమని దువ్వూరి పేర్కొన్నారు. ప్రస్తుతం ఏ ప్రధానికీ లేనంతగా మోదీకి రాజకీయ పలుకుబడి ఉన్నందున రాజకీయపరంగా కొన్ని కష్టతరమైన నిర్ణయాలను, వ్యవస్థీకృత సంస్కరణలను అమల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు.
నాటి సంస్కరణలు ఎంతో కీలకం
‘‘1991లో దేశంలో తెచ్చిన ఆర్థిక సంస్కరణలు ఎంతో కీలకమైవి. దేశం ఆర్థికంగా అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఉన్నపుడు తెచ్చిన ఆ సంస్కరణలు దేశ గతిని మలుపు తిప్పాయి. నాడు ఆ సంస్కరణలు ఎంతో అవసరం. వాటిని అంతర్జాతీయ ద్రవ్యనిధి ఆదేశాలకు అనుగుణంగా తెచ్చారనేది వాస్తవం కాదు. నేటి తరానికి, ముఖ్యంగా యువతకు 1990కు ముందు దేశంలో ఉన్న పరిస్థితుల గురించి అంతగా అవగాహన ఉండకపోవచ్చు. ల్యాండ్ ఫోన్ కనెక్షన్, ఎల్‌పీజీ గ్యాస్ లేవు. టేప్‌రికార్డర్, కాలిక్యులేటర్ వంటివి కూడా ఇతర దేశాల నుంచి తెప్పించుకోవడమో, స్మగ్లింగ్ చేయడమో జరిగేది..’’అని దువ్వూరి సుబ్బారావు చెప్పారు. ఎన్టీ రామారావు సీఎంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాల్లో జిల్లాకో ‘సారాయి బాట్లింగ్ యూనిట్’స్థాపించాలనే ఆదేశాలను అమలుచేసేందుకు ఓఎస్డీగా వ్యవహరించిన తీరును గుర్తు చేసుకున్నారు. ఆర్బీఐ గవర్నర్‌గా ఒక శాతం వడ్డీరేటు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ప్రకటించినప్పుడు ఎదురైన పరిస్థితులను వివరించారు. మండల స్థాయి నుంచి ప్రధాని స్థాయి వరకు రాజకీయవేత్తలను ఏవైనా నిర్ణయాలపై ఒప్పించడమనేది కష్టతరమైనదేనని ఒక ప్రశ్నకు బదులిచ్చారు.