
ఐఎస్‌బీలో మాట్లాడుతున్న ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాంరాజన్
రాయదుర్గం: మానవ వనరులపై సకాలంలో దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి రచించిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్’ పుస్తకంపై ఐఎస్‌బీ ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)లోని ఖేమ్కా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, రాబోయే దశాబ్దాలలో దేశాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ అత్యంత ముఖ్యమైన ఆస్తిగా మానవ వనరులని చెప్పవచ్చని, పెద్ద సంఖ్యలో వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే దేశానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దేశంలో అభివృద్ధికి అనేక ప్రణాళికలు ఉన్నాయని, అయితే వాటిని అమలు చేయడంలోనే లోపం ఉందని తెలిపారు.
అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారడానికి లక్ష్యాలను నిర్దేశించుకునే ముందు ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐఎస్‌బీ లాంటి విద్యాసంస్థలో చదివే విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సృష్టించడం కంటే ఉద్యోగాలు చేయడంపైనే దృష్టి సారించారని రఘురాం రాజన్ పేర్కొన్నారు.
విద్యార్థులంతా సంస్థలను స్థాపించి తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఐఎస్‌బీ ఒకటని, ఈ విద్యాసంస్థ దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే సత్తా కలిగిన విద్యార్థులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సహ రచయిత రోహిత్ లాంబా, పలువురు ఐఎస్‌బీ ఫ్యాకల్టి, విద్యార్థులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment