ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలానికి భద్రతేది?: రాజన్
ముంబయి: ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలానికి భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల పదవీకాలానికి ఎలాంటి భద్రత ఉంటుందో అదే స్థాయి భద్రతను ఆర్బీఐ గవర్నర్ పదవికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉండటం చాలా స్వల్పమైనదని చెప్పారు.
ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని, ఒక్కోసారి చిన్నచిన్న విషయాలకే అది సమస్యగా పరిణమిస్తుందని కూడా చెప్పారు. ఇవి తీరేందుకు విలువైన సమయం వృధా అయిపోతుందని కూడా తెలిపారు. అయితే, ఒక వేళ పదవీ కాలానికి భద్రత ఉంటుందనుకొని భావించినా తిరిగి ఏదో ఒక అంశం ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆయన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకం 'ఐ డూ వాట్ ఐ డూ' అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.