Former RBI governor
-
Duvvuri Subbarao: వృద్ధి, వడ్డీ రేటు మార్పులకు ఆ ఇద్దరి నుంచి ఒత్తిడి
న్యూఢిల్లీ: ప్రణబ్ ముఖర్జీ, పి. చిదంబరం ఆర్థిక మంత్రులుగా పని చేసిన సమయంలో సానుకూల సెంటిమెంటు కోసం వడ్డీ రేట్లను తగ్గించాలని, వృద్ధి రేటును పెంచి చూపాలని తమపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉండేవని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ స్వయం ప్రతిపత్తికి ప్రాధాన్యతనివ్వాల్సిన అవసరం గురించి ప్రభుత్వంలో కొంతైనా అవగాహన ఉండదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ‘జస్ట్ ఎ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్’ పేరిట రాసిన స్వీయకథలో దువ్వూరి ఈ విషయాలు పేర్కొన్నారు. వడ్డీ రేట్ల విషయంలోనే కాకుండా ఇతరత్రా అంశాల్లోనూ ప్రభుత్వం నుంచి ఆర్బీఐపై ఒత్తిడి ఉండేదని ఒక అధ్యాయంలో ఆయన ప్రస్తావించారు. ‘ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు జరిగిన విషయమిది. ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారాం, ప్రధాన ఆర్థిక సలహాదారు కౌశిక్ బసు మా అంచనాలను సవాలు చేశారు. సానుకూల సెంటిమెంటును పెంపొందించాల్సిన భారాన్ని ప్రభుత్వంతో పాటు ఆర్బీఐ కూడా పంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలకు సెంట్రల్ బ్యాంకులు సహకరిస్తుంటే మన దగ్గర మాత్రం ఆర్బీఐ తిరుగుబాటు ధోరణిలో ఉంటోందంటూ మాయారాం వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆర్బీఐ చీర్లీడరుగా ఉండాలన్న డిమాండ్‌కి నేను తలొగ్గలేదు’ అని దువ్వూరి పేర్కొన్నారు. చిదంబరం విషయానికొస్తే .. వడ్డీ రేట్లు తగ్గించాలంటూ ఆర్బీఐపై తీవ్ర ఒత్తిడి తెచి్చనట్లు దువ్వూరి చెప్పారు. పరిస్థితులను సమీక్షించిన మీదట తాను అంగీకరించలేదన్నారు. దీంతో కలవరానికి గురైన చిదంబరం అసాధారణ రీతిలో ఆర్బీఐపై అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారని వివరించారు. ఏపీలోని పార్వతీపురంలో సబ్–కలెక్టరుగా కెరియర్ను ప్రారంభించిన దువ్వూరి కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా, అటు పైన అంతర్జాతీయ మాంద్యం పరిస్థితుల్లో ఆర్బీఐ గవర్నర్‌గా కూడా పని చేసిన సంగతి తెలిసిందే. -
దేశానికి కీలక ఆస్తి మానవ వనరులే
రాయదుర్గం: మానవ వనరులపై సకాలంలో దృష్టి పెట్టడం భారతదేశ ఆర్థిక వృద్ధికి కీలకమని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అన్నారు. ఆయన ఆర్థికవేత్త రోహిత్ లాంబాతో కలిసి రచించిన ‘బ్రేకింగ్ ది మౌల్డ్’ పుస్తకంపై ఐఎస్బీ ప్రొఫెసర్ భగవాన్ చౌదరితో ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం రాత్రి గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లోని ఖేమ్కా ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, రాబోయే దశాబ్దాలలో దేశాభివృద్ధికి ఊతమిచ్చే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. భారతదేశ అత్యంత ముఖ్యమైన ఆస్తిగా మానవ వనరులని చెప్పవచ్చని, పెద్ద సంఖ్యలో వారికి సరైన శిక్షణ ఇవ్వగలిగితే దేశానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు. దేశంలో అభివృద్ధికి అనేక ప్రణాళికలు ఉన్నాయని, అయితే వాటిని అమలు చేయడంలోనే లోపం ఉందని తెలిపారు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా మారడానికి లక్ష్యాలను నిర్దేశించుకునే ముందు ఆరోగ్య సంరక్షణ, విద్యా సౌకర్యాల కొరతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఐఎస్బీ లాంటి విద్యాసంస్థలో చదివే విద్యార్థులు చాలా మంది ఉద్యోగాలు సృష్టించడం కంటే ఉద్యోగాలు చేయడంపైనే దృష్టి సారించారని రఘురాం రాజన్ పేర్కొన్నారు. విద్యార్థులంతా సంస్థలను స్థాపించి తాము ఉపాధి పొందుతూ, నలుగురికి ఉపాధి కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. భారతదేశంలోని అగ్రశ్రేణి వ్యాపార పాఠశాలల్లో ఐఎస్బీ ఒకటని, ఈ విద్యాసంస్థ దేశంలో మరిన్ని ఉద్యోగ అవకాశాలు సృష్టించే సత్తా కలిగిన విద్యార్థులను తయారు చేయాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో సహ రచయిత రోహిత్ లాంబా, పలువురు ఐఎస్బీ ఫ్యాకల్టి, విద్యార్థులు పాల్గొన్నారు. -
కొన్ని సలహాలూ, సంఘటనలూ!
చాలామంది రాయరు గానీ, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ అనుభవాలను పుస్తకాలుగా తెస్తే, అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి. అవి విలువైన పాఠాలు కూడా అవుతాయి. తాజాగా తన పదవీకాలపు జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చిన జాబితాలోకి భారత రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన సి.రంగరాజన్ కూడా చేరారు. 1990లో దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం గురించీ, చివరకు బంగారాన్ని తాకట్టుపెట్టి దానిలోంచి బయటపడిన ఘటన గురించీ ఆయన రాశారు. అప్పటి రాజకీయ వైఫల్యాన్ని కూడా బయటపెట్టారు. రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చిన సందర్భాన్ని కూడా వివరించారు. గవర్నర్‌గా పనిచేసినప్పుడు రాజకీయ నాయకుల ముహూర్తాల సెంటిమెంట్లను ఆయన గమనించారు. వీటన్నింటికంటే ముఖ్యంగా, గవర్నర్లకు తమ అధికారాలు, పరిమితుల మీద ఉండవలసిన గ్రహింపు గురించి కూడా ఆయన విడమరిచారు. గవర్నర్లు తరచూ వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇది గమనార్హమైనది. అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించారో ప్రకటించుకునే తరహా సంప్రదాయం మన దగ్గర పెద్దగా లేదు. మాంటెక్‌సింగ్ అహ్లూ్లవాలియా దీనికి ఒక మినహా యింపు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా తన దశాబ్ద కాలపు అనుభవాలను గురించి ఆయన రాశారు. భారత ఉపరాష్ట్రపతిగా తన పదేళ్ల కాలం గురించి హమీద్ అన్సారీ సమగ్రమైన ఇంట ర్వ్యూను ఇవ్వడాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు సి. రంగరాజన్... రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా, ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా, ఒరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్వల్పకాలం పాటు గవర్నర్ బాధ్య తలు నిర్వహించిన తన పదవీ కాలాల గురించిన రచనను(ఫోర్క్స్ ఇన్ ద రోడ్: మై డేస్ ఎట్ ఆర్బీఐ అండ్ బియాండ్) ప్రచురించారు. అది ఎన్నో చక్కటి వివరాలతో, సంతోషకరమైన ఉపాఖ్యానాలతో కూడి ఉంది. భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్‌గా ఉన్నప్పుడు, 1990 నాటి ఆర్థిక సంక్షోభం గురించి ఆయన ఎంతో వివరంగా రాశారు. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ రాస్తూ, ‘‘ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను సంప్రదించక తప్పని పరిస్థితి గురించి’’ పేర్కొంది. కానీ ‘‘ప్రభుత్వం తక్షణ చర్య ఏదీ తీసుకోలేదు.’’ ఇది ‘‘రాజకీయ నాయకత్వ వైఫల్యమే’’ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు. ఆనాటి ‘‘పరిస్థితిలోని తీవ్రతను నాటి ప్రభుత్వం గుర్తించకపోవడం, లేదా ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) వద్దకు వెళ్లడానికి సైద్ధాం తికంగా విముఖత ప్రదర్శించడం’’ వల్ల చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించిందని రంగరాజన్ రాశారు. ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ‘‘వేగంగా దిగజారిపోయింది’’ అంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. నాలుగు నెలల తర్వాత, ‘‘మన నిల్వలు... కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సమా నంగా ఉన్నాయి,’’ అని చెబుతూ ఆయన ఇలా కొనసాగిస్తారు: ‘‘పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందంటే, విదేశాల్లో ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను అమ్మివేయాలని కూడా కొంత ఆలోచన సాగింది.’’ అలా అమ్మేయడానికి పరిగణించిన ఆస్తుల్లో జపాన్ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒకటి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్ ‘‘డిఫాల్టర్‌గా ఉండటానికి కూడా సిద్ధమైంది... దీన్ని తప్పించుకోవడానికి చివరికి అదీ, ఇదీ అనకుండా ప్రతి విషయం గురించి కూడా ఆలోచించాం’’ అని రంగరాజన్ నాతో చెప్పారు. ఆ సమయంలో వారు ఎంపిక చేసు కున్న నిర్ణయాల్లో ఒకటి: 405 మిలియన్ డాలర్ల రుణం పొందడానికి గానూ, భారతదేశ బంగారు నిల్వల్లో 15 శాతం (ఇది 46.91 టన్నులకు సమానం) తనఖా పెట్టాలనుకోవడం! ఈ రోజు చూస్తే అది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ సమ యంలో ‘‘ఆ సొమ్ము చాలా కీలక మైంది... ఎగవేతను అడ్డుకోవ డానికి.’’ 1991 జూలై నాటి మరొక అద్భుతమైన కథ ఈ పుస్తకంలో ఉంది. అది – పీవీ నరసింహారావు ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించడం గురిం చినది. అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అది రెండు దఫాలుగా జరిగింది. సి.రంగరాజన్ ఈ రెండో దఫా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. ఇక్కడ ఒక చిన్న నేపథ్యం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తొలి విడత రూపాయి విలువను తగ్గించిన తర్వాత, దానిపై వచ్చిన తీవ్రమైన రాజకీయ ప్రతిస్పందన చూసి ప్రధాని నరసింహారావు విశ్వాసం సన్నగిల్లింది. దీంతో రెండో దఫా రూపాయి విలువ తగ్గింపును వాయిదా వేయాలని మన్మోహన్ సింగ్‌ను కోరారు. ఆ సందర్భంలో రంగరాజన్ చెప్పిన విషయానికి చాలా ప్రాముఖ్యం ఉంది. రూపాయి విలువను రెండో దఫా తగ్గించిన రోజున (1991 జూలై 3) ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ నుంచి ఉదయం 9.30 గంట లకు రంగరాజన్‌కు ఫోన్ కాల్ వచ్చింది. ‘‘పరిస్థితి ఎలా ఉంది?’’ అని మన్మోహన్ అడిగితే, ‘‘నేను జంప్ చేశాను’’అని రంగరాజన్ సింపుల్‌గా చెప్పేశారు. దాంతో మన్మోహన్ ‘‘అయితే సరే’’ అని చెప్పి సంభాషణను ముగించారు. ఆనాటి తన సమాధానం గురించి రంగరాజన్ నాకు చెబుతూ, రూపాయి విలువను తగ్గించడానికి ఆర్బీఐ కోడ్ భాష వాడిందని వివరించారు. ఆ కోడ్ ఏమిటంటే ‘హాప్, స్కిప్, అండ్ జంప్’. ‘నేను జంప్ చేశాను’ అనే సమాధానానికి ‘‘రెండో దశ రూపాయి విలువ తగ్గింపు ప్రక్రియ పూర్తయిందనీ, దాన్ని ఇక ఆపలేమనీ’’ అర్థం. రంగరాజన్ రాసిన పుస్తకం అయిదేళ్లు ఆయన గవర్నర్ పదవిలో ఉన్న రోజుల్లో చేసిన కొన్ని మంచి విషయాలను కూడా పొందుపర్చింది. ఈనాటి గవర్నర్లకు కొన్ని మంచి సలహాలను కూడా ఇది సూచించింది. ఒరిస్సాలో గవర్నర్‌గా ఉన్నప్పుడు భారత రాజకీయ నాయకులపై జ్యోతిష్యం ఎంత బలంగా ప్రభావం వేస్తోందో రంగరాజన్ కనుగొన్నారు. ఆనాడు ఒరిస్సా ముఖ్య మంత్రిగా ఉన్న గిరిధర్ గమాంగ్ కేవలం శుభ ముహూర్తాల్లో మాత్రమే గవర్నర్‌ని కలిసేవారట. ‘‘ఉదయం 11.13కు నేను మిమ్మల్ని కలుస్తాను’’ అని గమాంగ్ అనేవారని ఈ పుస్తకం చెబుతోంది. ఇక నేటి గవర్నర్లకు ఈ పుస్తకం ఇస్తున్న సలహా నిజంగానే ఉపయోగకరంగా ఉంది. ముఖ్యమంత్రి చేస్తున్న పనులు గవర్నర్‌కి నచ్చకపోయిట్లయితే, ఆయన లేదా ఆమె ముఖ్య మంత్రితో నేరుగా చర్చించాలనీ, లేదా రాష్ట్రపతికి ఈ వ్యవహారంపై లేఖ రాయవచ్చనీ రంగరాజన్ తన పుస్తకంలో రాశారు. అంతకు మించి తన అసమ్మతిని, వ్యతిరేకతను గవర్నర్ బయటకు వెల్ల డించకూడదనీ, ప్రజా ప్రదర్శన చేయకూడదనీ సలహా ఇచ్చారు. ఈ మాటలు మమతా బెనర్జీ గానీ విన్నట్లయితే ఎంతో సంతోష పడతారు! గతంలో ప్రముఖ రాజకీయ నేతలుగా ఉన్న వ్యక్తులను గవ ర్నర్లుగా నియమించినప్పుడు ‘‘కార్యాచరణలోకి దిగాలన్న దురద వారిలో కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తుంది’’ అని రంగరాజన్ అంటారు. ఆయన సలహా ఒకటే! అది ఏమిటంటే – ‘‘వారు తమ అత్యుత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం తప్పక నేర్చుకోవలసి ఉంది... గవర్నర్లు తమకు గల అధికారాలను మాత్రమే కాకుండా తమ పరిమితులను కూడా అర్థం చేసుకోవలిసి ఉంటుంది.’’ కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు -
ప్రభుత్వం ఆదుకోకపోతే బ్యాంకింగ్‌కు కష్టాలే..
ముంబై: ప్రపంచంలోనే అత్యధిక మొండి బకాయిల (ఎన్పీఏ) భారం మోస్తున్న భారత్ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌కు కేంద్రం సహాయక చర్యలు అందకపోతే పరిస్థితి మరింత విషమిస్తుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కు గవర్నర్లుగా బాధ్యతలు నిర్వహించిన నలుగురు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఒక పుస్తకంలో ఈ వివరాలు వెల్లడికానున్నాయి. ‘మహమ్మారి: భారత ఘన బ్యాంకింగ్ కష్టాలు’ పేరుతో పబ్లిషింగ్ హౌస్– రోలీ బుక్స్ ఆవిష్కరించనున్న పుస్తక రచనలో భాగంగా రచయిత, ప్రముఖ పాత్రికేయులు తమల్ బందోపాధ్యాయ నలుగురు గవర్నర్లను ఇంటర్వ్యూ చేశారు. అసలు మొండిబకాయిల సమస్యలకు కారణాలపై గవర్నర్లు విభిన్నంగా స్పందించినప్పటికీ బ్యాంకింగ్ విలీనాలు, పరిపాలనా, బ్యాంకుల విషయంలో ప్రభుత్వ యాజమాన్యంపై ఒకే విధంగా స్పందించడం గమనార్హం. విలీనాలు, భారీ బ్యాంకింగ్ ఏర్పాటుతో సమస్య తీరిపోదని వారు పేర్కొన్నారు. బ్యాంకుల్లో ప్రభుత్వ వాటాలు తగ్గాలని, పాలనా వ్యవస్థ మెరుగుపడాలనీ సూచించారు. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం... ఈ ఇంటర్వ్యూల్లో నలుగురు గవర్నర్లూ ఏమన్నారంటే... అత్యుత్సాహమూ కారణమే కంపెనీల భారీ పెట్టుబడులు, రుణాలు అందించడంలో బ్యాంకర్ల అత్యుత్సాహం ఎన్పీఏలు భారీగా పెరిగిపోడానికి కారణమయ్యాయి. ఆర్థిక మందగమనం మొండిబకాయిల తీవ్రతకు ఒక కారణం అయితే, సత్వర చర్యలు తీసుకోవడంలో వైఫల్యం కూడా సమస్యను మరింత జఠిలం చేసింది. మొండిబకాయిల సత్వర గుర్తింపు, తగిన భారీ మూలధన కల్పన, బ్యాంకింగ్ పాలనా వ్యవస్థ పటిష్టం తక్షణం అవసరం. ఈ దిశలో చర్యలు ఉండాలి. – డాక్టర్ రఘురామ్ రాజన్ (గవర్నర్‌గా.. 2013–2016) అతి పెద్ద సమస్య అవును. భారత్ బ్యాంకింగ్ మొండిబకాయిలు భారీ, వాస్తవ సమస్య. ఈ సమస్య సత్వర పరిష్కారంపై దృష్టి పెట్టాలి. అసలే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు మహమ్మారితో మరింత విషమించాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం ముందే ప్రారంభమైన మొండిబకాయిల సమస్య, అటు తర్వాతా కొనసాగింది. కొన్ని అననుకూల పాలనాపరమైన సమస్యల వల్ల మొండిబకాయిలను తరువాత అదుపుచేయలేకపోవడం చోటుచేసుకుంది. – దువ్వూరి సుబ్బారావు (బాధ్యతల్లో.. 2008–2013) ఇతర ఇబ్బందులకూ మార్గం బ్యాంకుల్లో ఉన్న మొండిబకాయిల సమస్య కేవలం అక్కడితో ఆగిపోదు. ఇతర సమస్యలకూ ఇది దారితీస్తుంది. బలహీన ఫైనాన్షియల్ పరిస్థితులు, మొండిబకాయిలు వాస్తవ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతున్నాయి. రుణాల పెంపునకు వచ్చిన ఒత్తిడులు కూడా మొండిబకాయిల భారానికి కారణం. 2015–16 రుణ నాణ్యత సమీక్ష తరువాత ఆర్థిక వ్యవస్థ విస్తృతమయినప్పటికీ, రుణాల్లో వృద్ధి లేకపోవడం ఇక్కడ గమనార్హం. – వై. వేణుగోపాల్ రెడ్డి (విధుల్లో.. 2003–2008) పెద్ద నోట్ల రద్దు... సంక్షోభం! బ్యాంకింగ్ వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ‘ప్రణాళికా బద్దంగా జరగని’’ నోట్ల రద్దుతో మరింత తీవ్రమయ్యాయి. నోట్ల రద్దు ఒక ఆర్థిక సంక్షోభంగా పేర్కొనవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలో సమస్యకు ఈ వ్యవస్థమాత్రమే కారణం కాదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనాపరమైన అంశాలెన్నో ఇక్కడ ప్రతిబింబిస్తుంటాయి. పాలనాపరమైన లోపాలను సవరించడం ద్వారా బ్యాంకింగ్ రంగాన్ని ఒక గాడిన పెట్టడం సాధ్యమవుతుంది. – సీ. రంగరాజన్ (పదవీకాలం..1992–1997) -
ఇది యాంత్రిక రికవరీయే..!
న్యూఢిల్లీ: ఆర్థిక రంగం కోలుకోవడం అన్నది యాంత్రికంగా చోటు చేసుకుంటున్నదే కానీ.. లాక్ డౌన్ పరిస్థితుల కారణంగా ఆగిపోయిన ఆర్థిక కార్యకలాపాలు పూర్వపు స్థితికి చేరుకుంటున్నాయని ప్రభుత్వం భావించడం సరికాదంటున్నారు ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి భారత్ వృద్ధి అవకాశాలు చూడ్డానికి బలహీనంగానే ఉన్నాయన్నారు. ఈ మేరకు ఆర్థిక వ్యవస్థపై తన అభిప్రాయాలను ఓ వార్తా సంస్థతో పంచుకున్నారు. కరోనా వైరస్ రావడానికి పూర్వమే మన దేశ వృద్ధి రేటు 2017–18లో ఉన్న 7 శాతం నుంచి 2019–20లో 4.2 శాతానికి క్షీణించిన విషయం తెలిసిందే. ‘‘మీరు పేర్కొంటున్న ఆర్థిక రికవరీ సంకేతాలను లాక్ డౌన్ నాటి క్షీణించిన పరిస్థితుల నుంచి యాంత్రికంగా జరిగే రికవరీగానే మేము చూస్తున్నాము. దీన్ని మన్నికైన రికవరీగా చూడడం పొరపాటే అవుతుంది. కరోనా మహమ్మారి ఇప్పటికీ విస్తరిస్తూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా, కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కనుక స్వల్పకాలం నుంచి మధ్య కాలానికి వృద్ధి అవకాశాలు బలహీనంగానే ఉండనున్నాయి. మహమ్మారి సమసిపోయిన తర్వాత (దీన్ని త్వరలోనే చూస్తామన్నది నా ఆశాభావం) ఈ సమస్యలు మరింత పెద్దవి కానున్నాయి. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోనుంది. రుణ భారం కూడా భారీగానే ఉంటుంది. ఆర్థిక రంగం దారుణ పరిస్థితులను చూస్తుంది. ఈ సవాళ్లను ఏ విధంగా పరిష్కరించుకుంటామన్న దానిపైనే మధ్యకాల వృద్ధి అవకాశాలు ఆధారపడి ఉంటాయి’’ అంటూ సుబ్బారావు వివరించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఆశావహం.. ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పట్టణాలతో పోలిస్తే మెరుగ్గా కోలుకోవడాన్ని సానుకూల సంకేతంగా దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని విస్తరించడం మంచి చర్యగా పేర్కొన్నారు. మన ఆర్థిక వ్యవస్థకు కనీస భద్రతా రక్షణలు ఉండడాన్ని తక్కువ మంది గుర్తించిన మరో సానుకూల అంశంగా చెప్పారు. 4 కోట్ల మంది పట్టణ కార్మికులు కరోనా లాక్ డౌన్ల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిపోయారని, అయినప్పటికీ అక్కడ భారీ కేసులు ఏమీ లేకపోవడాన్ని ఉదాహరణగా పేర్కొన్నారు. ప్రభుత్వ ఖర్చే వృద్ధి చోదకం ప్రస్తుత ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తగినంత నిధులను ఖర్చు చేయడం లేదన్న విమర్శలకు సుబ్బారావు స్పందిస్తూ.. రుణాలు తీసుకుని ఖర్చు చేయడం ప్రభుత్వానికి పెద్ద కష్టమైన విషయం కాదన్నారు. ‘‘ప్రభుత్వం చేసే వ్యయమే స్వల్పకాలంలో వృద్ధిని నడిపించగలదు. వద్ధికి ఆధారమైన ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు, ఎగుమతులు అన్నీ కూడా మందగించి ఉన్నాయి. ఆర్థిక వృద్ధి క్షీణతను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత ఖర్చు చేయకపోతే మొండి బకాయిలు సహా పలు సమస్యలు ఆర్థిక వ్యవస్థను చుట్టుముడతాయి’’ అని సుబ్బారావు చెప్పారు. అయితే, కేంద్రం రుణాలకు పరిమితి మాత్రం ఉండాలన్నారు. -
జీడీపీ వృద్ధి 5 శాతానికి పుంజుకుంటుంది
ముంబై: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 5 శాతం క్షీణతను చవిచూస్తుందని.. అయితే 2021–22లో తిరిగి 5 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. తన అంచనాలకు మద్దతునిచ్చే అంశాలను తెలియజేస్తూ.. ‘‘ఇది సహజ విపత్తు కాదు. మన పరిశ్రమలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. మన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి’’ అని సుబ్బారావు వివరించారు. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందంటూ క్రిసిల్, ఫిచ్ రేటింగ్ సంస్థలు అంచనాలు వ్యక్తీకరించిన విషయం తెలిసిందే. సుబ్బారావు అంచనాలు కూడా వీటికి పోలికగానే ఉండడం గమనార్హం. ‘భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడం’ అనే అంశంపై ఓ బిజినెస్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వెబినార్ ద్వారా దువ్వూరి సుబ్బారావు ప్రసంగించారు. వృద్ధి వేగం గా క్షీణించడం అన్నది సర్దుబాటులో భాగమే నన్నారు. మనవంటి పేదదేశానికి ఎంతో ఇబ్బంది కరమన్నారు. అయితే, వ్యవసాయ ఉత్పత్తి భారీగా ఉండడం, విదేశీ వాణిజ్యం స్థిరంగా ఉండడం అన్న వి మన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేవిగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ద్రవ్యపరిమితుల నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విధానం బాగుందన్నారు. అదనంగా రుణాలను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. 5–6 శాతం వృద్ధి సాధ్యమే: అహ్లువాలియా ప్రణాళికాసంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సైతం 2020–21లో 5–6% వృద్ధి రేటు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర మాంద్యాన్ని చవిచూడనున్నట్టు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను సంస్కరణలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
కనీస ఆదాయ పధకం సరైందే కానీ..
సాక్షి, న్యూఢిల్లీ : కనీస ఆదాయ హామీ పధకంతో పేదరికంపై మెరుపు దాడులు చేస్తామని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రకటించిన న్యాయ్ పధకంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. కాంగ్రెస్ ప్రకటించిన కనీస ఆదాయ పధకం స్ఫూర్తి మంచిదే అయినా దేశంలో వాస్తవ ఆర్థిక పరిస్థితి పరిగణనలోకి తీసుకుంటే ఇంతటి భారీ వ్యయం సాధ్యం కాదని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. ఈ పధకం క్షేత్రస్ధాయిలో వృద్ధికి ఊతమిస్తుందని ఆయన అంగీకరించారు. ఈ పధకాన్ని భారత ఆర్థిక వ్యవస్థ ఎంతమేరకు భరిస్తుందనేది ప్రశ్నార్దకమన్నారు. న్యాయ్ పధకానికి ఏటా రూ 3.34 లక్షల కోట్ల నిధులు అవసరమవుతాయని, ఇది దేశ బడ్జెట్లో 13 శాతమని ఆయన పేర్కొన్నారు. ఈ స్ధాయిలో నిధులు అవసరం కాగా ప్రభుత్వం వాటిని ఎలా సర్దుబాటు చేస్తుందనేది చూడాలన్నారు. ఇక ప్రస్తుతమున్న సంక్షేమ పధకాలను కొనసాగిస్తూనే ఈ పధకాన్ని చేపట్టడం కష్టసాధ్యమన్నారు. ఈ పధకాన్ని సమర్ధంగా అమలు చేయగలిగితే విప్లవాత్మక ఫలితాలు చేకూరుతాయన్నారు. ప్రజలు సొంతంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోగలుగుతారన్నారు. దేశంలో ప్రస్తుతం ద్రవ్య లోటును పరిగణనలోకి తీసుకుంటే కనీస ఆదాయ హామీ పధకం సాధ్యం కాదన్నారు. -
ప్రధాని మోదీకి చల్లటి కబురు
సాక్షి, న్యూఢిల్లీ : గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌పై మోదీ ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ చల్లటి కబురు చెప్పారు. దేశానికి వస్తు సేవల పన్ను(జీఎస్టీ) అవసరమని ఆయన తెలిపారు. అయితే.. పేద, ధనిక రాష్ట్రాల మధ్య తేడాలను గుర్తించి జీఎస్టీని వికేంద్రీకరణ చేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. కేంద్ర ప్రభుత్వం వస్తు సేవల పన్నును అమలు చేయడం అత్యంత ముఖ్యమైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. నూతన పరోక్ష పన్నుల విధానమైన జీఎస్టీని సక్రమంగా అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుత విధానంలో ఆర్థికంగా పరిపుష్టమైన మహరాష్ట్రకు, పేద రాష్ట్రమైన బిహార్‌కు ఒకే విధమైన జీఎస్టీ విధానం మంచిది కాదని ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో జీఎస్టీని వికేంద్రీరించి అమలు చేస్తే మంచిదని ఆయన కేంద్రానికి సూచించారు. -
ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలానికి భద్రతేది?: రాజన్
ముంబయి: ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలానికి భద్రత ఉండాలని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తుల పదవీకాలానికి ఎలాంటి భద్రత ఉంటుందో అదే స్థాయి భద్రతను ఆర్బీఐ గవర్నర్ పదవికి కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవీకాలం మూడేళ్లు మాత్రమే ఉండటం చాలా స్వల్పమైనదని చెప్పారు. ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం మధ్య కొన్నిసార్లు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని, ఒక్కోసారి చిన్నచిన్న విషయాలకే అది సమస్యగా పరిణమిస్తుందని కూడా చెప్పారు. ఇవి తీరేందుకు విలువైన సమయం వృధా అయిపోతుందని కూడా తెలిపారు. అయితే, ఒక వేళ పదవీ కాలానికి భద్రత ఉంటుందనుకొని భావించినా తిరిగి ఏదో ఒక అంశం ప్రభావం చూపుతుందని తెలిపారు. ఆయన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకం 'ఐ డూ వాట్ ఐ డూ' అనే పుస్తకం ఆవిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
చిదంబరంతో విభేదాలతో రెండుసార్లు వైదొలగాలనుకున్నా!
న్యూఢిల్లీ: ప్రభుత్వంతో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్లకు ఉన్న చేదు జ్ఙాపకాలు కొత్తేమీ కాదు. మాజీ ఆర్బీఐ గవర్నర్ వైవీ రెడ్డికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందట అప్పట్లో. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన పి.చిదంబరంతో విభేదాలను వైవీ రెడ్డి తన స్వీయ చరిత్ర.. ‘అడ్వైజ్ అండ్ డిసెంట్:మై లైఫ్ ఇన్ పబ్లిక్ సర్వీసెస్’లో బయటపెట్టారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే చిదంబరంతో పొసగకపోవడంతో రెండుసార్లు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని అనుకున్నారట. తొలుత 2004లో చిదంబరం ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్ల తర్వాత కాగా, యూపీఏ–1 సర్కారు చివరినాళ్లలో మరోసారి గవర్నర్ పదవి నుంచి వైదొలగాలని భావించినట్లు వైవీ రెడ్డి పేర్కొన్నారు. 2003 నుంచి 2008 మధ్యకాలంలో ఆయన ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు. తమ మధ్య బేదాభిప్రాయాలను సద్దుమణిగేలా చేయడం కోసం అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ జోక్యం కూడా చేసుకున్నారని.. తాను చిదంబరానికి బేషరతుగా క్షమాపణలు చెప్పానని కూడా వైవీ రెడ్డి తన ఆత్మకథలో తెలిపారు. అయినప్పటికీ.. తమ మధ్య విభేదాలు సమసిపోలేదని చెప్పారు. దేశీ బ్యాంకింగ్ రంగంలో యాజమాన్య హక్కులను విదేశీ సంస్థలు దక్కించుకునే విధంగా ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను కొనసాగించే విషయంలో చిదంబరం తనకు మధ్య అసలు గొడవ మొదలైందని.. అది 2008 నాటికి తారస్థాయికి చేరినట్లు వైవీ రెడ్డి రాసుకున్నారు. ‘ఆర్థిక వ్యవస్థను రెండంకెల వృద్ధి దిశగా పరుగులు పెట్టించే సంస్కరణవాదిగా ఆయన(చిదంబరం)కు ఒక పేరు ఉండేది. అయితే, కొన్ని సంస్కరణలు, ప్రభుత్వ విధానాల అమలును వ్యతిరేకిస్తూ.. హెచ్చరికలు చేయడం ఆయనకు నచ్చలేదు. సంస్కరణల గురించి చెప్పుకోవడానికి ఏమీలేకపోవడంతో ఇన్వెస్టర్లకు మొహం చూపించుకోలేక ఒకసారి చిదంబరం విదేశీ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు’ అని వైవీ రెడ్డి తన పుస్తకంలో వెల్లడించారు.