ముంబై: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 5 శాతం క్షీణతను చవిచూస్తుందని.. అయితే 2021–22లో తిరిగి 5 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. తన అంచనాలకు మద్దతునిచ్చే అంశాలను తెలియజేస్తూ.. ‘‘ఇది సహజ విపత్తు కాదు. మన పరిశ్రమలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. మన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి’’ అని సుబ్బారావు వివరించారు. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందంటూ క్రిసిల్, ఫిచ్ రేటింగ్ సంస్థలు అంచనాలు వ్యక్తీకరించిన విషయం తెలిసిందే.
సుబ్బారావు అంచనాలు కూడా వీటికి పోలికగానే ఉండడం గమనార్హం. ‘భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడం’ అనే అంశంపై ఓ బిజినెస్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వెబినార్ ద్వారా దువ్వూరి సుబ్బారావు ప్రసంగించారు. వృద్ధి వేగం గా క్షీణించడం అన్నది సర్దుబాటులో భాగమే నన్నారు. మనవంటి పేదదేశానికి ఎంతో ఇబ్బంది కరమన్నారు. అయితే, వ్యవసాయ ఉత్పత్తి భారీగా ఉండడం, విదేశీ వాణిజ్యం స్థిరంగా ఉండడం అన్న వి మన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేవిగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ద్రవ్యపరిమితుల నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విధానం బాగుందన్నారు. అదనంగా రుణాలను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు.
5–6 శాతం వృద్ధి సాధ్యమే: అహ్లువాలియా
ప్రణాళికాసంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సైతం 2020–21లో 5–6% వృద్ధి రేటు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర మాంద్యాన్ని చవిచూడనున్నట్టు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను సంస్కరణలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment