economic growth rate
-
భారత్, చైనా భేష్
వాషింగ్టన్: భారత్, చైనా, యూరప్ ఆర్థిక వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన అంచనాలను మెరుగుపరిచింది. అదే సమయంలో యూఎస్, జపాన్‌కు సంబంధించిన అంచనాలను కొంత తగ్గించింది. భారత్ 2024లో 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ అంచనా 6.8 శాతాన్ని పెంచింది. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను ఎగువకు సవరించింది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల నిదానించినట్టు తెలిపింది. 2024లో ప్రపంచ వృద్ధి 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఏప్రిల్‌లో వేసిన అంచనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంతో పోల్చి చూస్తే 0.1 శాతం తగ్గనున్నట్టు ఐఎంఎఫ్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో సగం చైనా, భారత్ నుంచే ఉంటుందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్తికవేత్త ఒలివర్ గౌరించాస్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు. చైనా 5 శాతం 2024 ఆరంభంలో చైనా ఎగుమతులు పెరగడంతో ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను గతంలో వేసిన 4.6 శాతం నుంచి 5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. అయిన కానీ 2023లో నమోదైన 5.2 శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఒకప్పుడు రెండంకెల వృద్ధి సాధించిన చైనా పెద్ద ఎత్తున సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు, ముఖ్యంగా అక్కడ ఇళ్ల మార్కెట్ కుదేలైనట్టు ఐఎంఎఫ్ తెలిపింది. వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరత నేపథ్యంలో 2029 నాటికి చైనా వృద్ధి రేటు 3.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. యూరప్ 0.9 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. అక్కడ సేవల రంగం మెరుగుపడుతుండడాన్ని ప్రస్తావించింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఈ ఏడాది 2.6 శాతం వృద్ధి రేటుకు పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. ఏప్రిల్‌లో 2.7 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక 2024 సంవత్సరానికి జపాన్ వృద్ధి రేటును 0.9 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధరల మంట (ద్రవ్యోల్బణం) 2023లో ఉన్న 6.7 శాతం నుంచి 2024లో 5.9 శాతానికి దిగొస్తుందని తెలిపింది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన దిశగా ఐఎంఎఫ్ కృషి చేస్తుంటుంది. -
ఆర్థిక మాంద్యంలోకి జపాన్
టోక్యో: జపాన్ మాంద్యంలోకి జారిపోయింది. జపాన్ ఆర్థిక వృద్ధి రేటు 2023 చివరి త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్ మధ్య)లో 0.4%, జూలై– సెప్టెంబర్‌లో 2.9% మేర క్షీణించింది. వరుసగా రెండు త్రైమాసికాల్లో ఆర్థిక వృద్ధి మందగించిన సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను మాంద్యంలో ఉందనేందుకు గుర్తుగా భావిస్తారు. దీంతోపాటు, జపాన్ కరెన్సీ యెన్ కూడా బలహీ నపడింది. ఫలితంగా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్..అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. -
అధిక ఆర్థిక వృద్ధితోనే..
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరులపై పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం అధిక ఆర్థిక వృద్ధి రేటు సాధించాలి్పన అవసరం ఉందని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ పేర్కొన్నారు. బొగ్గు నుండి పునరుత్పాదక ఇంధనం వైపు మళ్లేందుకు దేశానికి మరింత సమయం పడుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, నేషనల్ డిటరై్మండ్ కాంట్రిబ్యూషన్స్ (ఎన్డీసీ) లక్ష్యాన్ని చేరుకోవడంలో భారతదేశం ఇతర జీ20 గ్రూప్ దేశాల కంటే చాలా ముందుందని అన్నారు. భూమి సగటు ఉష్ణోగ్రత పెరుగుదలను పారిశ్రామిక పూర్వ (1985–1900) స్థాయిలతో పోలిస్తే రెండు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడానికి వివిధ దేశాలు అనుసరించిన జాతీయ కార్యాచరణ ప్రణాళికలను ఎన్డీసీలుగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. పేద దేశాలకు ఇబ్బందే.. అయితే అసలే కోవిడ్ ప్రతికూల ప్రభావాల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతూ, తక్కువ వృద్ధి సాధిస్తూ, అప్పుల వలయంలో ఉన్న కొన్ని దేశాలకు ఎన్డీసీ లక్ష్యాల సాధనకు పెట్టుబడులు పెట్టడం కష్టంగా మారిందని నాగేశ్వరన్ అన్నారు. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతామని కాప్28 వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో చేసిన డిక్లరేషన్‌పై సంతకాలు చేయడానికి ఈ నెల ప్రారంభంలో భారత్, చైనాలు తిరస్కరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ దిశలో అడుగులు వేయాలన్న జీ20 నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు భారత్ ఉద్ఘాటించింది. పర్యావరణ పరిరక్షణపై దుబాయ్‌లో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన చర్చల సందర్భంగా, 2030 నాటికి ప్రపంచ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచడానికి కట్టుబడి ఉన్నట్లు 118 దేశాలు ఉద్ఘాటించాయి. ఈ ప్రతిష్టాత్మక సమావేశం ప్రపంచంలోని మొత్తం శక్తి ఉత్పత్తిలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. డిక్లరేషన్‌కు మద్దతు ఇచి్చన దేశాల్లో జపాన్, ఆ్రస్టేలియా, కెనడా, చిలీ, బ్రెజిల్, నైజీరియా, బార్బడోస్ ఉన్నాయి. ఈ డిక్లరేషన్‌లో శిలాజ ఇంధనాల వినియోగం తగ్గడంతో పాటు పునరుత్పాదక ఇంధన ఉత్పత్లి పెంచడం కూడా కీలక అంశంగా ఉంది. నిరంతర బొగ్గు విద్యుత్‌ను దశలవారీగా తగ్గించాలని, కొత్త బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిధులకు స్వస్తి పలకాలని కాప్28 సదస్సు ప్రతినబూనింది. -
ఇదీ నిజం.. నమ్మొద్దు విష ప్రచారం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రసంగం ఎన్నో విమర్శలకు సూటిగా, స్పష్టమైన సమాధానం చెప్పింది. అప్పులపై, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా చేస్తున్న దుష్ఫ్రచారాన్ని నమ్మొద్దంటూ సవివరంగా, పూర్తి గణాంకాలతో తేటతెల్లంగా ప్రజల ముందుంచారు. ఎల్లో మీడియాతో కలిసి విపక్షాలు చేస్తోన్న విష ప్రచారం నమ్ముతారా? నిజాలను కళ్లకు కట్టినట్టు చూపించే గణాంకాలను నమ్ముతారా? 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో వృద్ధి రేటు ఎంత? 2019 నుంచి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ను నడిపిస్తున్న ముఖ్యమంత్రి జగన్ పాలనలో అభివృద్ధి ఎలా ఉంది? ఈ లెక్కలు మీరే చూడండి. 2018-19 చంద్రబాబు పాలనలో వృద్ధి రేటు 5.36% ఏపీ ర్యాంకు 21 2019 -20 సీఎం జగన్ పాలనలో వృద్ధి రేటు 6.89% ఏపీ ర్యాంకు 6 కోవిడ్ సమయంలో విపత్కర పరిస్థితులను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు ఎదుర్కొన్నాయి. అయినా ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆర్థికంగా అన్ని కష్టాలను తట్టుకుంది. వృద్ధి రేటులో నాలుగో స్థానానికి ఎదిగింది 2020 -21 వృద్ధి రేటు 0.08% ఏపీ ర్యాంకు 4 2021 -22 ఆర్థిక సంవత్సరానికి వచ్చే సరికి ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా ఎదిగింది. వృద్ధి రేటులో అద్భుతంగా రాణించింది, ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో మొదటి స్థానంలో నిలిచింది. 2021 -22 వృద్ధి రేటు 11.43% ఏపీ ర్యాంకు 1 2014 నుంచి 2019 వరకు అంటే చంద్రబాబు హయాంలో జాతీయ ఆదాయంలో రాష్ట్రం వాటా 4.45% మాత్రమే ఉండగా.. 2019 నుంచి అంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వచ్చిన తర్వాత, ఆయన పాలనలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. 2019 నుంచి ఇప్పటివరకు జాతీయ ఆదాయంలో ఏపీ వాటా 5% చేరింది. అప్పులపై అసలు నిజం ఇది విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.లక్షా 20వేల 556 కోట్లు ఉంటే దాన్ని చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోయే సమయానికి రూ.2లక్షల 69వేల 462 కోట్లకు తీసుకెళ్లారు. అంటే అప్పుల్లో అది 123.52% పెరుగుదల. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చే నాటికి అప్పులు రూ.2లక్షల 69వేల 462 కోట్లు ఉంటే.. ప్రస్తుతం అది రూ.3కోట్ల 82లక్షల 165 కోట్లుగా ఉంది. అంటే సీఎం జగన్ హయాంలో అప్పులు పెరిగింది 41.83% మాత్రమే. అప్పులపై కాగ్ చెప్పిన వాస్తవమిది ♦చంద్రబాబు హయాంలో ప్రభుత్వ గ్యారంటీతో వివిధ పబ్లిక్ సెక్టార్ యూనిట్లు చేసిన అప్పు రూ.14028 కోట్లు కాగా, ఆయన పదవి నుంచి దిగిపోయే సమయానికి అది రూ.59257 కోట్లకు చేరింది. మొత్తమ్మీద అప్పుల శాతం 19.55 % ♦ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో పీఎస్‌యూలు తీసుకున్న అప్పు 15.46% మాత్రమే ♦ఏపీ సర్కారుపై విషపు రాతలు రాస్తోన్న ఎల్లో మీడియా అసలు నిజాలు మాత్రం దాచిపెడుతోంది. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి పరిస్థితి ఏపీలో ఉందంటూ దుష్ప్రచారం చేస్తోంది. ఒక సారి కేంద్రం అప్పులు, వృద్ధి రేటు చూస్తే నిజాలు వెల్లడవుతాయి. ఈ లెక్కలు పార్లమెంటు సాక్షిగా కేంద్రం సమర్పించిన బడ్జెట్లో చెప్పినవే. ♦ 2014-19 మధ్య కేంద్రం అప్పులు రూ.62లక్షల 42వేల 220 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 50.07% ♦ 2020-21 కల్లా కేంద్రం అప్పులు రూ.1 కోటీ 20లక్షల 79వేల 18 కోట్లు ♦ వృద్ధి రేటులో అప్పు శాతం 61% కేంద్రం vs ఆంధ్రప్రదేశ్ .. అప్పుడెంత? ఇప్పుడెంత? మీరే గమనించండి ♦2014-19 మధ్య కేంద్రం అప్పులు 59.88% పెరిగితే అదే సమయంలో ఏపీలో సర్కారు నడిపించిన చంద్రబాబు అప్పుల శాతాన్ని ఏకంగా 123.52% పెంచేశారు. ♦2019 నుంచి మార్చి 31, 2022 వరకు కేంద్రం అప్పులు 43.8% పెరిగిన , అదే సమయంలో ఏపీ సర్కారు అప్పుల శాతం పెంపు 41.83% మాత్రమే ఇదీ వాస్తవం ♦ 2018-19 మధ్య వడ్డీ, అప్పు కలిపి చంద్రబాబు సర్కారు చెల్లించింది రూ.28886 కోట్లు అయితే 2021-22 మధ్య సీఎం జగన్ చెల్లించింది రూ.36007 కోట్లు ♦ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, 2019 నుంచి కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా వాటిని తట్టుకుని ఏపీని నిలబెట్టింది ♦ సీఎం జగన్ సర్కారు. సంక్షేమం, సంస్కరణలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను కరోనా నుంచి కాపాడుకున్నారు సీఎం జగన్. పచ్చ ప్రచారం ఆపండి, నిజాలు చూడండి ♦ మూలధన వ్యయం విషయానికి వస్తే టిడిపి హయాంలో రాష్ట్రం సగటు రూ.15227 కోట్లు. అదే సీఎం జగన్ హయాంలో మూలధన వ్యయం రాష్ట్రం సగటు రూ.18362 కోట్లు. ఈ లెక్కలు దాచిపెట్టి రాష్ట్రం శ్రీలంకలా మారబోతుంటూ చొక్కాలు చించుకున్నారు విష ప్రచారం చేశారు. కేంద్రం ఇచ్చిందెంత? కేంద్ర పన్నుల్లో రాష్ట్రం వాటా చాలా కీలకమైన అంశం. 2015 నుంచి 2019 వరకు ఏ ఏడాది చూసినా 34.91% నుంచి 36.63% వరకు ఉంది. అంటే చంద్రబాబు సర్కారుకు కేంద్రం ఇబ్బడిముబ్బడిగా పన్నుల్లో వాటా ఇచ్చింది. సీఎం జగన్ హయాంలో అంటే 2019 నుంచి ఏ ఏడాది చూసినా 29.35% నుంచి 23.13% మధ్యలోనే కేంద్ర పన్నుల వాటా ఉంది. 15వ ఆర్థిక సంఘం 41% ఇవ్వాలని చెప్పినా అది ఆచరణలోకి రాలేదు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ప్రజంటేషన్ pdf కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
GSDP Growth: వృద్ధిరేటులో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: కోవిడ్ సంక్షోభంలోనూ రాష్ట్ర ఆర్థిక వృద్ధి కొనసాగేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. ఓ పక్క ప్రాధాన్యతా రంగాల కార్యకలాపాలు కొనసాగేలా చేయూతనిస్తూనే, మరో పక్క సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా చూశారు. దీంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముగిసిన ఆర్ధిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ 2021–22లో స్థిర ధరల ప్రకారం 11.43 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపింది. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కోవిడ్–19 సంక్షోభం, లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశంలో 2020–21 సంవత్సరంలో వృద్ధి రేటు తిరోగమనంలో ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్ సంక్షోభం నుంచి బయటపడి, గత ఏడాదిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2021–22లో ఏపీ ఏకంగా 11.43 శాతం రెండంకెల వృద్ధి సాధించింది. ఇదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వృద్ధిరేటు కేవలం 8.7 శాతమే. కేంద్రం, మిగతా రాష్ట్రాలకంటే ఏపీ ఎక్కువ వృద్ధి రేటు సాధించడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను ఎక్కడా నిలిపివేయకుండా కొనసాగించడమే. ఒక పక్క ఆదాయం తగ్గిపోయినప్పటికీ, ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించింది. ప్రధానంగా వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం, నాడు–నేడు పేరుతో విద్య, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి. కోవిడ్–19 లాక్డౌన్ సమయంలోనూ ఎక్కడా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కార్యకలాపాలు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతతో చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఎంఎస్ఎంఈ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవడంతో 2021–22లో పారిశ్రామిక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్ 12.78 శాతంతో రెండంకెల వృద్ధి సాధించింది. ప్రాధాన్యత రంగ కార్యకలాపాలు కొనసాగించడం, ప్రజల చేతుల్లోకి డబ్బులను పంపించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలబడిందని, ఇంత వృద్ది రేటు సాధించడానికి ఇదే కారణమని అర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో 2021–22 ఆర్థిక సంవత్సరం స్ధిర ధరల ఆధారంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వృద్ధి రేటును ఉంచారు. ఏపీ తరువాత అత్యధిక వృద్ధి రాజస్థాన్ 11.04 శాతం సాధించింది. ఆ తరువాత బీహార్ 10.98 శాతం, తెలంగాణ 10.88 శాతం వృద్ది సాధించాయి. -
ఎకానమీ.. రివర్స్‌గేర్..!
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22 చివరి త్రైమాసికంలో మరింత కిందకు జారింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి త్రైమాసికంలో 4.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. అంతక్రితం మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే, వృద్ధి రేట్లు తగ్గుతూ రావడం గమనార్హం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.3 శాతం వృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతానికి తగ్గింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా వృద్ధి స్పీడ్ నమోదయితే తాజా సమీక్షా త్రైమాసికంలో మరింతగా జారుడుబల్లపై నిలిచింది. కొన్ని రంగాల హైబేస్ ఎఫెక్ట్‌సహా కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో స్థానిక ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో సరఫరాల సమస్యలు, కమోడిటీ ధరల తీవ్రత వంటి అంశాలు సమీక్షా నెల్లో వృద్ధి రేటును కిందకు జార్చాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 మార్చి త్రైమాసికంలో పలు రంగాలు మంచి పురోగతిని నమోదుచేసుకున్నాయి. అయితే వృద్ధి రేటు మాత్రం అప్పట్లో 2.5 శాతంగా నమోదయ్యింది. ‘క్షీణత’ నుంచి ‘వృద్ధి’లోకి... కాగా 2021 ఏప్రిల్‌తో ప్రారంభమై, 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదయ్యింది. 2020–12 ఇదే కాలంలో ఎకానమీ ఏకంగా 6.6 శాతం క్షీణతను నమోదుచేసింది. అత్యంత లో బేస్ కూడా తాజా వార్షిక వృద్ధి రేటుకు కారణమయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, 2021–22లో ఎకానమీ 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) రెండవ అడ్వాన్స్ అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతకంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక ఆర్బీఐ అంచనాలు (9.5%) కన్నా 80 బేసిస్ పాయింట్ల తక్కువగా వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో బల హీన గణాంకాలే దీనికి కారణం. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 నుంచి 8.5% శ్రేణిలో ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో సమరి్పంచిన ఎకనమిక్ సర్వే అంచనా వేసింది. ‘మూలధనం’ సానుకూలతలు మూలధన పెట్టుబడులకు సంబం ధించిన గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్ 2020–21లో రూ.41.31 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.47.84 లక్షల కోట్లకు పెరగడం హర్షణీయ పరిణామం. 8.7 శాతం వృద్ధి రేటు ఎలా అంటే... జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్లు. 2021–22లో ఈ రేటు రూ.147.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 8.7 శాతమన్నమాట. కరెంట్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లెక్కలను సర్దుబాటు చేయకుండా చూస్తే నామినల్ జీడీపీ 2020–21లో రూ.198.01 లక్షల కోట్లు ఉంటే, 2021–22లో రూ.236.65 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 19.51%. చైనా వృద్ధి రేటుకన్నా తక్కువే 2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. అయితే ఇంతకన్నా తక్కువగా భారత్ ఎకానమీ పనితీరు నమోదుకావడం గమనార్హం. దీనితో త్రైమాసికం పరంగా ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీగా చైనా నమోదయ్యింది. కట్టడిలోనే ద్రవ్యలోటు ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో కట్టడిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. బడ్జెట్ అంచనా ప్రకారం జీడీపీ విలువలో ద్రవ్యలోటు 6.9% (రూ.15,91,089 కోట్లు). అయితే 6.71%గా నమోదయినట్లు (మొదటి అంచనాల ప్రకారం రూ.15,86,537 కోట్లు) కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వివరించింది. భారీ పన్ను వసూళ్లు ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ఉండడానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల అంచనా రూ.17.65 లక్షల కోట్లుకాగా, వసూలయ్యింది రూ.18.2 లక్షల కోట్లు. అన్ని రంగాలూ బలహీనమే... ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ స్థిర ధరల బేస్ ప్రకారం వేసిన గణాంకాల ప్రకారం, 2021–22లో ఎకానమీ అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే –6.6% క్షీణత నుంచి 8.7% వృద్ధికి మళ్లింది. జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కరెంట్ ఇయర్ ప్రాతిపదికన తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరం, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా 19.5 శాతం, 14.4 శాతంగా ఉన్నాయి. 2020–21లో ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో మైనస్ 1.4 శాతంగా ఉంది. ఇక జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ అంటే జీడీపీ ‘ప్లస్’ ఉత్పత్తులపై సబ్సిడీలు ‘మైనస్’ ఉత్పత్తులపై పన్నులు) విషయానికి వస్తే, వృద్ధి రేటు వార్షికంగా 8.1 శాతం ఉంటే, 4వ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇందుకు సంబంధించి 4.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక తాజా మార్చి త్రైమాసికంలో అన్ని విభాగాలూ బలహీనంగా ఉండడం గమనార్హం. తలసరి ఆదాయం వృద్ధి అంతంతే... తలసరి ఆదాయం కోవిడ్–19 కన్నా ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. నికర జాతీయ ఆదాయం ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే, 2020–21లో ఇది రూ.1,26,855 ఉంటే, తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 18.3 శాతం పెరిగి రూ.1.5 లక్షలకు చేరింది. అయితే స్థిర ధరల వద్ద పరిశీలిస్తే, తలసరి ఆదాయం 7.5 శాతం మాత్రమే పెరిగి రూ.85,110 నుంచి రూ.91,481కి చేరింది. కోవిడ్ 19కు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో తలసరి ఆదాయం (స్థిర ధరల వద్ద) రూ.94,270. కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో 2020–21లో ఇది రూ.85,110కి పడిపోయింది. ప్రైవేటు వినియోగం బలహీనత నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయం నుంచి జీడీపీకి తగిన మద్దతుగా లభించగా, తయారీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా నాల్గవ త్రైమాసికం జీడీపీలో ప్రైవేట్ వాటా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం తీవ్రత, వినియోగ రికవరీలో అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో 2022–23లో వృద్ధి రేటు 7.2 శాతానికే పరిమితం అవుతుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణం నేపథ్యంలో జూన్ మొదటి వారం పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ రెపో రేటును పావుశాతం పెంచుతుందని మా అంచనా. – సాక్షి గుప్తా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎకనమిస్ట్ స్టాగ్ఫ్లేషన్ ఇబ్బంది తక్కువే... ఇతర దేశాలతో పోల్చితే భారత్‌కు స్టాగ్ఫ్లేషన్ (స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంతంతమాత్రంగా ఉండి, ధరలు తీవ్రంగా పెరగడం) ఇబ్బంది తక్కువే. ఇతర దేశాలకన్నా... భారత్ ఎకానమీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ముఖ్యంగా భారత్ ఫైనాన్షియల్ రంగం వృద్ధికి చక్కటి మద్దతును అందిస్తోంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాం... 2022కు సంబంధించి భారత్ క్రితం (ఏప్రిల్‌నాటి) 8.2 శాతం వృద్ధి అంచనాలను తగ్గించే పనిలో ఉన్నాం. గ్లోబల్ స్టాగ్ఫ్లేషన్ సవాళ్లు భారత్‌పై పడే అవకాశాలు కనిపిస్తుండడమే దీనికి కారణం. భారత్ ఇప్పటికే తక్కువ ఉపాధి కల్పన, అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది.అయితే సవాళ్లు ఉన్నప్పటికీ దేశం రికవరీ బాటనే నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల మరింత పెంపు బాటనే నడిచే అవకాశాలు సుస్పష్టం. మహమ్మారి సవాళ్ల నుంచి తప్పుకున్నట్లు అప్పడే భావించడం తగదు. చైనాలో ఈ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. చైనా జీడీపీ 1% తగ్గితే, భారత్ వృద్ధి 0.6% తగ్గుతుంది. – లూయిస్ బ్రూయర్, భారత్‌లో ఐఎంఎఫ్ సీనియర్ రెసిడెంట్ ప్రతినిధి -
రుణాలు రూ.2వేలకోట్లు పైనే, వసూళ్లు సైతం అదే స్థాయిలో
న్యూఢిల్లీ: మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ గత నెలలో రూ.2,150 కోట్ల రుణాలను జారీ చేసింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 57 శాతం అధికం. జారీ చేసిన రుణాలు రూ.2,000 కోట్లు దాటడం వరుసగా ఇది రెండవ నెల అని కంపెనీ తెలిపింది. వసూళ్లు ఏప్రిల్‌లో 72 శాతం, మే 67, జూన్ 90, జూలైలో 95 శాతం నమోదైతే.. ఆగస్ట్‌లో ఇది 97 శాతానికి చేరిందని వివరించింది. ఆర్థిక వ్యవస్థ తిరిగి ప్రారంభం, పరిస్థితులు మెరుగవడంతో నగదు రాక పెరిగి నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) తగ్గాయని వివరించింది. ‘ఇది చాలా ప్రోత్సాహకరమైన సంకేతం అని మేము నమ్ముతున్నాం. సెప్టెంబర్, రాబోయే నెలల్లో ఎన్పీఏలు మరింత తగ్గుతాయని భావిస్తున్నాం. కంపెనీ వద్ద సరిపడ నగదు నిల్వలు ఉన్నాయి’ అని మహీంద్రా ఫైనాన్స్ తెలిపింది. చదవండి : పాత కార్ల అమ్మకాల్లో మహీంద్రా జోరు -
జీడీపీ వృద్ధి 5 శాతానికి పుంజుకుంటుంది
ముంబై: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2020–21) 5 శాతం క్షీణతను చవిచూస్తుందని.. అయితే 2021–22లో తిరిగి 5 శాతం వృద్ధి రేటుకు పుంజుకుంటుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. తన అంచనాలకు మద్దతునిచ్చే అంశాలను తెలియజేస్తూ.. ‘‘ఇది సహజ విపత్తు కాదు. మన పరిశ్రమలు ఇప్పటికీ అలాగే నిలిచి ఉన్నాయి. మన మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థలు పనిచేస్తూనే ఉన్నాయి’’ అని సుబ్బారావు వివరించారు. భారత జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 5 శాతానికి క్షీణిస్తుందంటూ క్రిసిల్, ఫిచ్ రేటింగ్ సంస్థలు అంచనాలు వ్యక్తీకరించిన విషయం తెలిసిందే. సుబ్బారావు అంచనాలు కూడా వీటికి పోలికగానే ఉండడం గమనార్హం. ‘భారత ఆర్థిక వ్యవస్థ.. ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించడం’ అనే అంశంపై ఓ బిజినెస్ స్కూల్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ వెబినార్ ద్వారా దువ్వూరి సుబ్బారావు ప్రసంగించారు. వృద్ధి వేగం గా క్షీణించడం అన్నది సర్దుబాటులో భాగమే నన్నారు. మనవంటి పేదదేశానికి ఎంతో ఇబ్బంది కరమన్నారు. అయితే, వ్యవసాయ ఉత్పత్తి భారీగా ఉండడం, విదేశీ వాణిజ్యం స్థిరంగా ఉండడం అన్న వి మన ఆర్థిక వ్యవస్థకు మద్దతునిచ్చేవిగా పేర్కొన్నారు. ప్రభుత్వానికి ద్రవ్యపరిమితుల నేపథ్యంలో రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన విధానం బాగుందన్నారు. అదనంగా రుణాలను తీసుకోవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందించారు. 5–6 శాతం వృద్ధి సాధ్యమే: అహ్లువాలియా ప్రణాళికాసంఘం మాజీ డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా సైతం 2020–21లో 5–6% వృద్ధి రేటు సాధ్యమేనని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆయన కూడా మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తీవ్ర మాంద్యాన్ని చవిచూడనున్నట్టు చెప్పారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పన్ను సంస్కరణలు వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు
సాక్షి, న్యూఢిల్లీ: 2024 నాటికి దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం రానున్న ఐదేళ్లలో విమాయన రంగంలో ప్రభుత్వం లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ఆర్థిక వృద్ధిని పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం గతవారం జరిగిన ఓ సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా కొత్తగా 1000 రూట్లను చిన్న పట్టణాలు, పల్లెలను అనుసంధానించాలని కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశ ఆర్థిక వృద్ధి తగ్గిపోవడం, మరింతగా దిగజారే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా బడ్జెట్లో ప్రతిపాదించినట్లుగా 2025 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని మోదీ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల్లో భాగంగా గత నెలలో ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలకు పెట్టుబడులు తరలివెళ్లకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్ పన్నులను తగ్గించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానాశ్రయాల అభివృద్ధిలో భారత్ చైనా కంటే వెనకపడి ఉంది. చైనా 2035నాటికి 450 కమర్షియల్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఏడాదికి 600 మంది పైలట్లతో దేశీయ విమానాలు నడిపేలా కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్‌లో చిన్న పట్టణాలకు విమానాలు నడపకపోవడంవల్ల మూడేళ్ల క్రితం 450 రన్వేలు ఉండగా.. ప్రస్తుతం 75 రన్వేలు మాత్రమే పనిచేస్తున్నాయి. పాత రన్‌వేలపై విమానాలను నడిపేందుకు విమానాయాన సంస్థలు సంకోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రంగ అభివృద్ధి కోసం మోడీ సర్కార్ 38 విమానాశ్రయాలను అభివృద్ధి చేసి కొన్ని ప్రాంతాలకు టికెట్ ధరలు కూడా తగ్గించింది. అంతేకాదు మరో 63 విమానాశ్రయాలకు తమ విమానాలను తిప్పాల్సిందిగా ప్రభుత్వం కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది. మధ్యతరగతికీ విమాన ప్రయాణం మధ్యతరగతి వారికి కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందులోభాగంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఏషియా ఎయిర్‌లైన్స్‌లకు స్థానికంగా తమ యూనిట్లను నెలకొల్పుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇంధనంపై కూడా పన్నులు చాలావరకు తగ్గించింది. ఇక డ్రోన్లను కూడా వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది. 2024 నాటికి చట్టబద్ధంగా మిలియన్ డ్రోన్లను తిప్పాలని భారత సర్కార్ భావిస్తోంది. 2021 నాటికల్లా డ్రోన్ కారిడార్లను ఏర్పాటుచేసి 2023 కల్లా సరుకులను డ్రోన్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
నోట్ల రద్దు దారుణం..
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు తదితర అంశాలపై కేంద్ర మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద నోట్ల రద్దు దారుణమైన చర్యంటూ... ద్రవ్య విధానానికి పెద్ద షాక్‌లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక వృద్ధి రేటు మరింత వేగంగా పడిపోవడానికి ఇదే కారణమని అరవింద్ పేర్కొన్నారు. త్వరలో విడుదల కానున్న ‘ఆఫ్ కౌన్సిల్ – ది చాలెంజెస్ ఆఫ్ మోదీ– జైట్లీ ఎకానమీ‘ పేరిట రాసిన పుస్తకంలో అరవింద్ ఈ అంశాలు ప్రస్తావించారు. పుస్తకంలో దీనికోసం ప్రత్యేకంగా టూ పజిల్స్ ఆఫ్ డీమానిటైజేషన్ – పొలిటికల్ అండ్ ఎకనమిక్’ అనే అధ్యాయాన్ని కేటాయించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ముద్రించిన ఈ పుస్తకాన్ని డిసెంబర్ 7న ముంబైలో, 9న ఢిల్లీలో ఆవిష్కరిస్తారు. నాలుగేళ్ల పాటు ముఖ్య ఆర్థిక సలహాదారుగా కొనసాగి... ఇటీవలే అరవింద్ వైదొలిగారు. ‘నోట్ల రద్దు చాలా భారీ స్థాయి దారుణమైన చర్య. ద్రవ్య విధానానికి షాక్. ఒక్క దెబ్బతో చలామణిలో ఉన్న 86 శాతం నగదును ఉపసంహరించారు. డీమోనిటైజేషన్ కన్నా ముందు కూడా వృద్ధి రేటు నెమ్మదించింది! కానీ పెద్ద నోట్ల రద్దుతో అమాంతంగా పడిపోయింది. డీమోనిటైజేషన్‌కు ఆరు త్రైమాసికాల ముందు వృద్ధి రేటు సగటున 8 శాతంగా ఉండగా.. పెద్ద నోట్ల రద్దు తరవాతి ఏడు త్రైమాసికాల్లో 6.8 శాతానికి పడిపోయింది‘ అని అరవింద్ వివరించారు. రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తూ 2016 నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. రాజకీయంగా అసాధారణం... డీమోనిటైజేషన్ వల్ల వృద్ధి నెమ్మదించిందన్న వాస్తవాన్ని ఎవరూ కాదనలేరని.. కాకపోతే ఎంత స్థాయిలో మందగించిందన్నదే చర్చనీయమని అరవింద్ తన పుస్తకంలో తెలిపారు. రాజకీయ కోణంలో చూస్తే.. ఇటీవలి కాలంలో ఏ దేశం కూడా సాధారణ సందర్భాల్లో ఎకాయెకిన డీమోనిటైజేషన్ వంటి అసాధారణ చర్య తీసుకోలేదని స్పష్టంచేశారు. ‘‘సాధారణ పరిస్థితులున్నప్పుడు కరెన్సీని రద్దు చేయాల్సి వస్తే అది క్రమానుగతంగా మాత్రమే జరగాలి. అలాకాక యుద్ధాలు, అధిక ద్రవ్యోల్బణం, కరెన్సీ సంక్షోభం, రాజకీయ సంక్షోభం (2016లో వెనెజులా) వంటి పరిస్థితుల్లో మాత్రమే నోట్ల రద్దు వంటి అసాధారణ చర్యలు ఉంటాయి. భారత్‌లో ప్రయోగం మాత్రం ప్రత్యేకమైనది’’ అని అరవింద్ వివరించారు. డీమోనిటైజేషన్ తర్వాత యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం వెనుక గల కారణాలను కూడా ఆయన విశ్లేషించారు. నోట్ల రద్దు వల్ల పేద ప్రజానీకానికి కష్టాలు ఎదురైనా, అక్రమార్కులు.. సంపన్నులు తమకన్నా ఎక్కువ నష్టపోతారన్న ఆలోచనతో వారు ఆ ఇబ్బందులను భరించడానికి సిద్ధపడ్డారన్నారు. ‘‘నాది ఒక మేకే పోయింది. కానీ వాళ్ల ఆవులన్నీ పోయాయి కదా! అనే భావనలో ఉంటారు. ఈ సందర్భంలోనూ అదే జరిగి ఉండొచ్చు. నిజానికి పెద్ద లక్ష్యాలను సాధించే క్రమంలో సామాన్యులకు కొంత కష్టం తప్పకపోవచ్చు. కానీ ఈ సందర్భంలో తప్పించేందుకు అవకాశం ఉండేది’’ అన్నారు. ఐఎల్ఎఫ్ఎస్... నియంత్రణ సంస్థ వైఫల్యం.. నియంత్రణ సంస్థ వైఫల్యం వల్లే ఐఎల్ఎఫ్ఎస్ సంక్షోభం తలెత్తిందని అరవింద్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. దీనికి రిజర్వ్ బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. గొప్ప సంస్థగా ఆర్బీఐకి మంచి పేరున్నప్పటికీ.. ప్రతీ సందర్భంలో అది సరైన నిర్ణయాలే తీసుకుంటోందనడానికి లేదని చెప్పారాయన. ‘‘రుణాల చెల్లింపు సమస్యలు, నీరవ్ మోదీ కుంభకోణాల్లాంటివాటి తీవ్రతను అది గ్రహించలేకపోయింది. ఇటీవలి ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభాన్ని బట్టి ఆర్బీఐ వైఫల్యం వాణిజ్య బ్యాంకుల నియంత్రణకే పరిమితం కాలేదని, ఎన్‌బీఎఫ్‌సీల విషయంలోనూ అలాగే ఉందని అర్థమవుతోంది’’ అని తన పుస్తకంలో అరవింద్ పేర్కొన్నారు. ఆర్బీఐ పర్యవేక్షణ సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని, సమస్యల్లో ఉన్న ప్రభుత్వ బ్యాంకులకు కావాల్సిన మూలధనాన్ని సమకూర్చేందుకు తన వద్ద భారీగా ఉన్న నిల్వలను ఉపయోగించాలని సూచించారు. -
ఈ ఏడాది వృద్ధి 6.2%: ఈ అండ్ వై
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) 6.2% ఉంటుందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) తాజాగా అంచనావేసింది. రానున్న మూడేళ్లలో వృద్ధి 8 శాతాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది. మారుతున్న దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2013-14లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 4.7%. వరుసగా రెండవ యేడాది 5% దిగువన జీడీపీ కొనసాగింది. రూ. 4 లక్షలకు ఐటీ పరిమితి పెంచాలి... కాగా వృద్ధికి ఊపునిచ్చే క్రమంలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సంస్థ విజ్ఞప్తి చేసింది. అలాగే జూలైలో రానున్న బడ్జెట్లో చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి అదనపు పన్ను ప్రయోజనాలను కల్పించాలని కోరుతున్నట్లు సంస్థ విధాన వ్యవహారాల ప్రధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. మూలధన వ్యయాలను పెంచి తద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలని కోరారు. చిన్న పొదుపులకు ప్రోత్సాహం, జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల విభాగాల్లో సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రభుత్వ వ్యయాల్లో పునర్వ్యవస్థీకరణ కూడా అవసరమని సూచించారు. సీఎస్‌ఆర్‌పై భారీ వ్యయం: కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలు అమలులోకి వస్తే, భారత్ కార్పొరేట్ రంగం వార్షికంగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్ఆర్) కింద రూ.22,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని ఈ అండ్ వై అంచనావేసింది. వార్షిక నికర లాభంలో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై వెచ్చించాల్సిన పరిధిలో దేశంలో దాదాపు 16,500 కంపెనీలు ఉన్నట్లు పేర్కొంది -
వృద్ధి మళ్ళీ 5 % లోపే.......
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు గడచిన ఆర్థిక సంవత్సరం (2013-14)లోనూ నిరాశనే మిగిల్చింది. 2012-13కన్నా కాస్త బాగున్నప్పటికీ, 5 శాతం దిగువనే కొనసాగింది. 4.7 శాతంగా నమోదయ్యింది. సీఎస్ఓ తొలి అంచనాలు 4.9 శాతం కన్నా ఇది తక్కువ. మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) శుక్రవారం తాజా ఫలితాలను విడుదల చేసింది. 2012-13లో వృద్ధి రేటు దశాబ్దపు కనిష్ట స్థాయి 4.5%. అంటే వరుసగా రెండేళ్లు జీడీపీ వృద్ధి రేటు 5 శాతం దిగువన ఉంది. ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడం 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 2013-14 నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా... 4.7%, 5.2%, 4.6%, 4.6%గా నమోదయ్యాయి. 2012-13లో ఈ రేట్లు వరుసగా 4.5 శాతం, 4.6 శాతం, 4.4 శాతం, 4.4 శాతంగా ఉన్నాయి. రంగాల వారీగా... తయారీ: గడచిన ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో అసలు వృద్ధి నమోదుచేసుకోలేదు. ఈ రంగం రేటు క్షీణతలో 1.4 శాతంగా నమోదయ్యింది. 2012-13లో ఈ రంగం వృద్ధి రేటు 3 శాతం. ఇక మొత్తం ఆర్థిక సంవత్సరాన్ని చూసుకుంటే కూడా ఈ రంగం 1.1% వృద్ధి నుంచి క్షీణతలో మైనస్ (-) 0.7 శాతంగా నమోదయ్యింది. మొత్తం జీడీపీలో తయారీ రంగం వాటా దాదాపు 14%. మైనింగ్, క్వారీయింగ్: మార్చి క్వార్టర్లో క్షీణతలోనే కొనసాగింది. అయితే ఈ క్షీణత మైనస్ 4.8 శాతం నుంచి మైనస్ 0.4 శాతానికి తగ్గింది. ఆర్థిక సంవత్సరం మొత్తంమీద కూడా ఈ రంగం క్షీణత 2.2 శాతం నుంచి 1.4 శాతానికి పరిమితమయ్యింది. వ్యవసాయం: వృద్ధి రేటు నాల్గవ త్రైమాసికంలో భారీగా 1.6 శాతం నుంచి 6.3 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 1.4 శాతం నుంచి 4.7 శాతానికి చేరింది. జీడీపీలో ఈ రంగం వాటా దాదాపు 13 శాతం. నిర్మాణం: జనవరి-మార్చి తైమాసికంలో ఈ రంగంలో వృద్ధి రేటు 2.4 శాతం నుంచి 0.7 శాతానికి పడిపోయింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 1.1 శాతం నుంచి 1.6 శాతానికి ఎగసింది. వాణిజ్యం, హోటెల్స్, రవాణా, కమ్యూనికేషన్లు: ఈ విభాగం వృద్ధి క్యూ4లో 4.8 శాతం నుంచి 3.9 శాతానికి మందగించింది. ఆర్థిక సంవత్సరంలో కూడా 5.1 శాతం 3 శాతానికి జారింది. సేవలు (ఫైనాన్షింగ్, బీమా, రియల్టీ): క్యూ4లో వృద్ధి రేటు 11.2 శాతం నుంచి 12.4 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 10.9 శాతం నుంచి 12.9 శాతానికి ఎగసింది. మొత్తం జీడీపీలో ఈ రంగం వాటా దాదాపు 55 శాతం. కమ్యూనిటీ, సామాజిక, వ్యక్తిగత సేవలు: క్యూ4లో ఈ రంగం వాటా 2.8 శాతం నుంచి 3.3 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరంలో వృద్ధి 5.3 శాతం నుంచి 5.6 శాతానికి చేరింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా: మార్చి క్వార్టర్లో వృద్ధి రేటు భారీగా 0.9% నుంచి 7.2 శాతానికి చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో కూడా ఈ రేటు 2.3% నుంచి 5.9 శాతానికి ఎగసింది. తలసరి ఆదాయం ఇలా... జాతీయ నికర తలసరి ఆదాయం (2004-05 ధరలను ప్రాతిపదికగా తీసుకుని) గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల కాలంలో రూ.38,856 నుంచి రూ. 39,904 కు పెరిగింది. అంటే 2.7 శాతం వృద్ధి నమోదయ్యిందన్నమాట. 2012-13లో ఈ వృద్ధి రేటు 2.1 శాతమే. ప్రస్తుత ధరల ప్రాతిపదికగా తీసుకుంటే జాతీయ తలసరి ఆదాయం రూ.67,839 నుంచి రూ.74,380 కి చేరింది.