దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు | India Plans to Open 100 Airports By 2024 | Sakshi
Sakshi News home page

దేశంలో కొత్తగా వంద విమానాశ్రయాలు

Published Thu, Oct 31 2019 3:16 PM | Last Updated on Thu, Oct 31 2019 3:31 PM

India Plans to Open 100 Airports By 2024 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  2024 నాటికి  దేశవ్యాప్తంగా 100 కొత్త విమానాశ్రయాలు ప్రారంభం కానున్నాయి. దీనికోసం రానున్న ఐదేళ్లలో విమాయన రంగంలో ప్రభుత్వం  లక్ష కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఆసియా ఖండంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ ఆర్థిక వృద్ధిని పెంపొందించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ కోసం గతవారం జరిగిన ఓ సమావేశంలో కేంద్రం ఈ ప్రతిపాదనపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇందులోభాగంగా కొత్తగా 1000 రూట్లను చిన్న పట్టణాలు, పల్లెలను అనుసంధానించాలని కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.

గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంతగా దేశ ఆర్థిక వృద్ధి తగ్గిపోవడం, మరింతగా దిగజారే పరిస్థితులు కనిపిస్తుండటంతో ప్రధాని నరేంద్రమోడీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రాజెక్టుల ద్వారా ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టే ప్రయత్నాలు ప్రారంభించినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తద్వారా బడ్జెట్‌లో ప్రతిపాదించినట్లుగా 2025 నాటికల్లా భారత ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలని మోదీ సర్కార్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్యల్లో భాగంగా  గత నెలలో ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలకు  పెట్టుబడులు తరలివెళ్లకూడదనే ఉద్దేశంతో కార్పొరేట్ పన్నులను తగ్గించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విమానాశ్రయాల అభివృద్ధిలో భారత్ చైనా కంటే వెనకపడి ఉంది. చైనా 2035నాటికి 450 కమర్షియల్ విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఏడాదికి 600 మంది పైలట్లతో దేశీయ విమానాలు నడిపేలా కేంద్రం ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. భారత్‌లో చిన్న పట్టణాలకు విమానాలు నడపకపోవడంవల్ల మూడేళ్ల క్రితం 450 రన్‌వేలు ఉండగా.. ప్రస్తుతం 75 రన్‌వేలు మాత్రమే పనిచేస్తున్నాయి.  పాత రన్‌వేలపై విమానాలను నడిపేందుకు విమానాయాన సంస్థలు సంకోచిస్తున్నట్లు  తెలుస్తోంది. అయితే ఈ రంగ అభివృద్ధి కోసం మోడీ సర్కార్ 38 విమానాశ్రయాలను అభివృద్ధి చేసి కొన్ని ప్రాంతాలకు టికెట్ ధరలు కూడా తగ్గించింది. అంతేకాదు మరో 63 విమానాశ్రయాలకు తమ విమానాలను తిప్పాల్సిందిగా ప్రభుత్వం కాంట్రాక్ట్ కూడా ఇచ్చింది.

మధ్యతరగతికీ విమాన ప్రయాణం
మధ్యతరగతి వారికి కూడా విమాన ప్రయాణం అందుబాటులో ఉండాలని కేంద్రం భావిస్తోంది. ఇందులోభాగంగా సింగపూర్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఏషియా ఎయిర్‌లైన్స్‌లకు స్థానికంగా తమ యూనిట్లను నెలకొల్పుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఇంధనంపై కూడా పన్నులు చాలావరకు తగ్గించింది. ఇక డ్రోన్లను కూడా వినియోగించుకోవాలని భారత్ భావిస్తోంది. 2024 నాటికి చట్టబద్ధంగా మిలియన్‌ డ్రోన్లను తిప్పాలని భారత సర్కార్ భావిస్తోంది. 2021 నాటికల్లా డ్రోన్ కారిడార్లను ఏర్పాటుచేసి 2023 కల్లా సరుకులను డ్రోన్ల ద్వారా రవాణా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement