వృద్ధి అంచనాలు పెంపు
అమెరికా అంచనాలకు కోత
ఐఎంఎఫ్ తాజా నివేదిక
వాషింగ్టన్: భారత్, చైనా, యూరప్ ఆర్థిక వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) తన అంచనాలను మెరుగుపరిచింది. అదే సమయంలో యూఎస్, జపాన్‌కు సంబంధించిన అంచనాలను కొంత తగ్గించింది. భారత్ 2024లో 7 శాతం వృద్ధి రేటు నమోదు చేస్తుందని ఐఎంఎఫ్ తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ అంచనా 6.8 శాతాన్ని పెంచింది.
గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం బలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకుని అంచనాలను ఎగువకు సవరించింది. ప్రపంచవ్యాప్తంగా ధరల పెరుగుదల నిదానించినట్టు తెలిపింది. 2024లో ప్రపంచ వృద్ధి 3.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. ఏప్రిల్‌లో వేసిన అంచనాల్లో ఎలాంటి మార్పు చేయలేదు. 2023లో ప్రపంచ వృద్ధి రేటు 3.3 శాతంతో పోల్చి చూస్తే 0.1 శాతం తగ్గనున్నట్టు ఐఎంఎఫ్ అంచనాలు తెలియజేస్తున్నాయి. ఈ ఏడాది ప్రపంచ వృద్ధిలో సగం చైనా, భారత్ నుంచే ఉంటుందని ఐఎంఎఫ్ ముఖ్య ఆర్తికవేత్త ఒలివర్ గౌరించాస్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొన్నారు.
చైనా 5 శాతం
2024 ఆరంభంలో చైనా ఎగుమతులు పెరగడంతో ఆ దేశ వృద్ధి రేటు అంచనాలను గతంలో వేసిన 4.6 శాతం నుంచి 5 శాతానికి ఐఎంఎఫ్ పెంచింది. అయిన కానీ 2023లో నమోదైన 5.2 శాతం కంటే తక్కువే కావడం గమనార్హం. ఒకప్పుడు రెండంకెల వృద్ధి సాధించిన చైనా పెద్ద ఎత్తున సవాళ్లను ఎదుర్కొంటున్నట్టు, ముఖ్యంగా అక్కడ ఇళ్ల మార్కెట్ కుదేలైనట్టు ఐఎంఎఫ్ తెలిపింది. వృద్ధ జనాభా పెరుగుదల, కార్మికుల కొరత నేపథ్యంలో 2029 నాటికి చైనా వృద్ధి రేటు 3.3 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది.
యూరప్ 0.9 శాతం వృద్ధిని సాధిస్తుందని పేర్కొంది. అక్కడ సేవల రంగం మెరుగుపడుతుండడాన్ని ప్రస్తావించింది. ఇక ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా ఈ ఏడాది 2.6 శాతం వృద్ధి రేటుకు పరిమితం కావచ్చని ఐఎంఎఫ్ తాజాగా పేర్కొంది. ఏప్రిల్‌లో 2.7 శాతంగా అంచనా వేయడం గమనార్హం. ఇక 2024 సంవత్సరానికి జపాన్ వృద్ధి రేటును 0.9 శాతం నుంచి 0.7 శాతానికి తగ్గించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ధరల మంట (ద్రవ్యోల్బణం) 2023లో ఉన్న 6.7 శాతం నుంచి 2024లో 5.9 శాతానికి దిగొస్తుందని తెలిపింది. ఆర్థిక వృద్ధి, ఆర్థిక స్థిరత్వం, పేదరిక నిర్మూలన దిశగా ఐఎంఎఫ్ కృషి చేస్తుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment