Andhra Pradesh State GDP Growth Higher Than Other States In Country - Sakshi
Sakshi News home page

వృద్ధిరేటులో ఏపీ ఫస్ట్‌.. కేంద్ర వృద్ధిరేటు కంటే కూడా అధికం!

Published Tue, Aug 23 2022 3:32 AM | Last Updated on Tue, Aug 23 2022 12:10 PM

Andhra Pradesh State GDP growth higher than other states in Country - Sakshi

2021–22లో వివిధ రాష్ట్రాల వృద్ధి రేటు (శాతాల్లో)

సాక్షి, అమరావతి: కోవిడ్‌ సంక్షోభంలోనూ రాష్ట్ర ఆర్థిక వృద్ధి కొనసాగేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చర్యలు ఫలితాన్నిచ్చాయి. ఓ పక్క ప్రాధాన్యతా రంగాల కార్యకలాపాలు కొనసాగేలా చేయూతనిస్తూనే, మరో పక్క సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేయడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోకుండా చూశారు. దీంతో రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముగిసిన ఆర్ధిక సంవత్సరం (2021–22)లో రాష్ట్ర వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్‌ 2021–22లో స్థిర ధరల ప్రకారం 11.43 శాతం వృద్ధి రేటు సాధించినట్లు తెలిపింది. తెలంగాణ, రాజస్థాన్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, బిహార్, ఒడిశా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువగా ఉంది. కోవిడ్‌–19 సంక్షోభం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా, దేశంలో 2020–21 సంవత్సరంలో వృద్ధి రేటు తిరోగమనంలో ఉన్న విషయం తెలిసిందే. కోవిడ్‌ సంక్షోభం నుంచి బయటపడి, గత ఏడాదిలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా 2021–22లో ఏపీ ఏకంగా 11.43 శాతం రెండంకెల వృద్ధి సాధించింది.

ఇదే సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం వృద్ధిరేటు కేవలం 8.7 శాతమే. కేంద్రం, మిగతా రాష్ట్రాలకంటే ఏపీ ఎక్కువ వృద్ధి రేటు సాధించడానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక కార్యకలాపాలను ఎక్కడా నిలిపివేయకుండా కొనసాగించడమే. ఒక పక్క ఆదాయం తగ్గిపోయినప్పటికీ, ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించింది. ప్రధానంగా వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ చేయడం, నాడు–నేడు పేరుతో విద్య, వైద్య రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టడంతో ఆర్థిక కార్యకలాపాలు పెరిగాయి.

కోవిడ్‌–19 లాక్‌డౌన్‌ సమయంలోనూ ఎక్కడా వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కార్యకలాపాలు నిలిచిపోకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతతో చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ కార్యకలాపాలు కొనసాగించేలా చర్యలు తీసుకోవడంతో 2021–22లో పారిశ్రామిక రంగంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ 12.78 శాతంతో  రెండంకెల వృద్ధి సాధించింది.

ప్రాధాన్యత రంగ కార్యకలాపాలు కొనసాగించడం, ప్రజల చేతుల్లోకి డబ్బులను పంపించడం ద్వారా ఆర్థిక వ్యవస్థ నిలబడిందని, ఇంత వృద్ది రేటు సాధించడానికి ఇదే కారణమని అర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో 2021–22 ఆర్థిక సంవత్సరం స్ధిర ధరల ఆధారంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వృద్ధి రేటును ఉంచారు. ఏపీ తరువాత అత్యధిక వృద్ధి రాజస్థాన్‌ 11.04 శాతం సాధించింది. ఆ తరువాత బీహార్‌ 10.98 శాతం, తెలంగాణ 10.88 శాతం వృద్ది సాధించాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement