ఏపీలో తొలి ఆక్వా వర్సిటీ  | CM Jagan foundation stone for many development works At Narasapuram | Sakshi
Sakshi News home page

ఏపీలో తొలి ఆక్వా వర్సిటీ 

Published Tue, Nov 22 2022 3:55 AM | Last Updated on Tue, Nov 22 2022 3:55 AM

CM Jagan foundation stone for many development works At Narasapuram - Sakshi

పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఆక్వా కల్చర్‌ సుస్థిర అభివృద్ధి కోసం రాష్ట్రంలో మొట్టమొదటి ఆక్వా యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇది దేశంలో మూడో ఆక్వా యూనివర్సిటీ కానుందని చెప్పారు. ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా నుంచి పీహెచ్‌డీ వరకు ఇక్కడ అందుబాటులోకి తెచ్చి ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీరుస్తామన్నారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన 15 అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆ వివరాలివీ..  

నరసాపురం చరిత్రలో తొలిసారిగా.. 
పవిత్ర కార్తీక మాసంలో చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఒకేరోజు సుమారు రూ.3,300 కోట్ల నిధులతో 15 అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించాం. ఇన్ని శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం నరసాపురం చరిత్రలో బహుశా మునుపెన్నడూ జరిగిన దాఖలాలు లేవు. నరసాపురం, నియోజకవర్గం రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచుతున్నా.   

ఫిషరీస్‌ యూనివర్సిటీ  
ఇక్కడ ఆక్వా కల్చర్‌ ప్రధానమని మనందరికీ తెలుసు. మెరైన్‌ ప్రొడక్షన్, ఎక్స్‌పోర్ట్స్‌లో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఆక్వా కల్చర్‌కు సంబంధించిన స్కిల్, పరిజ్ఞానం పిల్లలకు అందుబాటులోకి వస్తే మెరుగైన ఉద్యోగాలు, మెరుగైన జీతాలు  లభిస్తాయి. ప్రపంచంలో ఎక్కడ అవసరమున్నా మన వారి నైపుణ్యాన్ని వినియోగించేలా గొప్ప చదువు అందించేందుకు ఇవాళ నాంది పలుకుతున్నాం.

ఆక్వా కల్చర్‌ సుస్థిర అభివృద్ధి కోసం ఫిషరీస్‌ పాలిటెక్నిక్‌ డిప్లొమా హోల్డర్స్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ డిగ్రీ హోల్డర్లు, మాస్టర్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ సైన్స్‌ పీజీ, డిగ్రీ హోల్డర్లతో ఆక్వా కల్చర్‌లో మానవ వనరుల కొరత తీర్చేందుకు ఆక్వా విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటివరకు దేశంలో తమిళనాడు, కేరళలలో మాత్రమే ఇవి ఉండగా మూడో వర్సిటీ మన రాష్ట్రంలో ఏర్పాటవుతోంది. రూ.332 కోట్లతో ఈ యూనివర్సిటీని నరసాపురంలో నెలకొల్పుతున్నాం. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ కూడా పూర్తై పనులు ప్రారంభించడానికి శ్రీకారం చుట్టాం.  

మత్స్యకారులకు మేలు చేస్తూ.. 
ముమ్మిడివరంలో ఓఎన్‌జీసీ కార్యకలాపాల వల్ల ప్రభావితమైన 23,458 మంది మత్స్యకార కుటుంబాలకు ఇక్కడి నుంచే బటన్‌ నొక్కి రూ.108 కోట్లు విడుదల చేశాం. కాకినాడ, కోనసీమ జిల్లాల్లో ఓఎన్‌జీసీ కార్యకలాపాల వల్ల నష్టపోయిన మత్స్యకారులకు మంచి చేసేందుకు గత ప్రభుత్వం ఏనాడూ ముందుకు రాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వ హయాంలో వారందరికీ మేలు చేసేలా చర్యలు చేపట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులాల్లోని పేదలంతా కూడా జగనన్న ప్రభుత్వమంటే మన ప్రభుత్వమనేలా ప్రతి అడుగూ వేస్తున్నాం.  

ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో.. 
నరసాపురంలోనే ఉప్పుటేరుపై మోళ్లపర్రు వద్ద  రెగ్యులేటర్‌ నిర్మించాలని ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. వారి కోరికను నెరవేరుస్తూ ఈరోజు శంకుస్థాపన చేశాం. ఉప్పునీరు కొల్లేరులోకి రాకుండా రైతులకు మంచినీరు ఇంకా మెరుగ్గా అందేలా, కొల్లేరులో ఐదో కాంటూరు వరకు మంచినీరు నిల్వ ఉండేలా ఉప్పుటేరుపై రూ.188 కోట్లతో రెగ్యులేటర్‌ కమ్‌ బ్రిడ్జి లాక్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.   

వంద పడకలతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనం 
నరసాపురంలో రూ.1,300 కోట్లతో ఏరియా ఆసుపత్రికి కొత్త భవనాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తూ ప్రారంభించాం.  ఈ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచడంతో పాటు మరో రూ.66 లక్షల విలువైన వైద్య పరికరాలను అందించి ఆక్సిజన్‌ ప్లాంట్, జనరేటర్‌ కూడా అందుబాటులోకి తెచ్చాం.  
రూ.1,400 కోట్లతో వాటర్‌ గ్రిడ్‌  
ఇక్కడ ఒకపక్క గోదావరి మరోపక్క సముద్రతీర ప్రాంతం ఉన్నా తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితిని నా పాదయాత్ర సమయంలో చూశా. బోరు వేస్తే ఉప్పునీరు వస్తోందని, ఆక్వా కల్చర్‌ సాగుతో ఉపరితల జలాలు కలుషితమవుతున్న నేపథ్యంలో తాగునీరు లేకుంటే ఎలా బతకాలన్న ఈ ప్రాంత ప్రజల ఆవేదనను తొలగిస్తూ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1,400 కోట్లతో రక్షిత మంచినీటి సరఫరా వాటర్‌ గ్రిడ్‌ పథకానికి శంకుస్థాపన చేశాం.

విజ్జేశ్వరం వద్ద గోదావరి నీటిని ర్యాపిడ్‌ శాండ్‌ ఫిల్టర్ల ద్వారా అక్కడే శుద్ధి చేసి పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తాం. ఈ పథకం ద్వారా తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, ఏలూరు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల ప్రజలతో పాటు కృష్ణా జిల్లాలోని కృత్తివెన్ను, బంటుమిల్లి, పెడన, గుడ్లవల్లేరు మండలాల ప్రజలకు సురక్షిత తాగునీరు సరఫరా అవుతుంది. మొత్తం 26 మండలాల్లో 1,178 గ్రామాలకు చెందిన సుమారు 18.50 లక్షలమంది ప్రజలకు దీనిద్వారా మేలు జరుగుతుంది.   

2,240 ఎకరాలకు సాగునీరు, తాగునీరు 
నరసాపురంలో రూ.87 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ ఫేజ్‌ 1కి శంకుస్థాపన చేశాం. మరో రూ.26 కోట్లతో వశిష్ట వారధి, బుడ్డిగవాని రేవు ఏటిగట్టు పటిష్టం చేయడంతోపాటు రూ.7.83 కోట్లతో శేషావతారం పంట కాలువ అభివృద్ధి, టైల్‌ డ్యామ్‌ నిర్మాణం, సీసీ లైనింగ్‌ పనులకు కూడా శ్రీకారం చుట్టాం. మొగల్తూరు పంట కాలువ అభివృద్ధి పనులను రూ.24 కోట్లతో చేపట్టాం. 2,240 ఎకరాలకు సాగునీరు, వాటి పరిధిలోని గ్రామాలకు తాగునీరు అందుతుంది. కాజ, ఈస్ట్‌ కొక్కిలేరు, ముస్కేపాలెం, మడుగు తూముల స్లూయిజ్‌ల పునర్నిర్మాణ పనులకు రూ.9 కోట్లతో శంకుస్థాపన చేశాం. ఒక్క నరసాపురం అభివృద్ధి పనుల గురించి చెప్పేందుకే ఇంత సమయం పట్టిందంటే ప్రజలకు ఎంత మంచి జరుగుతుందో ఆలోచించండి.
  
పాలకొల్లు మెడికల్‌ కాలేజీ.. 
పాలకొల్లులో రూ.500 కోట్లతో మెడికల్‌ కాలేజీ పనులు ప్రారంభమయ్యాయి. వశిష్ట బ్రిడ్జి నిర్మాణానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. కోర్టుల్లో వేసిన కేసులను పరిష్కరించి కేంద్రాన్ని ఒప్పించాం. జనవరిలో బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలుస్తాం.   

హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. 
ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, సీదిరి అప్పలరాజు, అంబటి రాంబాబు, శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, మార్గాని భరత్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  

రూ.3500 కోట్లతో 9 హార్బర్లు 
ఆరు వేల మంది మత్స్యకారులకు మేలు చేసేలా నరసాపురం ప్రాంతంలోని బియ్యపుతిప్ప వద్ద ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. రూ.430 కోట్ల వ్యయంతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం కానుంది. హార్బర్‌లో 640 మీటర్ల బెర్తు, 2,400 మీటర్ల బ్రేక్‌ వాటర్‌ నిడివి ఉండేలా బియ్యపుతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌ను నిర్మిస్తున్నాం.

ప్లాట్‌ఫామ్స్, వేలం కోసం హాల్స్, డ్రైయింగ్‌ యార్డ్స్, బోట్‌ పార్కింగ్‌ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, కోల్డ్‌ స్టోరేజీలు తదితర సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. మన రాష్ట్ర మత్స్యకారులు గుజరాత్‌ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లి బతకాల్సిన అవసరం రాకుండా ఇక్కడే తలెత్తుకుని  జీవించేలా తొమ్మిది ఫిషింగ్‌ హార్బర్లను రూ.3,500 కోట్లతో ఏర్పాటు చేస్తున్నాం.  

అగ్రికల్చర్‌ కంపెనీ భూములపై రైతులకు హక్కులు 
నరసాపురంలో అగ్రికల్చర్‌ కంపెనీ భూములపై పూర్తి హక్కులను రైతులకు ఈ రోజు నుంచి కల్పిస్తున్నాం. 1921లో బ్రిటీష్‌ ప్రభుత్వం దర్భరేవులో 1,754 ఎకరాల భూమిని నరసాపురం అగ్రికల్చర్‌ కంపెనీకి 99 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది. ఆనాటి నుంచి 1,623 మంది రైతులు సాగు చేస్తున్నప్పటికీ ఆ భూములపై వారికి ఎలాంటి హక్కులూ లేకపోవడంతో ప్రయోజనాలు అందని పరిస్థితి నెలకొంది.

ఎన్నికల్లో నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వారికి రిజిస్ట్రేషన్‌ చేసి పట్టాలను అందిస్తున్నాం. రైతుల కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపించాం. ఎకరానికి కేవలం రూ.100తో రైతులకు రిజిస్ట్రేషన్‌ చేసి వారికి హక్కులు కల్పించాం.    

నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించేలా.. 
నరసాపురంలో శాశ్వతంగా నీటి ఎద్దడి నివారణ, రక్షిత మంచి నీటి సరఫరా కోసం ఫిల్టరేషన్‌ ప్లాంట్, సర్వీస్‌ రిజర్వాయర్లు, వాటర్‌ సప్లై పైప్‌లైన్‌ పనులకు నేడు శంకుస్థాపన చేశాం. రూ.62 కోట్ల వ్యయంతో మంచినీటి సరఫరా ప్రాజెక్టు చేçపట్టాం. రూ.4 కోట్లతో నరసాపురం బస్‌స్టేషన్‌ అభివృద్ధి, కొత్త ప్లాట్‌ఫాంలు నిర్మించి నేడు వాటిని ప్రారంభించాం.

బ్రిటీషర్ల కాలంలో నిర్మించిన ట్రెజరీ ఆఫీస్‌ బిల్డింగ్‌ నూతన భవనానికి శంకుస్థాపన చేశాం. పారిశ్రామిక, వ్యవసాయ, ఆక్వా రంగానికి మెరుగైన విద్యుత్‌ అవసరాల కోసం  220/132/33 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి రూ.132 కోట్లు మంజూరు చేసి శంకుస్థాపన చేశాం. దీనివల్ల నరసాపురం, మొగల్తూరు, పాలకొల్లు, యలమంచిలి మండలాల్లో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అవుతుంది.   

పారదర్శకంగా రూ.1,76,516 కోట్లు.. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నిరుపేద ఓసీల అభివృద్ధికి కట్టుబడిన మన ప్రభుత్వ పాలనలో ఎలాంటి లంచాలు, అవినీతికి తావు లేకుండా బటన్‌ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో మూడేళ్ల ఐదు నెలల వ్యవధిలో రూ.1,76,516 కోట్లు జమ చేశాం. మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, బైబిల్‌గా, ఖురాన్‌గా భావించి 98 శాతం హామీలను నెరవేర్చాం. మేనిఫెస్టోలో చెప్పనివి కూడా అమలు చేస్తున్నాం.

వైద్యం, ఆరోగ్యం, ఇళ్ల నిర్మాణాలు, ఇళ్ల స్థలాలు, విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత.. ఇలా ఏ రంగం చూసినా పారదర్శకంగా పరిపాలన అందిస్తున్నాం. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడూ చేయనివిధంగా గత పాలకుల ఊహకు కూడా అందని విధంగా దేవుడి దయతో అన్ని వర్గాలకు అండగా, తోడుగా మీ బిడ్డ నిలబడ్డాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement