న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22 చివరి త్రైమాసికంలో మరింత కిందకు జారింది. జనవరి–ఫిబ్రవరి–మార్చి త్రైమాసికంలో 4.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యింది. అంతక్రితం మూడు త్రైమాసికాలను పరిశీలిస్తే, వృద్ధి రేట్లు తగ్గుతూ రావడం గమనార్హం. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో 20.3 శాతం వృద్ధి నమోదయితే, రెండవ త్రైమాసికంలో ఈ రేటు 8.5 శాతానికి తగ్గింది. అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 5.4 శాతంగా వృద్ధి స్పీడ్ నమోదయితే తాజా సమీక్షా త్రైమాసికంలో మరింతగా జారుడుబల్లపై నిలిచింది.
కొన్ని రంగాల హైబేస్ ఎఫెక్ట్‌సహా కోవిడ్–19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాలతో స్థానిక ఆంక్షలు, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో సరఫరాల సమస్యలు, కమోడిటీ ధరల తీవ్రత వంటి అంశాలు సమీక్షా నెల్లో వృద్ధి రేటును కిందకు జార్చాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. ఇక్కడ 2020–21 మార్చి త్రైమాసికంలో పలు రంగాలు మంచి పురోగతిని నమోదుచేసుకున్నాయి. అయితే వృద్ధి రేటు మాత్రం అప్పట్లో 2.5 శాతంగా నమోదయ్యింది.
‘క్షీణత’ నుంచి ‘వృద్ధి’లోకి...
కాగా 2021 ఏప్రిల్‌తో ప్రారంభమై, 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదయ్యింది. 2020–12 ఇదే కాలంలో ఎకానమీ ఏకంగా 6.6 శాతం క్షీణతను నమోదుచేసింది. అత్యంత లో బేస్ కూడా తాజా వార్షిక వృద్ధి రేటుకు కారణమయ్యిందని నిపుణులు భావిస్తున్నారు. కాగా, 2021–22లో ఎకానమీ 8.9 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌ఓ) రెండవ అడ్వాన్స్ అంచనాలు వెలువడ్డాయి. అయితే అంతకంటే 20 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తక్కువ వృద్ధి రేటు నమోదయ్యింది. ఇక ఆర్‌బీఐ అంచనాలు (9.5%) కన్నా 80 బేసిస్ పాయింట్ల తక్కువగా వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో బల హీన గణాంకాలే దీనికి కారణం. కాగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 8 నుంచి 8.5% శ్రేణిలో ఉంటుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో పార్లమెంటులో సమరి్పంచిన ఎకనమిక్ సర్వే అంచనా వేసింది.
‘మూలధనం’ సానుకూలతలు
మూలధన పెట్టుబడులకు సంబం ధించిన గ్రాస్ ఫిక్డ్స్ క్యాపిటల్ ఫార్మేషన్ 2020–21లో రూ.41.31 లక్షల కోట్లుగా ఉంటే, 2021–22లో రూ.47.84 లక్షల కోట్లకు పెరగడం హర్షణీయ పరిణామం.
8.7 శాతం వృద్ధి రేటు ఎలా అంటే...
జాతీయ గణాంకాల కార్యాలయం లెక్కల ప్రకారం, 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఎకానమీ విలువ రూ.135.58 లక్షల కోట్లు. 2021–22లో ఈ రేటు రూ.147.36 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 8.7 శాతమన్నమాట. కరెంట్ ఇయర్ ప్రాతిపదికన ద్రవ్యోల్బణం లెక్కలను సర్దుబాటు చేయకుండా చూస్తే నామినల్ జీడీపీ 2020–21లో రూ.198.01 లక్షల కోట్లు ఉంటే, 2021–22లో రూ.236.65 లక్షల కోట్లకు పెరిగింది. అంటే వృద్ధి రేటు 19.51%.
చైనా వృద్ధి రేటుకన్నా తక్కువే
2022 మొదటి త్రైమాసికంలో (జనవరి–మార్చి) చైనా వృద్ధి రేటు 4.8 శాతంగా నమోదయ్యింది. అయితే ఇంతకన్నా తక్కువగా భారత్ ఎకానమీ పనితీరు నమోదుకావడం గమనార్హం. దీనితో త్రైమాసికం పరంగా ప్రపంచంలో వేగవంతమైన ఎకానమీగా చైనా నమోదయ్యింది.
కట్టడిలోనే ద్రవ్యలోటు
ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22 ఆర్థిక సంవత్సరంలో కట్టడిలోనే ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. బడ్జెట్ అంచనా ప్రకారం జీడీపీ విలువలో ద్రవ్యలోటు 6.9% (రూ.15,91,089 కోట్లు). అయితే 6.71%గా నమోదయినట్లు (మొదటి అంచనాల ప్రకారం రూ.15,86,537 కోట్లు) కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) వివరించింది. భారీ పన్ను వసూళ్లు ద్రవ్యలోటు కట్టుతప్పకుండా ఉండడానికి ప్రధాన కారణమని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో పన్ను వసూళ్ల అంచనా రూ.17.65 లక్షల కోట్లుకాగా, వసూలయ్యింది రూ.18.2 లక్షల కోట్లు.
అన్ని రంగాలూ బలహీనమే...
ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటూ స్థిర ధరల బేస్ ప్రకారం వేసిన గణాంకాల ప్రకారం, 2021–22లో ఎకానమీ అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే –6.6% క్షీణత నుంచి 8.7% వృద్ధికి మళ్లింది. జనవరి–మార్చి త్రైమాసిక కాలంలో వృద్ధి రేటు 4.1 శాతంగా ఉంది. ఇక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కరెంట్ ఇయర్ ప్రాతిపదికన తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరం, నాల్గవ త్రైమాసికాల్లో వృద్ధి రేట్లు వరుసగా 19.5 శాతం, 14.4 శాతంగా ఉన్నాయి. 2020–21లో ఇదే కాలంలో ఈ రేటు క్షీణతలో మైనస్ 1.4 శాతంగా ఉంది. ఇక జీవీఏ (గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ అంటే జీడీపీ ‘ప్లస్’ ఉత్పత్తులపై సబ్సిడీలు ‘మైనస్’ ఉత్పత్తులపై పన్నులు) విషయానికి వస్తే, వృద్ధి రేటు వార్షికంగా 8.1 శాతం ఉంటే, 4వ త్రైమాసికంలో 3.9 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇందుకు సంబంధించి 4.8 శాతం క్షీణత నమోదయ్యింది. ఇక తాజా మార్చి త్రైమాసికంలో అన్ని విభాగాలూ బలహీనంగా ఉండడం గమనార్హం.
తలసరి ఆదాయం వృద్ధి అంతంతే...
తలసరి ఆదాయం కోవిడ్–19 కన్నా ఇంకా దిగువ స్థాయిలోనే ఉంది. నికర జాతీయ ఆదాయం ప్రకారం, ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా తలసరి ఆదాయాన్ని పరిశీలిస్తే, 2020–21లో ఇది రూ.1,26,855 ఉంటే, తాజా సమీక్షా ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 18.3 శాతం పెరిగి రూ.1.5 లక్షలకు చేరింది. అయితే స్థిర ధరల వద్ద పరిశీలిస్తే, తలసరి ఆదాయం 7.5 శాతం మాత్రమే పెరిగి రూ.85,110 నుంచి రూ.91,481కి చేరింది. కోవిడ్ 19కు ముందు ఆర్థిక సంవత్సరం 2019–20లో తలసరి ఆదాయం (స్థిర ధరల వద్ద) రూ.94,270. కోవిడ్ కఠిన ఆంక్షల నేపథ్యంలో 2020–21లో ఇది రూ.85,110కి పడిపోయింది.
ప్రైవేటు వినియోగం బలహీనత
నాల్గవ త్రైమాసికంలో వ్యవసాయం నుంచి జీడీపీకి తగిన మద్దతుగా లభించగా, తయారీ కార్యకలాపాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా నాల్గవ త్రైమాసికం జీడీపీలో ప్రైవేట్ వాటా తగ్గుదల ఆందోళన కలిగించే అంశం. ద్రవ్యోల్బణం తీవ్రత, వినియోగ రికవరీలో అస్పష్టత వంటి అంశాల నేపథ్యంలో 2022–23లో వృద్ధి రేటు 7.2 శాతానికే పరిమితం అవుతుందని విశ్వసిస్తున్నాం. ద్రవ్యోల్బణం నేపథ్యంలో జూన్ మొదటి వారం పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్‌బీఐ రెపో రేటును పావుశాతం పెంచుతుందని మా అంచనా. – సాక్షి గుప్తా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎకనమిస్ట్
స్టాగ్‌ఫ్లేషన్ ఇబ్బంది తక్కువే...
ఇతర దేశాలతో పోల్చితే భారత్‌కు స్టాగ్‌ఫ్లేషన్ (స్థూల దేశీయోత్పత్తి వృద్ధి అంతంతమాత్రంగా ఉండి, ధరలు తీవ్రంగా పెరగడం) ఇబ్బంది తక్కువే. ఇతర దేశాలకన్నా... భారత్ ఎకానమీ పరిస్థితి మెరుగ్గా ఉంది. ముఖ్యంగా భారత్ ఫైనాన్షియల్ రంగం వృద్ధికి చక్కటి మద్దతును అందిస్తోంది. – వీ అనంత నాగేశ్వరన్, చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్
వృద్ధి అంచనాలు తగ్గిస్తున్నాం...
2022కు సంబంధించి భారత్ క్రితం (ఏప్రిల్‌నాటి) 8.2 శాతం వృద్ధి అంచనాలను తగ్గించే పనిలో ఉన్నాం. గ్లోబల్ స్టాగ్‌ఫ్లేషన్ సవాళ్లు భారత్‌పై పడే అవకాశాలు కనిపిస్తుండడమే దీనికి కారణం. భారత్ ఇప్పటికే తక్కువ ఉపాధి కల్పన, అధిక ద్రవ్యోల్బణం సవాళ్లను ఎదుర్కొంటోంది.అయితే సవాళ్లు ఉన్నప్పటికీ దేశం రికవరీ బాటనే నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల మరింత పెంపు బాటనే నడిచే అవకాశాలు సుస్పష్టం. మహమ్మారి సవాళ్ల నుంచి తప్పుకున్నట్లు అప్పడే భావించడం తగదు. చైనాలో ఈ ఆంక్షలు ఇంకా కొనసాగుతుండడం గమనార్హం. చైనా జీడీపీ 1% తగ్గితే, భారత్ వృద్ధి 0.6% తగ్గుతుంది. – లూయిస్ బ్రూయర్, భారత్‌లో ఐఎంఎఫ్ సీనియర్ రెసిడెంట్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment