సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా భారత్ తన ప్రతిష్టను నిలబెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి త్రైమాసంలో చైనాను అధిగమిస్తూ భారత్ 7.7 శాతం జీడీపీ వృద్ధి నమోదు చేసింది. గత ఏడు క్వార్టర్లలో ఇదే అత్యంత గరిష్ట వృద్ధి రేటు కావడం గమనార్హం. కాగా ఈ త్రైమాసంలో భారత్ ఏడు శాతం వృద్ధి సాధిస్తుందన్న అంచనాలను అధిగమించి 7.7 శాతం వృద్ధి కనబరిచింది.
వ్యవసాయంలో 4.5 శాతం, తయారీ రంగంలో 9.1 శాతం, నిర్మాణ రంగంలో 11.5 శాతం వృద్ధితో భారత్ మెరుగైన వృద్ధిరేటు సాధించింది. రాయ్‌టర్స్ పోల్‌లో మార్చి క్వార్టర్‌లో భారత్ 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
సాధారణ వర్షపాతం నమోదవుతుందనే అంచనాలు, ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకోవడంతో 2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఆర్థిక వ్యవస్థ 7 శాతానికి పైగా వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు పెట్రో ధరల పెంపు, సంక్లిష్ట ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధిరేటు అంచనాను అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ తగ్గించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment