అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితులు చైనాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా తర్వాత చైనా జీరో కొవిడ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దాంతో అక్కడి కంపెనీల్లో ఉత్పత్తి కుంటుపడింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. ఈ పరిస్థితుల్లో తయారీ రంగంలో డ్రాగన్‌కు ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలు ముందుకొచ్చాయి. ఈ విషయంలో విదేశీ సంస్థలకు భారత్ మెరుగైన గమ్యస్థానంగా కనిపిస్తోంది.
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మూడోసారి బాధ్యతలు స్వీకరించి రికార్డు సృష్టించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ సమావేశాల్లో భాగంగా తన విధానాల నుంచి వెనక్కు మళ్ళేది లేదని పలుమార్లు జిన్‌పింగ్ కరాఖండీగా చెప్పారు. మానవ వనరులు అధికంగా ఉండటంతో ప్రపంచంలోని వేలాది కంపెనీలు తమ ఉత్పత్తి కేంద్రాలను చైనాలో ఏర్పాటు చేశాయి. 2020లో వుహాన్‌లో కరోనా వ్యాప్తి చెందిన తరవాత దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరా గొలుసులు స్తంభించిపోయాయి.
కొవిడ్ తగ్గుముఖం పట్టిన తరవాత ప్రపంచ దేశాల్లో వినియోగ వస్తువుల డిమాండ్ పెరిగింది. చైనాలో జీరో కొవిడ్ లాక్‌డౌన్ల వల్ల వస్తువుల ఉత్పత్తి నిలిచిపోయి, సరఫరా గొలుసులు దెబ్బతింటున్నాయి. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచానికి చైనా ఉత్పత్తి కేంద్రంగా మారింది. డ్రాగన్ అనుసరిస్తున్న విధానాలు దానికి ప్రత్యామ్నాయంగా మరో దేశాన్ని ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దే ఆలోచనలను ముందుకు తెచ్చాయి. ఆ ప్రయత్నాల్లో భారత్, వియత్నాం, థాయ్‌లాండ్ ముందున్నాయి. అంతర్జాతీయ పెట్టుబడులకు అనువుగా ఇప్పటికే తన విధానాలను భారత్ సవరించింది.
ఇండియాలో 1991లో మొదలైన ఆర్థిక సంస్కరణలు విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. చైనాకు ప్రత్యామ్నాయంగా నిలవడంలో వియత్నాం నుంచి భారత్‌కు తీవ్ర పోటీ ఉంది. భౌగోళికంగా చైనాకు వియత్నాం చాలా చేరువలో ఉంది. పెద్దగా ఖర్చు లేకుండానే కర్మాగారాలను అక్కడకు తరలించవచ్చు. అయితే, వియత్నాంలో మౌలిక వసతుల కొరత అడ్డంకిగా నిలుస్తోంది. మౌలిక వసతుల విషయంలో భారత్ గణనీయమైన అభివృద్ధిని సాధించింది.
ఏటా దేశంలో జాతీయ రహదారులను విస్తరిస్తున్నారు. దిల్లీ-ముంబయిల మధ్య నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్ రహదారి, సరకులను తరలించే గూడ్స్ రైళ్లకు ప్రత్యేక మార్గాలు, దేశ తీర ప్రాంతాల్లోని ఓడరేవులు..ఇలా పలు సంస్థలు మన దేశంలో కార్యకలాపాలు కొనసాగించేందుకు అనువుగా ఉన్నాయి. మొబైల్ ఫోన్ దిగ్గజం యాపిల్ సైతం చైనాలోని కొన్ని విభాగాలను భారత్‌కు తరలించాలని యోచిస్తోంది. 2025 కల్లా 25శాతం ఐఫోన్ ఉత్పత్తులను భారత్‌లోనే తయారు చేయాలని యాపిల్ సంస్థ యోచిస్తుంది.
చైనాలో తయారయ్యే ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని వారికి అందించాలన్న చట్టంపై కొన్ని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. మానవవనరుల పరంగా ఇప్పటికే భారత్ చైనాను దాటేసిందని సర్వేలు చెబుతున్నాయి. భారత్‌లోని ముఖ్యపట్టణాలతో పాటు ఇతర నగరాలను కలుపుతూ రవాణా సదుపాయం మెరుగుపడుతుంది. వెరసి ప్రపంచంలోని ప్రఖ్యాత సంస్థలు భారత్‌వైపు చూసేందుకు ప్రధానకారణం అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment