అభిప్రాయం
ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలూ, సైనిక శక్తులూ అయిన అమెరికా– చైనాల మధ్య సత్సంబంధాలు చోటు చేసుకోనున్నాయనే సూచనలు అభినందనీయం. ట్రంప్ ఎప్పుడు ఏం చేస్తారో ఎవరూ ఊహించలేరు. తాను మంచివనుకున్న, తనకు పేరు తెచ్చే పనులను చేస్తారు. అనుకోని పనులు చేయడం తన బలమని ట్రంప్ ప్రకటించు కున్నారు. అమెరికా– చైనాల పరస్పర సహకారంతో ప్రపంచ శాంతి సౌభాగ్యాలను సాధించవచ్చు.
‘చైనా అపాయం’ బూచితో అమెరికా... చైనా వ్యతిరేక ప్రచారం చేస్తోంది. ఆంక్షలు విధి స్తోంది. చైనా ఉత్పత్తులపై ఎక్కువ పన్నులు విధిస్తోంది. చైనా వాణిజ్య కట్టడికి కూటములు కడుతోంది. చైనా పొరుగు దేశా లకు ఆయుధాలను అమ్ముతోంది. విదేశాల్లో దూకుడుగా వ్యవహరిస్తోందనీ, స్వదేశంలో అణచివేతకు పాల్పడుతోందనీ, రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో రష్యాకు మద్దతు ఇస్తోందనీ చైనాపై అమెరికా ప్రచారం చేస్తోంది.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చైనా వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు. అధ్యక్షునిగా ఎన్నికైన ట్రంప్ విదేశీ విధాన అమలుకు ఎన్నుకున్న వ్యక్తులను బట్టి ఆయన చైనా వ్యతిరేకత తెలుస్తుంది. విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, జాతీయ భద్రత సలహాదారు మైక్ వాల్జ్ దీనికి ఉదాహరణ.
మరోవైపు ప్రపంచ ఘటనలు అంచనాలను తారు మారు చేస్తున్నాయి. సిరియాలో 5 దశాబ్దాల అల్ అసద్ కుటుంబ పాలన స్వల్ప ప్రతిఘటనతో కూలి అందరినీ ఆశ్చర్యంలో ముంచింది. అతి బలీయమైన రష్యా, ఎదుగు తున్న ఇరాన్ అసద్‌ను దశాబ్ద కాలంగా గట్టిగా సమర్థించాయి.
అయినా పేర్లే తెలియని తిరుగుబాటుదార్ల వేటలో కేవలం 2 వారాల్లో అసద్ దేశం వదిలి పారిపోయాడు. దీని వెనుక అనేక కారణాలున్నాయి. ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి; తర్వాత పాలస్తీనా, హమాస్, గాజా, వెస్ట్ బ్యాంక్‌లపై, లెబనాన్‌లో హెజ్ బొల్లాపై, వీరిని సమర్థించిన ఇరాన్‌పై ఇజ్రాయెల్ అమానవీయ దాడులు; ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు, అమెరికా ఆధీన ఐక్య రాజ్యసమితి అశక్తత వాటిలో కొన్ని.
సిరియా ప్రభుత్వ పతనం తర్వాత 2 రోజుల్లో ఇజ్రా యెల్, సిరియా ఉన్నత స్థాయి సైనిక సంపదను, వాయు సేనను 80 శాతం ధ్వంసం చేసింది. క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లు, ఆయుధ కర్మాగారాలు, పరిశోధన కేంద్రాలు, రసాయనిక ఆయుధాలు నాశనమయ్యాయి.
రష్యా–ఉక్రెయిన్ సంఘర్షణలో ఉత్తర కొరియా రష్యా వైపు జోక్యం, రష్యాకు చైనా మద్దతు (చైనా దీన్ని తిరస్కరించింది) ఐరోపాలో ఆందోళన కలిగించాయి. చైనా చౌక విద్యుత్ వాహనాలు తమ వాహన పరిశ్రమకు హానికరమని ఐరోపా భయం. తమ దేశాల ఉత్పత్తులపై ట్రంప్ విధించబోయే అధిక పన్నులపై అమెరికా మిత్రులైన ఐరోపా, ఆసియా దేశాలు బాధ పడుతున్నాయి.
ట్రంప్ చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌ను మెచ్చుకున్నారు. తాను యుద్ధాలను ప్రారంభించననీ, కొత్త ఒప్పందాలను ప్రేమి స్తాననీ గర్వంగా ప్రకటించారు. ట్రంప్ అధికారంలో అమె రికా, చైనా సంబంధాల మెరుగుకు ఇది శుభసూచకం. 2009 ఆర్థిక సంక్షోభం తర్వాత చైనా ఆర్థిక వ్యవస్థలో స్వీయ ఉద్దీపన తగ్గింది. ప్రజల వినియోగాన్ని పెంచాలనీ, విదేశీ పెట్టుబడులకు అనుకూలత కల్పించాలనీ, గిరాకీని పెంచాలనీ చైనా గుర్తించింది. మార్కెట్ అనుకూల ఆర్థిక విధానాలను స్వీకరించింది.
ప్రజలకు డబ్బు అందే విధంగా వడ్డీ తగ్గించింది. రియల్ ఎస్టేట్, స్టాక్ మార్కెట్ల స్థిరీకరణ పద్ధతులను పాటించింది. విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. ప్రపంచ అభివృద్ధికి చోదకశక్తిగా పని చేస్తానంటోంది. ఇవి అమెరికా–చైనా సంబంధాల మెరుగు దలకు ప్రేరణ.
సంగిరెడ్డి హనుమంత రెడ్డి
వ్యాసకర్త ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి ‘ 94902 04545
Comments
Please login to add a commentAdd a comment