
అమెరికాపై సుంకాలు 125 శాతానికి పెంపు
145 శాతం సుంకాలకు ప్రతీకారంగా నిర్ణయం
ఇంకా పెంచారంటే కామెడీగా ఉంటుంది
మేమైతే పెంచబోం, మీతో చర్చలకు సిద్ధం
అమెరికాకు హితవు పలికిన చైనా
బీజింగ్: అమెరికా, చైనా టారిఫ్ పోరు మరింత ముదిరింది. చైనాపై మొత్తం సుంకాలు 145 శాతానికి చేరినట్టు అమెరికా గురువారం ప్రకటించడం తెలిసిందే. ఆ మర్నాడే ఆ దేశంపై సుంకాలను 84 నుంచి 125 శాతానికి పెంచుతూ చైనా నిర్ణయం తీసుకుంది. చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఈ నిర్ణయం శనివారం నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. అమెరికా దుందుడుకు చర్యలను దీటుగా ఎదుర్కొంటామే తప్ప వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించింది. అయితే, ‘‘మాపై అమెరికా ఇప్పటికే సుంకాలను అవాస్తవిక రీతిలో పెంచేసింది. ఇంకా పెంచితే ఇక అర్థముండదు. ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఓ నవ్వులాట ఉదంతంగా నిలిచిపోతుంది.
అమెరికా ప్రస్తుత టారిఫ్‌లను భరిస్తూ ఆ దేశ దిగుమతులను చైనా మార్కెట్లోకి అనుమతించడం ఇప్పటికే అసాధ్యంగా మారిపోయింది. కనుక మాపై అమెరికా టారిఫ్‌లను ఇంకా పెంచేసినా మేం మాత్రం ఆ దేశంపై అదనపు సుంకాలు విధించబోం’’ అని స్పష్టం చేసింది. ఈ మతిలేని దూకుడు ఎవరికీ మేలు చేయదని చైనా వాణిజ్య శాఖ పేర్కొంది. వాణిజ్య యుద్ధాల్లో విజేతలంటూ ఎవరూ ఉండరని అభిప్రాయపడింది.
‘‘అందుకే టారిఫ్‌ల విషయంలో అమెరికాతో చర్చలకు ఇప్పటికీ చైనా సిద్ధంగానే ఉంది. మావైపు నుంచి తలుపులు తెరిచే ఉన్నాయి. చర్చలు, సంప్రదింపుల ద్వారా విభేదాలను పరిష్కరించుకుంటామనే ఆశిస్తున్నాం’ అని స్పష్టం చేసింది. అయితే ఏ చర్చలైనా సమానత్వం, పరస్పర విశ్వాసాల ప్రాతిపదికన జరగాలని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేశారు.
ట్రంప్ టారిఫ్‌లను అమెరికా ప్రజలే విమర్శిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. భారత్ సహా ఇతర దేశాలపై ప్రకటించిన ప్రతీకార సుంకాలను 90 రోజుల పాటు ట్రంప్ తాత్కాలికంగా పక్కన పెట్టడం తెలిసిందే. చైనాపై మాత్రం సుంకాలను ఏకంగా 125 శాతానికి పెంచుతూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం ఫెంటానిల్ సుంకంతో కలిపి అది 145 శాతానికి చేరినట్టు వైట్‌హౌస్ గురువారం స్పష్టతనిచి్చంది.
ఏకాకిగా మిగులుతారు
అమెరికాపై జిన్‌పింగ్ ధ్వజం
కలసికట్టుగా ఎదుర్కొందాం
ఈయూ దేశాలకు పిలుపు
అమెరికా టారిఫ్‌లపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తొలిసారిగా స్పందించారు. అవి ఫక్తు ఏకపక్ష పోకడలంటూ మండిపడ్డారు. ‘‘టారిఫ్‌ల యుద్ధంలో ఎవరూ గెలిచేదుండదు. ఇలా ప్రపంచం మొత్తానికీ వ్యతిరేకంగా వెళ్తే ఏకాకులు కావడం మినహా ఒరిగేదేమీ ఉండదు’’ అంటూ హితవు పలికారు. స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్‌తో శుక్రవారం బీజింగ్‌లో జిన్‌పింగ్ భేటీ అయ్యారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దూకుడును అడ్డుకోవడంలో తమతో కలిసి రావాల్సిందిగా యూరోపియన్ యూనియన్‌కు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇది మన అంతర్జాతీయ బాధ్యత కూడా. మన సంయుక్త స్పందన ఇరుపక్షాలకు మాత్రమే గాక మొత్తం అంతర్జాతీయ సమాజానికీ మేలు చేస్తుంది. స్వేచ్ఛాయుత వాణిజ్య వాతావరణాన్ని కాపాడుతుంది’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘చైనా ఏనాడూ ఇతరుల దయపై ఆధారపడలేదు. 70 ఏళ్లుగా స్వయంసమృద్ధినే, కష్టాన్నే నమ్ముకుంది’’ అని జిన్‌పింగ్ స్పష్టం చేశారు.