Tariff war
-
అమెరికా ఉత్పత్తులపై చైనా టారిఫ్‌ల మోత
బీజింగ్: అమెరికాకు దీటుగా చైనా స్పందించింది. అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై అదనంగా 10 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు చైనా శుక్రవారం ప్రకటించింది. చైనాకు చెందిన మరో 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులపై టారిఫ్‌లను 10 శాతం మేర అదనంగా పెంచనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికకు ప్రతీకారంగా చైనా ఈ నిర్ణయాన్ని వెలువరించింది. చైనాకు చెందిన ఉత్పత్తులపై అమెరికా నూతనంగా పెంచిన టారిఫ్‌లకు స్పందనగా... అమెరికాకు చెందిన 75 బిలియన్ డాలర్ల దిగుమతులపై అదనపు టారిఫ్‌లను బీజింగ్ అమలు చేస్తుందని చైనా కస్టమ్స్ టారిఫ్ కమిషన్ ప్రకటించింది. అలాగే, డిసెంబర్ 15 నుంచి అమెరికన్ తయారీ వాహనాలు, ఆటో విడిభాగాలపై అదనంగా 25 శాతం లేదా 5 శాతం టారిఫ్‌లను అమలు చేయనున్నట్టు మరో ప్రకటన కూడా వెలువరించింది. -
మరోసారి భారత్‌పై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్ : అమెరికా వస్తువులపై భారత్ విధిస్తున్న దిగుమతి సుంకాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సహకారం కోసం జరిగే చర్చలో భారత్ సరైన వివరాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన ఆయన భారత్ తమ వస్తువులపై విధించే సుంకాలను పునరాలోచించుకోవాలని కోరారు. భారత్ అధిక పన్నులు విధిస్తుందంటూ ట్రంప్ పలుమార్లు ట్విటర్ ద్వారా విమర్శించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా భారత్‌నుంచి దిగుమతి అయ్యే అల్యూమినియం, ఉక్కు తదితర వస్తువులపై అమెరికా దిగుమతి సుంకాలను పెంచి వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించింది. ఈ చర్యలతో దారికొస్తుందని భావించిన అమెరికాకు భారత్ ఉహించని షాక్ ఇచ్చింది. ఏకంగా 28 రకాల అమెరికా వస్తువులపై దిగుమతి సుంకాలను పెంచడంతో ఖంగుతింది. దీంతో భారత్‌ను అమెరికా ఇచ్చే ఎగుమతి ప్రోత్సాహక దేశాల జాబితానుంచి తీసివేసింది. ఒక పక్క ఇరుదేశాల మధ్య ఏర్పడిన వాణిజ్య సంక్షోభాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని అంటూనే సుంకాలను పెంచుకుంటూ వాణిజ్యయుద్ధాన్ని కొనసాగించాయి. జీ-20 సమ్మిట్‌లో మోదీ-ట్రంప్‌ల మధ్య ఈ వివాదంపై ఒక అవగాహనకు వచ్చారనే విశ్లేషకులు భావించారు. కానీ ట్రంప్ తాజా ట్వీట్‌తో ఈ వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదని తెలుస్తోంది. -
కీలెరిగి వాత
ఆయుధాలతో సాగించే యుద్ధాలతో పోలిస్తే వాణిజ్య యుద్ధాలు ప్రారంభంలో పెద్ద సమస్యగా కనబడవు. కానీ వాటిని తేలిగ్గా తీసుకుంటే, మొండి వైఖరితో ముందుకెళ్తే అవి వైషమ్యాలకు దారితీస్తాయి. చివరకు అసలైన యుద్ధాలుగా పరిణమిస్తాయి. చరిత్రలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల వెనకా ఉన్న అనేకానేక కారణాల్లో వాణిజ్య వైరం కీలకమైనది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దీన్ని గ్రహించకుండా ఇష్టానుసారం వివిధ దేశాల ఉత్పత్తులపై విధిస్తున్న అదనపు సుంకాలకు ప్రతీకార చర్యలు ఇప్పటికే మొదలయ్యాయి. మన దేశం సైతం ఇప్పుడు ఆ మార్గాన్నే అనుసరించింది. అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, యాపిల్స్, బాదం, ఉక్కు, ఇనుము తదితర 29 ఉత్పత్తులపై అదనపు సుంకాలు విధిస్తూ నిరుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌ను ఈ నెల 16 నుంచి అమలు చేయడం ప్రారంభించింది. దాన్ని వెనువెంటనే అమలు చేయాల్సి ఉండగా ఇప్పటికి 8 దఫాలు వాయిదావేసింది. (చదవండి : టారిఫ్‌లపై దూకుడు వద్దు!!) మనం అమెరికాకు ఎగుమతి చేసే ఉక్కుపై 25 శాతం, అల్యూమినియం ఉత్పత్తులపై 10 శాతం చొప్పున ట్రంప్ సర్కారు నిరుడు అదనపు సుంకాలు విధించినప్పుడు ఆ నోటిఫికేషన్ వెలువడింది. కానీ ట్రంప్ వైఖరి మారుతుందన్న భ్రమ వల్ల కావొచ్చు... దాని అమలులో జాప్యం చేసింది. అయిదు దశాబ్దాలుగా మన దేశానికి సాధారణ ప్రాధాన్యతల వ్యవస్థ(జీఎస్పీ)కింద కల్పిస్తున్న వెసులుబాట్లు రద్దు చేయాలని మొన్న మార్చిలో ప్రతినిధుల సభకు ఆయన లేఖ రాశాక ఇక వేచి చూడటం అనవసరమన్న నిర్ణయానికి మన దేశం వచ్చినట్టు కనబడుతోంది. అయితే ఇప్పుడు విధించిన ఈ అదనపు సుంకాల వల్ల అమెరికాకు వచ్చే నష్టం పెద్దగా లేకపోవచ్చు. ఎందుకంటే వీటి విలువ 24 కోట్ల డాలర్లకు మించదు. అమెరికా నుంచి నిరుడు దిగుమతైన సరుకుల విలువ 3,300 కోట్ల డాలర్లకు మించి ఉన్నదని గుర్తిస్తే ఇది ఏపాటి చర్యనో సులభంగానే అర్ధమవుతుంది. ట్రంప్ ఆలోచనలు విలక్షణమైనవి. అమెరికా ప్రారంభించిన ప్రపంచీకరణ వల్ల నానా అగచాట్లూ పడుతున్నామని ప్రపంచ ప్రజానీకం అనుకుంటుంటే... ఆయన మాత్రం తమను అలుసుగా తీసుకుని ప్రపంచదేశాలన్నీ ఇన్నాళ్లూ ఇష్టానుసారం ప్రవర్తించాయని, ఎదిగిపోయా యని నమ్ముతుంటారు. అధికారం దక్కితే వాటి ఆట కట్టిస్తానని అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే ఆయన పదే పదే చెప్పారు. చివరకు ఆ ఎజెండానే ఆయన అమలు చేస్తున్నారు. కానీ ఇదంతా స్వీయ ఇష్టాయిష్టాలతో ఏకపక్షంగా సాగదు, అవతలి నుంచి కూడా ప్రతీకార చర్యలు మొదల వుతాయని ఆయన గుర్తించలేకపోయారు. నిరుడు జనవరి మొదలుకొని చైనా వివిధ సందర్భాల్లో విధించిన అదనపు సుంకాలు సగటున 20.7 శాతం. అంతక్రితం ఇవి కేవలం 8 శాతం మాత్రమే. చైనాతో లావాదేవీలు సాగిస్తున్న అనేక అమెరికన్ సంస్థలు ఈ ధోరణితో బేజారెత్తుతున్నాయి. చైనాతో వైరం వద్దని ట్రంప్‌కు సలహాలిస్తున్నాయి. అమెరికాపై అది అదనపు సుంకాలు విధిం చడంతో ఆగలేదు. వేరే దేశాల ఉత్పత్తులపై విధించే 8 శాతం సుంకాలను 6 శాతానికి కుదించింది. ట్రంప్ యూరప్ యూనియన్(ఈయూ) దేశాలకు కూడా సుంకాల వాత పెట్టారు. అక్కడినుంచి అమెరికాకు వచ్చే ఉక్కుపై 25శాతం అదనపు సుంకాలు విధించారు. ఒకపక్క బ్రెజిల్లో ఆనకట్ట కూలి అక్కడినుంచి రావలసిన ఇనుప ఖనిజం దిగుమతులు తగ్గిపోగా, మరోపక్క అమెరికా విధించిన అదనపు సుంకాలు ఈయూ దేశాలను తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ రెండిటికీ తోడు ఈయూలో వాహనాలకు గిరాకీ పడిపోయి, ఆ పరిశ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. బ్రిటన్‌లో రెండో అతిపెద్ద సంస్థ బ్రిటిష్ స్టీల్ కుప్పకూలింది. మరో పెద్ద సంస్థ ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు ఉత్పత్తిపై కోత విధించుకుంది. అమెరికా చర్యకు ప్రతీకారంగా ఈయూ దేశాలు ఇప్పటికే అక్కడి నుంచి వచ్చే సరుకులపై అదనపు సుంకాలు వడ్డించాయి. ఇంకేం చర్యలు అవసరమో నిర్ణయించడానికి ఈ నెల 26న అవి బ్రస్సెల్స్‌లో సమావేశమవుతున్నాయి. అమెరికన్ సంస్థలన్నీ దేశంలో ఉత్పత్తయ్యే సరుకులు మాత్రమే కొనడం మొదలుపెడితే తయారీ రంగం వృద్ధి చెందుతుందని, అందువల్ల ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని ట్రంప్ భావిస్తున్నారు. కానీ ఆ ఉత్పత్తులకు ప్రపంచ మార్కెట్ కూడా ఉంటే తప్ప అవి మనుగడ సాగించలేవని, అందుకు తాను ప్రారంభించిన సుంకాల యుద్ధం అవరోధమవుతున్నదని ఆయన గుర్తించడం లేదు. నిరుడు అదనపు సుంకాల కారణంగా చైనాలో అమెరికా నుంచి వచ్చే చేపలు, రొయ్యలు, పీతలు వగైరా సముద్ర ఉత్పత్తుల గిరాకీ 70 శాతం మేర పడిపోయింది. అదే సమయంలో కెనడాపై సుంకాలు తగ్గించడంతో అక్కడి నుంచి వచ్చే ఉత్పత్తులు రెట్టింపయ్యాయి. వీటన్నిటినీ గమనించబట్టే ఈ నెల మొదట్లో ట్రంప్‌కు వివిధ రంగాలకు చెందిన 600 అమెరికన్ సంస్థలు సుంకాల బాదుడును వ్యతిరేకిస్తూ ఉమ్మడిగా లేఖ రాశాయి. మెక్సికోపై ఆయన కత్తులు నూరి సుంకాల రణం ప్రారంభించారుగానీ అక్కడి సంస్థల్లో సగానికి పైగా అమెరికన్లవే. అంటే ఆ భారం మోయాల్సింది అమెరికన్ పౌరులే. చైనాపై అమెరికా విధించిన అదనపు సుంకాల విలువ ఇప్పటికే 25,000 కోట్ల డాలర్లు దాటింది. దీనికి ప్రతీకారంగా అమెరికాపై చైనా విధించిన అదనపు సుంకాల విలువ దాదాపు 11,000 కోట్ల డాలర్లు. అంతేకాదు...ఇరాన్ నుంచి ముడి చమురు కొనడానికి వీల్లేదని అమెరికా పెట్టిన ఆంక్షల్ని చైనా బేఖాతరు చేసింది. మనం కూడా ఆ తరహాలోనే కఠినంగా వ్యవహరించడానికి సిద్ధపడాలి. జపాన్‌లోని ఒసాకా నగరంలో ఈనెల 28, 29 తేదీల్లో జరగబోయే జీ–20 శిఖరాగ్ర సదస్సులో ట్రంప్‌తో చైనా, ఈయూ దేశాల అధినేతలు సమావేశం కాబోతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ కూడా ఆయన్ను కలుస్తారు. ట్రంప్ తీరుతెన్నులపై నిర్మొహమాటంగా మాట్లాడితేనే, దీటుగా చర్యకు దిగితేనే ఆయన దారికొస్తారని అధినేతలంతా గుర్తించాలి. -
భారత్ పన్నుల రాజేమీ కాదు
న్యూఢిల్లీ: భారత్ టారిఫ్‌ల విషయంలో కింగ్ (రాజు) ఏమీ కాదని, వ్యవసాయం వంటి కీలకమైన రంగాల ప్రయోజనాలను కాపాడుకునే హక్కు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. భారత్ దిగుమతుల సుంకాలు ప్రపంచంలోనే ఎక్కువగా ఉన్నాయన్న అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతూ... అభివృద్ధి చెందిన జపాన్, దక్షిణ కొరియా, ఈయూ, అమెరికా సైతం అధిక టారిఫ్‌లను వ్యవసాయ ఉత్పత్తులపై కొనసాగిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. భారత్ తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు మోపుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తరచూ ఆరోపిస్తున్న విషయం గమనార్హం. ‘‘అమెరికా ఆరోపణలు పూర్తిగా అసత్యం. అమెరికాలో పొగాకు దిగుమతులపై 350 శాతం, వేరుశనగలపై 164 శాతం టారిఫ్‌లు ఉన్నాయి. వారు సైతం సహేతుక స్థాయిలో అధిక టారిఫ్‌లను నిర్వహిస్తున్నారు’’ అని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ బిశ్వజిత్ ధార్ అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ప్రొఫెసర్ రాకేశ్ మోహన్ జోషి సైతం ఇదే తరహా అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అమెరికా ఆరోపణలు సరైనవి కావని, అభివృద్ధి చెందిన దేశంగా ముందు తన డ్యూటీలను క్రమబద్ధీకరించాలన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడేది వాస్తవాలు కాదని ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మోహిత్‌సింగ్లా పేర్కొన్నారు. ‘భారత్ కంటే అధిక టారిఫ్‌లను అమలు చేస్తున్న దేశాలు కూడా ఉన్నాయి. కొన్ని ఉత్పత్తులపై జపాన్ 736 శాతం, దక్షిణ కొరియా 807 శాతం టారిఫ్‌లు విధిస్తున్నాయి’ అని సింగ్లా చెప్పారు. -
వాణిజ్య యుద్ధానికి తాత్కాలిక బ్రేకులు
బ్యూనస్ ఎయిర్స్: దాదాపు ఆరు నెలలుగా వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేసిన అమెరికా, చైనాల మధ్య ఎట్టకేలకు సంధి కుదిరింది. వివాదాల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా ప్రస్తుతానికి కొత్తగా మరిన్ని టారిఫ్‌లు విధించబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇవ్వగా.. ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు భర్తీకి చర్యలు తీసుకుంటామని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ భరోసానిచ్చారు. వార్షిక జీ–20 సదస్సు సందర్భంగా దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన విందు సమావేశంలో ఈ మేరకు ఇరువురు అంగీకారానికి వచ్చారు. 2019 జనవరి 1 నుంచి 200 బిలియన్ డాలర్ల చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను 25 శాతానికి పెంచకుండా.. ప్రస్తుతం 10 శాతానికే పరిమితం చేసేందుకు ట్రంప్ అంగీకరించారు. ప్రతిగా 375 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న వాణిజ్య లోటును తగ్గించేందుకు అమెరికా ఉత్పత్తులు భారీ ఎత్తున కొనుగోలు చేసేందుకు జి జిన్‌పింగ్ అంగీకారం తెలిపారు. ’అమెరికా, చైనాలకు అపరిమిత ప్రయోజనాలు చేకూర్చే విధంగా ఫలవంతమైన చర్చలు జరిగాయి’ అని ట్రంప్ పేరిట విడుదల చేసిన ప్రకటనలో వైట్‌హౌస్ వెల్లడించింది. ట్రేడ్వార్కు తాత్కాలికంగా బ్రేకులు వేసే దిశగా ట్రంప్, జిన్‌పింగ్ నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ చైనా మీడియా కథనాలు ప్రచురించింది. 90 రోజుల వ్యవధి.. ముందుగా ప్రతిపాదించినట్లు జనవరి 1 నుంచి టారిఫ్‌లను 10 శాతం నుంచి 25 శాతానికి పెంచాలన్న నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు, దీంతో ఈ అంశంపై మరిన్ని చర్చలకు ఆస్కారం లభించినట్లు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరి సారా సాండర్స్ తెలిపారు. వాణిజ్య లోటు భర్తీ క్రమంలో అమెరికా నుంచి వ్యవసాయ, ఇంధన, పారిశ్రామికోత్పత్తులు మొదలైనవి గణనీయంగా కొనుగోలు చేసేందుకు చైనా అంగీకరించినట్లు ఆమె పేర్కొన్నారు. టెక్నాలజీ బదలాయింపు, మేథోహక్కుల పరిరక్షణ తదితర అంశాలపై తక్షణం చర్చించేందుకు ట్రంప్, జిన్‌పింగ్ నిర్ణయించినట్లు వివరించారు. ఇరు పక్షంలో 90 రోజుల్లోగా ఒక అంగీకారానికి రాలేకపోయిన పక్షంలో 10 శాతం సుంకాలను 25 శాతానికి పెంచడం జరుగుతుందన్నారు. గతంలో తిరస్కరించిన క్వాల్కామ్–ఎన్ఎక్స్పీ డీల్ తన ముందుకు వచ్చిన పక్షంలో ఈసారి ఆమోదముద్ర వేసేందుకు జిన్‌పింగ్ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు శాండర్స్ వివరించారు. -
మళ్లీ ముదిరింది : చైనాపై అమెరికా పంజా
వాషింగ్టన్ : అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ ముదిరింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈసారి చైనాకు అతిపెద్ద పంచ్ ఇచ్చారు. అదనంగా 200 బిలియన్ డాలర్ల చైనీస్ దిగుమతులపై టారిఫ్‌లను విధించనున్నట్టు వెల్లడించారు. దీనిలో వినియోగదారులకు చెందిన ప్రముఖ ఉత్పత్తులు ఉన్నాయి. దీంతో వినియోగదారులు బీజింగ్ నుంచి పొందే ట్రేడ్ మినహాయింపులు పోయి, ఆ ప్రొడక్ట్‌లకు ఎక్కువ చెల్లించాల్సి వస్తోంది. ఇది అమెరికా వినియోగదారులకే అతిపెద్ద షాక్ గా ఉంది. చైనీస్ సంస్థల నుంచి అమెరికన్లను కొనుగోలు చేసే 505 బిలియన్ ఉత్పత్తుల్లో సగానికి పైగా ఉత్పత్తులు కొత్త టారిఫ్ లెవీలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ సోమవారం ప్రకటించారు. జూలైలో మొదటిసారి ట్రంప్ టారిఫ్ వార్‌కు తెరతీసిన సంగతి తెలిసిందే. అప్పుడు 50 బిలియన్ డాలర్ల ఇండస్ట్రియల్ గూడ్స్‌పై టారిఫ్‌లు విధించారు. తొలి వాణిజ్య యుద్ధం మాదిరిగా కాకుండా... సోమవారం ప్రకటించిన ఉత్పత్తుల్లో ఎక్కువగా వినియోగదారుల ఉత్పత్తులు ఎయిర్ కండీషనర్లు, స్పార్క్ ప్లగ్స్, ఫర్నీచర్, ల్యాంప్స్ వంటివి ఉన్నాయి. దీంతో ట్రంప్ విధించిన టారిఫ్‌లతో అమెరికన్ వినియోగదారులే ఎక్కువగా నష్టపోనున్నట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ 24 నుంచి ప్రభావిత వస్తువులకు అమెరికా దిగుమతిదారులు అదనంగా 10 శాతం టారిఫ్‌లను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ టారిఫ్‌లు 25 శాతానికి పెరుగుతాయని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాల సంపదకు చైనా ఓ భయంకరమైన ముప్పుగా ఉందని ట్రంప్ అన్నారు. చైనా అన్యాయమైన వాణిజ్య పద్ధతుల మార్పు కోసం ఈ టారిఫ్‌లను విధించినట్టు ట్రంప్ చెప్పారు. గత కొన్ని నెలలుగా ఈ అన్యాయపూర్వకమైన పద్ధతులపై యుద్ధం చేస్తున్నామని, చైనాకు తాము ప్రతి అవకాశం కల్పిస్తున్నామని, కానీ చైనా మాత్రం తన విధానాలను మార్చుకోవడం లేదని అన్నారు. అమెరికా విధించిన ఈ టారిఫ్‌లతో చైనా కొత్త వాణిజ్య చర్చలను తిరస్కరించింది. అమెరికా తీసుకున్న ఈ చర్యకు, ప్రతీకారం తీసుకోనున్నట్టు ప్రకటించింది. అయితే వాణిజ్య సమస్యల విషయంలో చైనాతో చర్చించేందుకు తాము సన్నద్ధతోనే ఉన్నామంటూ వైట్ హౌజ్ నేషనల్ ఎకానమిక్ కౌన్సిల్ డైరెక్టర్ ల్యారీ కుడ్లో చెప్పారు. ఈ అదనపు టారిఫ్‌లను వందల కొద్దీ అమెరికా కంపెనీలూ వ్యతిరేకించాయి. ఈ టారిఫ్‌ల వల్ల ఉత్పత్తుల ధరలు భారీగా పెరుగుతాయని, విక్రయాలు కూడా ఖరీదైనవిగా మారతాయని ఆరోపించాయి. తొలిసారి టారిఫ్‌లను విధించిన సమయంలోనే 6వేలకు పైగా రాతపూర్వక ఫిర్యాదు వచ్చాయి. అయినప్పటికీ, మళ్లీ మళ్లీ చైనాపై అమెరికా పంజా విసురుతూనే ఉంది. ఆ రెండు దేశాలు ట్రేడ్ వార్‌ను ముగించకుండా... యుద్ధం చేసుకుంటూనే ఉన్నాయి. -
హార్లీ డేవిడ్సన్ బాయ్‌కాట్
అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారి హార్లీ డేవిడ్ సన్‌కు తగిలిన సంగతి తెలిసిందే. టారిఫ్ వార్ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్సన్.. తన బైకుల ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఒకవేళ హార్లీ డేవిడ్సన్ కనుక అమెరికా వెలుపల ఉత్పత్తిని చేపడితే, వినియోగదారులు ఈ బైకులను బాయ్‌కాట్ చేయనున్నారు. వినియోగదారులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాగతిస్తున్నారు. అంతేకాక వినియోగదారులను పొగుడుతూ... గ్రేట్ అని ప్రశంసలు కురిపించారు. దీనిపై ట్రంప్ ఒక ట్వీట్ కూడా చేశారు. ‘ఒకవేళ అమెరికా వెలుపల హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తిని ప్రారంభిస్తే చాలా మంది హార్లీ డేవిడ్సన్ యజమానాలు కంపెనీని బాయ్‌కాట్ చేయాలనుకుంటున్నారు. గ్రేట్! చాలా కంపెనీలు ముఖ్యంగా హార్లీ ప్రత్యర్థులు మా బాటలో నడుస్తున్నాయి. కానీ ఇది చాలా చెత్త తరలింపు’ అని ట్రంప్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ట్రంప్ చేసిన ఈ ట్వీట్‌పై హార్లీ డేవిడ్సన్ ఇంకా స్పందించలేదు. ట్రంప్ కార్యాలయానికి, హార్లీ డేవిడ్సన్ కంపెనీకి గత కొన్ని రోజులుగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దేశీయ తయారీని ప్రోత్సహించేందుకు విదేశాల నుంచి వచ్చే స్టీల్, అల్యూమినియం ఉత్పత్తులపై ట్రంప్ భారీ మొత్తంలో టారిఫ్‌లు విధించారు. ట్రంప్ ఆ నిర్ణయానికి కౌంటర్‌గా యూరోపియన్ యూనియన్ కూడా అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువుపై పన్నులు విధించింది. వాటిలో హార్లీ మోటార్‌సైకిల్స్ కూడా ఉన్నాయి. దీంతో హార్లీ డేవిడ్సన్ ఏడాదికి 100 మిలియన్ డాలర్లను కోల్పోవాల్సి వస్తుంది. భారీగా ఆదాయం కోల్పోతుండటంతో, కంపెనీకి చెందిన కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టనున్నట్టు కంపెనీ ప్రకటించింది. కంపెనీ కొన్ని ఆపరేషన్లను థాయ్‌లాండ్ తరలించాలని చూస్తున్నట్టు కంపెనీ వర్గాలు చెప్పాయి. ఇప్పటికే కొంత ఉత్పత్తిని తరలించినట్టు హార్లీ డేవిడ్సన్ చెప్పింది. అమెరికాలోకి వచ్చే ఇతర మోటార్ సైకిల్ కంపెనీలతో కలిసి తాము పనిచేస్తామని ట్రంప్ గత నెలలోనే చెప్పారు. -
టారిఫ్ వార్ దెబ్బకు హార్లీ డేవిడ్సన్...
అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు మధ్య నెలకొన్న టారిఫ్ వార్ దెబ్బ, అమెరికా అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీదారి హార్లీ డేవిడ్ సన్ తగిలింది. టారిఫ్ వార్ నుంచి బయటపడేందుకు హార్లీ డేవిడ్సన్ కీలక నిర్ణయం తీసుకుంది. తన బైక్‌ల కొంత ఉత్పత్తిని అమెరికా వెలుపల చేపట్టాలని నిర్ణయించింది. దీంతో అమెరికాకు కౌంటర్‌గా యూరోపియన్ యూనియన్ విధించే టారిఫ్‌ల నుంచి అది తప్పించుకోబోతుంది. ఈ విషయాన్ని హార్లీ డేవిడ్సన్ ప్రకటించింది. గత కొన్ని రోజులుగా అమెరికాకు, ఇతర దేశాలకు భారీ ఎత్తున్న టారిఫ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా విధిస్తున్న టారిఫ్‌లకు కౌంటర్‌గా ఆయా దేశాలు కూడా టారిఫ్‌లు విధిస్తున్నాయి. గత వారంలోనే అమెరికా ఉత్పత్తులపై యూరోపియన్ యూనియన్ 3.2 బిలియన్ డాలర్ల జరిమానా విధించింది. అమెరికా విధించిన స్టీల్, అల్యూమినియం టారిఫ్‌లకు ప్రతిగా ఈ టారిఫ్‌లను ప్రకటించింది. యూరోపియన్ యూనియన్ విధించిన టారిఫ్ ఉత్పత్తుల్లో హార్లీ డైవిడ్సన్ బైక్‌లు కూడా ఉన్నాయి. వీటి టారిఫ్‌లు కూడా 6 శాతం నుంచి 31 శాతం పెరిగాయి. దీంతో అమెరికా నుంచి ఎగుమతి అయ్యే ఒక్కో మోటార్ సైకిల్‌పై 2,200 డాలర్ల ప్రభావం పడనుంది. ఈ క్రమంలోనే హార్లీ డేవిడ్సన్ తమ ఉత్పత్తుల తయారీని అమెరికా నుంచి యూరోపియన్ యూనియన్‌కు తరలించాని నిర్ణయించింది. ‘టారిఫ్‌లు పెరగడంతో, హార్లీ డేవిడ్సన్ వ్యయాలు కూడా పెరగనున్నాయి. ఒకవేళ ఈ వ్యయాలను డీలర్లకు, రిటైల్ కస్టమర్లకు బదిలీ చేస్తే, తమ వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తులకు కస్టమర్ యాక్సస్ కూడా తగ్గిపోతుంది’ అని కంపెనీ రెగ్యులేటరీలో పేర్కొంది. అమెరికా వెలుపలకు హార్లీ డేవిడ్సన్ ఉత్పత్తుల తయారీని బదిలీ చేసే ప్రక్రియకు 18 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే హార్లీ తీసుకున్న నిర్ణయంపై ట్రంప్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘హర్లీ డేవిడ్సన్ నిర్ణయం ఆశ్చర్యం కలిగిచింది. నేను వారికోసమే పోరాడుతున్నాను. చివరికి వారు ఈయూకి ఎగుమతి చేసే ఉత్పత్తులపై ఎలాంటి సుంకాలు చెల్లించరు. వాణిజ్యపరంగా మాకు 151 బిలియన్ డాలర్ల నష్టం కలుగుతోంది. సుంకాలపై హార్లే ఓపికగా ఉండాలి’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. -
లాభాల ప్రారంభం: టెలికాం షేర్లు ఢమాల్
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్105 పాయింట్ల లాభంతో 35, 797వద్ద , నిఫ్టీ 25 పాయింట్లు ఎగిసి 10868 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే డేటా టారిఫ్ వార్ నేపథ్యంలో టెలికాం షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎయిర్టెల్, ఐడియా, ఆర్ కాం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. పీఎస్‌యూ బ్యాంక్స్, ఐటీ, షేర్లకు కొనుగోళ్ల మద్దు లభిస్తోంది. టీసీఎస్, సన్ ఫార్మ , మారుతి లాభపడుతున్నాయి. ఇండియా బుల్స్, భారతి ఎయిర్టెల్, ఓ ఎన్జీసీ, కోటక్ మహీంద్ర, బజాజ్ ఫిన్ టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. -
టెలికాంకు టారిఫ్ వార్ దెబ్బ: 2018 ఆర్థిక సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థికసర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్ సంక్షోభానికి కారణమైందని పేర్కొంది. ఇతర కారణాలతోపాటు టారిఫ్ వార్ టెలికాం సేవల సంస్థలను దెబ్బతీసిందని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త టెలికాం పాలసీ తీసుకొస్తోందని చెప్పింది. దీని రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. 2018 లో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని విడుదల చేయనుందని సర్వే వెల్లడించింది. అలాగే రెగ్యులేటరీ, లైసెన్సింగ్ విధానాలు, కనెక్టివిటీ, సేవల నాణ్యత, వ్యాపార సరళీకరణ, 5జీ సేవలు, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ లాంటి కొత్త టెక్నాలజీపై ఈ కొత్త విధానం దృష్టిపెట్టాలని సర్వే సూచించింది. భారీ అప్పులు, తారిఫ్ వార్, అసంబద్ధమైన స్పెక్ట్రం చార్జీలు టెల్కోలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. టెలికాం మార్కెట్లో తక్కువ ధరలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో మార్కెట్లో సంక్షోభం ఏర్పడిందనీ, దీని కారణంగా ఇతర కంపెనీల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఈ సంక్షోభం పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములతోపాటు ఈ టెలికాం కంపెనీల వెండార్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. అయితే హేతుబద్ధమైన స్పెక్ట్రం వేలం, ఇతన ఖర్చుల హేతుబద్ధీకరణ ద్వారా దీన్ని నియంత్రించాలని సర్వే సిఫార్సు చేసింది. కాగా సెప్టెంబరు 2017 ముగిసే నాటికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 1,207.04 మిలియన్లుగా ఉంది. అందులో 501.99 మిలియన్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాలు నమోదు కాగా 705.05 మిలియన్ల కనెక్షన్లు పట్టణ ప్రాంతాలవి. -
జియో, ఎయిర్ టెల్ మధ్య మరో 'టారిఫ్ వార్'
టెలికాం మార్కెట్లోకి కొత్త ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో మధ్య, టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మధ్య మరోసారి 'టారిఫ్ వార్' మొదలైంది. జియోకు తరలిపోకుండా కస్టమర్లను కాపాడుకోవడానికి తీసుకొస్తున్న ఆఫర్లను రహస్యంగా ఉంచనున్నట్టు ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ చెబుతుండగా.. ప్లాన్స్ ను ఓ కామన్ ప్లాట్ ఫామ్ పైకి తీసుకురావాలని జియో డిమాండ్ చేస్తోంది. అయితే పోటీతత్వ ప్రయోజనాలు కాపాడేందుకు వీటిని బహిర్గతం చేయమని ఈ దిగ్గజాలు వాదిస్తున్నాయి. ప్లాన్స్ ను బహిర్గతం చేసే విషయంలో టెలికాం దిగ్గజాలు, జియోల పోరు ఉధృతమవుతోంది. టారిఫ్ అసెస్ మెంట్ పై టెలికాం రెగ్యులేటరీ మంగళవారం కంపెనీలకు ఓపెన్ హౌజ్ చర్చ నిర్వహించింది. కస్టమర్లను కాపాడుకోవడానికి ఆఫర్ చేసే డిస్కౌంట్లు, ప్లాన్స్ అనియతగా కాకుండా.. ఒక్కో యూజర్ సగటు ఆదాయం, కస్టమర్ విధేయత వంటివాటికి అనుగుణంగా ఉండాలని ట్రాయ్ చెబుతోంది. మరో 30రోజుల్లో వీటికి సంబంధించి ఓ గైడ్ లైన్సును ట్రాయ్ జారీచేయనుంది. ఎప్పుడైతే కస్టమర్ తమ నెట్ వర్క్ ను వదలివెళ్లాలనుకున్నప్పుడు, వారిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఆపరేటర్ పై ఉంటుందని భారతీ ఎయిర్ టెల్ రెగ్యులేటరీ అధినేత అన్షుమన్ థాకూర్ చెప్పారు. ఇది కేవలం టెలికాం ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే కాదని, అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీన్ని మాత్రం రిలయన్స్ జియో పూర్తిగా విభేదిస్తోంది. పారదర్శకత కోసం ప్రస్తుతమున్న చర్యలు సరిపోవని, పారదర్శకత స్పెషిఫికేషన్స్ స్థిరంగా లేవని జియో పేర్కొంటోంది. టెల్కోలు ఆఫర్ చేసే అన్ని ప్లాన్స్ ను కామన్ ప్లాట్ ఫామ్ లో ప్రచురించాలని తాము కోరుతున్నామని, వాటిని చూసి తమకు బెస్ట్ అనిపించిన వాటిని కస్టమర్లకు ఎంపికచేసుకునే అవకాశం కల్పించాలని అంటోంది. ఎవరికీ కూడా ఆ ప్లాన్స్ కు మించి ఆఫర్ చేయకూడదని కూడా వాదిస్తోంది. ఒకే కేటగిరీలోని సబ్ స్క్రైబర్లకు వివిధ రకాల ప్లాన్స్ ను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ట్రాయ్ ఈ చర్చా కార్యక్రమం నిర్వహించింది. -
టారిఫ్ వార్: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
జియో షాక్‌తో ఎయిర్టెల్, వొడాఫోన్ దిగొచ్చి, అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్లను వినియోగదారుల ముంగింట్లోకి తెచ్చాయి. వీటి బాటలోనే తాజాగా ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ కూడా వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రీపెయిడ్ కస్టమర్లకు పరిమిత ఉచిత డేటాతో కూడిన అపరిమిత వాయిస్ కాలింగ్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు శుక్రవారం తెలిపింది. దీనికోసం కేవలం రూ.99తో రీఛార్జ్ చేపించుకుంటే చాలని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. రూ.99తో రీచార్జ్ చేపించుకుంటే నెల రోజుల పాటు అపరిమితంగా లోకల్ కాల్స్, బీఎస్ఎన్ఎల్ నుంచి బీఎస్ఎన్ఎల్ ఎస్టీడీ కాల్స్ వాడుకోవచ్చని, వాటితో పాటు 300 ఎంబీ డేటా కూడా ఉచితంగా అందుబాటులో ఉంచుతామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రేట్ కోల్కత్తా టీడీ, పశ్చిమబెంగాల్, బిహార్, జార్ఖాండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌లు నెట్వర్క్ పరిధిలోని కాల్స్‌కు అందుబాటులో ఉంటుంది. ఇదే ఆఫర్ ఇతర సర్కిళ్లలో రూ.119 నుంచి రూ.149కు కల్పిస్తామని కంపెనీ పేర్కొంది. అదేవిధంగా కొత్త కోంబో ఎస్టీవీ ఆఫర్‌ను కూడా కంపెనీ తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ ఆఫర్ కింద రూ.339కు నెలరోజుల పాటు అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనా చేసుకునేలా అవకాశం కల్పిస్తూ 1జీబీ డేటాను అందుబాటులో ఉంచింది.. 30 రోజుల వాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అపరిమిత 3జీ సర్వీసులను రూ.1099కు అందిస్తోంది.