
ట్రంప్ ట్రేడ్ వార్.. ఆపై మాంద్యం భయాలు
ప్రపంచ మార్కెట్లపై ‘టారిఫ్’ బేర్ పంజా
సెన్సెక్స్ 2,227 పాయింట్లు క్రాష్
ఇంట్రాడేలో 72,000 కిందికి సూచీ...
743 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
ఆసియా సూచీలు 4–15 శాతం ఢమాల్
యూరప్ మార్కెట్లో బ్లడ్ బాత్
బేర్ గుప్పిట్లోకి అమెరికా సూచీలు
ఒక్క రోజే రూ.14 లక్షల కోట్లు ఆవిరి
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచిన ట్రంప్... ప్రపంచ ఆర్థిక మార్కెట్లలో సృష్టిస్తున్న భగభగలు చల్లారటం లేదు. అమెరికాతో వ్యాపారం చేస్తున్న ప్రతి దేశాన్నీ కాళ్ల బేరానికి వచ్చేలా చేయడానికి ఆయన ఎంచుకున్న ప్రతీకార సుంకాలు అమెరికా సహా అన్ని స్టాక్ మార్కెట్లలోనూ కల్లోలాన్ని కొనసాగిస్తున్నాయి.
కెనడా, జపాన్ సహా పలు దేశాల అధినేతలు ట్రంప్‌తో చర్చలకు వెళుతున్నట్లు ఇప్పటికే ప్రకటించగా... చైనా మాత్రం దిగిరాలేదు. పైపెచ్చు ట్రంప్ టారిఫ్‌లకు జవాబుగా చైనా కూడా అమెరికా వస్తువులపై సుంకాలు పెంచటంతో ట్రంప్ బెదిరింపులకు దిగారు. చైనా వాటిని ఉపసంహరించుకోకపోతే మరో 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. సోమవారం అమెరికా మార్కెట్లు మొదట్లో కోలుకున్నట్లు కనిపించినా ఈ ట్రేడ్ వార్ భయాలతో మళ్లీ భారీ పతనం దిశగా కదిలాయి. మరోవంక ట్రంప్ చర్యలతో ప్రపంచాన్ని మాంద్యం ముంచెత్తే అవకాశాలు 60 శాతానికి చేరినట్లు ఆర్థిక దిగ్గజాలు ప్రకటించాయి.
దీంతో భారత్ సహా ప్రపంచ మార్కెట్లన్నీ సోమవారం భారీ పతనాన్ని చూశాయి. సెన్సెక్స్ ఆరంభంలో 4 వేల పాయింట్ల వరకూ నష్టపోయినా చివరకు కాస్త కోలుకుని 2,226.79 పాయింట్లు (–2.95%) క్షీణించి 73,137 వద్ద ముగిసింది. నిఫ్టీ 742 పాయింట్లు (–3.24%) పడిపోయి 22,160 వద్ద ముగిసింది. ఈ పతనంతో రూ.14 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. చమురు, బంగారం ధరలు కూడా భారీగా పతనంఅవుతున్నాయి. మరోవైపు హాంకాంగ్ సూచీ హాంగ్‌సెంగ్ 15% నష్టపోగా... తైవాన్ వెయిటెడ్ 11%, జపాన్ నికాయ్ 8%, సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ 8%, చైనా షాంఘై 7% చొప్పున నష్టపోయాయి. యూరప్ మార్కెట్ల పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు.
ట్రంప్ టారిఫ్ వార్‌తో ప్రపంచ మార్కెట్లను బేర్ చీల్చిచెండాడింది. ఆసియా నుంచి అమెరికా దాకా బ్లాక్ మండే దెబ్బకు ఇన్వెస్టర్లు కుదేలయ్యారు. అమెరికా సుంకాలకు చైనా ప్రతీకార టారిఫ్‌లు విధించడం.. ఇతర దేశాలూ అదే బాటలో వెళ్తుండటంతో వాణిజ్య యుద్ధం మరింత ముదురుతోంది. దీంతో ద్రవ్యోల్బణం ఎగబాకి ఆర్థిక మాంద్యానికి దారి తీయొచ్చనే భయాలతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తింది.
ఈ ప్రభావం దేశీయ ఈక్విటీ మార్కెట్‌పైనా విరుచుకుపడింది. ఫలితంగా భారత స్టాక్ సూచీలు పది నెలల్లో (2024 జూన్ 4 తర్వాత) అతిపెద్ద నష్టాన్ని చూశాయి. సెన్సెక్స్ 2,227 పాయింట్లు క్షీణించి 73,138 వద్ద, నిఫ్టీ 743 పాయింట్లు నష్టపోయి 22,162 వద్ద నిలిచింది. ఈ క్రాష్‌తో ఇన్వెస్టర్ల సంపదగా భావించే, బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సోమవారం ఒక్కరోజే రూ.14.09 లక్షల కోట్లు ఆవిరై రూ.389 లక్షల కోట్ల (4.54 ట్రిలియన్ డాలర్లు)కు పడిపోయింది. ఒకానొక దశలో సంపద రూ.20.16 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది.
ముంబై: గత వారాంతంలో అమెరికా మార్కెట్లు కుప్పకూలడంతో సోమవారం ఆసియా మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. ఆ సెగతో మన సూచీలు కూడా భారీ నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 3,915 పాయింట్ల క్షీణతతో 71,450 వద్ద, నిఫ్టీ 1,146 వద్ద పతనంతో 21,758 వద్ద మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 3,940 పాయింట్లు, నిఫ్టీ 1160 పాయింట్లు దిగజారాయి. జాతీయ, అంత్జాతీయ ప్రతికూలతల ప్రభావంతో రోజంతా భారీ నష్టాల్లో కదలాడాయి. అయితే కనిష్టాల వద్ద కొన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలు కొంత భర్తీ అయ్యాయి.
→ సెన్సెక్స్ సూచీలో ఒక్క హెచ్‌యూఎల్ (0.25%) మినహా మిగిలిన 29 షేర్లు నష్టాలు చవిచూశాయి. రంగాల వారీగా సూచీల్లో మెటల్ 6.22%, రియల్టీ 5.69%, కమోడిటీస్ 4.68%, ఇండ్రస్టియల్ 4.57%, కన్జూమర్ డి్రస్కేషనరీ 4%, ఆటో 3.77%, బ్యాంకెక్స్ 3.37%, ఐటీ, టెక్ మూడు శాతాలు క్షీణించాయి.
బీఎస్‌ఈలో 3,515 షేర్లు నష్టపోయాయి. 570 స్టాక్స్ లాభపడ్డాయి. మిగిలిన 140 షేర్లలో ఎలాంటి మార్పుల్లేవు. 775 స్టాక్స్ ఏడాది కనిష్టాన్ని , 59 షేర్లు ఏడాది గరిష్టాన్ని తాకాయి.
ఐటీ షేర్లు.. హాహాకారాలు...
ఆర్థిక మాంద్య భయాలతో అమెరికా నుంచి అధిక ఆదాయాలు ఆర్జించే ఐటీ షేర్లు భారీ క్షీణించాయి. ఆన్‌వర్డ్ టెక్నాలజీస్ 14%, జెనెసిస్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ 11% క్షీణించాయి. క్విక్ హీల్ టెక్నాలజీస్ 10%, జాగిల్ ప్రీపెయిడ్ ఓషియన్ సరీ్వసెస్, డేటామాటిక్స్ గ్లోబల్ సరీ్వసెస్ 9%, న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ 8%, హ్యాపియెస్ట్ మైండ్స్, సొనాటా సాఫ్ట్‌వేర్, టాటా టెక్నాలజీ, ఎంఫసిస్ 6% క్షీణించాయి. అధిక వెయిటేజీ ఇన్ఫోసిస్ 4%, హెచ్‌సీఎల్ టెక్ 3%, టెక్ మహీంద్రా 2.50%, ఎల్‌టీఐమైండ్‌ట్రీ 2%, విప్రో ఒకశాతం, టీసీఎస్ అరశాతంనష్టపోయాయి. బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ గడిచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో 8 శాతం క్షీణించింది.
టాటా.. టప టపా!
టెక్నాలజీ, స్టీల్, ఆటోమొబైల్స్ రంగాల్లో అధిక భాగం వ్యాపారాలు కలిగిన టాటా గ్రూప్ షేర్లు డీలా పడ్డాయి. టాటా ట్రెంట్ షేరు 15%, టాటా స్టీల్ 9%, టాటా మోటార్స్, టాటా టెక్నాలజీ 6%, టీసీఎస్, టాటా కెమికల్స్, టైటాన్, ఇండియన్ హోటల్స్ షేర్లు 5–2% నష్టపోయాయి. ఈ గ్రూప్‌లో మొత్తం 16 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ.90,000 కోట్లు హరించుకుపోయి రూ.25.3 లక్షల కోట్లకు దిగివచి్చంది. ఒకానొక దశలో రూ.2.3 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ కోల్పోయింది.
అప్రమత్తత అవసరం: నిపుణులు
తీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పట్టకీ.., ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగా ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చు. రక్షణాత్మక రంగాల్లో పెట్టుబడి మరీ మంచిది అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వ్యూహకర్త వి.కే. విజయ్‌కుమార్ తెలిపారు.