Black Monday
-
మార్కెట్లో మరో బ్లాక్ మండే
ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతర పాలసీకి మొగ్గుచూపుతుండటంతో ఈక్విటీ మార్కెట్ మరో బ్లాక్ మండేను ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజూ పైపైకి ఎగబాకుతోంది. వీటిని అదుపులో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో పెట్టుబడులు బాండ్ల వైపు మళ్లుతున్నాయి. ఈనెల పదో తేదీ నుంచి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రారంభమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. యూఎస్ ఫెడరల్ రిజర్వు అనుకున్న దానికంటే వేగంగా వడ్డీరేట్లను పెంచవవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలన్నీ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని స్టాక్ నిపుణులు తెలిపారు. ఫలితంగా సోమవారం సెన్సెక్స్ 1,024 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,621 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 17,214 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లు హెచ్డీఎఫ్సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్‌ల భారీ అమ్మకాలు ఒత్తిడికిలోనయ్యాయి. ఎస్బీఐ రికార్డు ర్యాలీ అండతో ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. సెన్సెక్స్ సూచీలో ఐదుశాతం షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ ఇండెక్సులు రెండు శాతం వరుకు క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1157 కోట్ల షేర్లను, డీఐఐలు రూ. 1376 కోట్ల షేర్లను అమ్మేశారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 17 పైసలు క్షీణించి 74.60 వద్ద స్థిరపడింది. లతా మంగేష్కర్ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో సోమవారం ఫారెక్స్, మనీ మార్కెట్లు పనిచేయలేదు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ‘గతవారంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్ల నుంచి 5% శాతానికి పెంచింది.పాలసీ ప్రకటన సందర్భంగా పావెల్ వ్యాఖ్యలతో యూఎస్ ఫెడ్ రిజర్వ్ మార్చిలో 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చనే స్పష్టత వచ్చింది. దేశంలో డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణం ఐదునెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అంతర్జాతీయంగా బ్రెంట్ బ్యారెల్ చమురు ధర 95 డాలర్లకు ఎగసిన నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేకపోలేదని భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. ఆర్బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు వెల్లడి (గురువారం) అయ్యేంత వరకు మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది’ జియోజిత్ ఫైనాన్షియన్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,345 పాయింట్లు క్రాష్ ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలతో ఉదయం సెన్సెక్స్ 75 పాయింట్ల నష్టంతో 58,550 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల పతనంతో 17,516 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గంట గంటకూ అమ్మకాల ఉధృతి పెరుగుతుండటంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,345 పాయింట్లు క్షీణించి 57,299 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 17,119 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలు పెరిగినట్లు ప్రకటించడంతో పేటీఎం షేరు ఇంట్రాడేలో ఆరుశాతం క్షీణించి రూ.899 వద్దకు దిగివచ్చింది. అయితే మిడ్‌సెషన్ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను పూడ్చుకొని అరశాతం స్వల్పలాభంతో రూ.957 వద్ద స్థిరపడింది. ► ఇదే క్యూ3లో ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వరంగ ఎస్బీఐ బ్యాంక్ షేరు ఇంట్రాడేలో మూడున్నరశాతం ఎగసి రూ.549 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల స్వీకరణతో చివరికి అరశాతం లాభంతో 533 వద్ద స్థిరపడింది. ► మూడో త్రైమాసికంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇండిగో, లుపిన్ షేర్లు వరుసగా ఎనిమిది, పదిశాతం చొప్పున క్షీణించాయి. ► వీఐఎక్స్ ఇండెక్స్ ఎనిమిది శాతం పెరిగి 20.44 స్థాయికి చేరింది. ఇది మార్కెట్లో మరో ముప్పై రోజుల తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సూచిస్తోంది. 3 రోజుల్లో రూ. 6 లక్షల కోట్లు హుష్ గత 3 రోజుల్లో బీఎస్ఈ సెన్సెక్స్ 1,937 పాయింట్లు, నిఫ్టీ 566 పాయింట్లు చొప్పున క్షీణించాయి. సూచీలు మూడుశాతానికి పైగా కుదేలవడంతో రూ.ఆరు లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.270 కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ(మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. -
ప్రపంచ మార్కెట్లను వెంటాడిన ఒమిక్రాన్!
ముంబై: ఒమిక్రాన్ వేరియంట్ భయాలు మరోమారు ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. ఈ కొత్త రకం కేసుల సంఖ్య అంతకంతా పెరగడానికి తోడు ప్రపంచ మార్కెట్లలో అనూహ్య అమ్మకాలతో భారత మార్కెట్లో మరో ‘‘బ్లాక్ మండే’’ నమోదైంది. వైరస్ కట్టడికి ఆయా దేశాల లాక్డౌన్ల విధింపులు ఆర్థిక రికవరీ విఘాతం కలిగించవచ్చనే ఆందోళనల ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి. ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపుతుండటం.., విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయ ఆందోళనలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 56 వేల స్థాయిని కోల్పోయి 1,189 పాయింట్ల నష్టంతో 55,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 371 పాయింట్లు క్షీణించి 16,614 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టాల ముగింపు. శాతం పరంగా చూస్తే.., సెన్సెక్స్ మూడుశాతం, నిఫ్టీ రెండు శాతం క్షీణించాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 2 షేర్లు.. నిఫ్టీ50 షేర్లలో 4 షేర్లే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద మొత్తంలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లను విక్రయిస్తుండటంతో ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ ఇండెక్స్ ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో పాటు యూఎస్ నాస్డాక్ ఇండెక్స్ పతన ప్రభావంతో దేశీ ఐటీ షేర్లు పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి ఆందోళనలతో మెటల్, మౌలిక రంగ షేర్లు కరిగిపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు మూడున్నర శాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,565 కోట్ల షేర్లను అమ్మేయగా.., విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,764 కోట్ల షేర్లను కొన్నారు. సోమవారం సెషన్ సాగింది ఇలా..! ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్ మార్కెట్ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ 495 పాయింట్ల పతనంతో 56,517 వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు క్షీణించి 16,824 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 1879 పాయింట్ల పతనమై 55,132 వద్ద, నిఫ్టీ 575 పాయింట్లు నష్టపోయి 16,410 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ స్థాయిలు సూచీలకు ఎనిమిది నెలల కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. మిడ్ సెషన్ తర్వాత ఆయా షేర్లకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో రికవరీ బాట పట్టాయి. ఫలితంగా సూచీల నష్టాలు ఎనిమిది నెలల కనిష్టం నుంచి 4 నెలల కనిష్టానికి పరిమితమయ్యాయి. ► అమెజాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిలివేయడతో ఫ్యూచర్ లైఫ్‌స్టైల్ (20%), ఫ్యూచర్ రిటైల్ (19.92%), ఫ్యూచర్ కన్జ్యూమర్ (19.91%) షేర్లు రాణించి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ► ఇటీవల లిస్టయిన నైకా, కార్‌ట్రేడ్, జొమాటో పేటీఎంలు (న్యూ ఏజ్ స్టాక్‌లు) ఎనిమిది శాతం క్షీణించాయి. నష్టాలకు నాలుగు కారణాలు... ► వణికించిన ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తూ ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. యూరప్‌లో కేసులు పెరగడంతో ఆయా దేశాలు లాక్డౌన్ యోచనలు చేస్తున్నాయి. రెండు కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు బూస్టర్ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఇటీవల అమెరికా ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్ కేసుల పెరిగింది. వైరస్ వ్యాప్తి కట్టడికి అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు అమలు కావచ్చని అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ► వడ్డీ రేట్ల పెంపు భయాలు ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాలు వడ్డీరేట్ల పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్ ఫెడ్ ప్రకటించింది. దీంతో ఫలితంగా ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్ ఇండెక్స్ చేరింది. అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్ సూచీలపై పడింది. ► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో సెంటిమెంట్ బలహీనపడింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.17,696 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒమిక్రాన్ పరిణామాలు, అధిక వాల్యూయేషన్లు, ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు దిశగా యోచనలు చేస్తుండటంతో ఎఫ్ఐఐలు భారత్ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. ► ప్రపంచ మార్కెట్ల పతనం క్రిస్మస్, నూతన సంవత్సర సీజన్‌కు ముందు ఒమిక్రాన్ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు 2% క్షీణించాయి. కేసుల కట్టడికి ఐరోపా దేశాల్లో మరోమారు లాక్డౌన్ విధింపు ఉండొచ్చనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే నెదర్లాండ్స్ లాక్డౌన్ విధించింది. పండుగ వేళ లాక్డౌన్లు, ఆంక్షల నిర్ణయాలు వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు ఈక్విటీ మార్కెట్ల పతనానికి కార ణమయ్యాయి. ఆసియాలో చైనా, జపాన్ దేశాల స్టాక్ సూచీలు 2% వరకు క్షీణించాయి. యూరప్‌లో ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్ మార్కెట్లు 2–1% నష్టపోయాయి. యూఎస్ మార్కెట్లు 1.5% నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. డిస్కౌంట్లో శ్రీరాం ప్రాపర్టీస్ లిస్టింగ్ శ్రీరాం ప్రాపర్టీస్ షేర్లు లిస్టింగ్ రోజు నష్టాలను పంచాయి. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్ఈలో 24 శాతం క్షీణించి రూ.94 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 22 శాతం మేర పతనమైన రూ.92 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 16% నష్టంతో రూ.118 వద్ద స్థిరపడింది. మార్కెట్ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.1,686 కోట్ల వద్ద స్థిరపడింది. రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద ఆవిరి స్టాక్ మార్కెట్లో గడచిన రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. సూచీలు సోమవారం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో ఈ ఒక్క రోజే రూ.6.81 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్ 2078 పాయింట్లు, నిఫ్టీ 634 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడేలో 1879 పాయింట్లు డౌన్ 55,132కు పతనం ముగింపు 1190 పాయింట్లు డౌన్ 55,822 వద్ద క్లోజ్ -
‘క్రాష్’ మార్కెట్..!
ముంబై: స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు భారీ అమ్మకాలకు దారితీశాయి. ఫలితంగా సూచీలు సోమవారం రెండునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్లను కోల్పోయి 50,000 దిగువన 49,744 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి మూడువారాల కనిష్టస్థాయి. నిఫ్టీ 306 పాయింట్లు నష్టపోయి 14,676 వద్ద నిలిచింది. అలాగే ఇరు సూచీలకిది వరుసగా ఐదోరోజు నష్టాల ముగింపు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, దేశవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు, బాండ్ ఈల్డ్స్ అనూహ్య ర్యాలీ తదితర అంశాలు మన మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి. అలాగే మండుతున్న ముడిచమురు ధరలు, ఇటీవల మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో పెరిగిన ఈక్విటీల వ్యాల్యుయేషన్ల ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లను కలవరపరిచాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒక్క మెటల్ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో విస్తృతంగా అమ్మకాలు జరిగాయి. ఎన్ఎస్ఈలో ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా, ఐటీ, మీడియా రంగాల సూచీలు మూడుశాతం పతనమయ్యాయి. ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లు రెండుశాతం క్షీణించాయి. రూపాయి 16 పైసల ర్యాలీతో ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యతనివ్వడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ఒకదశలో సెన్సెక్స్ 1,273 పాయింట్లు నష్టపోయి 49,617 వద్ద దిగివచ్చింది. నిఫ్టీ 346 పాయింట్లను కోల్పోయి 14,635 స్థాయిని తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) ఈ జనవరి 29 తర్వాత తొలిసారి దేశీయ మార్కెట్లో్ల విక్రయాలు జరిపారు. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) సోమవారం రూ.893 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అలాగే దేశీ ఇన్వెస్టర్లు రూ.919 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి. ‘‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలతో కూడిన లాక్డౌన్ విధింపుతో ఆర్థిక రికవరీపై ప్రభావం పడొచ్చన్న భయాలు మార్కెట్‌ను వెంటాడాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ కారణాలతో ఇటీవల మార్కెట్ ర్యాలీకి దన్నుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇప్పుడు నెమ్మదించాయి.’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. పడినప్పుడల్లా... కొనండి..! ఐదు రోజుల వరుస పతనంతో సెన్సెక్స్ 2410 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 639 పాయింట్లను నష్టపోయింది. మార్కెట్ భారీగా క్షీణిస్తున్న ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చని స్టాక్ నిపుణులు సలహానిస్తున్నారు. ప్రస్తుత పతనం స్వల్పకాలికమేనని, పడిపోయిన ప్రతిసారి కొనుగోలు చేయమని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడ్డాయని.. ఇండస్ట్రీయల్, సైక్లికల్స్ రంగాల షేర్లపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. నిమిషానికి రూ.1000 కోట్ల నష్టం..! మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ సమయంలో ప్రతి నిమిషానికి రూ. 1000 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.3.08 లక్షల కోట్లు ఆవిరయ్యింది. వెరసి బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.200.18 లక్షల కోట్లకు దిగివచ్చింది. ట్రేడింగ్‌లో మరిన్ని విశేషాలు... ► సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఓఎన్జీసీ, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి ► నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది. ► మార్కెట్లో అస్థిరతను సూచించే ఎన్ఎస్ఈ వీఐఎక్స్ ఇండెక్స్ 14 శాతం పెరిగి 25.47 వద్ద ముగిసింది. ► ఎన్సీఎల్టీ నుంచి తుది అనుమతులు వచ్చిన ఆరునెలల్లో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ బిడ్డింగ్‌లో దక్కించుకున్న జలాన్ కల్రాక్ కన్సార్షియం సభ్యుడు మురారి లాలా జలాన్ తెలిపారు. ఫలితంగా ఈ కంపెనీ షేరు ఐదు శాతం లాభపడి రూ. 114.90 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ► ఫైడీస్ ఫుడ్ సిస్టమ్స్ విలీన ప్రక్రియను పూర్తి చేయడంతో జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేరు ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆరు శాతం లాభంతో రూ.3128 వద్ద స్థిరపడింది. -
విపణి వీధిలో కల్లోలం!
‘బ్లాక్ మండే’గా ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కిన సోమవారంనాటి ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనం 2008 అమెరికా ఆర్థిక సంక్షోభపు రోజులను గుర్తుకు తెచ్చింది. భారత్ మార్కెట్ దిక్సూచిగా పరిగణించే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ (సెన్సెక్స్) 1,640 పాయింట్లు పతనమైంది. అయితే, సెన్సెక్స్ రికార్డుస్థాయిలో 27,000 పాయింట్లపైన ఉన్నందువల్ల ఇది అతిపెద్ద క్షీణతగా కన్పిస్తున్నది తప్ప... గత పతనాలతో పోలిస్తే పెద్ద క్షీణతేమీ కాదు. 2004లో వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడూ, 2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడూ ఇంతకంటే ఎక్కువగా... 10-15 శాతం వరకూ సెన్సెక్స్ కుప్పకూలింది. పతనాన్ని శాతాల్లో గణిస్తే ఇది 1990 తర్వాత 27వ పెద్ద క్షీణత మాత్రమే. 2008నాటి సంక్షోభం అమెరికాలో పుట్టింది. ఇప్పటిదానికి చైనా మూలం. కాకపోతే అప్పటిది అధిక రుణాల ఏర్పడిన సంక్షోభంకాగా, తాజా కల్లోలం మందగమనంతో వచ్చింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంతంతగానే ఉండటంతో చైనా ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతున్నది. ఈ సమస్యల్ని అధిగమించడానికి చైనా ఒక్కసారిగా తన కరెన్సీ యువాన్ విలువను 10 రోజుల క్రితం తగ్గించడంతో చైనా ప్రమాదంలో పడిందన్న అంశాన్ని ఇన్వెస్టర్లు గుర్తించారు. ఇప్పుడు ప్రపంచమంతా చైనా మీద... చైనా ప్రపంచం మీద ఆధారపడటంతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం కలిసికట్టుగా భారీగా పడిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం, చైనా వెతలు, క్రూడ్ ధర పతనం వంటి కారణాలతో చాలా దేశాల మార్కెట్లు వాటి ఏడాది గరిష్ట స్థాయిల నుంచి కొద్ది నెలలుగా 20-50 శాతం మధ్య పతనమయ్యాయి. చైనా షాంఘై సూచి 5,000 పాయింట్ల నుంచి కేవలం మూడు నెలల్లో 40 శాతంపైగా క్షీణించి మంగళవారం 3,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. అలాగే ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా తదితర సూచీలు కూడా పెద్ద క్షీణతనే చవి చూశాయి. ఇటీవలి రికార్డు గరిష్టస్థాయిల నుంచి అమెరికా, జపాన్, భారత్‌ల సూచీల క్షీణత మాత్రమే చాలా తక్కువ. సెన్సెక్స్ ఈ ఏడాది మార్చినాటి 30,000 పాయింట్ల రికార్డు స్థాయి నుంచి 13 శాతం తగ్గి, ప్రస్తుతం 26,000 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే కరెన్సీ విషయంలో కూడా ఇండియా రూపాయి ఇతర వర్థమాన దేశాల కరెన్సీలకంటే పటిష్టంగా వుంది. రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, వియత్నాం, దక్షిణ కొరియాల కరెన్సీలు 20-30 శాతం మధ్య పడిపోగా, రూపాయి విలువ రెండు నెలల నుంచి తగ్గింది 5 శాతమే. భారత్ స్టాక్ మార్కెట్, కరెన్సీలు, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే బలంగా ఉండటానికి ప్రధాన కారణం ఈ ఆర్థిక వ్యవస్థ రికవరీని విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా విశ్వసిస్తుండటమే. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.11 లక్షల కోట్ల నిధుల్ని ఇక్కడి స్టాక్ మార్కెట్లో వారు పెట్టుబడి పెట్టారు. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడుదుడుకులకు లోనవుతున్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 21 వరకూ వారు నికరంగా వెనక్కు తీసుకున్నది 1,400 కోట్లే. వారు తమ మెజారిటీ పెట్టుబడుల పట్ల పెద్దగా ఆందోళనగా లేరన్నది ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసానికి కారణాలున్నాయి. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే క్రూడ్ ధర బాగా దిగిరావడంతో ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడింది. మనం దిగుమతుల మీద ఆధారపడే బంగారం ధర కూడా కనిష్టస్థాయిలోనే వుండటం కలిసివచ్చింది. వృద్ధి ఇంకా జోరందుకోకపోయినా, దిగుమతుల వ్యయం భారీగా తగ్గిపోయింది. 2012-13లో జీడీపీలో 4.7 శాతానికి చేరిపోయిన కరెంటు ఖాతా లోటు (ఖర్చుచేసే విదేశీ మారకం, సంపాదించే మారకంల మధ్య వ్యత్యాసం) దిగుమతుల బిల్లు తగ్గడంతో ఇప్పుడు 1.3 శాతానికి పడిపోయింది. క్రూడ్ దిగుమతులకు 200 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సివచ్చేది. ఆ బిల్లు ఇప్పుడు 88 బిలియన్ డాలర్లకు దిగింది. దీంతో ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకుపైగా సబ్సిడీల భారం తగ్గిపోయింది. క్రూడ్ ధర తగ్గడంతో ప్రజలకు నొప్పి తెలియకుండా పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సయిజు సుంకాల్ని వడ్డించి ప్రభుత్వం పన్నుల ఆదాయాన్ని పెంచుకోగలుగుతుంది. రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు రికార్డుస్థాయిలో 355 బిలియన్ డాలర్లకు పెరిగాయి. రెండేళ్ల క్రితం 10 శాతం వుండే రిటైల్ ధరల ద్రవ్యోల్బణం తాజాగా 6 శాతం లోపునకు దిగివచ్చింది. ఇటువంటి సానుకూలాంశాలతో భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న నెలల్లో వేగంగా కోలుకోవొచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు వున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ క్షీణత తక్కువగా వుంది. అంతమాత్రాన మనం భరోసాతో ఉండటానికి వీల్లేదు. రిస్క్ వుందని తెలిస్తే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు శరవేగంగా వె నక్కి వెళిపోతాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఎనిమిదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను త్వరలో పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. ఈ కారణంతోనే నాలుగు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తాజా పెట్టుబడులు నెమ్మదించాయి. ఫెడ్ రేట్లు పెంచితే అన్ని దేశాలతో పాటే మన దేశం నుంచి కూడా కొంతవరకూ నిధులు తరలివెళిపోతాయి. అప్పుడు సెన్సెక్స్ మరింత పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ భారీ విదేశీ మారక నిల్వలు ఉన్నందున, ఇతర దేశాలకంటే ఆ రిస్క్‌ను మనం సమర్థవంతంగా ఎదుర్కొంటామని రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ అంటున్నారు. వచ్చే నెల 17న ఫెడ్ కమిటీ సమావేశం జరగనున్నది. రేట్ల పెంపుపై స్పష్టమైన సంకేతాలు ఆ రోజు వెలువడవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అప్పటివరకూ అన్నిటితోపాటే మన స్టాక్ మార్కెట్ కూడా అనిశ్చితిలోనే ఉండొచ్చు. మొత్తానికి చిన్న మదుపరులు ఆచి తూచి అడుగేయాల్సిన సమయమిది. -
స్టాక్ మార్కెట్ రక్తమోడినా...
ముంబై: స్టాక్ మార్కెట్లు రక్తమోడుతున్నా కొన్ని షేర్లు నిబ్బరంగా నిలబడ్డాయి. నష్టాల సునామీ చుట్టుముట్టినా దాదాపు 206 షేర్లు లాభాల బాటలో సాగాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలి ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.ఇంత పతనంలోనూ కొన్ని కంపెనీల షేర్లు లాభాలు ఆర్జించడం విశేషం. మ్యాగీ నూడుల్స్ తో వివాదాలపాలైన నెస్లే ఇండియా టాప్ గెయినర్స్ లో ఒకటిగా నిలిచింది. ఇంట్రాడేలో నెస్లే ఇండియా షేర్లు 2 శాతం వరకు లాభపడ్డాయి. ఆరంభంలో రూ. 6100గా ఉన్న షేరు తర్వాత రూ.6,206కు పెరిగింది. వీడియోకాన్ ఇండస్ట్రీస్ వాటాలు 4.36 శాతం లాభపడ్డాయి. సన్ రైజ్ ఏషియన్, ఒరిసా స్పాంజ్ అండ్ ఐరన్, ఇమామీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, జిందాల్ వరల్డ్ వైడ్, బిన్నీ మిల్స్ తదితర షేర్లు లాభాలు ఆర్జించాయి. -
స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే!
-
బ్లాక్ మండే: రూ.3 లక్షల కోట్లపైగా నష్టం
ముంబై: స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో భారీ పతనం. ఊహించని నష్టాలతో స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలాయి. మూడో అతిపెద్ద పతనంతో సోమవారం స్టాక్ మార్కెట్ పాలిట బ్లాక్ మండేగా పరిణమించింది. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ సుమారు 1500 పాయింట్లు పతనమై 26వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 7900 పాయింట్ల కిందకు పతనమైంది. నిఫ్టీలోని 50 షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. బీఎస్ఈలోని 500 షేర్లలో కేవలం 6 షేర్లు మాత్రమే నష్టాల బారిన పడకుండా ఉన్నాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు పైగా నష్టపోయినట్టు అంచనా. ఏడున్నరేళ్లలో ఇదే అతిపెద్ద నష్టం కాగా, స్టాక్ మార్కెట్ చరిత్రలో మూడోది. 2008, జనవరి 21న సెన్సెక్స్ 2,062 పాయింట్లు పతనమైంది. -
బ్లాక్ మండే