విపణి వీధిలో కల్లోలం! | black monday for stock market in financial crisis | Sakshi
Sakshi News home page

విపణి వీధిలో కల్లోలం!

Published Wed, Aug 26 2015 1:20 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

విపణి వీధిలో కల్లోలం! - Sakshi

విపణి వీధిలో కల్లోలం!

‘బ్లాక్ మండే’గా ప్రపంచవ్యాప్తంగా పతాక శీర్షికలకు ఎక్కిన సోమవారంనాటి ప్రపంచ స్టాక్ మార్కెట్ల పతనం 2008 అమెరికా ఆర్థిక సంక్షోభపు రోజులను గుర్తుకు తెచ్చింది. భారత్ మార్కెట్ దిక్సూచిగా పరిగణించే బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సిటివ్ ఇండెక్స్ (సెన్సెక్స్) 1,640 పాయింట్లు పతనమైంది. అయితే, సెన్సెక్స్ రికార్డుస్థాయిలో 27,000 పాయింట్లపైన ఉన్నందువల్ల ఇది అతిపెద్ద క్షీణతగా కన్పిస్తున్నది తప్ప... గత పతనాలతో పోలిస్తే పెద్ద క్షీణతేమీ కాదు. 2004లో వామపక్షాల మద్దతుతో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడూ,  2008లో అమెరికా ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడూ ఇంతకంటే ఎక్కువగా... 10-15 శాతం వరకూ సెన్సెక్స్ కుప్పకూలింది. పతనాన్ని  శాతాల్లో గణిస్తే ఇది 1990 తర్వాత 27వ పెద్ద క్షీణత మాత్రమే.
 
 2008నాటి సంక్షోభం అమెరికాలో పుట్టింది. ఇప్పటిదానికి చైనా మూలం. కాకపోతే అప్పటిది అధిక రుణాల ఏర్పడిన సంక్షోభంకాగా, తాజా కల్లోలం మందగమనంతో వచ్చింది. ప్రపంచ ఆర్థికాభివృద్ధి అంతంతగానే ఉండటంతో చైనా ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతున్నది. ఈ సమస్యల్ని అధిగమించడానికి చైనా ఒక్కసారిగా తన కరెన్సీ యువాన్ విలువను 10 రోజుల క్రితం తగ్గించడంతో చైనా ప్రమాదంలో పడిందన్న అంశాన్ని ఇన్వెస్టర్లు గుర్తించారు. ఇప్పుడు ప్రపంచమంతా చైనా మీద... చైనా ప్రపంచం మీద ఆధారపడటంతో అన్ని దేశాల స్టాక్ మార్కెట్లు సోమవారం కలిసికట్టుగా భారీగా పడిపోయాయి.

 ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం, చైనా వెతలు, క్రూడ్ ధర పతనం వంటి కారణాలతో చాలా దేశాల మార్కెట్లు వాటి ఏడాది గరిష్ట స్థాయిల నుంచి కొద్ది నెలలుగా 20-50 శాతం మధ్య పతనమయ్యాయి. చైనా షాంఘై సూచి 5,000 పాయింట్ల నుంచి కేవలం మూడు నెలల్లో 40 శాతంపైగా క్షీణించి మంగళవారం 3,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. అలాగే ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా, ఇండోనేషియా, సింగపూర్, దక్షిణ కొరియా తదితర సూచీలు కూడా పెద్ద క్షీణతనే చవి చూశాయి.  ఇటీవలి రికార్డు గరిష్టస్థాయిల నుంచి అమెరికా, జపాన్, భారత్‌ల సూచీల క్షీణత మాత్రమే చాలా తక్కువ.  సెన్సెక్స్ ఈ ఏడాది మార్చినాటి 30,000 పాయింట్ల రికార్డు స్థాయి నుంచి 13 శాతం తగ్గి, ప్రస్తుతం 26,000 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. అలాగే కరెన్సీ విషయంలో కూడా ఇండియా రూపాయి ఇతర వర్థమాన దేశాల కరెన్సీలకంటే పటిష్టంగా వుంది. రష్యా, దక్షిణాఫ్రికా, ఇండోనేషియా, వియత్నాం, దక్షిణ కొరియాల కరెన్సీలు 20-30 శాతం మధ్య పడిపోగా, రూపాయి విలువ రెండు నెలల నుంచి తగ్గింది 5 శాతమే.
 

భారత్ స్టాక్ మార్కెట్, కరెన్సీలు, ఇతర వర్ధమాన దేశాలతో పోలిస్తే బలంగా ఉండటానికి ప్రధాన కారణం ఈ ఆర్థిక వ్యవస్థ రికవరీని విదేశీ ఇన్వెస్టర్లు ఇంకా విశ్వసిస్తుండటమే. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.11 లక్షల కోట్ల నిధుల్ని ఇక్కడి స్టాక్ మార్కెట్లో వారు పెట్టుబడి పెట్టారు. ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లు ఒడుదుడుకులకు లోనవుతున్నా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు 21 వరకూ వారు నికరంగా వెనక్కు తీసుకున్నది 1,400 కోట్లే. వారు తమ మెజారిటీ పెట్టుబడుల పట్ల పెద్దగా ఆందోళనగా లేరన్నది ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్ల విశ్వాసానికి కారణాలున్నాయి. భారత్ అధికంగా దిగుమతి చేసుకునే క్రూడ్ ధర బాగా దిగిరావడంతో ఇక్కడి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడింది. మనం దిగుమతుల మీద ఆధారపడే బంగారం ధర కూడా కనిష్టస్థాయిలోనే వుండటం కలిసివచ్చింది. వృద్ధి ఇంకా జోరందుకోకపోయినా, దిగుమతుల వ్యయం భారీగా తగ్గిపోయింది.  2012-13లో జీడీపీలో 4.7 శాతానికి చేరిపోయిన కరెంటు ఖాతా లోటు (ఖర్చుచేసే విదేశీ మారకం, సంపాదించే మారకంల మధ్య వ్యత్యాసం) దిగుమతుల బిల్లు తగ్గడంతో ఇప్పుడు 1.3 శాతానికి పడిపోయింది.

క్రూడ్ దిగుమతులకు 200 బిలియన్ డాలర్లను వెచ్చించాల్సివచ్చేది. ఆ బిల్లు ఇప్పుడు 88 బిలియన్ డాలర్లకు దిగింది. దీంతో ప్రభుత్వానికి లక్ష కోట్ల రూపాయలకుపైగా  సబ్సిడీల భారం తగ్గిపోయింది. క్రూడ్ ధర తగ్గడంతో ప్రజలకు నొప్పి తెలియకుండా పెట్రోల్, డీజిల్‌పై అదనపు ఎక్సయిజు సుంకాల్ని వడ్డించి ప్రభుత్వం పన్నుల ఆదాయాన్ని పెంచుకోగలుగుతుంది.  రిజర్వుబ్యాంక్ వద్ద విదేశీ మారక నిల్వలు రికార్డుస్థాయిలో 355 బిలియన్ డాలర్లకు పెరిగాయి. రెండేళ్ల క్రితం 10 శాతం వుండే రిటైల్ ధరల ద్రవ్యోల్బణం తాజాగా 6 శాతం లోపునకు దిగివచ్చింది. ఇటువంటి సానుకూలాంశాలతో భారత్ ఆర్థిక వ్యవస్థ రానున్న నెలల్లో వేగంగా కోలుకోవొచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు  వున్నారు. ఈ నేపథ్యంలో సెన్సెక్స్ క్షీణత తక్కువగా వుంది. అంతమాత్రాన మనం భరోసాతో ఉండటానికి వీల్లేదు.
 
 రిస్క్ వుందని తెలిస్తే విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు శరవేగంగా వె నక్కి వెళిపోతాయి. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఎనిమిదేళ్ల తర్వాత వడ్డీ రేట్లను త్వరలో పెంచుతుందన్న అంచనాలు మార్కెట్లో ఉన్నాయి. ఈ కారణంతోనే నాలుగు నెలల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల తాజా పెట్టుబడులు నెమ్మదించాయి. ఫెడ్ రేట్లు పెంచితే అన్ని దేశాలతో పాటే మన దేశం నుంచి కూడా కొంతవరకూ నిధులు తరలివెళిపోతాయి. అప్పుడు సెన్సెక్స్ మరింత పతనమయ్యే ప్రమాదం ఉంటుంది. కానీ భారీ విదేశీ మారక నిల్వలు ఉన్నందున, ఇతర దేశాలకంటే ఆ రిస్క్‌ను మనం సమర్థవంతంగా ఎదుర్కొంటామని రిజర్వుబ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్ అంటున్నారు. వచ్చే నెల 17న ఫెడ్ కమిటీ సమావేశం జరగనున్నది. రేట్ల పెంపుపై స్పష్టమైన సంకేతాలు ఆ రోజు వెలువడవచ్చని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అప్పటివరకూ అన్నిటితోపాటే మన స్టాక్ మార్కెట్ కూడా అనిశ్చితిలోనే ఉండొచ్చు. మొత్తానికి చిన్న మదుపరులు ఆచి తూచి అడుగేయాల్సిన సమయమిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement