ముంబై: స్టాక్ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు భారీ అమ్మకాలకు దారితీశాయి. ఫలితంగా సూచీలు సోమవారం రెండునెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,145 పాయింట్లను కోల్పోయి 50,000 దిగువన 49,744 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు సూచీకి మూడువారాల కనిష్టస్థాయి. నిఫ్టీ 306 పాయింట్లు నష్టపోయి 14,676 వద్ద నిలిచింది. అలాగే ఇరు సూచీలకిది వరుసగా ఐదోరోజు నష్టాల ముగింపు. ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు, దేశవ్యాప్తంగా తిరిగి పెరుగుతున్న కోవిడ్–19 కేసులు, బాండ్ ఈల్డ్స్ అనూహ్య ర్యాలీ తదితర అంశాలు మన మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులను సృష్టించాయి. అలాగే మండుతున్న ముడిచమురు ధరలు, ఇటీవల మార్కెట్ ర్యాలీ నేపథ్యంలో పెరిగిన ఈక్విటీల వ్యాల్యుయేషన్ల ఆందోళనలు కూడా ఇన్వెస్టర్లను కలవరపరిచాయి.
ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒక్క మెటల్ షేర్లు తప్ప అన్ని రంగాల షేర్లలో విస్తృతంగా అమ్మకాలు జరిగాయి. ఎన్‌ఎస్‌ఈలో ప్రభుత్వ బ్యాంకులు, ఫార్మా, ఐటీ, మీడియా రంగాల సూచీలు మూడుశాతం పతనమయ్యాయి. ప్రైవేట్ బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ, ఆర్థిక, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లు రెండుశాతం క్షీణించాయి. రూపాయి 16 పైసల ర్యాలీతో ఐటీ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. మార్కెట్ మొదలైనప్పటి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యతనివ్వడంతో సూచీలు ఏ దశలో కోలుకోలేదు. ఒకదశలో సెన్సెక్స్ 1,273 పాయింట్లు నష్టపోయి 49,617 వద్ద దిగివచ్చింది. నిఫ్టీ 346 పాయింట్లను కోల్పోయి 14,635 స్థాయిని తాకింది. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐలు) ఈ జనవరి 29 తర్వాత తొలిసారి దేశీయ మార్కెట్లో్ల విక్రయాలు జరిపారు. విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) సోమవారం రూ.893 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. అలాగే దేశీ ఇన్వెస్టర్లు రూ.919 కోట్ల విలువైన పెట్టుబడులను వెనక్కి తీసుకున్నట్లు ఎక్సే్చంజ్ గణాంకాలు తెలిపాయి.
‘‘దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో స్థానిక ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను విధిస్తున్నాయి. కఠిన ఆంక్షలతో కూడిన లాక్‌డౌన్ విధింపుతో ఆర్థిక రికవరీపై ప్రభావం పడొచ్చన్న భయాలు మార్కెట్‌ను వెంటాడాయి. అంతర్జాతీయంగా పెరుగుతున్న బాండ్ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ కారణాలతో ఇటీవల మార్కెట్ ర్యాలీకి దన్నుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఇప్పుడు నెమ్మదించాయి.’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
పడినప్పుడల్లా... కొనండి..!
ఐదు రోజుల వరుస పతనంతో సెన్సెక్స్ 2410 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 639 పాయింట్లను నష్టపోయింది. మార్కెట్ భారీగా క్షీణిస్తున్న ఈ సమయంలో కొనుగోలు చేయవచ్చని స్టాక్ నిపుణులు సలహానిస్తున్నారు. ప్రస్తుత పతనం స్వల్పకాలికమేనని, పడిపోయిన ప్రతిసారి కొనుగోలు చేయమని చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు మెరుగుపడ్డాయని.. ఇండస్ట్రీయల్, సైక్లికల్స్ రంగాల షేర్లపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
నిమిషానికి రూ.1000 కోట్ల నష్టం..!
మార్కెట్ భారీ పతనంతో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ సమయంలో ప్రతి నిమిషానికి రూ. 1000 కోట్ల నష్టాన్ని చవిచూశారు. ఇన్వెస్టర్లు సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.3.08 లక్షల కోట్లు ఆవిరయ్యింది. వెరసి బీఎస్‌ఈ నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ రూ.200.18 లక్షల కోట్లకు దిగివచ్చింది.
ట్రేడింగ్‌లో మరిన్ని విశేషాలు...
► సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో ఓఎన్‌జీసీ, కోటక్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు మాత్రమే లాభపడ్డాయి
► నష్టాల మార్కెట్లోనూ మెటల్ షేర్లు మెరిశాయి. ఆర్థిక వ్యవస్థపై ఆశావహ అంచనాలతో మెటల్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా మెటల్ ఇండెక్స్ ఒకటిన్నర శాతం ర్యాలీ చేసింది.
► మార్కెట్లో అస్థిరతను సూచించే ఎన్‌ఎస్‌ఈ వీఐఎక్స్ ఇండెక్స్ 14 శాతం పెరిగి 25.47 వద్ద ముగిసింది.
► ఎన్‌సీఎల్‌టీ నుంచి తుది అనుమతులు వచ్చిన ఆరునెలల్లో జెట్ ఎయిర్‌వేస్ కార్యకలాపాలను ప్రారంభిస్తామని కంపెనీ బిడ్డింగ్‌లో దక్కించుకున్న జలాన్ కల్‌రాక్ కన్సార్షియం సభ్యుడు మురారి లాలా జలాన్ తెలిపారు. ఫలితంగా ఈ కంపెనీ షేరు ఐదు శాతం లాభపడి రూ. 114.90 వద్ద అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
► ఫైడీస్ ఫుడ్ సిస్టమ్స్ విలీన ప్రక్రియను పూర్తి చేయడంతో జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేరు ఏడాది గరిష్టాన్ని తాకింది. ఆరు శాతం లాభంతో రూ.3128 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment