మార్కెట్లో మరో బ్లాక్‌ మండే | Block Monday: The Sensex crashed by 1,345 points | Sakshi
Sakshi News home page

మార్కెట్లో మరో బ్లాక్‌ మండే

Published Tue, Feb 8 2022 4:23 AM | Last Updated on Tue, Feb 8 2022 5:48 AM

Block Monday: The Sensex crashed by 1,345 points - Sakshi

ముంబై: ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు కఠినతర పాలసీకి మొగ్గుచూపుతుండటంతో ఈక్విటీ మార్కెట్‌ మరో బ్లాక్‌ మండేను ఎదుర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోతున్నాయి. ద్రవ్యోల్బణం రోజురోజూ పైపైకి ఎగబాకుతోంది. వీటిని అదుపులో పెట్టేందుకు రిజర్వు బ్యాంకు ద్రవ్య విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది. కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో పెట్టుబడులు బాండ్ల వైపు మళ్లుతున్నాయి.

ఈనెల పదో తేదీ నుంచి అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు  ప్రారంభమవుతున్న తరుణంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. అమెరికా ద్రవ్యోల్బణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో.. యూఎస్‌ ఫెడరల్‌ రిజర్వు అనుకున్న దానికంటే వేగంగా వడ్డీరేట్లను పెంచవవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఈ పరిణామాలన్నీ ఈక్విటీ మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయని స్టాక్‌ నిపుణులు తెలిపారు.

ఫలితంగా సోమవారం సెన్సెక్స్‌ 1,024 పాయింట్లు నష్టపోయి 58 వేల దిగువన 57,621 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 303 పాయింట్లు నష్టపోయి 17,214 వద్ద నిలిచింది. సూచీలకిది వరుసగా మూడోరోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఇండెక్సుల్లో అధిక వెయిటేజీ షేర్లు హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌ బ్యాంక్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ల భారీ అమ్మకాలు ఒత్తిడికిలోనయ్యాయి. ఎస్‌బీఐ రికార్డు ర్యాలీ అండతో ఒక్క ప్రభుత్వరంగ బ్యాంకు షేర్లు మినహా అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి.

సెన్సెక్స్‌ సూచీలో ఐదుశాతం షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌క్యాప్‌ ఇండెక్సులు రెండు శాతం వరుకు క్షీణించాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1157 కోట్ల షేర్లను, డీఐఐలు రూ. 1376 కోట్ల షేర్లను అమ్మేశారు. ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి 17 పైసలు క్షీణించి 74.60 వద్ద స్థిరపడింది.  లతా మంగేష్కర్‌ మృతికి నివాళిగా మహారాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో సోమవారం ఫారెక్స్, మనీ మార్కెట్లు పనిచేయలేదు.  ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్‌ అవుతున్నాయి.

‘గతవారంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ వడ్డీరేట్లను 25 బేసిస్‌ పాయింట్ల నుంచి 5% శాతానికి పెంచింది.పాలసీ ప్రకటన సందర్భంగా పావెల్‌ వ్యాఖ్యలతో యూఎస్‌ ఫెడ్‌ రిజర్వ్‌ మార్చిలో 50 బేసిస్‌ పాయింట్లు పెంచవచ్చనే స్పష్టత వచ్చింది. దేశంలో డిసెంబర్‌ రిటైల్‌ ద్రవ్యోల్బణం ఐదునెలల గరిష్టానికి చేరుకోవడంతో పాటు అంతర్జాతీయంగా బ్రెంట్‌ బ్యారెల్‌ చమురు ధర 95 డాలర్లకు ఎగసిన నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచే అవకాశాలు లేకపోలేదని భయాలు మార్కెట్‌ వర్గాలను వెంటాడాయి. ఆర్‌బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు వెల్లడి (గురువారం) అయ్యేంత వరకు మార్కెట్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది’ జియోజిత్‌ ఫైనాన్షియన్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయర్‌ తెలిపారు.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 1,345 పాయింట్లు క్రాష్‌  
ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలతో ఉదయం సెన్సెక్స్‌ 75 పాయింట్ల నష్టంతో 58,550 వద్ద, నిఫ్టీ 60 పాయింట్ల పతనంతో 17,516 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. గంట గంటకూ అమ్మకాల ఉధృతి పెరుగుతుండటంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 1,345 పాయింట్లు క్షీణించి 57,299 వద్ద, నిఫ్టీ 397 పాయింట్లు పతనమై 17,119 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి.

మార్కెట్లో మరిన్ని సంగతులు
► అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నష్టాలు పెరిగినట్లు ప్రకటించడంతో పేటీఎం షేరు ఇంట్రాడేలో ఆరుశాతం క్షీణించి రూ.899 వద్దకు దిగివచ్చింది. అయితే మిడ్‌సెషన్‌ నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో నష్టాలను పూడ్చుకొని అరశాతం స్వల్పలాభంతో రూ.957 వద్ద స్థిరపడింది.  
► ఇదే క్యూ3లో ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన ప్రభుత్వరంగ ఎస్‌బీఐ బ్యాంక్‌ షేరు ఇంట్రాడేలో మూడున్నరశాతం ఎగసి రూ.549 వద్ద ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. లాభాల స్వీకరణతో చివరికి అరశాతం లాభంతో 533 వద్ద స్థిరపడింది.  
► మూడో త్రైమాసికంలో ఫలితాలు నిరాశపరచడంతో ఇండిగో, లుపిన్‌ షేర్లు వరుసగా ఎనిమిది, పదిశాతం చొప్పున క్షీణించాయి.
► వీఐఎక్స్‌ ఇండెక్స్‌ ఎనిమిది శాతం పెరిగి 20.44 స్థాయికి చేరింది. ఇది మార్కెట్లో మరో ముప్పై రోజుల తీవ్ర ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సూచిస్తోంది.


3 రోజుల్లో రూ. 6 లక్షల కోట్లు హుష్‌
గత 3 రోజుల్లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1,937 పాయింట్లు, నిఫ్టీ 566 పాయింట్లు చొప్పున క్షీణించాయి. సూచీలు మూడుశాతానికి పైగా కుదేలవడంతో రూ.ఆరు లక్షల కోట్లు ఆవిరైంది. సోమవారం ఒక్కరోజే రూ.270 కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ(మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) రూ.264 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement