ట్రేడింగ్‌లో సరికొత్త రికార్డుల నమోదు
నష్టాలతో ముగిసిన స్టాక్ సూచీలు
ముంబై: సరికొత్త రికార్డుల వద్ద ఐటీ, ఫైనాన్స్ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో స్టాక్ సూచీలు సోమవారం నష్టాలతో ముగిశాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణస్వీకారంతో ఉదయం ప్రారంభంలోనే సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 386 పాయింట్లు పెరిగి 77,000 స్థాయిపై 77,079 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 23,412 వద్ద జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి.
తదుపరి ఐటీ, ఫైనాన్స్ మెటల్, ఇంధన షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో స్టాక్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పతనమై 76,490 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లు నష్టపోయి 23,259 వద్ద నిలిచాయి. సరీ్వసెస్, రియల్టీ, కమోడిటీస్, యుటిలిటీస్, హెల్త్‌కేర్, పారిశ్రామికోత్పత్తి రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఫలితంగా బీఎస్‌ఈ స్మాల్, మిడ్ సూచీలు వరుసగా 1.04%, 0.56% చొప్పున రాణించాయి.
క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేరు బీఎస్‌ఈలో ఇష్యూ ధర(రూ.136)తో పోలిస్తే 21% ప్రీమియంతో రూ.165 వద్ద లిస్టయ్యింది. ఆఖరికి 17% లాభంతో రూ.159 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.591.25 కోట్లుగా నమోదైంది.
డీప్‌ఫేక్ వీడియోలను నమ్మొద్దు: ఎన్‌ఎస్‌ఈ
కాగా, డీప్‌ఫేక్ వీడియోల పట్ల జాగ్రత్త వహించాలంటూ నేషనల్ స్టాక్ ఎక్సే్చంజీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎన్‌ఎస్‌ఈ ఎండీ, సీఈవో అశిష్‌కుమార్ చౌహాన్ పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తున్నట్లు వైరల్ అవుతున్న నకిలీ వీడియోల నేపథ్యంలో ఎక్సే్చంజీ ఈ హెచ్చరిక జారీ చేసింది.
మేలో ఈక్విటీ ఎంఎఫ్‌ల రికార్డ్
మే నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు)కు ఇన్వెస్టర్లు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ మే నెలలో రూ. 34,697 కోట్ల పెట్టుబడులు ప్రవహించాయి. ఏప్రిల్‌తో పోలిస్తే ఇది 83 శాతం అధికం. సిప్‌కు సైతం రూ. 20,904 కోట్ల పెట్టుబడులు లభించినట్లు యంఫీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment