ముంబై: ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల సంకేతాల అందడంతో రికార్డు గరిష్టాల వద్ద లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా స్టాక్ సూచీల అయిదు రోజుల వరుస ర్యాలీకి మంగళవారం ముగింపు పడింది. ఉదయం బలహీనంగా మొదలైన సూచీలు ఆరంభ నష్టాలు భర్తీ చేసుకొని ప్రథమార్ధంలోనే జీవితకాల గరిష్టాలు నమోదు చేశాయి. సెన్సెక్స్ 100 పాయింట్లు పెరిగి 73,428 వద్ద, నిఫ్టీ 27 పాయింట్లు బలపడి 22,124 వద్ద ఆల్‌టైం హై స్థాయిలు తాకాయి.
సరికొత్త రికార్డుల స్థాయిల వద్ద ఐటీ, రియలీ్ట, ఇంధన షేర్లలో లాభాల స్వీకరణ చేసుకోవడంతో సెన్సెక్స్ 199 పాయింట్ల నష్టపోయి 73,427 వద్ద, నిఫ్టీ 65 పాయింట్లు పతనమై 22,032 వద్ద ముగిశాయి. చిన్న, మధ్య తరహా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.31%, 0.43% చొప్పున పతనమయ్యాయి. మరోవైపు మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు.
‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలతో ఇటీవల భారీగా ర్యాలీ చేసిన ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ చోటుకుంది. చిన్న, మధ్య తరహా షేర్ల విలువలు భారీ పెరిగిపోవడంతో మార్కెట్ ర్యాలీ కొనసాగకపోవచ్చు. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే తాజా అంశాలేవీ లేకపోవడంతో ఎఫ్‌ఐఐలు నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. భౌగోళిక ఉద్రిక్తతలతో క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.
► జ్యోతి సీఎన్‌సీ ఆటోమేషన్ లిస్టింగ్ మెప్పించింది. ఇష్యూ ధర(రూ.331)తో పోలిస్తే షేరు బీఎస్‌ఈలో 12% ప్రీమియంతో రూ.372 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 34% ఎగసి రూ.445 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. చివరికి 31% లాభపడి రూ.433 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,851 కోట్లుగా నమోదైంది.
► క్యూ3 లో నికర లాభం 56% క్షీణించడంతో జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ షేరు 7% నష్టపోయి రూ.249 వద్ద నిలిచింది. ట్రేడింగ్‌లో 8% పతనమై రూ.247 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ ఒక్క రోజులోనే రూ.11,372 కోట్ల మార్కెట్ క్యాప్‌ను కోల్పోయింది.
► డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో గత రెండు రోజుల్లో భారీగా పెరిగిన దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్ 2%, విప్రో 2%, టెక్ మహీంద్ర 1.40%, ఇన్ఫోసిస్ 1.27%, టీసీఎస్ 1% చొప్పున నష్టపోయాయి.
► గతవారంలో 8% ర్యాలీ చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ3 ఆర్థిక ఫలితాల వెల్లడి(శుక్రవారం)కి ముందు అమ్మకాల ఒత్తిడికి లోనైంది. బీఎస్‌ఈలో ఒకటిన్నర శాతం నష్టపోయి రూ.2747 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment