
హర్షద్ మెహతా స్కామ్ నుంచి కోవిడ్–19 వరకు..
భారీ పతనాలను చవిచూసిన మార్కెట్
ఆ తర్వాత ఏడాది నుంచి నాలుగేళ్లలోనే రికవరీ...
పడిన ప్రతిసారీ కొత్త ఆల్‌టైమ్ గరిష్టాలకు సూచీలు
ఈసారి ట్రంప్ టారిఫ్ బాంబ్‌తో కల్లోలం
పరిస్థితులు సద్దుమణిగితే మళ్లీ ర్యాలీ ఖాయం అంటున్న నిపుణులు
ట్రంప్ టారిఫ్‌ల సునామీ ప్రపంచ మార్కెట్లను అల్లకల్లోలం చేసింది. అనేక దేశాలపై అమెరికా భారీగా ప్రతీకార సుంకాలు వడ్డించడం, చైనా దీటుగా టారిఫ్‌లతో తిప్పికొట్టడంతో వాణిజ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తోంది. దీంతో అమెరికా టు ఆసియా స్టాక్ మార్కెట్లు ’బేర్’మన్నాయి. అక్టోబర్ నుంచి రివర్స్‌గేర్‌లో కొనసాగుతున్న మన సూచీలు.. ట్రంప్ టారిఫ్ దెబ్బకు తాజా 17 శాతం దిగజారాయి.
సెన్సెక్స్ సెప్టెంబర్లో 85,978 పాయింట్ల ఆల్‌టైమ్ గరిష్టం నుంచి తాజాగా 71,425 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. అయితే, ట్రంప్ ప్రతీకార సుంకాలకు 90 రోజులు విరామం ప్రకటించడం, పలు రంగాలకు మినహాయింపులు ఇవ్వడంతో మళ్లీ బుల్స్ ఫేస్ టరి్నంగ్ ఇచ్చుకున్నాయి. తాజా కనిష్టం నుంచి 10 శాతం మేర ‘రిలీఫ్’ ర్యాలీ చేశాయి. ఈ వారంలోనే 4 శాతం జంప్ చేశాయి.
కాగా, దేశీ మార్కెట్లు గతంలో కూడా సంక్షోభాలు, స్కామ్‌ల దెబ్బకు భారీగా పడి, బేర్ గుప్పిట్లో చిక్కుకున్నప్పటికీ... మళ్లీ అంతే వేగంగా రికవరీ అయ్యాయి. అమెరికా–చైనాల మధ్య టారిఫ్ వార్ ముదురుతుండటం, ట్రంప్ మళ్లీ ఎప్పుడు ఎలాంటి పిడుగు వేస్తారోనన్న అనిశి్చతితో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే, టారిఫ్‌ల దుమారం పూర్తిగా సద్దుమణిగితే బుల్స్ రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లే అవకాశం ఉంది. మన మార్కెట్లో అతిపెద్ద పతనాలు, కోలుకున్న తీరు చూస్తే...
కోవిడ్ క్రాష్..
2020లో కోవిడ్–19 మహమ్మారి దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పిట్టల్లా రాలిపోతే.. స్టాక్ మార్కెట్లో బేర్ విలయతాండవం చేసింది. ఇటీవలి చరిత్రలో మార్కెట్లు ఇలా కుప్పకూలడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌లతో ఆర్థిక వ్యవస్థలు ఎక్కడిక్కడ నిలిచిపోవడంతో మార్చి 2020లో సెన్సెక్స్ 41,000 స్థాయి నుంచి 25,981 పాయింట్ల కనిష్టానికి క్రాష్ అయ్యింది.
అయితే, సెంట్రల్ బ్యాంకుల సహాయ ప్యాకేజీలు, వడ్డీ రేట్ల భారీ కోతలతో మార్కెట్లు నేలక్కొట్టిన బంతిలా దూసుకుపోయాయి. నవంబర్ 2020 నాటికి కనిష్టం నుంచి 58 శాతం ఎగబాకి మళ్లీ క్రాష్ ముందస్తు స్థాయిని దాటేశాయి. వ్యాక్సిన్‌ల అందుబాటు, విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కుమ్మరింపుతో నాన్ స్టాప్ ర్యాలీ చేశాయి. 2021 సెప్టెంబర్ నాటికి 60,,000 స్థాయి పైకి చేరగా.. 2024 సెప్టెంబర్‌లో 85,978 పాయింట్లతో సరికొత్త చరిత్రాత్మక గరిష్టాన్ని తాకడం విశేషం!
ప్రపంచ ఆర్థిక సంక్షోభం...
2008లో అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం దెబ్బకు అనేక పేరొందిన ఆర్థిక సంస్థలతో పాటు పలు కంపెనీలు కూడా దివాలా తీశాయి. అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. సెన్సెక్స్ మెగా పతనంతో 21,000 స్థాయి నుంచి 2009 మార్చి నాటికి 8,000 పాయింట్లకు కుప్పకూలింది. అంటే ఏకంగా 62 శాతం కరిగిపోయింది. అయితే, ప్రపంచ దేశాలన్నీ మూకుమ్మడిగా ఉద్దీపన ప్యాకేజీల అమలు, వడ్డీరేట్ల కోతలతో మార్కెట్ల రికవరీ మొదలైంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు గాడిలో పడటం, విదేశీ ఇన్వెస్టర్లు క్యూ కట్టడంతో 2010 నవంబర్ నాటికి సెన్సెక్స్ మళ్లీ 21,000 మార్కును తాకింది. రెండేళ్ల రికవరీలో 162% ర్యాలీ చేసింది.
కేతన్ పరేఖ్ స్కామ్/డాట్ కామ్ బబుల్
భారత్ స్టాక్ మార్కెట్లను కుదిపేసిన కేతన్ పరేఖ్ షేర్ల కుంభకోణానికి తోడు ప్రపంచవ్యాప్తంగా డాట్–కామ్ బబుల్ బద్దలవ్వడంతో దేశీ సూచీలు కకావికలం అయ్యాయి. 2001 ఆరంభంలో 4,200 పాయింట్ల స్థాయిలో ఉన్న సెన్సెక్స్ సెప్టెంబర్ నాటికి 2,594 పాయింట్లకు కుప్పకూలింది. అయితే, మళ్లీ 2003 నుంచి నెమ్మదిగా మార్కెట్లో జోరు మొదలైంది. 2004 మధ్య నాటికి, అంటే మూడేళ్లలో 62 శాతం ర్యాలీతో 4,200 పాయింట్ల స్థాయికి చేరుకుంది. ఇందుకు ప్రధానంగా దేశ జీడీపీ వృద్ధి పుంజుకోవడం, ఐటీ రంగం పరుగులతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భారత్‌లో పెట్టుబడులకు వరుస కట్టడం వంటి అంశాలు దోహదం చేశాయి.
హర్షద్ మెహతా కుంభకోణం
దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిపోయిన హర్షద్ మెహతా స్కామ్.. ఇన్వెస్టర్లను నిలువునా ముంచేసింది. 1992లో స్కామ్ బట్టబయలు కాగా, సెన్సెక్స్ 4,467 పాయింట్ల నుంచి 1993 మే నెలకల్లా 2,529 పాయింట్లకు (43 శాతం) పడిపోయింది. అయితే, దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు, సరళీకరణ దన్నుతో విదేశీ పెట్టుబడులు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం కొత్తపుంతలు తొక్కి, మార్కెట్లు చెంగుచెంగున దూసుకెళ్లాయి. 1996 నాటికి సెన్సెక్స్ మళ్లీ 4,600 పాయింట్ల స్థాయికి (82 శాతం) అధిగమించి దుమ్మురేపింది.
– సాక్షి, బిజినెస్ డెస్క్