జియో, ఎయిర్ టెల్ మధ్య మరో 'టారిఫ్ వార్'
జియో, ఎయిర్ టెల్ మధ్య మరో 'టారిఫ్ వార్'
Published Wed, May 31 2017 5:05 PM | Last Updated on Tue, Sep 5 2017 12:28 PM
టెలికాం మార్కెట్లోకి కొత్త ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో మధ్య, టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మధ్య మరోసారి 'టారిఫ్ వార్' మొదలైంది. జియోకు తరలిపోకుండా కస్టమర్లను కాపాడుకోవడానికి తీసుకొస్తున్న ఆఫర్లను రహస్యంగా ఉంచనున్నట్టు ఎయిర్ టెల్, ఐడియా సెల్యులార్ చెబుతుండగా.. ప్లాన్స్ ను ఓ కామన్ ప్లాట్ ఫామ్ పైకి తీసుకురావాలని జియో డిమాండ్ చేస్తోంది. అయితే పోటీతత్వ ప్రయోజనాలు కాపాడేందుకు వీటిని బహిర్గతం చేయమని ఈ దిగ్గజాలు వాదిస్తున్నాయి. ప్లాన్స్ ను బహిర్గతం చేసే విషయంలో టెలికాం దిగ్గజాలు, జియోల పోరు ఉధృతమవుతోంది. టారిఫ్ అసెస్ మెంట్ పై టెలికాం రెగ్యులేటరీ మంగళవారం కంపెనీలకు ఓపెన్ హౌజ్ చర్చ నిర్వహించింది. కస్టమర్లను కాపాడుకోవడానికి ఆఫర్ చేసే డిస్కౌంట్లు, ప్లాన్స్ అనియతగా కాకుండా.. ఒక్కో యూజర్ సగటు ఆదాయం, కస్టమర్ విధేయత వంటివాటికి అనుగుణంగా ఉండాలని ట్రాయ్ చెబుతోంది. మరో 30రోజుల్లో వీటికి సంబంధించి ఓ గైడ్ లైన్సును ట్రాయ్ జారీచేయనుంది.
ఎప్పుడైతే కస్టమర్ తమ నెట్ వర్క్ ను వదలివెళ్లాలనుకున్నప్పుడు, వారిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఆపరేటర్ పై ఉంటుందని భారతీ ఎయిర్ టెల్ రెగ్యులేటరీ అధినేత అన్షుమన్ థాకూర్ చెప్పారు. ఇది కేవలం టెలికాం ఇండస్ట్రీకి సంబంధించి మాత్రమే కాదని, అన్ని ఇండస్ట్రీల్లో ఇదే ఉంటుందని పేర్కొన్నారు. అయితే దీన్ని మాత్రం రిలయన్స్ జియో పూర్తిగా విభేదిస్తోంది. పారదర్శకత కోసం ప్రస్తుతమున్న చర్యలు సరిపోవని, పారదర్శకత స్పెషిఫికేషన్స్ స్థిరంగా లేవని జియో పేర్కొంటోంది. టెల్కోలు ఆఫర్ చేసే అన్ని ప్లాన్స్ ను కామన్ ప్లాట్ ఫామ్ లో ప్రచురించాలని తాము కోరుతున్నామని, వాటిని చూసి తమకు బెస్ట్ అనిపించిన వాటిని కస్టమర్లకు ఎంపికచేసుకునే అవకాశం కల్పించాలని అంటోంది. ఎవరికీ కూడా ఆ ప్లాన్స్ కు మించి ఆఫర్ చేయకూడదని కూడా వాదిస్తోంది. ఒకే కేటగిరీలోని సబ్ స్క్రైబర్లకు వివిధ రకాల ప్లాన్స్ ను ఆఫర్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ట్రాయ్ ఈ చర్చా కార్యక్రమం నిర్వహించింది.
Advertisement