
అమెరికాపై 34 శాతం సుంకాలు
దెబ్బకు దెబ్బ తీసిన చైనా
అదనంగా మరిన్ని ప్రతీకార చర్యలు
పలు అమెరికా సంస్థలపై ఆంక్షలు
అమెరికాకు ఖనిజ ఎగుమతులు బంద్
రక్షణ, కంప్యూటర్, సాఫ్ట్‌వేర్ పరిశ్రమలకు దెబ్బ
తక్షణం అమల్లోకి వస్తాయన్న డ్రాగన్ దేశం
ఇది తొండాట: ట్రంప్ తప్పుడు నిర్ణయాలంటూ ధ్వజం
బీజింగ్: తెంపరి ట్రంప్ తెర తీసిన టారిఫ్‌ల యుద్ధం అప్పుడే ముదురు పాకాన పడుతోంది. అమెరికా అధ్యక్షుని సుంకాల బాదుడుపై ప్రపంచ దేశాలు దీటుగా స్పందిస్తున్నాయి. అమెరికా ఆటో ఉత్పత్తులపై 25 శాతం టారిఫ్‌లు విధిస్తున్నట్టు కెనడా గురువారమే ప్రకటించడం తెలిసిందే. శుక్రవారం చైనా కూడా అదే బాట పట్టింది. అమెరికాపై 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు చైనా ఆర్థిక శాఖ ప్రకటించింది.
అగ్ర రాజ్యపు ఉత్పత్తులపై ఇప్పటికే అమల్లో ఉన్న సుంకాలకు ఇవి అదనం. తమ నుంచి చైనా ఏకంగా 54 శాతం సుంకాలు వసూలు చేస్తోందని ట్రంప్ బుధవారం ఆక్షేపించడం తెలిసిందే. అందుకే ఆ దేశంపై 34 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అవి ఏప్రిల్ 10 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆలోపే అమెరికాపై తానూ అంతే మొత్తం సుంకాలు విధించడం ద్వారా డ్రాగన్ దేశం దెబ్బకు దెబ్బ తీసింది. టారిఫ్ పోరులో తగ్గేదే లేదని స్పష్టం చేసింది. అంతటితో ఆగలేదు! అమెరికాకు అత్యవసరమైన పలు అరుదైన ఖనిజాల ఎగుమతులపైనా నియంత్రణలు ప్రకటించింది.
సమారియం, గాడోలినియం, టెర్బియం, డైస్పోరియం, లుటేటియం, స్కాండియం, ఇత్రియం వంటి పలు ఖనిజాలు ఈ జాబితాలో ఉన్నాయి. చైనా నిర్ణయంతో అమెరికా రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ పరిశ్రమలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయి. ఆయా ఖనిజాల కోసం చైనా దిగుమతులపైనే భారీగా ఆధారపడుతుండటమే ఇందుకు కారణం. వీటికి తోడు 16 అమెరికా కంపెనీలకు పలు ‘డ్యుయల్ యూజ్’ వస్తువుల ఎగుమతులను పూర్తిగా నిలిపేయాలని కూడా చైనా నిర్ణయించింది.
చైనాకు ఎలాంటి ఎగుమతులూ చేయకుండా మరో ఆరు అమెరికా కంపెనీలపై నిషేధం విధించింది. అమెరికా, భారత్ నుంచి దిగుమతైన మెడికల్ సీటీ ట్యూబులపై యాంటీ డంపింగ్ దర్యాప్తు ప్రారంభిస్తున్నట్టు పేర్కొంది. తాజా సుంకాలు, ఖనిజ ఎగుమతులపై ఆంక్షలు ఏప్రిల్ 4 నుంచే అమల్లోకి రానున్నట్టు చైనా ప్రకటించింది. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. ‘‘చైనాది తొండాట. మా దెబ్బతో వారు గాభరా పడిపోయారు. దాంతో చేయకూడని పనులు చేస్తున్నారు’’ అంటూ ఆక్షేపించారు. అయితే తన నిర్ణయాలు, విధానాలు మారబోవని కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు తన సోషల్‌మీడియా హ్యాండిల్ ట్రూత్‌లో పోస్టులు పెట్టారు.
డబ్ల్యూటీఓలో చైనా దావా
చైనాపై ట్రంప్ ఇప్పటికే 20 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. బుధవారం నాటి వడ్డింపులతో అవి ఏకంగా 54 శాతానికి 64 శాతానికి చేరాయి. దీనిపై చైనా తాజాగా ప్రపంచ వాణిజ్య సంస్థలో దావా వేసింది.