సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థికసర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్ సంక్షోభానికి కారణమైందని పేర్కొంది. ఇతర కారణాలతోపాటు టారిఫ్ వార్ టెలికాం సేవల సంస్థలను దెబ్బతీసిందని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త టెలికాం పాలసీ తీసుకొస్తోందని చెప్పింది. దీని రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. 2018 లో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని విడుదల చేయనుందని సర్వే వెల్లడించింది. అలాగే రెగ్యులేటరీ, లైసెన్సింగ్ విధానాలు, కనెక్టివిటీ, సేవల నాణ్యత, వ్యాపార సరళీకరణ, 5జీ సేవలు, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ లాంటి కొత్త టెక్నాలజీపై ఈ కొత్త విధానం దృష్టిపెట్టాలని సర్వే సూచించింది.
భారీ అప్పులు, తారిఫ్ వార్, అసంబద‍్ధమైన స్పెక్ట్రం చార్జీలు టెల్కోలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. టెలికాం మార్కెట్‌లో తక్కువ ధరలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో మార్కెట్‌లో సంక్షోభం ఏర్పడిందనీ, దీని కారణంగా ఇతర కంపెనీల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఈ సంక్షోభం పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములతోపాటు ఈ టెలికాం కంపెనీల వెండార్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. అయితే హేతుబద్ధమైన స్పెక్ట్రం వేలం, ఇతన ఖర్చుల హేతుబద్ధీకరణ ద్వారా దీన్ని నియంత్రించాలని సర్వే సిఫార్సు చేసింది.
కాగా సెప్టెంబరు 2017 ముగిసే నాటికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 1,207.04 మిలియన్లుగా ఉంది. అందులో 501.99 మిలియన్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాలు నమోదు కాగా 705.05 మిలియన్ల కనెక్షన్లు పట్టణ ప్రాంతాలవి.
Comments
Please login to add a commentAdd a comment