Economic Survey 2017-18
-
ఈ చిరునవ్వులు అన్ వాంటెడా?!
ఏటా బడ్జెట్‌కు ముందు ‘ఎకనమిక్ సర్వే’ విడుదలౌతుంది. మర్నాడో, ఆ తర్వాతి రోజో ‘బడ్జెట్’ బయటికి వస్తుంది. గడిచిన ఏడాది ఎలా ఉందన్నది ‘ఎకనమిక్ సర్వే’. ఈ ఏడాది ఎలా ఉండబోతున్నదన్నది ‘బడ్జెట్’. ఈ రెంటినీ కేంద్ర ఆర్థిక శాఖే సమర్పిస్తుంది. విషయం ఇది కాదు. ఎకనమిక్ సర్వే ఫైల్ కవరు ఈసారి లేత గులాబీ రంగులో ఉంది. దాన్ని మహిళా వాదులు ఎలా తీసుకున్నా.. (స్త్రీ, పురుషులు సమానం అయినప్పుడు ‘పింక్’ కలర్‌తో మహిళల్ని ఇండికేట్ చేయడం ఏంటని కొంతకాలంగా వాదన ఒకటి వినిపిస్తోంది)... ప్రభుత్వం మాత్రం స్త్రీల సంక్షేమానికి, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు పింక్ లుక్‌తో ఒక సంకేతం పంపింది. ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ, మొన్నటి ‘ఎకనమిక్ సర్వే’లో ఆర్థిక శాఖ స్త్రీ, శిశు అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే మన్ కీ బాత్‌లో మోదీ మంచి ఆకాంక్షలు వ్యక్తపరిస్తే, అందుకు భిన్నంగా ఆ ఆకాంక్షల్ని తుంచేస్తున్న చేదు నిజం ఒకటి ఎకనమిక్ సర్వేలో వెల్లడయింది. మగపిల్లవాడు పుట్టడం కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రుల కారణంగా, వారికి ఇష్టం లేకుండా పుట్టిన ఆడపిల్లల సంఖ్య దేశంలో రెండు కోట్లకు పైగా ఉందట! వీళ్లను ‘అన్ వాంటెడ్’ చిల్డ్రన్ అని సర్వేలో పేర్కొన్నారు. సమాజంలో ఈ ‘అసమాన దృష్టి’ పోవాలని ఎకనమిక్ సర్వే ఆశించింది. ఆ ఆశ నెరవేరే విధంగా రేపటి బడ్జెట్లో బాలికల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాలు ఏమైనా ఉంటే బాగుంటుంది. -
విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రానికి 5వ స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017–18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు. విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది. అంతర్రాష్ట్ర వాటాలు ఇలా.. అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది. మంత్రి కేటీఆర్ హర్షం విదేశీ ఎగుమతుల్లో 5వ స్థానంలో తెలంగాణ నిలవడం హర్షణీయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్లో సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా ఉత్పత్తి రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరసన నిలవటం గర్వంగా ఉందన్నారు. -
తయారీలో అగ్రగామిగా మారతాం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తయారీ రంగంలో అగ్రగామిగా మారతామన్న విశ్వాసం తమకుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు చెప్పారు. 2017–18 ఎకనమిక్ సర్వే ప్రకారం తయారీలో టాప్–5 రాష్ట్రాల్లో తెలంగాణకు చోటు దక్కటం తెలిసిందే. దేశం నుంచి తయారీ ఎగుమతుల్లో 70 శాతం ఈ అయిదు రాష్ట్రాలే కైవసం చేసుకోవడం మామూలు విషయం కాదన్నారు. టీఎస్–ఐపాస్ మూలంగానే రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, తయారీ పెరగడం వల్లే తొలి అయిదు స్థానాల్లో తెలంగాణ చేరిందని గుర్తు చేశారు. మున్ముందు ఇదే ఒరవడి కొనసాగిస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో విద్యుత్ మిగులు స్థాయికి రావడం, పారదర్శక పారిశ్రామిక విధానాలు, అవినీతికి తావులేకుండా అనుమతులివ్వడం వంటి చర్యలతో ఈ స్థాయిలో పురోగతి సాధించామన్నారు. పరిష్కారాల వేదిక టి–హబ్.. టి–హబ్‌తో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ) చేతులు కలిపింది. ఇందులో భాగంగా పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తారు. సోమవారమిక్కడ కేటీఆర్ సమక్షంలో ఆర్ఈసీ సీఎండీ పి.వి.రమేష్, టి–హబ్ సీఈవో జయ్ కృష్ణ ఒప్పందం చేసుకున్నారు. కార్పొరేట్ కంపెనీల సమస్యలకు పరిష్కారాలను అందించే వేదికగా టి–హబ్ నిలుస్తుందని కేటీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ‘దావోస్ సదస్సులో బీర్ల తయారీ కంపెనీ కారŠల్స్‌బర్గ్ సీఈవో నన్ను కలిశారు. ఒక లీటరు బీరు తయారీకి 3.8 లీటర్ల మంచి నీరు వాడుతున్నామని, నీటిని మరింత ఆదా చేయగలికే టెక్నాలజీ అందించేందుకు సాయపడాలని కోరారు. త్వరలోనే ఆ కంపెనీ టి–హబ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోనుంది’ అని మంత్రి వివరించారు. -
కోటి 50లక్షల ఉద్యోగాలు: ఆర్థిక సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: మినీ బడ్జెట్‌గా భావించే 2017 ఆర్థిక సర్వేలో ఉద్యోగాల కల్పనపై కీలక సూచనలు అందించింది ప్రభుత్వం. దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుంకుంటోందన్న ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఉద్యోగఅవకాశాలపై మరో ఆసక్తికరమైన అంచనాలను అందించారు. 2019 సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7-7.5 శాతంగా ఉంటుందని అంచనా వేయడంతోపాటు రాబోయే అయిదేళ్లలో భారీ ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. రియల్టీ, నిర్మాణ రంగంలో రాబోయే అయిదేళ్లలో 1.5కోట్ల ఉద్యోగ అవకాశాలు రానున్నాయని ఆర్థిక సర్వే నివేదించింది. గత కొన్ని క్వార్టర్లుగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికీ ఈ రెండు రంగాలు దేశంలోనే రెండవ అతిపెద్ద ఉద్యోగాలిచ్చే సెక్టార్లుగా నిలవనున్నాయని తెలిపింది. రియల్టీ, నిర్మాణ రంగంలో 2013లో 40మిలియన్ల మందికి, 2017లో 52 మిలియన్ల మందికి ఉపాధి అవకాశం లభించగా, 2022 నాటికి దాదాపు 67 మిలియన్ల మందికి ఉపాధి లభించనుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కాగా గత ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1కి మార్చిన కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో వస్తున్నఈ బడ్జెట్‌ఫై ఈ సామాన్యులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ ఇది. దీంతో అంచనాలు భారీగా ఉన్నాయి. -
స్టాక్‌మార్కెట్‌పై ఆర్థిక సర్వే ఏం చెప్పింది?
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త రికార్డులతో దూసుకెళుతున్న దేశీయ ఈక్విటీమార్కెట్లపై ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ కీలక హెచ్చరిక చేశారు. మార్కెట్లో బబుల్ లాంటి వాతావరణం నెలకొందని చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అక్రమ ఆస్తులను నిరోధించే భాగంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లకు తరలినట్టు తెలిపారు. ముఖ్యంగా నోట్ల రద్దు తర్వాత విధించిన పన్ను దీనికి దారి తీసిందన్నారు. నగదు నిల్వలు, ఆస్తులు, బంగారం నిల్వలపై విధించిన పన్ను కారణంగా స్టాక్‌మార్కెట్ పెట్టుబడులకు మళ్లినట్టు తెలిపారు. అయితే ఈ బబుల్ ఎపుడైనా పేలే అవకాశం ఉందంటూ ఇన్వెస్టర్లకు కీలక సూచనలు అందించారు. ఎకనామిక్ సర్వే రిపోర్టును సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మార్కెట్లు బాగా పెరిగినపుడు తప్పని సరిగా వెనక్కి రావాలని, ప్రపంచవ్యాప్తంగా ఈ ధోరణిని చూశామని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అప్రతమత్తంగా వుంటూ మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మార్కెట్లో స్టాక్ ధరల పరంగా వేగంగా వృద్ధి చెందుతున్నట్లు మార్కెట్ అంచనా వేస్తోంది. ఏదేమైనా, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న ప్రమాదాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఆర్థిక సర్వే నివేదిక ఈ భయాలను పునరుద్ఘాటించింది. ఆదాయ వృద్ధి అంచనాలు భారతదేశంలో చాలా ఎక్కువగా ఉన్నాయని సర్వే నివేదించింది. భారతదేశంలో స్టాక్ మార్కెట్ పెరుగుదలలో ఉంది. కానీ ప్రపంచ ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కార్పొరేట్ లాభం / జీడీపీ నిష్పత్తి క్షీణిస్తోందని పేర్కొంది. ఇది భారత్‌లో 3.5క్షీణిస్తే.. అమెరికా 9శాతం జీడీపీతో పటిష్టంగా ఉందని పేర్కొంది. స్టాక్ మార్కెట్ బూమ్ కాలంలో, అమెరికా రియల్ రేట్లు సగటున -1.0 శాతం ఉండగా, భారతదేశంలో ఇది 2.2 శాతంగా ఉందని సర్వే తెలిపింది. -
టెలికాంకు టారిఫ్ వార్ దెబ్బ: 2018 ఆర్థిక సర్వే
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటోందని 2017-18 ఆర్థికసర్వే విశ్లేషించింది. ముఖ్యంగా టెలికాం రంగంలోకి కొత్తగా ప్రవేశించిన రిలయన్స్ జియో మార్కెట్ సంక్షోభానికి కారణమైందని పేర్కొంది. ఇతర కారణాలతోపాటు టారిఫ్ వార్ టెలికాం సేవల సంస్థలను దెబ్బతీసిందని చెప్పడం విశేషం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త టెలికాం పాలసీ తీసుకొస్తోందని చెప్పింది. దీని రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది. 2018 లో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని విడుదల చేయనుందని సర్వే వెల్లడించింది. అలాగే రెగ్యులేటరీ, లైసెన్సింగ్ విధానాలు, కనెక్టివిటీ, సేవల నాణ్యత, వ్యాపార సరళీకరణ, 5జీ సేవలు, ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ లాంటి కొత్త టెక్నాలజీపై ఈ కొత్త విధానం దృష్టిపెట్టాలని సర్వే సూచించింది. భారీ అప్పులు, తారిఫ్ వార్, అసంబద్ధమైన స్పెక్ట్రం చార్జీలు టెల్కోలను దెబ్బతీశాయని వ్యాఖ్యానించింది. టెలికాం మార్కెట్లో తక్కువ ధరలతో ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో మార్కెట్లో సంక్షోభం ఏర్పడిందనీ, దీని కారణంగా ఇతర కంపెనీల ఆదాయం పడిపోయిందని తెలిపింది. ఈ సంక్షోభం పెట్టుబడిదారులు, రుణదాతలు, భాగస్వాములతోపాటు ఈ టెలికాం కంపెనీల వెండార్స్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిందని సర్వే పేర్కొంది. అయితే హేతుబద్ధమైన స్పెక్ట్రం వేలం, ఇతన ఖర్చుల హేతుబద్ధీకరణ ద్వారా దీన్ని నియంత్రించాలని సర్వే సిఫార్సు చేసింది. కాగా సెప్టెంబరు 2017 ముగిసే నాటికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 1,207.04 మిలియన్లుగా ఉంది. అందులో 501.99 మిలియన్ కనెక్షన్లు గ్రామీణ ప్రాంతాలు నమోదు కాగా 705.05 మిలియన్ల కనెక్షన్లు పట్టణ ప్రాంతాలవి. -
2018 ఆర్థిక సర్వే వచ్చేసింది...
న్యూఢిల్లీ : ఆర్థిక సంవత్సరం 2019లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరుగుతుందని 2018 ఆర్థిక సర్వే అంచనావేసింది. జీఎస్టీ వంటి పలు సంస్కరణలు ప్రవేశపెట్టిన అనంతరం మార్చితో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. నేటి నుంచి ప్రారంభమైన పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఈ సర్వేను ప్రవేశపెట్టారు. ఆర్థిక వృద్ధి రేటు పెరగడానికి ప్రధాన కారణంగా జీఎస్టీ, బ్యాంక్ రీక్యాపిటలైజేషన్, సరళీకరణ, విదేశీ పెట్టుబడులు, ఎగుమతులు పెరగడమని వెల్లడించింది. వ్యవసాయం, విద్య, ఉపాధిలపై ఎక్కువగా దృష్టిసారించాల్సి ఉందని ఆర్థిక సర్వే పేర్కొంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 2016-17లో 8 శాతం పెరిగి 60.08 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇవి 55.56 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ప్రతికూలంగా ఉంటూ వస్తున్న ఎగుమతులు 2016-17లో సానుకూలంగా మారాయని, 2017-18లో మరింత పెరుగునున్నట్టు పేర్కొంటోంది. మొత్తంగా 2017-18లో ఎగుమతులు వృద్ధి రేటు 12.1 శాతంగా ఉండనున్నట్టు తెలిపింది. విదేశీ మారక నిల్వలు వార్షిక ప్రాతిపదికన 14.1 శాతం పెరిగి, 409.4 బిలియన్ డాలర్లుగా నమోదైనట్టు ఆర్థిక సర్వే తెలిపింది. తయారీ రంగంపై ఓ గుడ్‌న్యూస్‌ను కూడా ఆర్థిక సర్వే ప్రకటించింది. తొలిసారి భారతీయ చరిత్రలో మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు దేశీయ ఎగుమతుల్లో 70 శాతాన్ని నమోదుచేసినట్టు పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2018లో సేవల వృద్ధి 8.3 శాతం, పరిశ్రమల వృద్ధి 4.4 శాతం, వ్యవసాయ వృద్ధి 2.1 శాతంగా ఉన్నట్టు అంచనావేసింది. వచ్చే ఏడాది ఆర్థిక నిర్వహణ సవాల్‌గా నిలువనున్నట్టు రిపోర్టు చేసింది. గత ఆరేళ్లలో 2017-18 మధ్యకాలంలోనే ద్రవ్యోల్బణం సగటున కనిష్టంగా ఉన్నట్టు ఈ సర్వే పేర్కొంది. అయితే ప్రస్తుతం పెరుగుతున్న ఆయిల్ ధరలపై ఆర్థిక సర్వే ఆందోళన వ్యక్తంచేసింది. 2019 ఆర్థిక సంవత్సరంలో సగటున క్రూడ్ ఆయిల్ ధరలు 12 శాతం పెరిగే అవకాశముందని పేర్కొంది. ఒకవేళ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు ఇలానే పెరుగుతూ వస్తూ ఉంటే... వచ్చే నెలల్లో 'పాలసీ విజిలెన్స్(విధాన నిఘా)' చేపట్టాలని పిలుపునిచ్చింది. 50 శాతం పెరిగిన పన్ను చెల్లింపుదారులు పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తర్వాత కొత్తగా పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారని, వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు కూడా పెరిగినట్టు ఆర్థిక సర్వే రిపోర్టు చేసింది. స్వచ్ఛంగా పన్ను చెల్లింపుదారులు కూడా భారీగా పెరిగాయని తెలిపింది. ముఖ్యంగా పెద్ద వ్యాపారుల నుంచి కొనుగోలు చేసే చిన్న వ్యాపారులు ఇన్‌ఫుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను ఆశిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను విశ్లేషిస్తూ... బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొన్ని రోజుల ముందు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. గత 12 ఏళ్ల నుంచి పార్లమెంట్లో ఇరుసభల్లో ఈ సర్వేను ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ ఆధ్వర్యంలోని బృందం దీన్ని రూపొందించింది. ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన అనంతరం లోక్‌సభ ఫిబ్రవరి 1కి(గురువారానికి) వాయిదా పడింది.