సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017–18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు. విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది.
అంతర్రాష్ట్ర వాటాలు ఇలా..
అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది.
మంత్రి కేటీఆర్ హర్షం
విదేశీ ఎగుమతుల్లో 5వ స్థానంలో తెలంగాణ నిలవడం హర్షణీయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్‌లో సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా ఉత్పత్తి రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరసన నిలవటం గర్వంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment