Foreign exports
-
విదేశీ ఎగుమతుల్లో ఏపీ రికార్డు
సాక్షి, అమరావతి: ఒకపక్క కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య కార్యకలాపాలు మందగిస్తే.. విదేశీ ఎగుమతుల్లో మన రాష్ట్రం రికార్డు సృష్టించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రూ.లక్ష కోట్లు దాటిన విదేశీ ఎగుమతులు.. వరుసగా రెండో ఏడాది కూడా అదే జోరు కొనసాగించాయి. 2019–20తో పోలిస్తే 2020–21లో రాష్ట్ర ఎగుమతుల్లో 2.76 శాతం వృద్ధి నమోదైంది. 2019–20లో రూ.1,04,828.84 కోట్లుగా ఉన్న ఎగుమతులు 2020–21లో రూ.1,07,730.13 కోట్లకు చేరాయి. రాష్ట్రం నుంచి 2017–18లో రూ.84,640.56 కోట్లు, 2018–19లో రూ.98,983.95 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకపక్క కోవిడ్–19 వ్యాప్తి నిరోధానికి పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే మరోపక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా సమగ్రమైన ప్రణాళికను అమలు చేయడం ద్వారా ఎగుమతుల్లో గణనీయమైన వృద్ధి సాధ్యమైందని అధికారులు పేర్కొంటున్నారు. కోవిడ్ మొదటి వేవ్ సమయంలో చాలా దేశాలు చేపలు, రొయ్యలతో పాటు వివిధ ఆహార ఉత్పత్తులపై నిషేధం విధించినప్పటికీ ఆ ప్రభావం ఎగుమతుల ఆదాయంపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా దేశంలోనే మొదటిసారిగా రీస్టార్ట్ పేరుతో కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ గతేడాది ఏప్రిల్ 20 నుంచే పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించుకోవడానికి అనుమతులు ఇవ్వడం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్ జవ్వాది సుబ్రమణ్యం చెప్పారు. ఇప్పుడు సెకండ్ వేవ్‌లో కూడా పరిశ్రమల కార్యకలాపాలకు ఆటంకాలు లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వృద్ధిలో పది రంగాలు కీలకం.. రాష్ట్ర ఎగుమతుల వృద్ధిలో పది రంగాలు కీలకపాత్ర పోషించాయి. డ్రగ్ ఫార్ములేషన్స్ (ఔషధాలు), స్టీల్–ఐరన్, బంగారు ఆభరణాలు, బియ్యం, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్యుత్ ఉపకరణాలు వంటి ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం రాష్ట్రం నుంచి రూ.13,383.11 కోట్ల విలువైన డ్రగ్ ఫార్ములేషన్స్, బయలాజికల్స్ ఎగుమతి అయ్యాయి. అంతకుముందు ఏడాది జరిగిన రూ.10,510.65 కోట్ల ఎగుమతులతో పోలిస్తే 27 శాతం వృద్ధి నమోదైంది. కరోనా వ్యాధిని నియంత్రించడానికి వినియోగించే హెచ్‌సీక్యూ200, అజిత్రోమైసిన్ వంటి అనేక ఔషధాలకు డిమాండ్ రావడం వాటి ఎగుమతులు పెరగడానికి కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో అంతర్జాతీయంగా ఉక్కు, ఇనుము వంటి లోహాలకు డిమాండ్ పెరగడంతో వీటి ఎగుమతుల్లో కూడా వృద్ధి నమోదైంది. ఇనుము, ఉక్కు ఎగుమతులు రూ.6,485.72 కోట్ల నుంచి 22.82 శాతం వృద్ధితో రూ.7,965.97 కోట్లకు చేరాయి. ఈ ఏడాది మన రాష్ట్రం నుంచి రికార్డు స్థాయిలో రూ.4,928.86 కోట్ల విలువైన బాస్మతియేతర బియ్యం ఎగుమతి కావడం గమనార్హం. ఇది గతేడాదితో పోలిస్తే 159 శాతం అధికం. ఆఫ్రికా వంటి దేశాల నుంచి బియ్యానికి డిమాండ్ రావడం ఎగుమతులు పెరగడానికి కారణంగా పేర్కొంటున్నారు. అలాగే మన రాష్ట్రం నుంచి 436 శాతం వృద్ధితో రూ.2,841.66 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఎగుమతి అయ్యాయి. గత మూడేళ్లుగా రాష్ట్ర ఎగుమతుల్లో కీలకపాత్ర పోషిస్తున్న సముద్ర ఉత్పత్తులు, నౌకలు బోట్ల ఎగుమతులు మాత్రం తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి రూ.16,938.48 కోట్ల సముద్ర ఉత్పత్తులు, రూ.13,470.52 కోట్ల ఓడలు, బోట్లు ఇతర పరికరాల ఎగుమతులు జరిగాయి. -
విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రానికి 5వ స్థానం
సాక్షి, న్యూఢిల్లీ: వస్తు, సేవల ఎగుమతుల్లో తెలంగాణ 5వ స్థానం దక్కించుకుంది. దాదాపు 70 శాతం విదేశీ ఎగుమతులు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచే జరగడం విశేషం. సోమవారం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2017–18లో ఈ వివరాలను పేర్కొన్నారు. వస్తు, సేవల విదేశీ ఎగుమతుల్లో రాష్ట్రాల వాటా గురించి దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్థిక సర్వేలో పొందుపరిచారు. జీఎస్టీ గణాంకాల ద్వారా ఇది సాధ్యమైంది. అయితే ఈ గణాంకాల్లో జీఎస్టీయేతర (పెట్రోలియం తదితర) వస్తు, సేవల వివరాలు లేవు. విదేశీ ఎగుమతుల్లో మహారాష్ట్ర వాటా 22.3 శాతం, గుజరాత్ వాటా 17.2 శాతం, కర్ణాటక వాటా 12.7 శాతం, తమిళనాడు వాటా 11.5 శాతం, తెలంగాణ వాటా 6.4 శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో 2.8 శాతం వాటా కలిగి ఉంది. అంతర్రాష్ట్ర వాటాలు ఇలా.. అంతర్రాష్ట్ర ఎగుమతుల్లో తొలి 5 స్థానాల్లో మహారాష్ట్ర, గుజరాత్, హరియాణా, తమిళనాడు, కర్ణాటకలు నిలిచాయి. 10వ స్థానంలో ఏపీ, 12వ స్థానంలో తెలంగాణ నిలిచాయి. అంతర్రాష్ట్ర దిగుమతుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, గుజరాత్‌లు తొలి 5 స్థానాల్లో నిలవగా, 10వ స్థానంలో తెలంగాణ, 11వ స్థానంలో ఏపీ ఉంది. మంత్రి కేటీఆర్ హర్షం విదేశీ ఎగుమతుల్లో 5వ స్థానంలో తెలంగాణ నిలవడం హర్షణీయమని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ట్వీటర్లో సంతోషం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా ఉత్పత్తి రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరసన నిలవటం గర్వంగా ఉందన్నారు. -
పోచంపల్లి చేనేతకు ‘బ్రాండ్’ పట్టం
సాక్షి, హైదరాబాద్: మన ‘పోచంపల్లి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ను సాధించడం ద్వారా పోచంపల్లి చేనేత పార్కుకు దేశంలోనే అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 7న ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ తొలిసారిగా నల్లగొండ జిల్లా పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు దక్కింది. ఈ గుర్తింపుతో పోచంపల్లి చేనేత ఉత్పత్తులకు ఇకపై అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లో గిరాకీ మరింత పెరగనుంది. స్థూల జాతీయోత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ఉన్న చేనేత ఉత్పత్తులను మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇకపై అవకాశం ఉంటుంది. చీరలు, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు, శాలువాల తయారీలో దేశంలో పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులకు మాత్రమే ఈ బ్రాండ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి చీరల విభాగంలో పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, సిద్దిపేట, నారాయణపేట, మంగళగిరి, ధర్మవరం; డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్ల విభాగంలో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ పొందే వీలుందని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఆయా ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను పరీక్షించిన తర్వాతే బ్రాండ్ వినియోగించేందుకు అనుమతి ఇస్తామని కేంద్ర చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ కమిటీ ప్రకటించింది. పోచంపల్లి ఇక్కత్‌కు గుర్తింపు ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ కోరుకునే ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, చేనేత పార్కులు, మహిళా స్వయం సహాయక సంఘాలు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిం చారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి చేనేత పార్కు.. తాము ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్ చీరలు, బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్‌కు బ్రాండ్ అనుమతి కోరింది. వస్త్ర ఉత్పత్తిలో ఉపయోగించే దారం, రంగుల నాణ్యత, డిజైన్లలో నవ్యత, పర్యావరణం, ధరించే వారి ఆరోగ్యంపై ఆయా ఉత్పత్తుల ప్రభావం తదితరాలపై టెక్స్టైల్ కమిటీ శల్య పరీక్షలు చేసి పోచంపల్లికి ‘బ్రాండ్’ పట్టం కట్టింది. దీంతో ఇకపై పోచంపల్లి అన్ని ఉత్పత్తులపై ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ లోగోను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పోచంపల్లి ఉత్పత్తులు ఢిల్లీ, చెన్నై, ముంబై, పుణే వంటి నగరాలతో పాటు అమెరికా, సింగపూర్, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రిలయన్స్ ట్రెండ్స్, మధుర కోట్స్, ఆదిత్య బిర్లా తదితర సంస్థలు పెద్దఎత్తున కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. పోచంపల్లి చేనేతపార్కులో 350 మంది కళాకారులు పనిచేస్తుండగా.. ఏటా రూ.5 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రాండ్ దక్కడంతో లావాదేవీలు రూ.7 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. బ్రాండ్ రావడంతో పోచంపల్లి ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతోపాటు యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చేనేత పార్కు ప్రతినిధి దామోదర్ ‘సాక్షి’కి చెప్పారు. చేనేత పార్కుకు బ్రాండ్ దక్కడంపై పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు తెలిపారు. -
రొయ్యయ్యో
మొక్కుబడిగా హేచరీల తనిఖీ ఒంగోలు టౌన్: కొన్ని హేచరీ నిర్వాహకుల స్వార్థం విదేశీ ఎగుమతులకు అవరోధంగా నిలిచింది. అది ఏ స్థాయికి చేరుకుందంటే చివరకు మనదేశం నుంచి ఎగుమతులు వద్దనే దశకు వెళ్లింది. దీనికి కారణం నకిలీ రొయ్య పిల్లల పెంపకమే. నాసిరకం కావడంతో విదేశీయులు ఈ రొయ్యలంటేనే దూరంగా పెడుతున్నారు. ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్న వీరి ఆగడాలను అరికట్టేందుకు చెన్నై నుంచి వచ్చిన కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ సభ్యుడు రమేష్‌కుమార్ మొక్కుబడిగా ఒక్క హేచరీని మాత్రమే తనిఖీ చేసి వెళ్లడం అనేక విమర్శలకు తావిస్తోంది. కొత్తపట్నం మండలంలోని రెండు హేచరీలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వారం రోజుల క్రితం వాటిని సీజ్ చేశారు. మిగిలిన హేచరీల విషయాన్ని ఇటు జిల్లా యంత్రాంగం, అటు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ పట్టించుకోకపోవడం పట్ల అనేక మంది పెదవి విరుస్తున్నారు. తనిఖీలు లేవు.. నివేదికలు లేవు జిల్లాలోని హేచరీలను యుద్ధప్రాతిపదికన తనిఖీలు చేసి నివేదికలు అందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను ఒంగోలు ఆర్డీఓ, కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను కందుకూరు సబ్ కలెక్టర్ తనిఖీలు చేసి నివేదికలు అందిస్తారని వారం రోజుల కిందట జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. మత్స్యశాఖ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించకుండా మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 11మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. 2894 హెక్టార్లలో 1563 మంది రైతులు వెన్నామీ సాగు చేస్తున్నారు. ఏడాదికి దాదాపు 23 వేల 152 మెట్రిక్ టన్నుల సాగు వస్తోంది. హెక్టార్‌కు 8 నుండి 15 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుండటంతో రైతులు ఎక్కువ మంది వెన్నామీ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు అనధికారిక హేచరీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 20 హేచరీలు అధికారికంగా ఉండగా, అనధికారికంగా మరికొన్ని ఉన్నట్లు తేలింది. వీటిని ఏర్పాటు చేయాలంటే ముందుగా ఎంపెడా నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ నుంచి తల్లి రొయ్యల ఉత్పత్తికి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వాస్తవానికి వెన్నామీ తల్లి సీడ్ దక్షిణ అమెరికా సముద్రంలో లభిస్తోంది. ఆ సీడ్ (బ్రూడర్ స్టాక్)ను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జబ్బులేని తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవడం వల్ల వాటి సీడ్‌తో ఆరోగ్యవంతమైన పిల్లలు వస్తాయి. వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల కోట్లాది రూపాయల విదేశీ ఆదాయం వస్తోంది. వెన్నామీకి డిమాండ్ పెరుగుతుండటంతో అనధికారిక హేచరీల నిర్వాహకులు విచ్చలవిడిగా నకిలీ సీడ్‌ను రైతులకు అంటగడుతున్నారు. చివరకు అది విదేశీ ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా జిల్లాలోని హేచరీలను విస్తృతంగా తనిఖీచేసి నకిలీ సీడ్‌ను నిరోధిస్తే భవిష్యత్‌లో వెన్నామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. లేకుంటే టైగర్ రొయ్య కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఐదుగురు జూదరుల అరెస్టు - రూ.17,060 స్వాధీనం మార్కాపురం : మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దనాగులవరం రోడ్డులో పేకాటాడుతున్న ఐదుగురిని గురువారం రాత్రి పట్టణ ఎస్సై రాంబాబు అరెస్టు చేశారు. వారి నుంచి 17,060 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.