పోచంపల్లి చేనేతకు ‘బ్రాండ్’ పట్టం | textiles situated to the 'brand' title | Sakshi
Sakshi News home page

పోచంపల్లి చేనేతకు ‘బ్రాండ్’ పట్టం

Published Thu, Dec 31 2015 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 2:49 PM

పోచంపల్లి చేనేతకు ‘బ్రాండ్’ పట్టం

పోచంపల్లి చేనేతకు ‘బ్రాండ్’ పట్టం

సాక్షి, హైదరాబాద్: మన ‘పోచంపల్లి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ను సాధించడం ద్వారా పోచంపల్లి చేనేత పార్కుకు దేశంలోనే అరుదైన గుర్తింపు లభించింది.  కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 7న ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ తొలిసారిగా నల్లగొండ జిల్లా పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు దక్కింది. ఈ గుర్తింపుతో పోచంపల్లి చేనేత ఉత్పత్తులకు ఇకపై అంతర్జాతీయ వస్త్ర మార్కెట్‌లో గిరాకీ మరింత పెరగనుంది. స్థూల జాతీయోత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది.

ఈ బ్రాండ్ ఉన్న చేనేత ఉత్పత్తులను మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇకపై అవకాశం ఉంటుంది. చీరలు, డ్రెస్ మెటీరియల్, బెడ్‌షీట్లు, శాలువాల తయారీలో దేశంలో పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులకు మాత్రమే ఈ బ్రాండ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి చీరల విభాగంలో పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, సిద్దిపేట, నారాయణపేట, మంగళగిరి, ధర్మవరం; డ్రెస్ మెటీరియల్స్, బెడ్‌షీట్ల విభాగంలో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ పొందే వీలుందని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఆయా ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను పరీక్షించిన తర్వాతే బ్రాండ్ వినియోగించేందుకు అనుమతి ఇస్తామని కేంద్ర చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలోని టెక్స్‌టైల్ కమిటీ ప్రకటించింది.

 పోచంపల్లి ఇక్కత్‌కు గుర్తింపు
 ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ కోరుకునే ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, చేనేత పార్కులు, మహిళా స్వయం సహాయక సంఘాలు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిం చారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి చేనేత పార్కు.. తాము ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్ చీరలు, బెడ్‌షీట్లు, డ్రెస్ మెటీరియల్‌కు బ్రాండ్ అనుమతి కోరింది. వస్త్ర ఉత్పత్తిలో ఉపయోగించే దారం, రంగుల నాణ్యత, డిజైన్లలో నవ్యత, పర్యావరణం, ధరించే వారి ఆరోగ్యంపై ఆయా ఉత్పత్తుల ప్రభావం తదితరాలపై టెక్స్‌టైల్ కమిటీ శల్య పరీక్షలు చేసి పోచంపల్లికి ‘బ్రాండ్’ పట్టం కట్టింది. దీంతో ఇకపై పోచంపల్లి అన్ని ఉత్పత్తులపై ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ లోగోను వినియోగించుకోవచ్చు.

ప్రస్తుతం పోచంపల్లి ఉత్పత్తులు ఢిల్లీ, చెన్నై, ముంబై, పుణే వంటి నగరాలతో పాటు అమెరికా, సింగపూర్, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రిలయన్స్ ట్రెండ్స్, మధుర కోట్స్, ఆదిత్య బిర్లా తదితర సంస్థలు పెద్దఎత్తున కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. పోచంపల్లి చేనేతపార్కులో 350 మంది కళాకారులు పనిచేస్తుండగా.. ఏటా రూ.5 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రాండ్ దక్కడంతో లావాదేవీలు రూ.7 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. బ్రాండ్ రావడంతో పోచంపల్లి ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతోపాటు యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చేనేత పార్కు ప్రతినిధి దామోదర్ ‘సాక్షి’కి చెప్పారు. చేనేత పార్కుకు బ్రాండ్ దక్కడంపై పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement