పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరలు , పోచంపల్లి చీరను పోలిన ప్రింటెడ్ చీర
సాక్షి, యాదాద్రి: పోచంపల్లి ఇక్కత్ పట్టు చీర ప్రమాదంలో పడింది. పేటెంట్ హక్కు కలిగిన ఇక్కత్ పట్టు చీరల డిజైన్లు కాపీకి గురవుతున్నాయి. భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ) కలిగిన ఇక్కత్ డిజైన్లను కొందరు బడా వ్యాపారులు కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరలను తయారు చేసి విక్రయిస్తున్నారు. నేతన్న నేసే పట్టుచీర డిజైన్‌ను బట్టి గరిష్టంగా రూ.20 వేలు పలుకుతుండగా ప్రింటెడ్ పట్టు చీరల పేరుతో వస్తున్న చీరలు కేవలం రూ.600కే లభ్యమవుతున్నాయి. దీంతో వినియోగదారులు ప్రింటెడ్ చీరల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా పట్టు చీరల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడంతో పాటు చేనేత వృత్తిదారులు దెబ్బతింటున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో సుమారు 50 వేల చేనేత వృత్తి దారుల జీవనోపాధిపై ప్రింటెడ్ చీరలు తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. చేనేత డిజైన్లు కాపీకి గురికాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చేనేత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
బ్రాండ్ ఇమేజ్‌పై దెబ్బ
పట్టుదారానికి రంగులద్ది డిజైన్‌లు కట్టి నేసే ఇక్కత్ పట్టు చీరకు ఓ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఈ చీరలకు మహిళల్లో విశేష ఆదరణ ఉంది. పోచంపల్లి కేంద్రంగా తయారయ్యే పట్టు చీరలకు అంతర్జాతీయంగా గుర్తింపు కూడా ఉంది. అలాంటి పట్టు చీరల డిజైన్లను నిబంధనలకు విరుద్ధంగా ప్రింట్ చేసి తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో చీర ధర పడిపోవడం, ఏది అసిలీనో ఏది నకిలీనో గుర్తించలేకపోవడం, ఆన్‌లైన్‌లో మోసాలు జరగడం లాంటివి కూడా చోటు చేసుకుంటున్నాయి. గత రెండేళ్లుగా గుజరాత్‌లోని సూరత్ కేంద్రంగా పోచంపల్లి డిజైన్లతో ప్రింటెడ్ పాలిస్టర్ చీరలు బహిరంగ మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. ఈ చీరలు రూ.600 నుంచి రూ.1000 లోపే లభిస్తుండటంతో కొనుగోలుదారులు ఆకర్షితులవుతున్నారు.
భారీగా పడిపోయిన అమ్మకాలు
ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో 12,000 మంది చేనేత కళాకారులకు జియో ట్యాగ్ ఉంది. అంటే ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతినెలా ఒక జియో ట్యాగ్ కళాకారుడితోపాటు మరో ఇద్దరు అనుబంధ కళాకారులు ఉంటారు. అంటే సుమారు 36 వేల మంది నేరుగా వృత్తిలో ఉన్నారు. నెలకు ఒక చేనేత కుటుంబం ఐదు చీరలు తయారు చేస్తుంది. ఇలా తయారైన చీరలతో గతంలో నెలకు రూ. 40 కోట్ల వ్యాపారం జరిగేది. ప్రస్తుతం ప్రింటెడ్ చీరలు రాకతో రూ.20 కోట్లకు అంటే సగానికి సగం వ్యాపారం పడిపోయిందని నేతన్నలు చెబుతున్నారు.
మూట వ్యాపారం దాకా విస్తరణ
పోచంపల్లి ప్రింటెడ్ పట్టు చీరలు ఇప్పుడు గ్రామాల్లో మూట వ్యాపారం దాకా వచ్చాయి. గతంలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనే లభించే ప్రింటెడ్ చీరలు ఇప్పుడు పల్లెల్లోనూ అమ్ముతున్నారు. ప్రింటెడ్ చీరల అమ్మకాలను అరికట్టాల్సిన యంత్రాంగం చేతులెత్తేయడంతో పోచంపల్లి పట్టు చీరల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్థానిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ప్రింటెడ్ చీరలను అదుపు చేయాలి
జీఐ పొందిన ఇక్కత్ చేనేత చీరలను పోలిన ప్రింటెడ్ చీరల తయారీని ప్రభుత్వం అరికట్టాలి. ఇటీవల పోచంపల్లికి వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, కేంద్ర జౌళిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రచనా సాహు దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాం. గుజరాత్‌లో ప్రింటెడ్ చీరల తయారీని, షాపింగ్ మాల్స్‌లో అమ్మకాలను నిరోధించాలి. కల్యాణ లక్ష్మి నగదు సహాయంతోపాటు పోచంపల్లి పట్టు చీరను వధువుకు ఇవ్వాలి. ఇక్కత్ వృత్తిని కాపాడాలి.
– తడ్క రమేష్, చేనేత సంఘం నాయకులు, పోచంపల్లి
మాల్స్‌పై మరిన్ని దాడులు చేస్తాం
పోచంపల్లి పట్టు చీరలను పోలిన ప్రింటెడ్ చీరలు సూరత్ నుంచి వస్తున్నాయి. షాపింగ్ మాల్స్‌లో అమ్ముతున్నారన్న విషయాన్ని గుర్తించి దాడులు చేస్తున్నాం. ప్రతి డిజైన్‌ను కాపీతో ప్రింట్ చేసి చీరలను విక్రయిస్తున్నారు. చేనేత వృత్తిదారులకు ఇది తీరని నష్టం కలిగిస్తోంది. త్వరలో మరిన్ని దాడులు చేయబోతున్నాం.
– వెంకటేశ్వర్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment