Indian handloom brand
-
చేనేతను ఫ్యాషైన్ చేద్దాం!
ఇకత్ చీరతో వేడుకలో వెలిగిపోతాం. నారాయణపేట మెటీరియల్‌తో డిజైనర్ బ్లవుజ్ కుట్టించుకుంటాం. మన సంప్రదాయ వస్త్రధారణ మనల్ని ఫ్యాషన్ పెరేడ్లో తళుక్కుమని తారల్లా మెరిపిస్తోంది. ఇవి ఇంత అందంగా ఎలా తయారవుతాయి. ఒక డిజైన్ని విజువలైజ్ చేసి వస్త్రం మీద ఆవిష్కరించే చేనేతకారులు ఏం చదువుతారు... ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే ప్రయత్నం చేశారు మిసెస్ ఇండియా (Mrs India) విజేత సుష్మ. ఈ వస్త్రాలను నేసే చేతులను, ఆ వేళ్ల మధ్య జాలువారుతున్న కళాత్మకతను దగ్గరగా చూడాలనిపించింది. పోచంపల్లి బాట పట్టారామె. కళాత్మకత అంతా చేనేతకారుల చేతల్లోనే తప్ప వారి జీవితాల్లో కనిపించలేదు. నూటికి రెండు–మూడు కుటుంబాలు ఆర్థికంగా బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఈ కళను తమ తరంతో స్వస్తి పలకాలనుకుంటున్న వాళ్లే. మరి... ఇంత అందమైన కళ తర్వాతి తరాలకు కొనసాగకపోతే? ఒక ప్రశ్నార్థకం. దానికి సమాధానంగా ఆమె తనను తాను చేనేతలకు ప్రమోటర్‌గా మార్చుకున్నారు. చేనేతకారుల జీవితాలకు దర్పణంగా నిలిచే డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. తాను పాల్గొనే ఫ్యాషన్ పెరేడ్లు, బ్యూటీ కాంటెస్ట్‌లలో మన చేనేతలను ప్రదర్శిస్తున్నారు. ఆ చేనేతలతోనే విజయాలు సొంతం చేసుకుంటున్నారు. స్వతహాగా ఎంటర్ప్రెన్యూర్ అయిన సుష్మా ముప్పిడి (Sushma Muppidi) మన హస్తకళలు, చేనేతలను ప్రపంచవేదిక మీదకు తీసుకెళ్లడానికి మార్గం సుగమం చేశారు.వైఫల్యమూ అర్థవంతమే! చీరాలకు చెందిన సుష్మ ముప్పిడి బీటెక్, ఎంబీఏ చేశారు. కొంతకాలం గుంటూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం, పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగంతోపాటు మరో ప్రైవేట్ కాలేజ్‌లో పార్ట్‌టైమ్ జాబ్ చేశారు. ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉద్యోగం... ఈ జర్నీలో ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్. ఉద్యోగం కోసం తన హండ్రెడ్‌పర్సెంట్ ఇస్తోంది. పిల్లల కోసం గడిపే సమయం తగ్గిపోతోంది. వెనక్కి చూస్తే తనకు మిగిలిందేమిటి? సివిల్ సర్వీసెస్ ప్రయత్నం సఫలం కాలేదు. ఉనికి లేని సాధారణ ఉద్యోగంతో తనకు వచ్చే సంతృప్తి ఏమిటి? సమాజానికి పని చేయడంలో సంతృప్తి ఉంటుంది, తనకో గుర్తింపునిచ్చే పనిలో సంతోషం ఉంటుంది. ఇలా అనుకున్న తర్వాత యూత్‌లో సోషల్ అవేర్నెస్ కోసం కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ప్రయాణంలో అనుకోకుండా బ్యూటీ కాంపిటీషన్లో పాల్గొనవడం విజేతగా నిలవడం జరిగింది. సోషల్ ఇనిషియేటివ్, వెల్ స్పోకెన్, బెస్ట్ కల్చరల్ డ్రెస్, మిసెస్ ఫ్యాషనిష్టా వంటి గుర్తింపులతోపాటు ‘యూఎమ్బీ ఎలైట్ మిసెస్ ఇండియా 2024’ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మార్చి ఒకటిన ఇటలీలోని మిలన్ నగరంలో, ఎనిమిదవ తేదీన ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరిగే ఫ్యాషన్ షోలలో భారత చేనేతలు అసోం సిల్క్, మల్బరీ సిల్క్లను ప్రదర్శించనున్నారు. జూన్‌లో యూఎస్, ఫ్లోరిడాలో జరిగే మిసెస్ యూనివర్సల్ వేదిక మీద మనదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు సుష్మ. ఇవన్నీ ఆత్మసంతృప్తినిచ్చే పనులు. ఇక తనకు రాబడి కోసం ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారారు. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆఫీస్ నుంచి యూఎస్, దుబాయ్, సింగపూర్లలో డైమండ్ బిజినెస్ (Diamond Business) నిర్వహిస్తున్నారు. ‘‘జీవితంలో గెలవాలి, నా కోసం కొన్ని సంతోషాలను పూస గుచ్చుకోవాలి. నన్ను నేను ప్రశంసించుకోవడానికి సమాజానికి నా వంతు సర్వీస్ ఇవ్వాలి’’ అన్నారు సుష్మ. ‘‘వయసు దేనికీ అడ్డంకి కాదు. అంతా మన అభిరుచి మీద ఆధారపడి ఉంటుంది. మీ కలలను నిజం చేసుకోవాలంటే ఒక ముందడుగు వేయండి. సక్సెస్ అవుతామా, విఫలమవుతామా అనే సందేహాలు వద్దు. ఏ ప్రయత్నమూ చేయకపోవడం కంటే ప్రయత్నించి విఫలమైనా కూడా అది అర్థవంతమయిన వైఫల్యమే. కాబట్టి మిమ్మల్ని మీరు తగ్గించుకోకూడదు’’ అని మహిళలకు సందేశమిచ్చారు. ఇది నా చేయూత పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిరిసిల్లలకు వెళ్లి స్వయంగా పరిశీలించాను. మన చేనేత కుటుంబాలు కళకు దూరం కాకుండా ఉండాలన్నా, ఇతరులు ఈ కళాత్మక వృత్తిని చేపట్టాలన్నా ఇది ఉపాధికి సోపానంగా ఉండాలి. అందుకోసం చేనేతలను కార్పొరేట్ స్థాయికి చేరుస్తాను. సమావేశాలకు ఉపయోగించే ఫైల్ ఫోల్డర్స్, ఇంట్లో ఉపయోగించే సోఫా కవర్స్, వేడుకల్లో ధరించే బ్లేజర్స్ వంటి ప్రయోగాలు చేసి మన చేనేతలను ప్రపంచవేదికలకు తీసుకెళ్లాలనేదే నా ప్రయత్నం. నేను ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎల్లలు దాటి విదేశాలకు విస్తరించాను. చదవండి: అన్నదాత మెచ్చిన రైతుబిడ్డకాబట్టి నాకున్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించుకుని మన చేనేతలను ప్రమోట్ చేయగలుగుతున్నాను. కలంకారీ కళ కోసం అయితే ప్రత్యేకంగా వర్క్‌షాప్ నిర్వహించి కలంకారీ కళాకారులకు ఉచితంగా స్టాల్స్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశాను. పారిస్, యూఎస్ కార్యక్రమాల తర్వాత ఆ పని. సివిల్స్ సాధించినా కూడా ప్రత్యేకంగా ఒక అంశం మీద సమగ్రంగా పని చేయడం సాధ్యం కాకపోవచ్చు. ఇప్పుడు నేను ఒక కళాత్మక సమాజానికి ఇస్తున్న సర్వీస్ నాకు అత్యంత సంతృప్తినిస్తోంది. ప్రపంచ ఫ్యాషన్ వేదిక మీద మన భారతీయ చేనేతకు ప్రాతినిధ్యం వహించాలి. మన నేతలకు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం కల్పించాలనేది నా లక్ష్యం. – సుష్మ ముప్పిడి, మిసెస్ ఇండియా– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ప్రతినిధి -
పోచంపల్లి చేనేతకు ‘బ్రాండ్’ పట్టం
సాక్షి, హైదరాబాద్: మన ‘పోచంపల్లి’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ను సాధించడం ద్వారా పోచంపల్లి చేనేత పార్కుకు దేశంలోనే అరుదైన గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం గత ఆగస్టు 7న ప్రవేశపెట్టిన ఈ బ్రాండ్ తొలిసారిగా నల్లగొండ జిల్లా పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు దక్కింది. ఈ గుర్తింపుతో పోచంపల్లి చేనేత ఉత్పత్తులకు ఇకపై అంతర్జాతీయ వస్త్ర మార్కెట్లో గిరాకీ మరింత పెరగనుంది. స్థూల జాతీయోత్పత్తిలో కీలకపాత్ర పోషిస్తూ అనేక మందికి ఉపాధి కల్పిస్తున్న చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. ఈ బ్రాండ్ ఉన్న చేనేత ఉత్పత్తులను మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఇకపై అవకాశం ఉంటుంది. చీరలు, డ్రెస్ మెటీరియల్, బెడ్షీట్లు, శాలువాల తయారీలో దేశంలో పేరెన్నికగన్న చేనేత ఉత్పత్తులకు మాత్రమే ఈ బ్రాండ్‌ను ఇవ్వాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాల నుంచి చీరల విభాగంలో పోచంపల్లి, వెంకటగిరి, ఉప్పాడ, సిద్దిపేట, నారాయణపేట, మంగళగిరి, ధర్మవరం; డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్ల విభాగంలో పోచంపల్లి ఇక్కత్ ఉత్పత్తులకు ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ పొందే వీలుందని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే ఆయా ఉత్పత్తులకు సంబంధించిన నమూనాలను పరీక్షించిన తర్వాతే బ్రాండ్ వినియోగించేందుకు అనుమతి ఇస్తామని కేంద్ర చేనేత, వస్త్ర పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలోని టెక్స్టైల్ కమిటీ ప్రకటించింది. పోచంపల్లి ఇక్కత్‌కు గుర్తింపు ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ కోరుకునే ప్రాథమిక చేనేత సహకార సంఘాలు, చేనేత పార్కులు, మహిళా స్వయం సహాయక సంఘాలు దరఖాస్తు చేసుకునే వీలు కల్పిం చారు. ఈ నేపథ్యంలో పోచంపల్లి చేనేత పార్కు.. తాము ఉత్పత్తి చేస్తున్న ఇక్కత్ చీరలు, బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్‌కు బ్రాండ్ అనుమతి కోరింది. వస్త్ర ఉత్పత్తిలో ఉపయోగించే దారం, రంగుల నాణ్యత, డిజైన్లలో నవ్యత, పర్యావరణం, ధరించే వారి ఆరోగ్యంపై ఆయా ఉత్పత్తుల ప్రభావం తదితరాలపై టెక్స్టైల్ కమిటీ శల్య పరీక్షలు చేసి పోచంపల్లికి ‘బ్రాండ్’ పట్టం కట్టింది. దీంతో ఇకపై పోచంపల్లి అన్ని ఉత్పత్తులపై ‘ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్’ లోగోను వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం పోచంపల్లి ఉత్పత్తులు ఢిల్లీ, చెన్నై, ముంబై, పుణే వంటి నగరాలతో పాటు అమెరికా, సింగపూర్, ఐరోపా దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. రిలయన్స్ ట్రెండ్స్, మధుర కోట్స్, ఆదిత్య బిర్లా తదితర సంస్థలు పెద్దఎత్తున కొనుగోలు చేసి మార్కెటింగ్ చేస్తున్నాయి. పోచంపల్లి చేనేతపార్కులో 350 మంది కళాకారులు పనిచేస్తుండగా.. ఏటా రూ.5 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రాండ్ దక్కడంతో లావాదేవీలు రూ.7 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. బ్రాండ్ రావడంతో పోచంపల్లి ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతోపాటు యువతకు ఈ రంగంలో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చేనేత పార్కు ప్రతినిధి దామోదర్ ‘సాక్షి’కి చెప్పారు. చేనేత పార్కుకు బ్రాండ్ దక్కడంపై పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అభినందనలు తెలిపారు.