మొక్కుబడిగా హేచరీల తనిఖీ
ఒంగోలు టౌన్: కొన్ని హేచరీ నిర్వాహకుల స్వార్థం విదేశీ ఎగుమతులకు అవరోధంగా నిలిచింది. అది ఏ స్థాయికి చేరుకుందంటే చివరకు మనదేశం నుంచి ఎగుమతులు వద్దనే దశకు వెళ్లింది. దీనికి కారణం నకిలీ రొయ్య పిల్లల పెంపకమే. నాసిరకం కావడంతో విదేశీయులు ఈ రొయ్యలంటేనే దూరంగా పెడుతున్నారు.
ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్న వీరి ఆగడాలను అరికట్టేందుకు చెన్నై నుంచి వచ్చిన కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ సభ్యుడు రమేష్‌కుమార్ మొక్కుబడిగా ఒక్క హేచరీని మాత్రమే తనిఖీ చేసి వెళ్లడం అనేక విమర్శలకు తావిస్తోంది. కొత్తపట్నం మండలంలోని రెండు హేచరీలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వారం రోజుల క్రితం వాటిని సీజ్ చేశారు. మిగిలిన హేచరీల విషయాన్ని ఇటు జిల్లా యంత్రాంగం, అటు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ పట్టించుకోకపోవడం పట్ల అనేక మంది పెదవి విరుస్తున్నారు.
తనిఖీలు లేవు.. నివేదికలు లేవు
జిల్లాలోని హేచరీలను యుద్ధప్రాతిపదికన తనిఖీలు చేసి నివేదికలు అందించాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌కేఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను ఒంగోలు ఆర్‌డీఓ, కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను కందుకూరు సబ్ కలెక్టర్ తనిఖీలు చేసి నివేదికలు అందిస్తారని వారం రోజుల కిందట జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
అయినప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. మత్స్యశాఖ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించకుండా మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 11మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. 2894 హెక్టార్లలో 1563 మంది రైతులు వెన్నామీ సాగు చేస్తున్నారు. ఏడాదికి దాదాపు 23 వేల 152 మెట్రిక్ టన్నుల సాగు వస్తోంది. హెక్టార్‌కు 8 నుండి 15 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుండటంతో రైతులు ఎక్కువ మంది వెన్నామీ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
రైతుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు అనధికారిక హేచరీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 20 హేచరీలు అధికారికంగా ఉండగా, అనధికారికంగా మరికొన్ని ఉన్నట్లు తేలింది. వీటిని ఏర్పాటు చేయాలంటే ముందుగా ఎంపెడా నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ నుంచి తల్లి రొయ్యల ఉత్పత్తికి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వాస్తవానికి వెన్నామీ తల్లి సీడ్ దక్షిణ అమెరికా సముద్రంలో లభిస్తోంది. ఆ సీడ్ (బ్రూడర్ స్టాక్)ను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
జబ్బులేని తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవడం వల్ల వాటి సీడ్‌తో ఆరోగ్యవంతమైన పిల్లలు వస్తాయి. వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల కోట్లాది రూపాయల విదేశీ ఆదాయం వస్తోంది. వెన్నామీకి డిమాండ్ పెరుగుతుండటంతో అనధికారిక హేచరీల నిర్వాహకులు విచ్చలవిడిగా నకిలీ సీడ్‌ను రైతులకు అంటగడుతున్నారు. చివరకు అది విదేశీ ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా జిల్లాలోని హేచరీలను విస్తృతంగా తనిఖీచేసి నకిలీ సీడ్‌ను నిరోధిస్తే భవిష్యత్‌లో వెన్నామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. లేకుంటే టైగర్ రొయ్య కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఐదుగురు జూదరుల అరెస్టు
- రూ.17,060 స్వాధీనం
మార్కాపురం : మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దనాగులవరం రోడ్డులో పేకాటాడుతున్న ఐదుగురిని గురువారం రాత్రి పట్టణ ఎస్సై రాంబాబు అరెస్టు చేశారు. వారి నుంచి 17,060 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు.
రొయ్యయ్యో
Published Fri, Dec 26 2014 1:28 AM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM
Advertisement