![Ramesh Kumar Reddy Fires On Sharmila and Sunita and Chandrababu - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/16/rameskumar.jpg.webp?itok=Zl1Ct9oF)
మాట్లాడుతున్న రమేష్‌కుమార్‌రెడ్డి, సురేష్‌బాబు
షర్మిల, సునీత చేస్తున్నది న్యాయ పోరాటమా.. రాజకీయ పోరాటమా?
రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ వేచి ఉండాలి
చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్
వివేకాను ఓడించేందుకు స్పెషల్ చార్టెర్డ్ ఫ్లయిట్లు ఉపయోగించారు
అప్పట్లో కోట్లు ఖర్చుచేసి జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొన్నారు
ఈ ఎన్నికల్లో కూడా సుమారు 40 సీట్లు రూ.వందల కోట్లకు అమ్ముకున్నారు
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి
కడప కార్పొరేషన్: మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే ఉపయోగపడుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. కడపలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కో–ఆర్డినేటర్ కె. సురేష్‌బాబు, డా. చైతన్యరెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిత్యం నీచ రాజకీయాలు చేయడమే చంద్రబాబు సంస్కృతి అని, అన్ని వ్యవస్థలను ధ్వంసంచేసి తనకు అనుకూలంగా మలుచుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.
లక్ష్మీపార్వతిని సాకుగా చూపి ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవడమేగాక, ఆయన మరణానికి కూడా బాబు కారణమయ్యారన్నారు. ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఒక కొత్త కూటమి ఏర్పాటుచేయడం బాబుకు అలవాటుగా మారిందన్నారు. 2014లో నరేంద్ర మోదీ, పవన్‌కళ్యాణ్‌తో.. 2019లో లోపాయికారిగా జనసేనతో, ఇప్పుడు బీజేపీ, జనసేనతో పాటు కాంగ్రెస్‌తో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన అందరి కుటుంబాల్లో చిచ్చుపెడతారన్నారు. ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ కేసును పక్కదారి పట్టిస్తున్నారని రమేష్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు.
రెండు చానెళ్లు, రెండు పత్రికలైతే అదేపనిగా సీఎం జగన్, ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలపై బురదజల్లుతూ తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. వైఎస్ వివేకా కేసు కోసం రూ.వందల కోట్లు ఖర్చుచేశారని, కోట్ల రూపాయలు వెచ్చించి లూథ్రా అనే ఖరీదైన న్యాయవాదిని నియమించుకున్నారన్నారు. ఇక ‘వివేకం’ అనే సినిమాలో క్యారెక్టర్లను చాలా నీచంగా చూపించడం దారుణమన్నారు.
అవినాశ్ ఎలాంటివారో షర్మిల, సునీతలకు తెలీదా?
ఇక అవినాశ్ ఎలాంటి వారో షర్మిల, సునీత ఇద్దరూ చిన్నప్పటి నుంచి చూసి ఉంటారు కదా, వారికి తెలీదా.. ఎప్పుడైనా ఆయనలో నేరప్రవృత్తి గమనించారా.. దౌర్జన్యాలు, రాజకీయ హత్యలు, ఫ్యాక్షన్ గొడవలతో ఆయనకు సంబంధం ఉందేమో గుండెలపై చేయివేసుకుని చెప్పాలన్నారు. నిష్కళంకమైన జీవితం గడుపుతున్న అవినాష్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు.
వైఎస్ జగన్ ప్రజాసేవ చేయాలని ఇష్టపడి రాజకీయాల్లోకి వచ్చారని.. ఏ రకమైన ఫ్యాక్షన్‌ను, గొడవలను ఆయన ప్రేరేపించలేదన్నారు. చంద్రబాబుది క్రిమినల్ బ్రెయిన్ అని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానందరెడ్డిని ఓడించేందుకు రూ.కోట్లు ఖర్చుచేసి చార్టెర్డ్ ఫ్లయిట్‌లు పెట్టి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కొనుగోలు చేశారని రమేష్‌రెడ్డి గుర్తుచేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 40 సీట్లను రూ.వందల కోట్లకు అమ్ముకున్నారని ఆరోపించారు.
కడప జిల్లాలో కూడా చాలామంది డబ్బులిచ్చి టికెట్లు కొన్నారన్నారు. మరోవైపు.. షర్మిల, సునీత న్యాయపోరాటం చేస్తున్నారో, రాజకీయ పోరాటం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. రాజకీయ పోరాటమైతే కోర్టు తీర్పు వచ్చేవరకూ దయచేసి నోరు విప్పవద్దని ఆయన సూచించారు. ఇక చంద్రబాబు చెబుతున్న ‘సూపర్ సిక్స్’ ఒక ఫ్లాప్‌సిక్స్ అని రమేష్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీడీపీకి ఓటేస్తే కాంగ్రెస్, బీజేపీలకు వేసినట్లేనని తెలిపారు.
సునీతవి అర్థంలేని ఆరోపణలు
డా. చైతన్యరెడ్డి మాట్లాడుతూ.. డాక్టరేట్ పొందిన సునీత అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హత్య జరిగిన రోజు రాత్రి ఏ–1 ఎర్ర గంగిరెడ్డి, వైఎస్ అవినాశ్‌రెడ్డి వాట్సాప్ కాల్స్ చేసుకున్నారని చెప్పడం అబద్ధమన్నారు. సీబీఐ చార్జిషీట్‌లో వాట్సాప్ చాట్‌లో ఉన్నారని చెప్పిందే తప్పా వాట్సాప్ కాల్స్ అని ఎక్కడా చెప్పలేదన్నారు. ఎన్నికల సమయం కాబట్టి వాట్సాప్‌కు మెసేజ్‌లు వస్తూ ఉంటాయని, ఫోన్ ఆన్‌చేసి ఉంచితే ఎవరి వాట్సాప్ అయినా యాక్టివ్‌లో ఉన్నట్లేనని చెప్పారు. ఇక గూగుల్ టేకౌట్‌కు శాస్త్రీయతలేదని, దాన్ని గూగుల్ కంపెనీ దానిని సర్టిఫై చేయలేదని, న్యాయమూర్తి కూడా అంగీకరించలేదన్నారు. కోర్టులో నేరం రుజువు కాకుండా ఆరోపణలు చేయడం సరికాదని షర్మిల, సునీతకు చైతన్యరెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment