రాష్ట్రవ్యాప్తంగా కుదేలవుతోన్న కూటమి
వరుస దెబ్బలతో తేరుకోలేకపోతున్న టీడీపీ
రాజంపేట కూటమిలో కుంపట్లు..పోటాపోటీగా ప్రచారం
ఉండి టీడీపీలో అసమ్మతి ప్రకంపనలు
తిరుగుబాటు ధోరణిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు
రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై తీవ్ర మండిపాటు
హిందూపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ పదేళ్లు ఉన్నాఅభివృద్ధి చెందలేదన్న విమర్శలు
సాక్షి రాయచోటి/ఏలూరు/అనంతపురం: రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి స్వపక్షం నుంచే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి కుదేలవుతోంది. టికెట్లు ఆశించి భంగపడిన నేతలు తిరుగు బావుటా ఎగరేస్తున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న తమను నమ్మించి మోసం చేస్తున్నారంటూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే బాహాబాహీకి దిగుతూ ఆయన్నే ఎదురిస్తున్నారు. దీంతో ఆ పార్టీ వరుస దెబ్బలతో తేరుకోలేకపోతోంది. అన్నమయ్య జిల్లాలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకు దిగజారిపోతోంది.
సీనియర్ నాయకులు పార్టీని వీడుతుండటంతో అధిష్టానంలో కలవరం మొదలైంది. టీడీపీ రాయచోటి ఇన్‌చార్జిగా ఉన్న రమేష్ కుమార్‌రెడ్డి రాజీనామా చేయడం పార్టీలో గుబులు రేపుతోంది. అంతేకాకుండా బుధవారం పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో రమేష్ కుమార్‌రెడ్డి తో పాటు ఆయన వర్గం భారీగా వైఎస్సార్‌సీపీలో చేరడంతో అక్కడ వైఎస్సార్‌సీపీ తిరుగులేని రీతిలో బలపడింది. ఇటీవలే సీఎం సమక్షంలో రాజంపేట పార్లమెంటు టీడీపీ ఇన్‌ఛార్జి గంటా నరహరి చేరారు.
తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డిని మార్చకపోతే ఆ పార్టీని వీడేందుకు నియోజకవర్గ నేత శంకర్ యాదవ్ సిద్ధమవుతున్నారు. రాజంపేటకు సంబం«ధించి రాయచోటి టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం అభ్యర్థిత్వాన్ని మాజీ ఎమ్మెల్సీ, రాజంపేట ఇన్‌చార్జి బత్యాల చెంగల్రాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రైల్వేకోడూరులో జనసేనకు సీటు కేటాయించి, తర్వాత మార్చడంతో ఆయా వర్గాల నేతలు లోలోపల కత్తులు దూసుకుంటున్నారు. మదనపల్లెలో టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా అక్కడ ఆ పార్టీ నేత దొమ్మలపాటి రమేష్ ప్రజా సంఘాల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలిచేందుకు సిద్ధపడుతున్నారు.
ఉండిలో మూడు ముక్కలాట
పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో టీడీపీ సంకట స్థితిలో పడింది. మాజీ ఎమ్మెల్యే శివరామరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. టికెట్ దక్కించుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ఇప్పుడు రామరాజును కాదని ఎంపీ రఘురామకృష్ణరాజుకు టికెట్ కేటాయించారన్న సమాచారంతో ఆ నియోజకవర్గ టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చెలరేగాయి.
రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వం అధికారికంగా ప్రకటించకపోయినా తీవ్రస్థాయిలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. అందరూ సహకరిస్తే ఇండిపెండెంట్‌గా తాను బరిలో ఉంటానని మరోవైపు రామరాజు చెబుతున్నారు. పదిహేను రోజుల నుంచి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా నరసాపురం ఎంపీ టికెట్ ఆశించి కూటమి చేతిలో భంగపడ్డ ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఉండి టికెట్ హామీ రావడంతో రామరాజు వర్గం తేరుకోలేకపోతోంది.
చంద్రబాబు నుంచి రఘురామకృష్ణరాజు అభ్యర్థిత్వంపై పరోక్ష సంకేతాలు ఇవ్వడంతో రామరాజు వర్గం ఐదు రోజులుగా వివిధ రకాలుగా నిరసనలు వ్యక్తం చేసి తీవ్రస్థాయిలో పార్టీపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలో రామరాజుకు ఎలాంటి హామీ రాకపోవడంతో కంటితడి కూడా పెట్టారు. ఆయన వర్గీయులు బుధవారం నుంచి ఆమరణదీక్ష ప్రారంభించారు.
బాలకృష్ణ ఓటమి ఖాయం
హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలకృష్ణ ఈ దఫా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ వర్గాలు ఆయనకు పూర్తిగా దూరమయ్యాయి. ఆయన అందుబాటులో ఉండకపోవడం, పీఏలే ఎమ్మెల్యేలుగా చలామణి అవుతుండడం వల్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2014లో తొలిసారి హిందూపురం నుంచి పోటీచేసి గెలుపొందిన ఆయన.. తన బావ చంద్రబాబు సీఎంగా ఉన్నా నియోజకవర్గానికి పైసా పని చేయలేకపోయారు. ఈ క్రమంలో ఓటర్లు స్థానిక అభ్యర్థి వైపు మొగ్గు చూపుతున్నారు.
ఏడాదికి ఒకటి రెండుసార్లు వచ్చే బాలకృష్ణ కావాలా, స్థానికంగా ఉండే ఎమ్మెల్యే కావాలా అన్న అంశంపై ఇప్పుడు హిందూపురంలో చర్చ జరుగుతోంది. గతంలో బాలకృష్ణ పీఏ బాలాజీ పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఇప్పటికీ ఆ కేసు నడుస్తోంది. దీంతో టీడీపీ నాయకులే కాకుండా, ప్రజలు కూడా పీఏలపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మళ్లీ ఎన్నికలొస్తే తప్ప బాలకృష్ణ నియోజకవర్గానికి రారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు.
బీజేపీ తరపున టికెట్ ఆశించిన పరిపూర్ణానందస్వామి కూడా బాలకృష్ణ ఇక్కడికి ఎన్నిసార్లు వచ్చారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా ఉంది. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సారి బాలకృష్ణ ఓటమి ఖాయం అని .. ఈ దిశగా పలువురు ఒకటికి రెండంటూ బెట్టింగులకు దిగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment