Shrimp
-
కనుమరుగు రొయ్యో..!
కూటమి సర్కారు కుట్ర.. అందని ప్రోత్సాహకం.. పెరిగిన విద్యుత్ చార్జీలు.. నాసిరకం రొయ్య పిల్లల ఉత్పత్తి.. క్షీణించిన ఎగుమతులు.. దక్కని గిట్టుబాటు ధరలు.. వెరసి.. ఆక్వాకల్చర్ చతికిలపడింది. కొనేనాథులు లేక హేచరీలు మూతపడ్డాయి.. ఫలితంగా రొయ్యల చెరువులు వరి మడులుగా మారాయి. కుబేరులుగా మారిన ఆక్వా రైతులు ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన దుస్థితి నెలకొంది. వాకాడు: నాడు రొయ్యల సాగు చేసిన రైతులు, హేచరీల యజమానులు కుబేరులుగా మారారు. అయితే నేడు రొయ్యల పరిశ్రమకు గడ్డు కాలం వచ్చింది. దీంతో తిరుపతి జిల్లాలో ఆక్వా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అప్పట్లో రొయ్యలు విదేశాలకు ఎగుమతి కావడంతో విదేశీ మారక ద్రవ్యం బాగా పెరిగి ఎంతో మంది రైతులు కుబేరులుగా మారా రు. దీంతో ఆక్వాసాగు నలు మూలలకు విస్తరించింది.అనేక ప్రాంతాల్లో రైతులు, చిన్న చిన్న వ్యాపా రులు, ఉద్యోగులు సైతం లాభాలు గడించేందుకు తమ వృత్తులకు స్వస్తి పలికి ఆక్వా సాగులోకి ప్రవేశించారు. ఆక్వా సాగుకు అనుగుణంగా జిల్లా సముద్ర తీరం వెంబడి 24 రొయ్య పిల్లల కేంద్రాలు వెలిశాయి. అందులో వాకాడు మండలంలో 23, కోట మండలంలో ఒక హేచరీ ఉన్నాయి. ఎక్కువసార్లు పిల్లల ఉత్పత్తితో నాణ్యత క్షీణత రొయ్యి పిల్లలను ఉత్పత్తి చేసే బ్లోడర్స్ విషయంలో హేచరీల వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక తల్లి రొయ్యి (బ్లోడర్)తో మూడు సార్లు మాత్రమే రొయ్యి పిల్లలు పెట్టించాలి. అలా జరిపితేనే సాగు సక్సెస్ అవుతుంది. అదే తరహాలోనే వైరస్ లేకుండా మంచి దిగుబడులు కూడా వస్తాయి. ఈ ప్రక్రియ ఏ ఒక్క హేచరీలో కూడా జరగడంలేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొన్ని హేచరీలు తొలి కాన్పులో పెట్టించిన పిల్లలు, అలాగే 7, 8 కాన్పుల్లో పెట్టించిన పిల్లలను మిక్సింగ్ చేసి రైతులకు అంటగడుతున్నారు. ఇలా చేయడంతో అవి చెరువుల్లో ఎదుగుదల తగ్గిపోయి వివిధ సైజుల్లో పెరుగుతున్నాయి. ప్రతి హేచరీకి ఇతర దేశాల నుంచి నాణ్యమైన బ్లోడర్స్ వస్తాయని రైతులకు ఒక నమ్మకం ఉంది. కాని ఇతర దేశాల నుంచి ఒక తల్లి రొయ్యను (బ్లోడర్)ను తెప్పించి దాంతోపాటు లోకల్ బ్లోడర్స్ని కలిపి పిల్లలను ఉత్పత్తి చేసి రైతులను మోసం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ హేచరీలపై నమ్మకం లేని ఆక్వా రైతులు పాండిచ్చేరి, భీమవరం, విశాఖపట్నం తదితర ప్రాంతాల నుంచి సీడ్ కొనుగోలు చేసేవారు.జిల్లాలోనే మొట్ట మొదటిసారి.. 1990–91లో తిరుపతి జిల్లా వాకాడు మండల తీర ప్రాంత గ్రామాలు అందలమాట, వాలమేడు ప్రాంతాల్లో రొయ్యిల సాగు ప్రారంభమైంది. అప్పటి నుంచి కనక వర్షం కురిపించిన ఆక్వా రంగం అందరినీ ఆకర్షించింది. అనేక ప్రాంతాల్లోని పలువురు రైతులు లాభాలు గడించేందుకు వరి పంటలను వదిలేసి ఆక్వా సాగులోకి ప్రవేశించారు. అప్పట్లో వరి సాగు విస్తార్ణం తగ్గిపోయి ఆక్వా సాగు పెరిగిపోయింది. వరుస నష్టాలతో రైతులు ఆక్వా సాగును వదిలేసి మళ్లీ వరిసాగులోకి వస్తున్నారు.ఆక్వా రైతుకు జగనన్నఅండగత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆక్వా రైతులకు అండగా నిలిచారు. రొయ్య సాగు చేసే రైతులకు పలు రాయితీ ఇచ్చి, వారిని ఆదుకున్నారు. దీంతో ఆగిపోయిన రొయ్య ఎగుమతులను కరోనాలో సైతం యూరోపియన్ దేశాలకు ఎగుమతి జరిగింది. అదే సమయంలో ఆక్వా రైతుల కష్టాలను గుర్తించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో డాలర్ల సేద్యంగా మారిన టైగర్ రొయ్యల సాగుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా 6 హేచరీల ద్వారా టైగర్ రొయ్య పిల్లల ఉత్పత్తికి అనుమతి లభించగా అందులో ఒక ఏపీలోనే 5 హేచరీలకు అనుమతులను తీసుకొచ్చింది. ఈ క్రమంలో జిల్లాకు 3 హేచరీలకు టైగర్ సీడ్ ఉత్పత్తికి అనుమతి లభించించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అధికంగా 76 రొయ్య పిల్లల హేచరీలు ఉండగా అందులో 3 హేచరీల్లో మాత్రమే టైగర్ సీడ్‌తోపాటు, లార్వా రేరింగ్ ఉత్పత్తికి అనుమతి లభించింది. అయితే నేడు హేచరీల యజమానులు 30 పైసలకు రొయ్యిపిల్లను విక్రయిస్తున్నా కొనే వారు కరువయ్యారు.కొనేవారు లేక మూత పడిన 20 హేచరీలుతిరుపతి జిల్లాలో తీరం వెంబడి 17 రొయ్య పిల్లల ఉ త్పత్తి హేచరీలు ఉన్నాయి. అందులో 3 హేచరీలు మాత్రమే ప్రస్తుతం అంతంత మాత్రంగా నడుస్తున్నాయి. జిల్లాలో 2022 వరకు 4 వేల హెక్టార్లలో ఆక్వా సాగు సాగేది. అయితే రాను రాను రొయ్యల సాగులో రైతులకు నష్టాలే మిగలడంతో ఒక్కొక్కరుగా సాగుకు దూరమయ్యారు.ప్రస్తుతం చిల్లకూరు, గూ డూరు, కోట, వాకాడు, చిట్టమూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో కేవలం 800 హెక్టార్లలో మాత్రమే సాగు ఉంది. దీంతో రొయ్య పిల్లలు కొనే వారు లేక హేచరీలు ఒక్కొక్కటి గా మూత పడ్డాయి. హేచరీల యజమానులకు వ్యాపారాలు లేక పెట్టిన పెట్టుబడులు రాక లబోదిబోమంటున్నారు. ఒక హేచరీ ని ర్మించాలంటే దాదాపు రూ.3 కోట్ల నుంచి రూ.11 కోట్లు వరకు ఖర్చు అవుతుంది. అందులో దాదాపు 50 నుంచి 100 మంది వరకు వర్కర్లు ఉంటారు. ఒక్కొక్కరికి రూ.15 నుంచి రూ.40 వేలు వరకు జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే కూటమి సర్కారు హేచరీలకు కరెంటు బిల్లులపై రాయితీ ఇస్తామని చెప్పి రూ.6.50కు పెంచి మోసం చేయడంతో మ రింత భారం పడింది. దీంతో ఏటా రూ.కో ట్లల్లో నష్టాలు రావడంతో హేచరీ నిర్వాహకులు నష్టాలు భరించలేక చేతులు ఎత్తేశారు. వేలాది మంది పనిలేక రోడ్డున పడ్డారు. నాణ్యమైన తల్లి రొయ్యతోనే అధిక దిగుబడి అధిక నాణ్యత కలిగిన రొయ్య పిల్లలను స్థిరంగా ఉత్పత్తి చేయడం, అలాగే రొయ్యల సాగు అవసరాలను తీర్చడానికి తీరంలో హేచరీలను ఏర్పాటు చేశారు. రొయ్య పిల్లల ఉత్పత్తి కోసం ఒకప్పుడు అమెరికా నుంచి అర్డిలైన్, పేనెట్ తదితర కంపెనీల నుంచి తల్లి రొయ్యలు రాష్టానికి వచ్చేవి. ఆయా కంపెనీలకు ముందుగా హేచరీల యజమాను లు ఒక్కో తల్లి రొయ్యకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు వరకు నగదు చెల్లించి ఆర్డర్ పెట్టుకోవాలి. ఆ తరువాత బ్రోడర్స్(తల్లి రొయ్యలు) అమెరికా నుంచి ప్రభుత్వ మత్స్యశాఖ ల్యాబ్‌లకు వస్తాయి. అక్కడ పూర్తి స్థాయిలో తల్లిరొయ్యకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తరువాతే బుకింగ్ చేసుకున్న ఆయా హేచరీలకు చేరుతాయి. హేచరీలకు చేరిన తరువాత మళ్లీ కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ(సీఏఏ) వారు పరిశీలన అనంతరం వారి అనుమతి మేరకు వాటి ద్వారా గుడ్లు పెట్టించడం జరుగుతుంది. జిల్లాలో అనుమతి లభించిన హేచరీలన్నీ వంద మిలియన్ల సీడ్ ఉత్పత్తి చేసే సామర్థం కలిగినవే. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ అనుమతులకు లోబడి మాత్రమే సీడ్ ఉత్పత్తి చేయాల్సి ఉంది. తద్వారా ఉత్పత్తి చేసిన పిల్లలకు ఎలాంటి వ్యాధులు లేకుండా, మంచి పెరుగుదల వచ్చేటట్లు ముందుస్తు పరీక్షలు నిర్వహించి రైతులకు ఇవ్వాలి. ఇలా చేయడంతో రైతులు అనుకున్న దిగుబడుల కంటే అధనపు దిగుబడులు సాధించడం జరుగుతుంది. ఇలా చేయడంతో 1996–2012 మధ్య కాలంలో రొయ్యల దిగుబడులు అధికంగా రావడం, ఉత్పత్తులకు మంచి గిరాకీ ఏర్పడి ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ మొత్తంలో రొయ్యిలు యూరోపియన్ దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు మంచి ఆదాయం వచ్చేది. ఆక్వా కల్చర్ తగ్గిన మాట వాస్తవమేజిల్లాలో 24 రొయ్య పిల్లల హేచరీలున్నాయి. అందులో మూడు మాత్రమే రన్నింగ్‌లో ఉన్నాయి. వివిధ కారణాలతో కల్చర్ తగ్గిన మాట వాస్తవమే. దీంతో హేచరీలు షట్‌డౌన్ అయ్యాయి. త్వరలోనే కల్చర్ పూర్తిస్థాయిలో ప్రారంభించి, గతంలో మాదిరి అన్ని హేచరీలు పనిచేస్తాయని అనుకుంటున్నాను. – నాగరాజు, జిల్లా మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ తిరుపతి -
ఫీడ్ ధరలకు ముకుతాడు
సాక్షి, అమరావతి: రొయ్య రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అండగా నిలుస్తోంది. తాజాగా రొయ్యల మేత (ఫీడ్) ధరలు పెంచేందుకు కంపెనీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో ఏపీ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ (అప్సడా) రంగంలోకి దిగింది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఫీడ్ ధర టన్నుకు రూ.103 నుంచి రూ.256 వరకు పెంచుతూ సీపీఎఫ్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలను తక్షణమే అమలు చేయాలంటూ డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు సైతం జారీ చేసింది. సీపీఎఫ్ బాటలోనే మిగిలిన కంపెనీలు కూడా ధరల పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ విషయాన్ని రొయ్య రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా సీపీఎఫ్ కంపెనీ ప్రతినిధులతో చర్చించింది. పెంచిన ధరలను ఉపసంహరించుకునేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వంతో చర్చించకుండా ధరలు పెంచొద్దని ఫీడ్ కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మిగిలిన అన్ని కంపెనీలు ధరల పెంపుదల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాయి. తాజాగా ధరల పెంపు ఉపసంహరణ ఫలితంగా కిలో రొయ్యల ఉత్పత్తిపై రూ.4.50 చొప్పున భారం తగ్గింది. గతంలోనూ ధరల పెంపును అడ్డుకున్న ప్రభుత్వం ప్రస్తుతం మేత కోసం ప్రతి రైతు కిలో రొయ్యల ఉత్పత్తికి రూ.90 వరకు ఖర్చు చేస్తున్నారు. ఏటా ఫీడ్ అమ్మకాల ద్వారా రూ.12,600 కోట్ల టర్నోవర్ జరుగుతోంది. గతంలో ఏటా కనీసం రెండు, మూడుసార్లు ఫీడ్ కంపెనీలు ధరలు పెంచేవి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీడ్ తయారీ, అమ్మకాలను సైతం అప్సడా చట్టం పరిధిలోకి తీసుకురావడంతో ఇష్టానుసారంగా ధరల పెంపునకు కళ్లెం పడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా 2022 మే 19న టన్నుకు రూ.256 చొప్పున పెంచేందుకు కంపెనీలు ప్రయత్నించాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో ఆశించిన ధర లేక సతమతమవుతున్న అప్పటి తరుణంలో రైతులపై పైసా భారం మోపడానికి వీల్లేదని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో కంపెనీలు పెంపు ప్రతిపాదనలను పూర్తిగా వెనక్కి తీసుకున్నాయి. అదే రీతిలో 2022 అక్టోబర్ 13న టన్నుకు రూ.260 చొప్పున పెంచాయి. ప్రభుత్వ ఆదేశాలతో పెంచిన నాలుగు రోజులకే కంపెనీలు వెనక్కి తీసుకున్నాయి. ఇలా రెండేళ్లలో మూడుసార్లు పెంచిన ధరలను వెనక్కి తీసుకోవడంతో సగటున కిలోకు రూ.8.60 చొప్పున మేత ఖర్చుల భారం రైతులకు తగ్గింది. సీఎం జగన్ ఆదేశాలతో.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అప్సడా ఆధ్వర్యంలో సీపీఎఫ్ కంపెనీ ప్రెసిడెంట్ సహా ఇతర ఉన్నతాధికారులను పిలిపించి సమావేశం నిర్వహించాం. ధరల పెంపు ప్రతిపాదనను ఉపసంహరింప చేసుకునేలా ఆదేశాలిచ్చాం. ప్రభుత్వాదేశాలతో సీపీఎఫ్తో సహా ఇతర కంపెనీలు కూడా ధరల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నాయి. – వడ్డి రఘురాం, కో–వైస్ చైర్మన్, అప్సడా -
తల్లి రొయ్య ఇక లోకల్
సాక్షిప్రతినిధి, కాకినాడ: అమెరికన్ తల్లి రొయ్యకు మన ఆక్వా రైతులు త్వరలో గుడ్‌బై చెప్పనున్నారు. తల్లి రొయ్యలను దేశీయంగా మన హేచరీల్లో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోని హేచరీల్లో రొయ్య పిల్లల పునరుత్పత్తి కోసం తల్లి రొయ్యలను కొన్నేళ్లుగా లక్షలు వెచ్చించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన హేచరీల్లో బ్లాక్ టైగర్(మోనాడామ్) తల్లి రొయ్యలు 2009కి ముందు భారతీయ సముద్ర జలాల్లో లభించేవి. ఆ తర్వాత బ్లాక్‌టైగర్ 60 శాతం బాక్టీరియాతో రోగాల బారిన పడి తల్లి రొయ్యలు దెబ్బతిన్నాయి. అనంతరం రోగాల్లేని తల్లి రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న అమెరికా నుంచి వెనామీ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే లభించే ఈ వెనామీ(ఎగ్జోటిక్ స్పీసిస్)వైట్‌లెగ్ ష్రింప్‌ను దిగుమతి చేసుకునేలా నిబంధనలను సడలించింది. అమెరికాలో వెనామీని పునరుత్పత్తి చేస్తున్న కంపెనీల్లో ఎంపిక చేసిన 14 కంపెనీల నుంచి తల్లి రొయ్య దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇలా దిగుమతి చేసుకునే వెనామీని చెన్నైలోని సెంట్రల్ క్వారంటైన్లో ఐదు రోజులు అన్ని పరీక్షల అనంతరం ఒడిశా, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా.. మన రాష్ట్రంలోని హేచరీల్లో వినియోగిస్తున్నారు. వెనామీ తల్లి రొయ్య ప్రస్తుతం అమెరికాలో 80 డాలర్లు (రూ.6,400) పలుకుతోంది. కస్టమ్స్, లాజిస్టిక్, ఫ్లైట్ చార్జీలు 30 శాతం అదనంగా కలుపుకొంటే సుమారు రూ.10,000 వరకు అవుతుంది. ఇక్కడి హేచరీలు అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి ఏటా 2లక్షల నుంచి 2.50 లక్షల తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా తీరంలో 550 హేచరీలుంటే అత్యధికంగా మూడొంతులు హేచరీలు కాకినాడ తీరంలోనే ఉండటం విశేషం. మరో రెండేళ్ల సమయం.. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీకి కేంద్రం తీసుకొచ్చి న సవరణలు వెనామీ తల్లి రొయ్యల స్థానే.. దేశీయంగా తల్లి రొయ్యల ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని చెప్పొచ్చు. ఇందుకోసం రెండు దశలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. తొలి దశలో బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లు, మలి దశలో న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్(ఎన్బీఎస్)లు నెలకొల్పుకోవచ్చు. ఈ రెండు దశలు పూర్తయ్యేసరికి తల్లి రొయ్య కోసం అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు దశలు చేరుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని అంచనా. తొలి దశలో భాగంగా బీఎంసీ ద్వారా తల్లి రొయ్య స్థానంలో పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుంటారు. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లలో పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. అమెరికా నుంచి దిగుమతిచేసుకునే ఒక తల్లి రొయ్య స్థానంలో అంతే ఖర్చుతో 1000 పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేయొచ్చు. ఇలా పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుని బీఎంసీలలో పునరుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మన రాష్ట్రంలో నిర్వహించేందుకు వీలుగా పలు సెంటర్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నెల్లూరు బీఎంఆర్, భీమవరం ఆమందా, శ్రీకాకుళం కోనాబే, విశాఖలో ఎమ్పెడా బీఎంసీ(బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్)లు సిద్ధమయ్యాయి. మలి దశలో ఇక అమెరికా వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా మనమే నేరుగా తల్లి రొయ్యను పునరుత్పత్తి చేయొచ్చు. ఇందుకోసం న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు నెలకొల్పుతారు. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే నిర్వహిస్తున్న సెంటినల్ ట్రైల్స్ ఇక్కడ ఏర్పాటు చేసే ఎన్బీసీలలో నిర్వహిస్తారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకనుగుణంగా జెనెటిక్ బ్రీడింగ్, జెనెటిక్ ప్రాసెసింగ్ చేస్తారు. ఇక లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదు.. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా మన తల్లి రొయ్యను మనమే పునరుత్పత్తి చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల అమెరికా నుంచి లక్షలు ఖర్చుపెట్టి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. – హరినారాయణరావు, ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ష్రింప్హేచరీస్ అసోసియేషన్ -
పెరిగిన రొయ్యల ధరలు.. 20 కౌంట్ కేజీ ధర రూ.610
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలితంగా రొయ్యల కౌంట్ ధరలు పెంచేందుకు ప్రాసెసింగ్ కంపెనీలు ముందుకొచ్చాయి. గత నెలాఖరులో జరిగిన ఆక్వా సాధికారత కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రకటించిన ధరలను మరోసారి పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. 20 నుంచి 55 కౌంట్ వరకు కేజీకి రూ.10 చొప్పున, 56 నుంచి 100 కౌంట్ వరకు కేజీకి రూ.5 చొప్పున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. దేశంలోని మరే రాష్ట్రంలో లేనివిధంగా.. తమ పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిపై ఆక్వా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా రైతులు ఏ దశలోనూ నష్టపోకూడదన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రుల సారథ్యంలో సమావేశమైన రైతు సాధికారత కమిటీ రొయ్యల ధరలను పెంచేందుకు కృషి చేస్తోంది. ఆక్వా రైతుల సమక్షంలో ప్రాసెసింగ్ కంపెనీలు, ఎగుమతిదారులతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు జరుపుతున్న చర్చలు మంచి ఫలితమిస్తున్నాయి. గత నెలాఖరులో ప్రకటించిన ధరలు ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగగా, మంగళవారం మరోసారి పునఃసమీక్షించి.. కేజీకి రూ.5 నుంచి రూ.10 చొప్పున పెంచేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఈ నెల 9వ తేదీ నుంచి రానున్న పది రోజుల పాటు కొత్త ధరలు అమలులో ఉంటాయి. కోత పెడితే చర్యలు ప్రభుత్వం నిర్దేశించిన ధరల చెల్లింపులో ఏజెంట్లు, షెడ్ల నిర్వాహకులు కోత పెడుతున్నట్టుగా ప్రభుత్వం దృష్టికి రావడంతో ఎగుమతిదారులతో పాటు షెడ్ల యజమానులు, ఏజెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇకనుండి రైతుల నుంచి కొనుగోలు చేసే వారెవరైనా కచ్చితమైన బిల్లులు ఇచ్చి కొనుగోలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. లేకుంటే అప్సడా చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే క్రిమినల్ కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించింది. ఇతర రాష్ట్రాలకంటే మిన్నగా.. దేశంలో ఒక్క ఏపీలో మాత్రమే కౌంట్ల వారీగా ధరలను ప్రకటిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పూర్వం నుంచి కొనసాగుతున్నట్టుగా ప్రతి 10 కౌంట్లకు ఒక ధర చొప్పున నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రకటించిన కౌంట్ ధరలు పొరుగు రాష్ట్రాలతో కంటే మెరుగ్గా ఉన్నాయి. తమిళనాడు, ఒడిశా, గుజరాత్, పశి్చమ బెంగాల్, మహరాష్ట్రలో ప్రధాన కౌంట్లకు మన కంటే కేజీకి రూ.5 నుంచి రూ.25 వరకు తక్కువగానే చెల్లిస్తున్నారు. -
జోన్.. జోష్
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న ప్రణాళిక రూపొందించింది. ఆక్వా జోనేషన్ విధానంతో సాగు చేసే విస్తీర్ణం, రైతుల వివరాలతో లెక్కలు తేల్చి అన్ని విధాలా ఆదుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఈ–ఫిష్ యాప్‌లో వివరాలు నమోదు చేయడం ద్వారా ఎంత విద్యుత్ అవసరమో గుర్తించి రైతులకు విద్యుత్ చార్జీల భారం నుంచి భారీ విముక్తిని కల్పించనుంది. విడవలూరు: ఆక్వా రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆక్వా జోనేషన్ విధానం వరంగా మారనుంది. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లో రొయ్యల ధరల ఒడిదుడుకుల కారణంగా జిల్లాలోని ఆక్వా రైతులు అతలాకుతలమవుతున్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ క్షేతస్థాయిలో దళారులు మొండి చేయి చూపుతున్నారు. ఆక్వా రైతులకు అండగా ఉండేందుకు ఇప్పటికే ఆక్వా జోనేషన్ విధానం అమల్లోకి తెచ్చింది. మత్స్యశాఖ, విద్యుత్, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్న అధికారులు ఆక్వా సాగు విస్తీర్ణం, రైతుల వివరాలు, విద్యుత్ వినియోగం వివరాలను ఈ–ఫిష్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నారు. తాజాగా మరోసారి సర్వే ప్రారంభించారు. ఇంకా నమోదు చేసుకోని రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. ఆక్వా రైతులకు ఊరట ప్రతి ఆక్వా రైతు ఈ–ఫిష్‌లో నమోదు చేసుకోవడం వల్ల వారికి కరెంట్ చార్జీలు భారీగా తగ్గుముఖం పడుతాయి. జిల్లాలోని తీర ప్రాంతాలైన ఉలవపాడు, గుడ్లూరు, కావలి, బోగోలు, అల్లూరు, విడవలూరు, ఇందుకూరుపేట, తోటపల్లిగూడూరు, ముత్తుకూరు మండలాల్లో ఆక్వా సాగు కింద రొయ్యలు, చేపలను సాగు చేస్తున్నారు. ఈ 9 మండలాల్లో సుమారు 8,500 మంది రైతులు సుమారు 40 వేల ఎకరాల ఆక్వా సాగు చేస్తున్నారు. ఏటా రెండు దఫాలుగా సాగు జరుగుతోంది. ఈ సాగులో మొదటి నెలలో ఎకరా గుంతకు రెండు ఏయిరేటర్లు, రెండు మోటార్లు నిత్యం నియోగించాలి. రెండో నెలలో నాలుగు ఏయిరేటర్లు, రెండు మోటార్లు, మూడో నెలలో ఆరు ఏయిరేటర్లు, రెండు మోటార్లను రైతులు వినియోగిస్తుంటారు. ఏడాదికి రూ. 480 కోట్ల మేర భారం ప్రస్తుతం ఆక్వా సాగు కింద విద్యుత్ యూనిట్‌ను రూ.3.85 చొప్పున వసూలు చేస్తున్నారు. నెలకు ఒక ఎకరాకు రూ.30 వేల విద్యుత్ బిల్లు వస్తుంది. అయితే ఈ–ఫిష్ రీ సర్వే పూర్తయ్యాక యూనిట్ విద్యుత్‌ను రూ.1.50లకే అందిస్తారు. దీంతో నెలకు ఎకరాకు సుమారు రూ.10 వేల లోపు మాత్రమే విద్యుత్ బిల్లు వస్తుంది. ఈ లెక్కన నెలకు ప్రభుత్వంపై దాదాపు రూ.80 కోట్లు భారం పడనుంది. ఏడాదిలో ఆక్వా సాగు జరిగే ఆరు నెలలకు నెలకు రూ. 80 కోట్లు చొప్పున రూ.480 కోట్ల మేర భారం పడనుంది. ఈ– ఫిష్ నమోదు ప్రక్రియ ఇలా.. ►కేవలం 10 ఎకరాల్లోపు విస్తీర్ణం కలిగిన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ►ఆక్వా సాగు చేసే పరిధిలోని సచివాలయంలో మత్స్యశాఖ ఉద్యోగి ద్వారా నమోదు ప్రక్రియ చేసుకోవాలి. ►రైతుకు సంబంధించిన ఆక్వా సాగు విస్తీర్ణ ధ్రువీకరణ పత్రాలు, సర్వే నంబర్ పత్రాలు, విద్యుత్ సర్వీస్ నంబర్ పత్రాలు, ఆధార్‌కార్డు, మత్స్యశాఖ వారు జారీ చేసిన లైసెన్సు లేదా, కార్డును ఉద్యోగులకు అందజేయాలి. ►అనంతరం వాటిని జిల్లా మత్స్యశాఖ జేడీ కార్యాలయానికి పంపి అక్కడ నుంచి విద్యుత్ జిల్లా అధికారులకు నివేదికను అందజేస్తారు. రైతులకు భారీ ఊరట ఆక్వా జోనేషన్ నిజంగా ఆక్వా రైతుల పాలిట వరం. ప్రస్తుతం ఆక్వా సాగు ఒడిదుడుకుల మధ్య సాగడంతో నష్టాలను చవి చూస్తున్నాం. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేకపోతున్నాం. ఈ విధానంతో యూనిట్ విద్యుత్ కేవలం రూ.1.50లకే మాత్రమే పడడంతో చాలా వరకు కష్టాలు తీరనున్నాయి. – వెంకటేశ్వర్లు, రామచంద్రాపురం, విడవలూరు మండలం చిన్న రైతులకు మేలు ఈ ఆక్వా జోనేషన్ చిన్న, సన్న కారు ఆక్వా రైతులు చాల మేలు కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా కేవలం 10 ఎకరాల లోపు వారు మాత్రమే నమోదు చేసుకోవాల్సి ఉంది. చిన్న రైతులకు విద్యుత్ భారం తగ్గనుంది. చిన్న రైతులు కూడా సాగు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. – సంతోష్, ఆక్వా రైతు, గంగపట్నం, ఇందుకూరుపేట మండలం ఆక్వా జోనేషన్ వరం ఈ ఆక్వా జోనేషన్ పథకం ద్వారా విద్యుత్ చార్జీలు భారీగా తగ్గుతాయి. ఇప్పటికే మా సిబ్బంది రీ సర్వే చేసి గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సాగును నమోదు చేస్తున్నాం. ఇంకా నమోదు చేసుకోని రైతులు సచివాలయాలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. – నాగేశ్వరరావు, మత్స్యశాఖ జేడీ -
సముద్ర ఉత్పత్తుల విషయంలో ప్రత్యేక చొరవ చూపండి
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వారు సీఎంతో భేటీ అయ్యారు. కాకినాడ వద్ద ఏర్పాటు కానున్న మేజర్ బల్క్ డ్రగ్ పార్క్ వల్ల మత్స్యసంపద, సముద్ర ఉత్పత్తుల ఉనికికి ప్రమాదం ఏర్పడకుండా ప్రత్యేక చొరవ తీసుకోవాలని, డ్రగ్ పార్క్ వ్యర్థ జలాల డిశ్చార్జ్ పాయింట్ దూరం పెంచాలని హ్యాచరీస్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎంను కోరారు. దీంతో పాటు అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు సర్ప్లస్ పవర్‌ను హ్యాచరీస్‌కు ప్రత్యేక కేటగిరీ కింద ఇవ్వాలని కూడా వారు సీఎంకు విన్నవించారు. ష్రింప్ హ్యచరీస్ అసోసియేషన్ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారు. సీఎంని కలిసిన వారిలో ఆర్అండ్బీ శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, ఆలిండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి కొనకంటి మధుసూదన్‌రెడ్డి, కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ సత్తి బులివీర్రెడ్డి, నేషనల్ బాడీ వైస్ ప్రెసిడెంట్ వి.సత్తిరెడ్డి, అడ్వైజర్ ప్రత్తిపాటి వీరభద్ర కుమార్, హ్యాచరీ ఓనర్స్ కనుమూరి ఆనంద వర్మ, ఎ.నగేష్ బాబు, బి.విజయ్‌కుమార్, సి.కోదండ తదితరులు ఉన్నారు. -
విదేశాలకు మన వంగడాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ నుంచి ఏటా రూ.2,000 కోట్ల విలువైన విత్తనాలు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో టమాటా, మిరప, పుచ్చకాయ, మొక్కజొన్న తాలూకు విదేశీ వెరైటీలు కూడా ఉన్నాయి. పలు విదేశీ కంపెనీలు ఇక్కడి రైతులతో భాగస్వామ్యం కుదుర్చుకుని విత్తనాలను ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం రూ.200 కోట్ల విలువైన విదేశీ వెరైటీల విత్తనాల ఎగుమతి జరుగుతోంది. ఇక్కడి విత్తనాలకు విదేశాల్లో మార్కెటింగ్, సర్టిఫికేషన్, సబ్సిడీలతో ప్రభుత్వం ప్రోత్సహిస్తే అయిదేళ్లలో మొత్తం ఎగుమతులు నాలుగు రెట్లకు చేరడం ఖాయమని సీడ్స్‌మెన్ అసోసియేషన్ అంటోంది. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు మరింత ప్రయోజనమని చెబుతోంది. నాబార్డు సహకారంతో లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని అసోసియేషన్ ధీమాగా ఉంది. విత్తన భాండాగారాలు.. తెలుగు రాష్ట్రాలు విత్తన భాండాగారాలుగా విరాజిల్లుతున్నాయి. వాతావరణం, నేలలు అనుకూలంగా ఉండడం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న విత్తనాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాటా 60 శాతంగా ఉంది. మొక్కజొన్న, జొన్న విత్తనాల్లో 90 శాతం, సజ్జలు 85 శాతం, వరి 60 శాతం, పత్తి విత్తనాల్లో 50 శాతం తెలుగు రాష్ట్రాలు సమకూరుస్తున్నాయి. ఇక రూ.200 కోట్ల విలుౖÐð న కూరగాయల విత్తనాలు ఉత్పత్తి అవుతున్నాయి. జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీల్లో 90 శాతం ఇక్కడ కొలువుదీరాయని సీడ్స్‌మెన్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కార్న్టెక్ సీడ్స్ సీఈవో యాగంటి వెంకటేశ్వర్లు సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ రెండు రాష్ట్రాల్లో 10 లక్షలకుపైగా రైతులు విత్తన సాగులో నిమగ్నమయ్యారని చెప్పారు. రబీకి పెరగనున్న విక్రయాలు.. కోవిడ్–19 కారణంగా ఉపాధి కోల్పోయిన, ఉద్యోగాలు వదులుకున్న యువత తిరిగి గ్రామాల బాట పట్టారు. వీరిప్పుడు వ్యవసాయంపై దృష్టిసారించారని కంపెనీలు అంటున్నాయి. మరోవైపు వర్షాలు దేశవ్యాప్తంగా అంచనాలను మించి కురిశాయి. ఈ ఏడాది ఖరీఫ్‌లో పరిశ్రమ 5 శాతం వృద్ధి సాధించింది. రబీకి విత్తన అమ్మకాలు 20–25 శాతం అధికం కావచ్చని పరిశ్రమ భావిస్తున్నట్లు రాశి సీడ్స్ సీవోవో ఏ.ఎస్.ఎన్.రెడ్డి తెలిపారు. ఎంౖMð్వరీలనుబట్టి చూస్తే సాగు విస్తీర్ణమూ పెరగనుందని అన్నారు. రెండున్నర దశాబ్దాల్లో కూరగాయల ఉత్పత్తి మూడు రెట్లు అధికమైందని ఈస్ట్–వెస్ట్ సీడ్ ఎండీ దిలీప్ రాజన్ వెల్లడించారు. కాగా, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కోవిడ్–19 ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో లేదని.. ఇందుకు ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు వేగంగా స్పందించడమే కారణమని సీడ్స్‌మెన్ అసోసియేషన్ తెలిపింది. పరిశోధనకు రూ.2 వేల కోట్లు.. దేశవ్యాప్తంగా విత్తన పరిశ్రమ ఏటా 5–10 శాతం వృద్ధితో రూ.30,000 కోట్లకు చేరుకుంది. ఇందులో కూరగాయల విత్తనాల విలువ రూ.3,000 కోట్ల మేర ఉంది. మొత్తం ఎగుమతులు రూ.2,000 కోట్ల మేర జరుగుతున్నాయి. 2,000 కంపెనీలు పరిశ్రమలో నిమగ్నమయ్యాయి. ఇందులో 500 దాకా కంపెనీలు జాతీయ స్థాయిలో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధి విభాగంలో రూ.5,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జీనోమ్ ఎడిటింగ్ సాంకేతిక విధానంపై ఫోకస్ చేయనున్నందున వచ్చే రెండేళ్లలో రూ.2,000 కోట్ల పెట్టుబడులు పరిశోధన, అభివృద్ధి విభాగంలో రానున్నాయి. 16 లక్షల మంది రైతులతో కంపెనీలు చేతులు కలిపాయి. శాస్త్రవేత్తలు, తయారీ, మార్కెటింగ్ సిబ్బంది ఒక లక్ష వరకు ఉంటారు. -
రొయ్యల క్రయవిక్రయాలపై ప్రభుత్వం అప్రమత్తం
సాక్షి, అమరావతి: రొయ్యల క్రయ విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసింది. క్రయవిక్రయాలు రెవెన్యూ, మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో జరగాలని ఆదేశిస్తూ అధికారులు పాటించాల్సిన అంశాలపై మార్గదర్శకాలను విడుదల చేసింది. వారం రోజులుగా హేచరీస్ నిర్వాహకులు, ఎగుమతిదారులు కొనుగోళ్లు నిలిపివేయడం, ఒకవేళ కొనుగోలు చేసినా కిలోకు రూ.80 వరకు తక్కువ రేటును చెల్లిస్తుండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయాన్ని కొందరు రైతులు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం.. ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్న ప్రాంతాలకు ఇద్దరేసి అధికారులను నియమించింది. వారి మొబైల్ నంబర్లు రైతులకు తెలిసే విధంగా ఏర్పాట్లు చేసింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కలెక్టర్ కార్యాలయాల్లోని కంట్రోల్ రూమ్‌లు పనిచేయనున్నాయి. రైతులు తమ సమస్యలను ఈ కంట్రోలు రూమ్‌లకు తెలిపితే అధికారులు సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటారు. గతంలో ప్రభుత్వం ప్రకటించిన రేట్లకే ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు రొయ్యలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. -
రొయ్యల్లో వైరస్ : దిగుమతులపై చైనా నిషేధం
బీజింగ్ : కరోనా వైరస్ కారణంగా అతలాకుతలమైన చైనా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్రీజ్ చేసిన రొయ్యల ప్యాకేజీలో కరోనా వైరస్‌ను గుర్తించిన తరువాత చైనా ఈక్వెడార్ కు చెందిన మూడు కంపెనీల నుండి ఆహార దిగుమతులను తాత్కాలికంగా నిషేధించింది. అలాగే అధిక ప్రమాదం ఉన్న దేశాల నుండి దిగుమతి చేసుకున్న శీతలీకరించిన ఆహార ఉత్పత్తులను పరీక్షించాలంటూ దేశవ్యాప్త ప్రచారం ప్రారంభించింది. ఇటీవల బీజింగ్‌లో కరోనా విస్తరించడంతో రిఫ్రిజిరేటెడ్ వస్తువులపై తాజా పరిశీలన తరువాత ఈ నిర్ణయం తీసుకుంది. కస్టమ్స్ అథారిటీ మూడు ఈక్వడోరియన్ కంపెనీల నుండి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేసినట్టు ప్రకటించింది. డాలియన్, జియామెన్ నౌకాశ్రయం నుంచి దిగుమతైన వైట్‌లెగ్ రొయ్యల ప్యాకేజింగ్ నుండి తీసిన నమూనాల పరీక్షల్లో పాజిటివ్ తేలిందని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ అధికారి బీ కెక్సిన్ విలేకరుల సమావేశంలో చెప్పారు. జిన్‌ఫాడి క్లస్టర్‌ను కనుగొన్నప్పటి నుంచి అధికారులు 220,000 శాంపిల్స్‌ను పరీక్షించినట్టు తెలిపారు. ఇక్కడ దిగుమతి చేసుకున్న రొయ్యల ప్యాకేజీ బోర్డులో వైరస్ కనుగొన్నారు. అయితే లోపల ప్యాకేజీలోను, రొయ్యల్లోనూ వైరస్ లేదని తేలింది. అయినప్పటికీ మరోసారి ఆహార దిగుమతులపై చైనా నిషేధాన్ని ప్రకటించింది కాగా గత నెలలో చైనా రాజధాని బీజింగ్ నగరంలో జిన్‌ఫాది హోల్‌సేల్ మార్కెట్ ద్వారా కరోనా వైరస్ రెండో దశలో విజృంభించిన సంగతి తెలిసిందే. తొలిదశలో అమెరికానుంచి టైసన్ పాల ఉత్పత్తులను, జర్మన్ మాంసం ఉత్పత్తుల దిగుమతులను నిషేధించింది. -
'రొయ్య'లసీమ
ప్రొద్దుటూరు: రాళ్లురప్పలతో కరువు ప్రాంతాన్ని తలపించే రాయలసీమ.. నేడు రొయ్యలు, చేపలు వంటి మత్స్యసంపదతో కళకళలాడుతోంది. వైఎస్సార్ జిల్లా చాపాడు మండలమైతే చేపల చెరువులతో కోనసీమను తలపిస్తోంది. ఒక్క రైతుతో 30 ఎకరాల్లో మొదలైన సాగు క్రమంగా వందల ఎకరాలకు విస్తరిస్తోంది. వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఇక్కడి రొయ్యలు, చేపలను ఎగుమతి చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత మంది రైతులు ఆక్వా సాగుకు ముందుకు వస్తున్నారు. భీమవరం టూ వైఎస్సార్ జిల్లా.. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు. ఆ సందర్భంగా అక్కడి రైతులతో రొయ్యలు, చేపల సాగు గురించి ఆరా తీశారు. అదే సమయంలో పోరుమామిళ్ల మండలం ఎరసాల గ్రామానికి చెందిన కల్లూరి భాస్కర్‌రెడ్డి భీమవరం ప్రాంతంలో చేపలు, రొయ్యలు సాగు చేస్తున్నాడని తెలుసుకుని ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు. మన ప్రాంతంలో వీటిని సాగు చేస్తే బాగుంటుందని, ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ మేరకు చాపాడు మండలంలోని అనంతపురం–కుచ్చుపాప గ్రామాల మధ్య తనతో పాటు తన బంధువులు, గ్రామస్తులకున్న భూములను భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే లీజుకు ఇప్పించారు. ఆయన తొలుత 30 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగును ప్రారంభించి ప్రస్తుతం 100 ఎకరాలకు పైగా విస్తీర్ణానికి పెంచారు. రొయ్యల సాగును కూడా చేపట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రూప్‌చంద్, కట్ల, శీలావతి, మోస్, పండుగప్ప, సీతల్ రకాల చేపలను సాగు చేస్తున్నారు. కుందూనది పరీవాహక ప్రాంతలో ఈ భూములు ఉండగా నీటి లభ్యత కోసం మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు. ఆరు అడగుల మేర నీరు నింపి.. పలు చోట్ల చెరువులను తయారు చేశారు. దూర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకోనవసరం లేకుండా ఈ ప్రాంతంలోని వారికే శిక్షణ ఇచ్చి నియమించుకున్నారు. ఇక్కడ 8 కిలోల వరకు చేపలు పెరుగుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పాటు సీతల్ రకం చేపలను బంగ్లాదేశ్‌కు ఎగుమతి చేశారు. కడపలో చేపల చెరువులా! కేవలం 9వ తరగతి చదువుకున్న భాస్కర్‌రెడ్డి సాగులో కొత్త మెళకువలను పాటించి అధిక ఉత్పత్తిని సాధిస్తున్నారు. తన కుమార్తెను గుజరాత్లో పీజీ ఫిషరీసైన్స్ చదివించారు. ఆమె డిగ్రీ, పీజీల్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇటీవల మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డితో పాటు ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప పార్లమెంట్ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు ఈ చేపల చెరువులను సందర్శించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చేపల చెరువుల సాగు విషయాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు దృష్టికి తీసుకెళ్లారు. ‘కడపలో చేపల చెరువులా..’ అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ఎమ్మెల్యే ‘సాక్షి’కి తెలిపారు. ఆక్వా బిల్లుతో సాగుకు ముందుకొస్తున్న రైతులు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో చేపలు, రొయ్యల సాగు అభివృద్ధి, ఎగుమతులు తదితరాలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని మరికొన్ని చోట్ల కూడా చేపలు, రొయ్యలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. చేపలు, రొయ్యల సాగుకు సహకారం అందిస్తున్నా.. నా స్వగ్రామం పరిధిలోని అనంతపురం గ్రామం వద్ద చేపలు, రొయ్యల సాగు విస్తీర్ణానికి సహకారం అందిస్తున్నాను. ఇక్కడ కుందూ నీరు వస్తేనే పంటలు పండే అవకాశముంది. లేని రోజుల్లో కౌలు కూడా రాని పరిస్థితిని చూశాం. ఈ కారణంతోనే చేపల చెరువులను సాగు చేయడం మంచిదని భావించా. ప్రస్తుతం రైతులకు మంచి కౌలు వస్తోంది. చెరువులను పరిశీలించి.. ఎగుమతులకు తగిన సహకారం అందించాలని కలెక్టర్‌ను కూడా కోరాను. – శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు. ఆశాజనంగా ఉంది భీమవరంలో పొందిన అనుభవంతో ఇక్కడ చేపలు, రొయ్యల చెరువులను సాగు చేస్తున్నా. ఇప్పటివరకు సాగు ఆశాజనకంగా ఉంది. అధికారుల నుంచి పూర్తి సహాయ సహకారాలు అందితే మరింత వేగంగా వృద్ధి చెందే అవకాశముంది. చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు ఆదివారం ఉదయం చేపలు విక్రయిస్తున్నా. – కల్లూరి భాస్కర్‌రెడ్డి, రైతు -
రొయ్యలకూ క్వారంటైన్!
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తితో క్వారంటైన్ అనేది విస్తృత వ్యాప్తిలోకి వచ్చింది. అయితే కరోనాకు ముందు నుంచే తల్లి రొయ్యల (బ్రూడర్)ను క్వారంటైన్లో ఉంచే విధానం ఉంది. ఆక్వా చెరువుల్లో వెనామీ రకం రొయ్యల పెంపకానికి హేచరీ నిర్వాహకులు విదేశాల నుంచి గుడ్లతో ఉన్న తల్లి రొయ్యల (బ్రూడర్ల)ను దిగుమతి చేసుకుంటారు. వాటికి వ్యాధుల నిర్ధారణకు వారం రోజులపాటు ఆక్వాటిక్ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధుల్లేవని తేలాకే హేచరీలకు తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. దేశం మొత్తమ్మీద చెన్నైలో ఒకే ఒక్క ఆక్వాటిక్ క్వారంటైన్ సెంటర్ ఉంది. హేచరీల యజమానులు దిగుమతి చేసుకున్న తల్లి రొయ్యలను ఈ కేంద్రంలోనే పరీక్షకు పంపుతారు. ► అమెరికా, వియత్నాం, థాయిలాండ్ దేశాల నుంచి వ్యాధుల్లేని బ్రూడర్ రొయ్యలను దిగుమతి చేసుకోవడానికి మాత్రమే భారత ప్రభుత్వం రిజిస్టర్డ్ హేచరీలకు అనుమతించింది. ► ఆ రొయ్యలకు వ్యాధులుంటే వాటి ద్వారా ప్రజలకు వైరస్ కారక జబ్బులు సంక్రమిస్తాయన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ క్వారంటైన్ విధానాన్ని అమలుచేస్తోంది. ► దేశంలో మొత్తం 500 హేచరీలుండగా ఒక్క ఏపీలోనే 391 ఉన్నాయి. గతేడాది దేశం మొత్తంమీద 8.05 లక్షల టన్నుల వెనామీ రొయ్యల ఉత్పత్తి జరగ్గా.. రాష్ట్రంలో 5.70 లక్షలుండటం (71 శాతం) విశేషం. ఇక్కడ 80 వేల హెక్టార్లలో వెనామీ రొయ్యలు సాగవుతున్నాయి. ► రాష్ట్రంలో రొయ్యల ఉత్పత్తిని దృష్టిలో ఉంచుకుని విశాఖ జిల్లా బంగారమ్మపాలెంలో ఆక్వాటిక్ క్వారంటైన్ సెంట ర్ను ఏర్పాటు ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. 2018 మార్చిలో శంకుస్థాపన చేశారు. స్థల సమస్యలు తలెత్తడంతో అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం మానేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక భూసమస్యను పరిష్కరించింది. ► ఇప్పుడు అక్కడ 30 ఎకరాల్లో రూ.35 కోట్లు వెచ్చించి ఈ క్వారంటైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. నెలాఖరుకల్లా టెండర్లు పిలుస్తామని మత్స్య శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. చెన్నైలోని ఆక్వాటిక్ క్వారంటైన్ ► విదేశాల నుంచి దిగుమతి అయిన తల్లి రొయ్యలకు ఎప్పట్నుంచో కొనసాగుతున్న విధానం ► వైరస్ లేదని తేలాకే హేచరీలకు.. ► విశాఖ జిల్లాలో త్వరలో ఆక్వాటిక్ క్వారంటైన్ సెంటర్ -
ఏ రొయ్యలో ఏ'మందో'..
పశ్చిమగోదావరి, భీమవరం టౌన్: రొయ్యల ఇగురు.. చూడగానే ఎవరికైనా లొట్టలేస్తూ తినేయాలనిపిస్తుంది. ఇక ఆక్వాకు పేరుపడ్డ పశ్చిమగోదావరి జిల్లాల్లో రొయ్యల వంటకాలు భోజన ప్రియుల నోరూరిస్తుంటాయి. అయితే కొందరు ఆక్వా రైతులు ఇష్టానుసారం యాంటీ బయాటిక్స్ వాడడంతో రొయ్యల్లో ఉండిపోతున్న వాటి అవశేషాలు మన శరీరంలోకి నేరుగా చేరి అనారోగ్యాలకు కారణమవుతున్నాయి. యాంటీ బయోటిక్స్ మన శరీరంలోకి ప్రవేశిస్తున్నా అంతకుముందే వాటిని గుర్తించే వ్యవస్థ మన వద్ద లేదు. జిల్లాలో యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వాడుతూ వేలాది టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేస్తూ విక్రయిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే మందుల తయారీ సంస్థలపై చర్యలు లేవు. సరుకు తిప్పిపంపాక అప్రమత్తం నిషేధిత యాంటీబయోటిక్స్‌పై రైతులకు అవగాహన లేక దుకాణాల నుంచి వాటిని ద్రావణం, పొడి రూపంలో తెచ్చి చెరువుల్లో వాడుతున్నారు. మన జిల్లా నుంచి కంటైనర్లలో విదేశాలకు ఎగుమతి చేసిన రొయ్యల నాణ్యతను అక్కడ పరీక్షించి వాటిలో యాంటీబయోటిక్స్ అవశేషాలు గుర్తిస్తే సరకును వెనక్కి తిప్పి పంపుతున్నారు. పంపే ముందు నాణ్యత పరీక్షించడం, రైతులు యాంటీ బయాటిక్స్ వాడకుండా అవగాహన కల్పించడం చేయకుండా తిప్పిపంపాక అధికార యంత్రాంగం అప్రమత్తమవుతుంది. గతంలో పలుమార్లు తిప్పిపంపిన విదేశాలు మన రొయ్యలను విదేశాలు వెనక్కి పంపడం కొత్త కాదు. ఏడాది క్రితం అమెరికా, యూరోపియన్ దేశాలు తిరస్కరించిన రొయ్యల్లో 11 కంటైనర్లు పశ్చిమగోదావరి జిల్లాకు చెందినవే. ఇటీవల అమెరికా, యూరప్ దేశాల నుంచి రాష్ట్రానికి 9 కంటైనర్ రొయ్యలు తిరిగి రాగా.. వీటిలో జిల్లాకు చెందిన కంటైనర్లు రెండు ఉన్నాయి. మత్స్యశాఖ జిల్లా సంయుక్త అధికారిణి ఎస్.అంజలి, ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఈ కంటైనర్లు వచ్చిన విషయాన్ని ఈ నెల 6న ఆకివీడులో జరిగిన ఆక్వా సదస్సులో ప్రస్తావించారు. రొయ్యల సాగులో ఎంతో పురోగతి సాధిస్తున్నామని చెప్పుకుంటున్నా రొయ్యల్లోని యాంటీ బయాటిక్స్‌ను ముందుగా గుర్తించడంలో మనవద్ద ఉన్న సాంకేతికత అంతంతమాత్రమే. దశాబ్దంన్నర క్రితం మన రొయ్యల్లో యాంటీ బయోటిక్స్ అవశేషాలను గుర్తించిన ఆస్ట్రేలియా నేటికి దిగుమతి చేసుకోవడం లేదు. పరిజ్ఞానం అంతంతమాత్రమే రొయ్యల ఉత్పత్తిలో యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించే పరిజ్ఞానం మన వద్ద అంతంత మాత్రంగా ఉంది. పట్టుబడికి ముందు ఫ్రీ హార్వెస్ట్ టెస్ట్ (పీహెచ్‌టీ) చేస్తారు. ఎంపెడా ఆధ్వర్యంలో రాష్ట్రంలో 7 చోట్ల ఇలాంటి ప్రయోగశాలలున్నాయి. భీమవరం ఒకటి, నెల్లూరులో (లిక్విడ్ క్రొమిటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రిక్) ఒక ప్రయోగశాల ఉన్నాయి. యాంటీ బయోటిక్స్‌తో ముప్పు కొన్ని జాతుల సూక్ష్మజీవుల్ని ఉపయోగించి వాటి జీవన ప్రక్రియ ఆధారంగా తయారు చేసే రసాయనిక మందులే ఈ యాంటీ బయాటిక్స్. ఇవి మిగిలిన సూక్ష్మజీవుల పెరుగుదలను నియంత్రిస్తాయి. వాటి ప్రభావం 21 రోజుల వరకూ మాత్రమే ఉండాలి. ప్రస్తుత యాంటీబయోటిక్స్ ప్రభావం అంతకు మించి ఉంటున్నాయి. అలాంటి రొయ్యలు తినడంతో మానవ శరీరంలోకి యాంటీబయోటిక్స్ అవశేషాలు ప్రవేశిస్తున్నాయి. అలాంటి రొయ్యలతో రోగాలు ఫ్రీ క్లోరామ్ఫెనికాల్, ప్యూరాజోలిడాన్ తదితర మందుల వల్ల అప్లాస్టిక్ ఎనిమియా తరహా వ్యాధులు వస్తాయి. జీర్ణకోశంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎముక మూలుగులో రక్త తయారీ ప్రక్రియ నిలిచిపోయి రక్తహీనతకు గురవుతాం. నిషేధిత యాంటీబయోటిక్స్ శరీరంలో ఉంటే మరే మందులు పనిచేయవు. ఒక్కోసారి క్యాన్సర్‌కు దారితీయవచ్చని వైద్య నిపుణులు ఇప్పటికే గుర్తించారు. అనుమతి లేకుండా.. రొయ్యలకు మేలు చేసేందుకు నీటిలో, మేతలో, చెరువు నేలలో వాడే ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఈ పేరు చెప్పి యాంటీబయోటిక్స్ అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన ప్రమాణాలు పాటించకుండా హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తితో యాంటీబయోటిక్ అవశేషాలు బయటపడుతున్నాయి. పొలాల్లో పురుగుమందుల వాడకంతో వ్యర్థ జలాలు పంట కాల్వలు, బోదెల్లోకి ప్రవేశించడం, ఆ నీరు రొయ్యల చెరువులకు మళ్లించడంతో కూడా ఈ అవశేషాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. ఆక్వా ఉత్పత్తుల పెంపకంలో మొత్తం 20 రకాల యాంటీ బయోటిక్స్‌ను నిషేధించారు. 1. క్లోరామ్ఫెనికాల్ 2. నెట్రోప్యూరాన్స్, ప్యూరాజోలిడాన్, నెట్రోప్యూరాజోన్, ప్యూరాల్టోడాన్, నెట్రో ప్యూరాన్టాయిన్, ప్యూరైల్ ప్యూరామైడ్, నెప్యూరటల్, నెపురోగ్జిమ్, నైఫర్ప్రజైన్, వాటి నుంచి వచ్చే ఉత్పాదనలు 3. నియోమైసిన్ 4. నాలిడిక్సిక్ ఆసిన్ 5. సల్ఫా మిథాక్వోజిల్ 6. అరిస్టాలోకియా మొక్కల నుంచి తయారు చేసే మందు 7. క్లోరోఫాం 8. క్లోర్ప్రోమజైన్ 9. కోల్చిసిన్ 10. డాప్సోన్ 11. డైమిట్రీ డాజోల్ 12. మెట్రోనిడాజోల్ 13. రోనిడాజోల్ 14. ఇప్రానిడాజోల్ 15. ఇతర నైట్రోమిడాజోల్స్ 16. క్లెన్ బ్యుటరాల్ 17. డైఇథైల్ స్టిల్ బిన్స్టిరాల్ 18. సల్ఫోనమైడ్ 19. ఫ్లోరిక్వినోలోన్స్ 20. గ్లైకోపెప్టిడ్స్ -
ఈ గుర్రమెందుకు‘రొయ్యో’..
చేపలు పట్టాలంటే ఏం కావాలి? ముందుగా ఓ వల.. ఆ తర్వాత పడవ.. కదా.. ఇదే ప్రశ్న.. బెల్జియంలోని ఓస్ట్‌డూన్‌కెర్క్‌కు వెళ్లి అడగండి.. ముందుగా ఓ వల.. ఆ తర్వాత గుర్రం అని సమాధానమిస్తారు.. గుర్రానికి చేపల వేటకు ఏం సంబంధం? ఉంది.. ఎందుకంటే.. ఇక్కడ గుర్రమెక్కే ష్రింప్స్(రొయ్యల్లాంటివి), చేపలను వేటాడతారు. గుర్రాలు దాదాపుగా నడుంలోతు మునిగేస్థాయి వరకూ సముద్రంలోకి వెళ్లి.. తిరిగి తీరం వైపు వస్తారు. వెనుక వైపు వల కట్టి ఉంటుంది. తీరానికి వచ్చాక.. అందులో చిక్కే ష్రింప్స్, ఇతర చేపలను అమ్ముకుంటారు. ష్రింప్స్‌తో చేసిన వంటకాలకు అక్కడ తెగ డిమాండ్ ఉంది.. 500 ఏళ్ల క్రితమైతే బెల్జియంతోపాటు ఫ్రాన్స్, నెదర్లాండ్స్, దక్షిణ ఇంగ్లండులలో ఇలా గుర్రమెక్కే ష్రింప్స్‌ని వేటాడేవారు. అప్పట్లో అది ఎంత ప్రాచుర్యం పొందిందంటే.. గుర్రమెక్కి చేపలు వేటాడుతున్న మత్స్యకారుల విగ్రహాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత తర్వాత ఆధునిక పద్ధతుల రాకతో ఈ తరహా విధానం కనుమరుగైపోయింది. ప్రస్తుతం ఓస్ట్‌డూన్‌కెర్క్‌లో మాత్రమే గుర్రమెక్కి చేపలను పట్టే మత్స్యకారులు ఉన్నారు. అదీ ఓ డజను కుటుంబాలు మాత్రమే. వారు కూడా పర్యాటకుల కోసం.. తమ సంప్రదాయాన్ని బతికించుకోవడం కోసం దీన్ని కొనసాగిస్తున్నారు. -
మే నాటికి వాటర్‌బేస్ హ్యాచరీ రెడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రొయ్యల దాణా ఉత్పత్తిలో ఉన్న వాటర్‌బేస్ నెల్లూరు జిల్లాలో హ్యాచరీని ఏర్పాటు చేస్తోంది. రామతీర్థం సమీపంలో రానున్న ఈ ప్లాంటులో ఏటా 50 కోట్ల పిల్ల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు. తొలి దశ ప్లాంటు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానుంది. రెండో దశ 2019 జనవరిలో కార్యరూపంలోకి వస్తుంది. ప్రాజెక్టు కోసం మొత్తం రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ మొత్తంలో సగం రుణం ద్వారా సమకూర్చుకుంటామని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. తొలి ఏడాది రూ.10 కోట్లు: వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచే హ్యాచరీ ద్వారా కంపెనీకి ఆదాయం సమకూరనుంది. 2018–19లో రూ.10 కోట్లు, 2019–20లో రూ.25 కోట్ల ఆదాయాన్ని వాటర్‌బేస్ ఆశిస్తోంది. కాగా, దాణా తయారీకి కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 1,10,000 టన్నులు ఉంది. ప్రస్తుతం 50,000 టన్నులు విక్రయిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 60,000 టన్నులు దాటనుందని అంచనా వేస్తోంది. కంపెనీ 2017–18 ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.277 కోట్ల టర్నోవర్‌పై రూ.27 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీకి అవార్డు: వాటర్బేస్కు రొయ్యల దాణా విభాగంలో ఆసియాస్ మోస్ట్ వాల్యుయేబుల్ బిజినెస్ బ్రాండ్ అవార్డు వరించింది. సింగపూర్‌లో జరిగిన ఆసియన్ బ్రాండ్, లీడర్షిప్ కాంక్లేవ్‌లో కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల ఈ అవార్డు అందుకున్నారు. ఐబ్రాండ్స్ 360 ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది. -
త్వరలో మార్కెట్లోకి తెలంగాణ రొయ్య!
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లోకి త్వరలో తెలంగాణ రొయ్యలు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన రొయ్య ఇప్పుడు రాష్ట్రంలోనూ ఉత్పత్తి అవుతున్నాయి. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం రొయ్యలను పెంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం మత్స్యశాఖ 12 రిజర్వాయర్లలో 85 లక్షల నీలకంఠ రొయ్య పిల్లలను వదిలింది. నాలుగైదు నెలల్లో అవి మార్కెట్లోకి రాబోతున్నాయి. దాదాపు 6 లక్షల కిలోల రొయ్య ఉత్పత్తి కానుందని అంచనా వేస్తున్నారు. రిజర్వాయర్లలో వదిలిన రొయ్యలను నిర్ణీత పరిమాణంలో పెరిగాక స్థానికంగా ఉండే మత్స్య శాఖ సొసైటీ సభ్యులు మార్కెట్లకు తరలిస్తారు. ఇప్పటివరకు తెలంగాణకు అవసరమైన రొయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచే దిగుమతి చేసుకునేవారు. దీంతో తాజా రొయ్యలు అందుబాటులో లేక వినియోగదారులు వాటి పట్ల పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రైతులు వనామి ఉప్పునీటి రొయ్యను ఉత్పత్తి చేశారు. మున్ముందు చెరువుల్లోనూ.. రొయ్యల సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని మత్స్యశాఖ భావిస్తోంది. రిజర్వాయర్లలోనే కాకుండా చెరువుల్లోనూ రొయ్యలను పెంచేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇప్పటికే 50 కోట్ల చేపలను దాదాపు 12 వేల చెరువులు, రిజర్వాయర్లు, ఇతర నీటి వనరుల్లోకి వదిలారు. ప్రభుత్వం రొయ్యలపై దృష్టిసారిస్తే మత్స్యకారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. పైగా రొయ్యలను, చేపలను కలిపి కూడా సాగు చేయొచ్చని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే మత్స్యకారులకు లాభసాటి వ్యాపారంగా రొయ్యలు ఉంటాయని అధికారులు పేర్కొంటున్నారు. -
ఉచితంగా రొయ్య పిల్లలు
కొత్తగా 9 జలాశయాల్లో రొయ్యల పెంపకానికి సర్కారు నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గతేడాది నుంచి చేప విత్తనాన్ని లబ్ధిదారులకు ఉచి తంగా పంపిణీ చేసి చెరువులు, జలాశ యాల్లో పెంచుతున్న సర్కారు... ఈ ఏడాది నుంచి రొయ్య విత్తనాన్ని కూడా ఉచితంగా ఇచ్చి తొమ్మిది జలాశయాల్లో పెంచాలని నిర్ణయించింది. తద్వారా ఒకవైపు చేపలు, మరోవైపు రొయ్యలను రాష్ట్ర మార్కెట్లో దింపాలని భావిస్తోంది. జలాశయాల్లో 1.51 కోట్ల రొయ్య పిల్లల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తోంది. రొయ్య విత్తనాన్ని కొనుగోలు చేసేందుకు త్వరలో టెండర్లు పిలుస్తామని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఈ మేరకు ఆర్థికశాఖ అనుమతి కూడా ఇచ్చిందన్నారు. రొయ్యల ఉచిత పంపిణీకి రూ. 2 కోట్ల మేరకు ఖర్చు కానుందని అంచనా వేశామన్నారు. రాష్ట్రం లో గతేడాది 5,189 టన్నుల రొయ్యలు ఉత్పత్తి అయినా వాటిల్లో ఎక్కువ భాగం ఎగుమతి అయ్యాయి. మిగిలిన వాటిని నెల్లూరు తదితర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి విదేశాలకు ఎగుమతి చేశారు. స్థానిక ప్రజలు ఏపీ సహా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రొయ్యలను కొను గోలు చేసి తింటున్నారు. దీంతో ఈ ఏడాది 9 జలాశయాల్లో రొయ్యలను పెంచాక లాభనష్టాలను అంచనా వేసి వచ్చే ఏడాది నుంచి అన్ని రిజర్వాయర్లు, చెరువుల్లోనూ పెంచుతామని అధికారులు తెలిపారు. -
రొయ్య.. అదిరిందయ్యా
♦ దిగుబడి తగ్గడంతోధరల పెరుగుదల ♦ సగంపైగా తగ్గిన ఎగుమతులు ♦ 25 కౌంట్ కిలో రూ.540 ♦ వైరస్ దెబ్బతో చెరువులు ఖాళీ భీమవరం: జిల్లాలో రొయ్యల రైతులకు మంచిరోజులు వచ్చాయి. రొయ్యల ధరలు మీసం మెలేస్తున్నాయి. నెల రోజులుగా ధరలు పెరుగుదలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన రొయ్యల సాగు విస్తీర్ణం, తెగుళ్లు దాడి, మే నెల నుంచి పడిపోయిన ధరలతో దిగాలు పడిన రైతులు ప్రస్తుత ధరలతో ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం 25 కౌంట్ కిలో రొయ్యలు రూ.540, 30 కౌంట్ రూ.450, 100 కౌంట్ రూ.250 పలుకుతోంది. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నా రైతులు వద్ద సరుకు అంతంత మాత్రంగానే ఉందని తెలిసింది. ఇప్పటిధరలతో మరింత వేగంగా సాగుకు ఉపక్రమించాలని రైతులు భావిస్తున్నారు. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో.. జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా దాదాపు 50 వేల ఎకరాలకు పైగా రొయ్యలు సాగు చేస్తున్నట్టు అంచనా. ఏడాది మొదట్లో రొయ్యల ధరలు ఆశాజనకంగా ఉండటంతో చాలా మంది డెల్టాలోని మూడు పంటలు పండే సారవంతమైన భూములను సైతం రొయ్యల చెరువులుగా మార్చేశారు. చెరువుల తవ్వకంపై ఆంక్షలున్నా కొందరు రెవెన్యూ, వ్యవసాయశాఖ, మత్స్యశాఖ అధికారులకు పెద్దమొత్తంలో ముడుపులు ముట్టచెప్పి ప్రసన్నం చేసుకుని మరీ చెరువులు తవ్వినట్టు తెలుస్తోంది. ఇలా ఈ ఏడాది వేసవిలో భీమవరం, పాలకొల్లు, ఉండి, ఆచంట, ఉంగుటూరు, తణుకు తదితర అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సుమారు 10 వేల ఎకరాలకు పైగా చెరువులు తవ్వినట్టు అంచనా. తెగుళ్ల దాడి గతంలో టైగర్ రకం రొయ్యలు సాగు చేసిన రైతులు తెగుళ్ల బారిన పడుతుండటంతో వనామీ సాగు చేపట్టారు. మంచి లాభాలు ఆర్జించిన రైతులు ఎక్కువ విస్తీర్ణంలో రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మేలో వనామీ రొ య్యలు సైతం వైరస్, వైట్‌స్పాట్ తెగుళ్లు సోకి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. సీడ్ వేసిన నెలలోపు రొయ్యల పిల్లలు మృత్యువాతపడటంతో పెట్టుబ డులు సైతం దక్కక నష్టపోయారు. తెగు ళ్లు కారణంగా పట్టుబడులు పెరిగిపోవడంతో రొయ్యల కొనుగోలుదారులు సిం డికేటుగా మారి ధరలను మరింత తగ్గించి వేశారు. వాతావరణం అనుకూలించకపోవడం, తెగుళ్లు కారణంగా పలువురు రైతులు తిరిగి సీడ్ వేయకుండా చెరువులను ఖాళీగానే ఉంచేశారు. ప్రస్తుతం రొయ్యల పట్టుబడులు అంతంతమాత్రంగానే ఉండటంతో మరింత ధర పలుకుతోంది. అక్కడక్కడా కొందరు రై తులు అత్యంత జాగ్రత్తగా పెంచి, పోషిం చిన రొయ్యలను ప్రస్తుతం పట్టుబడులు పడుతుంటే వ్యాపారులు హెచ్చుధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ ధరలు మ రింత పెరిగే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. -
అయ్యో.. రొయ్య
బుచ్చిరెడ్డిపాళెం : జిల్లాలో వెనామీ రొయ్య ఎదురీదుతోంది. కష్టాల కోర్చి పెంచిన రైతులకు నష్టాలు మిగులుస్తోంది. సాధారణంగా రొయ్య సైజు ఎంత పెరిగితే అంత ఎక్కువ ధర లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు అందుకు భిన్నంగా మారాయి. రొయ్యల కొనుగోలుదారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. నెల రోజుల వ్యవధిలో కిలోకు రూ.100 నుంచి రూ.120 వరకు ధర తగ్గింది. దీంతో రైతులు టన్నుకు రూ.లక్ష వరకు నష్టపోతున్నారు. ప్రధానంగా 30, 40, 50, 60 కౌంట్ రొయ్యలపై ధరల ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో రొయ్యలు పెంచుతున్నారు. వీటిలో 95 శాతం వెనామీ రకమే. రోజుకు 200 టన్నుల రొయ్యల జిల్లా నుంచి ఎగుమతి అవుతున్నాయి. నెల రోజుల్లో 6 వేల టన్నులను ఎగుమతి చేయగా.. టన్నుకు రూ.లక్ష చొప్పున ధర తగ్గడంతో రూ.60 కోట్లను జిల్లా రైతులు నష్టపోయారు. ధర పడిపోవడంతో జిల్లాలో సుమారు 3 వేల ఎకరాల్లో 30, 40 కౌంట్‌కు వచ్చిన రొయ్యలను పట్టుబడి పట్టకుండా చెరువుల్లోనే ఉంచేశారు. తక్కువ ధరకు అమ్ముకోలేక.. చెరువుల్లోనే ఉంచి మేపలేక ఆక్వా రైతులు సతమతమవుతున్నారు. కొందరైతే చచ్చినోడి పెళ్లికి.. వచ్చిందే కట్నం అన్నట్టుగా అయినకాడికి అమ్ముకుంటూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. దళారుల మాయాజాలమేనా! రొయ్యలను ఇతర రాష్ట్రాలకు, దేశాలకు ఎగుమతి చేసేవారి సంఖ్య జిల్లాలో చాలా తక్కువ. దీంతో దళారులు రైతుల వద్దకు వెళ్లి పట్టుబడికి వచ్చిన రొయ్యలను కొనుగోలు చేస్తున్నారు. వీరంతా సిండికేట్‌గా ఏర్పడి 15 రోజులకు ఒకసారి సమావేశమవుతూ ధరలను నిర్ణయిస్తున్నారు. మార్కెట్లో ధర బాగున్నప్పటికీ దళారులు మాత్రం తగ్గించేశారని రైతులు వాపోతున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే కేజీకి రూ.100 నుంచి రూ.120 వరకు ధర తగ్గించారని చెబుతున్నారు. 30 కౌంట్ రొయ్యల కేజీ ధర నెల రోజుల క్రితం రూ.550 ఉండగా.. ప్రస్తుతం రూ.440కి పడిపోయింది. 40 కౌంట్ ధర రూ.440 నుంచి రూ.340కి, 50 కౌంట్ ధర రూ.360 నుంచి రూ.260కి, 60 కౌంట్ ధర రూ.350 నుంచి రూ.230కి తగ్గించేశారు. వ్యాపారులు చెబుతున్న కారణాలివీ రొయ్యల్ని ఎగుమతి చేసే వ్యాపారులు ఇన్ని టన్నుల వరకు సరుకు సరఫరా చేస్తామని దిగుమతిదారులతో ముందుగానే ఒప్పందాలు చేసుకుంటారు. ఒప్పందం ప్రకారం లక్ష్యం పూర్తయిన అనంతరం కూడా ఎగుమతులు చేస్తే కొనుగోలు ధరల్లో వ్యత్యాసం ఉంటుందని చెబుతున్నారు. లక్ష్యాల మేరకు ఎగుమతులు పూర్తికావడంతో బయ్యర్లు కొనుగోలు చేయడం లేదని.. ఆ కారణంగానే ధరలను తగ్గించాల్సి వచ్చిందంటున్నారు. అయితే, ఇది అసలు కారణం కాదని రైతులు కొట్టిపారేస్తున్నారు. లక్ష్యం మేరకు కొనుగోళ్లు పూర్తయ్యాయనేది వట్టిమాటేనంటున్నారు. వ్యాపారులంతా బృందంగా ఏర్పడి ధరలు తగ్గించేసి తమను నిలువునా ముంచేస్తున్నారని రైతులు వాపోతున్నారు. -
వివాదాస్పదంగా రొయ్యల చెరువులు
తవ్వకాలు అడ్డుకున్న గ్రామస్తులు అనమతించింది 16, తవ్వేసింది 150 ఎకరాలు ఎదురుచెప్పిన వారిపై పోలీసు కేసులు సిరిపురం ప్రజల తిరుగుబాటుతో వెనుదిరిగిన పోలీసులు కలెక్టర్ కలుగజేసుకోవాలని వినతి కరప (కాకినాడ రూరల్) : కరప మండలం సిరిపురంలో రొయ్యల చెరువు తవ్వకాలు వివాదాస్పదంగా మారాయి. రొయ్యల చెరువులు తవ్వొద్దని ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకిస్తున్నా తవ్వకం పనులు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. పనులు జరగకుండా రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. రొయ్యల చెరువుల వల్ల తాగు నీరు, పంచాయతీ చెరువులు, పంట కాలువలు కలుషితమై పోతున్నాయని గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని అధికారులు, పోలీసుల పనితీరుపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. 16 ఎకరాలకు అనుమతి తీసుకుంటే 150 ఎకరాలు రొయ్యల చెరువులుగా తవ్వేశారని సిరిపురం, జి.భావారం తదితర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ వ్యక్తి వందలాది ఎకరాలు రొయ్యలు చెరువులు తవ్వేస్తున్నా నాదస్వరం విన్న నాగుపాము తలాడించినట్టుగా రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీసుశాఖాధికారులు ఆనాయకుడికి వంతపాడుతున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. పంట కాలువలు మూసేసినా, రహదారులు «ఇస్టానుసారంగా తవ్వేస్తున్నా, ప్రభుత్వ స్థలంలో 11 కేవీ విద్యుత్ ట్రాన్స్‌ఫారమ్‌లు ఏర్పాటు చేసినా, దిగువ నుంచి ఎగువకు రొయ్యల చెరువుల్లోని మురికినీరు పోయేందుకు డ్రెయిన్లు తవ్వేస్తున్నా ఇరిగేషన్, పంచాయతీరాజ్‌శాఖ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు, రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎదురుచెప్పిన వారిపై అధికారపార్టీ అండదండలతో పోలీసు, కోర్టు కేసులు బనాయిస్తున్నారని, ఇలాగైతే గ్రామంలో ఉండాలా, వద్దా అని సిరిపురం గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. పంట పొలాలు చెరువులుగా తవ్వేస్తుండటంతో ఉపాధికోల్పోతున్నామని కౌలు రైతులు, పనుల్లేక పస్తులుండాల్సి వస్తోందని కూలీలు, పంట, మురుగు కాలువ లు ఆక్రమించేసుకోవడం వల్ల తమ భూములకు సాగునీరందడం లేదని రైతులు, రొయ్యల చెరువులవల్ల తాగునీరు కలుషితమవుతున్నాయని, దుర్వాసనతో, దోమలతో గ్రామంలో ఉండలేకపోతున్నామని గ్రామస్తులు ఇలా అన్ని వర్గాలవారు ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. తహసీల్దార్ బూసి శ్రీదేవి గ్రామానికి వచ్చినప్పుడు తమ బాధలు చెప్పుకున్నా, పనులు ఆపలేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నెల ఒకటో తేదీన పొక్లెయిన్‌తో రోడ్డు తవ్వుతుంటే ఆపామని, అయినా వీఆర్వో పట్టించుకోలేదన్నారు. శనివారం రాత్రి కరప ఎస్సై మెల్లం జానకిరాం సిబ్బందితో వచ్చి బెదిరించారని, గ్రామస్తులంతా రావడంతో చేసేదేమీలేక వెనుదిరిగినట్టు గ్రామస్తులు తెలిపారు. ఒకటో తేదీన రాత్రి పని ఆపితే 3న రోడ్డు తవ్వడానికి పర్మిషన్ ఉందని సంబంధిత అధికారి స్టాంపు కానీ, పూర్తి సంతకంకానీ లేని పత్రాన్ని పోలీసులు చూపించారని, ప్రజలు మూకుమ్మడిగా తిరగబడడంతో పోలీసులు వెనుదిరిగారు. ఆదివారం గ్రామస్తులంతా సిరిపురం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని ఎట్టి పరిస్థితుల్లోను చెరువులు తవ్వనీయమని తీర్మానించుకున్నారు. పంచాయతీ అనుమతివ్వలేదని, అవసరమైతే ప్రజల తరఫున నిలబడతామని ఉప సర్పంచ్ నున్న రాంబాబు, ఎంపీటీసీ నున్న శ్రీనివాస్‌లు ప్రజలకు మద్ధతుతెలిపారు. గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నా ఏమిచేసుకుంటారో చేసుకోండని చెరువులు తవ్వుతున్న చిక్కాల దొరబాబు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని గ్రామస్తులు తెలిపారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు అండతోనే గ్రామస్తులు వ్యతిరేస్తున్నా చెరువులు అక్రమంగా తవ్వేస్తున్నట్టు ప్రజలు ఆరోపించారు. గ్రామస్తులు, సర్పంచ్, ఎంపీటీసీల సంతకాలతో సోమవారం కలెక్టర్ కార్తికేయ మిశ్రాకు ఫిర్యాదు చేస్తున్నట్టు ప్రజలు తెలిపారు. కలెక్టర్ స్పందించి సిరిపురంలో ఉన్నతాధికారితో విచారణ జరిపించి, అనధికారికంగా తవ్విన చెరువులు ధ్వంసంచేయించాలని, ఇకపై పరిసర గ్రామాల్లో రొయ్యల చెరువులు తవ్వకుండా చర్యలు తీసుకోవాలని సిరిపురం పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అన్యాయంగా కేసు పెట్టారు తనకున్న నాలుగుకుంచాల భూమి చెరువులు తవ్వడానికి ఇయ్యలేదన్న కక్షతో అన్యాయంగా పోలీసు కేసు పెట్టించారు. సొంత భూమి పక్కనే 8.60 ఎకరాలు కౌలుకు చేస్తున్నారు, తనతో చెప్పకుండా కౌలుభూమిని తవ్వేశారు. ఎదురు చెప్పానని ధాన్యం అమ్మేసుకున్నట్టు అక్రమ కేసుపెట్టి 10 రోజులు స్టేషన్ చుట్టూ తిప్పారు. చెరువులవల్ల పక్కపొలాలు దెబ్బతిని పండకుండా పోతున్నాయి. అధికారులు కలగజేసుకుని రైతులకు న్యాయం చేయాలి. -
రొయ్య @ రూ.600
సముద్రంలో వేటకు వెళ్లిన ఓ మత్య్స కారుడికి ఓ భారీ రొయ్య దొరికింది. తూర్పు గోదావరి జిల్లా మలికిపురం మండలం కరవాక వద్ద చింతా కాసులు అనే మత్స్యకారుడువేటకువెళ్లాడు. అతని వలలో 1,200 గ్రాముల బరువైన భారీ రొయ్య పడింది. దీన్ని కొనేందుకు పెద్ద సంఖ్యలో జనం ఆసక్తి చూపారు. చివరకి ఈ రొయ్యను రూ.600కు విక్రయించారు. ఇది ఆళ్ల జాతికి చెందిన రొయ్యగా మత్స్యకారులు తెలిపారు. -
చింత చిగురు - రొయ్యల కూర
కావలసిన పదార్థాలు: పచ్చిరొయ్యలు - 1 కప్పు, చింత చిగురు - 1 కప్పు, ఉల్లిపాయ - 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, కారం - 2 చెంచాలు, గరం మసాలా - 1 చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, కరివేపాకు - కొద్దిగా, నూనె - సరిపడా తయారీ విధానం: రొయ్యల తోకలు వదిలేసి మిగతా గుల్ల ఒలిచెయ్యాలి. కొంచెం ఉప్పు వేసి వాటిని శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి; చింతచిగురును శుభ్రంగా కడిగి, మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. కానీ మరీ మెత్తగా అవ్వకూడదు. జారుడుగానూ అవ్వకూడదు; ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి; రంగు మారాక రొయ్యలు వేసి కాసేపు వేగనివ్వాలి; తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి; తర్వాత చింతచిగురు మిశ్రమం వేసి, గరం మసాలా చల్లి మూత పెట్టెయ్యాలి; అప్పుడప్పుడూ కలుపుతూ, తక్కువ మంటమీద ఉడకనివ్వాలి; చింత చిగురు రొయ్యలకు పూర్తిగా పట్టి, కూర బాగా దగ్గరగా అయిపోయాక దించేసుకోవాలి. -
రొయ్యల హేచరీలలో కమిషనర్ తనిఖీలు
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోని రొయ్యల హేచరీలను బుధవారం మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ తనిఖీలు చేశారు. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం చుట్టుపక్కల ఉన్న రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనుమతి లేని హేచరీలపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. -
రొయ్యయ్యో
మొక్కుబడిగా హేచరీల తనిఖీ ఒంగోలు టౌన్: కొన్ని హేచరీ నిర్వాహకుల స్వార్థం విదేశీ ఎగుమతులకు అవరోధంగా నిలిచింది. అది ఏ స్థాయికి చేరుకుందంటే చివరకు మనదేశం నుంచి ఎగుమతులు వద్దనే దశకు వెళ్లింది. దీనికి కారణం నకిలీ రొయ్య పిల్లల పెంపకమే. నాసిరకం కావడంతో విదేశీయులు ఈ రొయ్యలంటేనే దూరంగా పెడుతున్నారు. ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్న వీరి ఆగడాలను అరికట్టేందుకు చెన్నై నుంచి వచ్చిన కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ సభ్యుడు రమేష్‌కుమార్ మొక్కుబడిగా ఒక్క హేచరీని మాత్రమే తనిఖీ చేసి వెళ్లడం అనేక విమర్శలకు తావిస్తోంది. కొత్తపట్నం మండలంలోని రెండు హేచరీలు నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో వారం రోజుల క్రితం వాటిని సీజ్ చేశారు. మిగిలిన హేచరీల విషయాన్ని ఇటు జిల్లా యంత్రాంగం, అటు కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీ కమిటీ పట్టించుకోకపోవడం పట్ల అనేక మంది పెదవి విరుస్తున్నారు. తనిఖీలు లేవు.. నివేదికలు లేవు జిల్లాలోని హేచరీలను యుద్ధప్రాతిపదికన తనిఖీలు చేసి నివేదికలు అందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ అవి ముందుకు కదిలిన దాఖలాలు లేవు. ఒంగోలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను ఒంగోలు ఆర్డీఓ, కందుకూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని హేచరీలను కందుకూరు సబ్ కలెక్టర్ తనిఖీలు చేసి నివేదికలు అందిస్తారని వారం రోజుల కిందట జిల్లా కలెక్టర్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అయినప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. మత్స్యశాఖ అధికారులు కూడా తనిఖీలు నిర్వహించకుండా మౌనంగా ఉండటం విమర్శలకు తావిస్తోంది. జిల్లాలో 11మండలాల్లో 102 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. 2894 హెక్టార్లలో 1563 మంది రైతులు వెన్నామీ సాగు చేస్తున్నారు. ఏడాదికి దాదాపు 23 వేల 152 మెట్రిక్ టన్నుల సాగు వస్తోంది. హెక్టార్‌కు 8 నుండి 15 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుండటంతో రైతులు ఎక్కువ మంది వెన్నామీ సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రైతుల ఆశలను సొమ్ము చేసుకునేందుకు అనధికారిక హేచరీలు పుట్టుగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 20 హేచరీలు అధికారికంగా ఉండగా, అనధికారికంగా మరికొన్ని ఉన్నట్లు తేలింది. వీటిని ఏర్పాటు చేయాలంటే ముందుగా ఎంపెడా నుండి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ నుంచి తల్లి రొయ్యల ఉత్పత్తికి అనుమతి తీసుకోవలసి ఉంటుంది. వాస్తవానికి వెన్నామీ తల్లి సీడ్ దక్షిణ అమెరికా సముద్రంలో లభిస్తోంది. ఆ సీడ్ (బ్రూడర్ స్టాక్)ను దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. జబ్బులేని తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవడం వల్ల వాటి సీడ్‌తో ఆరోగ్యవంతమైన పిల్లలు వస్తాయి. వాటిని విదేశాలకు ఎగుమతి చేయడం వల్ల కోట్లాది రూపాయల విదేశీ ఆదాయం వస్తోంది. వెన్నామీకి డిమాండ్ పెరుగుతుండటంతో అనధికారిక హేచరీల నిర్వాహకులు విచ్చలవిడిగా నకిలీ సీడ్‌ను రైతులకు అంటగడుతున్నారు. చివరకు అది విదేశీ ఎగుమతులపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికైనా జిల్లాలోని హేచరీలను విస్తృతంగా తనిఖీచేసి నకిలీ సీడ్‌ను నిరోధిస్తే భవిష్యత్‌లో వెన్నామీకి విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది. లేకుంటే టైగర్ రొయ్య కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఐదుగురు జూదరుల అరెస్టు - రూ.17,060 స్వాధీనం మార్కాపురం : మార్కాపురం పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పెద్దనాగులవరం రోడ్డులో పేకాటాడుతున్న ఐదుగురిని గురువారం రాత్రి పట్టణ ఎస్సై రాంబాబు అరెస్టు చేశారు. వారి నుంచి 17,060 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి శుక్రవారం నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఎస్సై తెలిపారు. -
భారీగా రొయ్యలు, చేపలు లభ్యం
భారీగా రొయ్యలు, చేపలు లభ్యం ఇతర ప్రాంతాలకు జోరుగా రవాణా నాతవరం: తాండవ రిజర్వాయరులో చేపలు, రొయ్యల లభ్యత ఆశాజనకంగా ఉంది. ఇక్కడి చేపలు, రొయ్యలకు గిరాకీ ఉండడంతో మత్స్యకారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఈ ఏడాది అనుకూల వాతావరణంతో తాండవలో రెండు నెలలుగా చేపలు వేట జోరుగా సాగుతోంది. గత ఏడాది తుపాన్ల సమయంలో రిజర్వాయరులోకి అధికంగా నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం బాగుంది. ఇది చేపలు ఏపుగా పెరగటానికి దోహదపడింది. ప్రస్తుతం అడపాదడపా వర్షలు కురవడంతో అయకట్టు భూములకు నీరు విడుదల చేస్తున్నా రిజర్వాయరులో నీటిమట్టం తగ్గలేదు. నెల రోజులుగా జలాశయంలోకి ఇన్‌ఫ్లో వస్తుండడంతో ఆ ఎర్ర నీటికి రిజర్వాయరు అడుగు భాగాన ఉన్న చేపలు బయటకు వస్తున్నాయి. ఫలితంగా వేటాడుతున్న మత్స్యకారులకు చేపలు ఆశించినంతంగా దొరుకుతున్నాయి. రోజూ తాండవలో 150 పైగా బోట్ల ద్వారా చేపల వేట జరుగుతోంది. ఇక్కడ చేపలకు రంగు రుచి బాగుండడం, ధర కూడా ఇతర మార్కెట్ల కంటే తక్కువగా ఉండడం వల్ల కొనుగోలుదార్లు పోటీపడుతుంటారు. ఇక్కడ దొరికే టైగర్ రొయ్యలు రుచిగా ఉండడంతో గిరాకీ ఉంటుంది. ఇక్కడ నుంచి రోజూ పెద్ద సంఖ్యలో వాహనాల్లో విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలకు రవాణా చేస్తున్నారు. కొందరు బడా వ్యాపారులు ఇక్కడ మత్యకారులకు ముందుగా పెట్టుబడి పెట్టి వారి ద్వారా వేటాడించి చేపలు రొయ్యలు కొనుగోలు చేసి దూర ప్రాంతాలకు తీసుకెళ్లి అధిక ధరలకు విక్రయిస్తారు. ఈ ఏడాది తాండవ రిజర్వాయరులో పెద్ద చేపలు కూడా బాగా లభిస్తున్నాయి. ఈ రిజర్వాయరులో చేపలు, రొయ్యలు ఊహించని విధంగా లభ్యం కావడం, ధర కూడా బాగుండడంతో మత్స్యకారులు ఆనంద పరవశులవుతున్నారు. -
చేప చిక్కట్లే..
మత్స్యకారులు విలవిల వలలు నిండక వెనక్కి వస్తున్న బోట్లు హార్బర్, చేపల మార్కెట్లు వెలవెల ఎల్‌నినో, వర్షాల్లేక సముద్ర గర్భంలోనే ఉండిపోతున్న మత్స్య సంపద సాక్షి, విశాఖపట్నం : సముద్రం చేప చేతికి చిక్కనంటోంది. మత్స్యకారుల వలలో పడడానికి ససేమిరా అంటోంది. రోజుల తరబడి వేట సాగిస్తున్నా ఈసురోమనిపిస్తోంది. సముద్రంపై వేడి తట్టుకోలేక మరింత లోతుకు తరలిపోతోంది. జూన్‌లో వచ్చే వర్షపు నీరు తగలక చేప సంపద పైకి రానంటోంది. గతేడాది ఇదే సీజన్లో పుష్కలంగా కానాగడతలు, రెడ్ఫిష్లు, బొచ్చులు, శీలావతి, వంజరాలు, రొయ్యలతో కళకళలాడిన బోట్లు, మార్కెట్లు ఇప్పుడు బోసిపోతున్నాయి. రోజుల తరబడి వేట సాగించినా వలలు నిండక బోట్లు వెనుదిరుగుతున్నాయి. సముద్రంలోకి ఎప్పుడెళ్లినా 15 నుంచి 20 రకాల చేపలరాశులతో తిరిగొచ్చే మత్స్యకారులు ఈసురోమంటూ నాలుగైదు రకాలతోనే వెలితిగా ఒడ్డుకు చేరుతు న్నారు. దీని ప్రభావంతో మార్కెట్లో చేపల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అసలెందుకిలా? ఏటా జూన్‌లో సముద్రంలో చేపలవేటకు విరామం ముగియగానే విశాఖ హార్బర్ నుంచి 650 మెకనైజ్డ్ బోట్లు, వేలాది పడవలు మత్స్య సంపద కోసం వెళ్తాయి. మెకనైజ్డ్ బోట్లయితే పదినుంచి పదిహేను రోజులు సముద్రంలోనే ఉండిపోయి తిరిగి రకరకాల భారీ చేపలతో ఒడ్డుకు వస్తాయి. ఈసీజన్లో హార్బర్‌తోపాటు ఎక్కడికక్కడ మార్కెట్లో చేపల లభ్యత పెరిగి కొనేవాళ్లకు ధరలు కూడా పూర్తిగా అందుబాటులో ఉంటాయి. వేలాది మత్స్యకారుల చేతిలో కాసులు గలగలలాడే సమయం కూడా ఇదే. ఈవిధంగా నెలకు సుమారుగా రూ.70 నుంచి రూ.90కోట్ల వరకు వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం చేపల వేటకు నిషేధం ముగిసిన తర్వాత వేటకు వెళ్లిన మత్స్యకారులు ఊహించని విధంగా ఖాళీ బోట్లతో తిరిగొస్తున్నారు. పది నుంచి ఇరవై రోజులు వేలాదిమంది సుదూర తీరం వెళ్లినా వలలు నిండడం లేదు. గతేడాది కానాగడతలు, రెడ్ఫిష్లు, బొచ్చులు, శీలావతి, వంజరాలు, రొయ్యలు ఇలా 15 రకాలు దొరకగా, ఇప్పుడు నాలుగైదు రకాలు మినహా చిక్కడం లేదు. దీంతో మార్కెట్లో మత్స్య సంపద పెద్దగా కనిపించడం లేదు. ఫలితంగా నగరానికి చెందిన 650 బోట్లు ఇప్పటివరకు రెండు దఫాలుగా వేటకు వెళ్లగా కనీసం బోటు సగానికికూడా నిండకపోవడంతో నష్టం భరించలేక హార్బర్‌లోనే నిలిపివేశారు. వేట విరామం ముగిసిన తర్వాత సముద్రంలో చేపల వేట సాగిస్తే టన్నులకొద్దీ చేపలు భారీగా వలకు చిక్కుతాయి. కానీ ఈదఫా వాతావరణంలో తీవ్ర మార్పులు సముద్రంపై తీవ్రప్రభావం చూపి తద్వారా చేపలు దొరకనిపరిస్థితి తలెత్తేలా చేసిందని మత్స్యకారులు, మత్స్యశాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. సముద్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. నెలరోజులుగా ఉష్ట్రోగ్రత 42 డిగ్రీలకు మించి నమోదవుతోంది. వేడిగాలులు కూడా తీవ్రంగా వీస్తున్నాయి. దాని వల్ల సముద్రజలాలపై వేడి వాతావరణం పెరగడంతో చేపలు బాగా లోతుకు వెళ్లిపోతున్నాయి. సముద్రంపై ఉష్ట్రోగ్రతలు 32 డిగ్రీలులోపు ఉంటేనే వేట ఆశాజనకంగా ఉంటుంది. ఖరీదైన టునా చేప వలలకు చిక్కాలంటే సముద్రంలో ఉష్ట్రోగ్రత 28డిగ్రీలు ఉండాలి. అలా అయితేనే ఈ రకం చేపలు పైకి వస్తాయి. వేడి కారణంగా ఈసారి వేటలో ఈ చేపలు అస్సలు దొరకడంలేదు. రుతుపవనాల జాడలేక ఇప్పటికే వ్యవసాయం ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఇప్పుడిది మత్స్యరంగంపైనా ప్రభావం చూపుతోంది. వానలు కురవకపోవడం వల్ల సముద్రం చేప పైకిరాక మత్స్యకారులకు దొరకడం లేదు. వాస్తవానికి వర్షాలు కురిస్తే చెరువులు, కాలువలు, నదుల నుంచి భారీగా వర్షం నీరు రకరకాల చెత్తాచెదారంతో సముద్రంలోకి వచ్చి కలుస్తుంది. దీంతో ఆహారం కోసం చేపలు సముద్ర గర్భం నుంచి కొంచెం పైకి వస్తాయి. కానీ వర్షాలు రాక చేపల లభ్యత తగ్గిపోయింది. సముద్రంలో మత్స్య సంపద పెంచేందుకు ఏడాదిలో ఒకసారి వేట విరామం ప్రకటిస్తారు. ఈ సమయంలో అసలు వేట చేయడం నిషిద్ధం. కానీ ఇది ఆచరణలో జరగడం లేదు. నిషేధం అమల్లో ఉన్నా కొందరు అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారు. దీని వల్ల నిషేధం పూర్తయిన తర్వాత వేటకు వెళ్లే బోట్లకు చేపలు చిక్కడం లేదు. ప్రస్తుతం సముద్రంలో చేపలు చిక్కక మత్స్యకారులు నష్టపోతున్నారు. ఒకసారి మెకనైజ్డ్ బోటు సముద్రంలోకి వెళ్లిందంటే డీజిల్, ఐస్ అవసరాలకు రూ.2లక్షలు ఖర్చవుతుంది. చేపలు పడకపోవడంతో నష్టం పెరిగిపోతోంది. దీంతో హార్బర్లో బోట్లు ఖాళీగా లంగరేశాయి. ఫలితంగా మార్కెట్లోకి సముద్రం చేప రావడం లేదు. ఒకవేళ వచ్చినా ధర విపరీతంగా ఉంటోంది. నగర మార్కెట్లో కూడా చెరువు చేప మినహా సముద్రం చేపలు కనిపించడంలేదు. దీంతో వినియోగదారులు కొందామన్నా ధర చూసి బెంబేలెత్తిపోతున్నారు. చేపలు బయటికి రాక ఉపాధి పోతోంది సముద్రంలోకి కొత్త నీరు రాక చేపలు బయటికి రావడం లేదు. వేడి కూడా ఉండటంతో రెండుసార్లు 20 రోజులు సముద్రంలోకి వెళ్లి వస్తున్నా చేపలు చిక్కడం లేదు. గడిచిన చాలా ఏళ్లతో పోలిస్తే ఇటువంటి పరిస్థితి ఇదే మొదటిసారి. వేటలేక సుమారు 12 వేల కుటుంబాలు ఖాళీగా ఉంటున్నాయి. పోనీ ఏదోలా మరోసారి వేటకు వెళ్దామంటే డీజిల్ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం డీజిల్ లీటర్ ధర రూ.61. కానీ ప్రభుత్వం మాకు రూ.6 సబ్సిడీ ఇస్తోంది. ఈ సబ్సిడీ గడిచిన పదేళ్లుగా ఇలాగే ఉంది. డీజిల్ ధరలేమో పెరిగిపోతున్నాయి. - పి.సి.అప్పారావు, రాష్ట్ర మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు ఆపరేటర్ల అధ్యక్షుడు