
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రొయ్యల దాణా ఉత్పత్తిలో ఉన్న వాటర్‌బేస్ నెల్లూరు జిల్లాలో హ్యాచరీని ఏర్పాటు చేస్తోంది. రామతీర్థం సమీపంలో రానున్న ఈ ప్లాంటులో ఏటా 50 కోట్ల పిల్ల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు. తొలి దశ ప్లాంటు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానుంది. రెండో దశ 2019 జనవరిలో కార్యరూపంలోకి వస్తుంది. ప్రాజెక్టు కోసం మొత్తం రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ మొత్తంలో సగం రుణం ద్వారా సమకూర్చుకుంటామని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. తొలి ఏడాది రూ.10 కోట్లు: వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచే హ్యాచరీ ద్వారా కంపెనీకి ఆదాయం సమకూరనుంది.
2018–19లో రూ.10 కోట్లు, 2019–20లో రూ.25 కోట్ల ఆదాయాన్ని వాటర్‌బేస్ ఆశిస్తోంది. కాగా, దాణా తయారీకి కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 1,10,000 టన్నులు ఉంది. ప్రస్తుతం 50,000 టన్నులు విక్రయిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 60,000 టన్నులు దాటనుందని అంచనా వేస్తోంది. కంపెనీ 2017–18 ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.277 కోట్ల టర్నోవర్‌పై రూ.27 కోట్ల నికరలాభం ఆర్జించింది.
కంపెనీకి అవార్డు: వాటర్‌బేస్‌కు రొయ్యల దాణా విభాగంలో ఆసియాస్ మోస్ట్ వాల్యుయేబుల్ బిజినెస్ బ్రాండ్ అవార్డు వరించింది. సింగపూర్‌లో జరిగిన ఆసియన్ బ్రాండ్, లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల ఈ అవార్డు అందుకున్నారు. ఐబ్రాండ్స్ 360 ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment