Hatchery
-
తల్లి రొయ్య ఇక లోకల్
సాక్షిప్రతినిధి, కాకినాడ: అమెరికన్ తల్లి రొయ్యకు మన ఆక్వా రైతులు త్వరలో గుడ్‌బై చెప్పనున్నారు. తల్లి రొయ్యలను దేశీయంగా మన హేచరీల్లో ఉత్పత్తి చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తీర ప్రాంత రాష్ట్రాల్లోని హేచరీల్లో రొయ్య పిల్లల పునరుత్పత్తి కోసం తల్లి రొయ్యలను కొన్నేళ్లుగా లక్షలు వెచ్చించి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. మన హేచరీల్లో బ్లాక్ టైగర్(మోనాడామ్) తల్లి రొయ్యలు 2009కి ముందు భారతీయ సముద్ర జలాల్లో లభించేవి. ఆ తర్వాత బ్లాక్‌టైగర్ 60 శాతం బాక్టీరియాతో రోగాల బారిన పడి తల్లి రొయ్యలు దెబ్బతిన్నాయి. అనంతరం రోగాల్లేని తల్లి రొయ్యలను ఉత్పత్తి చేస్తున్న అమెరికా నుంచి వెనామీ దిగుమతికి కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. పసిఫిక్ మహాసముద్రంలో మాత్రమే లభించే ఈ వెనామీ(ఎగ్జోటిక్ స్పీసిస్)వైట్‌లెగ్ ష్రింప్‌ను దిగుమతి చేసుకునేలా నిబంధనలను సడలించింది. అమెరికాలో వెనామీని పునరుత్పత్తి చేస్తున్న కంపెనీల్లో ఎంపిక చేసిన 14 కంపెనీల నుంచి తల్లి రొయ్య దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదిరింది. ఇలా దిగుమతి చేసుకునే వెనామీని చెన్నైలోని సెంట్రల్ క్వారంటైన్లో ఐదు రోజులు అన్ని పరీక్షల అనంతరం ఒడిశా, గుజరాత్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా.. మన రాష్ట్రంలోని హేచరీల్లో వినియోగిస్తున్నారు. వెనామీ తల్లి రొయ్య ప్రస్తుతం అమెరికాలో 80 డాలర్లు (రూ.6,400) పలుకుతోంది. కస్టమ్స్, లాజిస్టిక్, ఫ్లైట్ చార్జీలు 30 శాతం అదనంగా కలుపుకొంటే సుమారు రూ.10,000 వరకు అవుతుంది. ఇక్కడి హేచరీలు అమెరికాలోని టెక్సాస్, ఫ్లోరిడా రాష్ట్రాల నుంచి ఏటా 2లక్షల నుంచి 2.50 లక్షల తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా తీరంలో 550 హేచరీలుంటే అత్యధికంగా మూడొంతులు హేచరీలు కాకినాడ తీరంలోనే ఉండటం విశేషం. మరో రెండేళ్ల సమయం.. కోస్టల్ ఆక్వా కల్చర్ అథారిటీకి కేంద్రం తీసుకొచ్చి న సవరణలు వెనామీ తల్లి రొయ్యల స్థానే.. దేశీయంగా తల్లి రొయ్యల ఉత్పత్తికి మార్గం సుగమం చేశాయని చెప్పొచ్చు. ఇందుకోసం రెండు దశలను కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. తొలి దశలో బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లు, మలి దశలో న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్(ఎన్బీఎస్)లు నెలకొల్పుకోవచ్చు. ఈ రెండు దశలు పూర్తయ్యేసరికి తల్లి రొయ్య కోసం అమెరికాపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఈ రెండు దశలు చేరుకోవడానికి మరో రెండేళ్లు పడుతుందని అంచనా. తొలి దశలో భాగంగా బీఎంసీ ద్వారా తల్లి రొయ్య స్థానంలో పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుంటారు. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్(బీఎంసీ)లలో పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేస్తారు. అమెరికా నుంచి దిగుమతిచేసుకునే ఒక తల్లి రొయ్య స్థానంలో అంతే ఖర్చుతో 1000 పిల్ల రొయ్యలను పునరుత్పత్తి చేయొచ్చు. ఇలా పిల్ల రొయ్యలను దిగుమతి చేసుకుని బీఎంసీలలో పునరుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మన రాష్ట్రంలో నిర్వహించేందుకు వీలుగా పలు సెంటర్లకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం నెల్లూరు బీఎంఆర్, భీమవరం ఆమందా, శ్రీకాకుళం కోనాబే, విశాఖలో ఎమ్పెడా బీఎంసీ(బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్స్)లు సిద్ధమయ్యాయి. మలి దశలో ఇక అమెరికా వైపు కన్నెత్తి చూడాల్సిన అవసరం లేకుండా మనమే నేరుగా తల్లి రొయ్యను పునరుత్పత్తి చేయొచ్చు. ఇందుకోసం న్యూక్లియర్ బ్రీడింగ్ సెంటర్లు నెలకొల్పుతారు. ప్రస్తుతం అమెరికాలో మాత్రమే నిర్వహిస్తున్న సెంటినల్ ట్రైల్స్ ఇక్కడ ఏర్పాటు చేసే ఎన్బీసీలలో నిర్వహిస్తారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకనుగుణంగా జెనెటిక్ బ్రీడింగ్, జెనెటిక్ ప్రాసెసింగ్ చేస్తారు. ఇక లక్షలు ఖర్చుపెట్టాల్సిన అవసరం ఉండదు.. బ్రూడ్‌స్టాక్ మల్టిప్లికేషన్ సెంటర్ల ఏర్పాటు ద్వారా మన తల్లి రొయ్యను మనమే పునరుత్పత్తి చేసుకునేందుకు వీలుంటుంది. దీనివల్ల అమెరికా నుంచి లక్షలు ఖర్చుపెట్టి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఇక ఉండదు. – హరినారాయణరావు, ప్రధాన కార్యదర్శి, ఆలిండియా ష్రింప్హేచరీస్ అసోసియేషన్ -
ఆక్వా రైతును కాపాడుకుందాం..
సాక్షి, అమరావతి : ఆక్వా రైతును కాపాడుకోకుంటే ఆ పరిశ్రమ మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్‌రావు, అప్సడా వైస్ చైర్మన్ వడ్డి రఘురాంలు కంపెనీలను హెచ్చరించారు. ఆక్వా రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోందని, అదే రీతిలో ఈ పరిశ్రమలు కూడా అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు, హేచరీలు, మందుల కంపెనీల ప్రతినిధులతో శనివారం విజయవాడలో జరిగిన సాధికారత కమిటీ భేటీలో ఎంపీ మస్తాన్‌రావు మాట్లాడుతూ తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలు యూనిట్ విద్యుత్ రూ.8కి సరఫరా చేస్తుండగా.. మన రాష్ట్రంలో మాత్రమే యూనిట్ రూ.1.50కే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కౌంట్ రూ.210 చొప్పున కొనుగోలు చేసినా ఎగుమతిదారులకు ఎలాంటి నష్టం వాటిల్లదన్నారు. హేచరీలతో పాటు ఫీడ్ ప్లాంట్ నిర్వాహకులు కూడా రైతులపై భారం తగ్గించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులతో పాటు హేచరీలు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు సంబంధించి ఢిల్లీకి ప్రతినిధుల బృందం వస్తే సంబంధిత మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సీఆర్‌జెడ్ పరిధిలోని హేచరీలను మూసివేయాలన్న గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకోగలిగామని, ఆ మేరకు కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ(సీఏఏ) చట్టసవరణ జరిగేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. వడ్డి రఘురాం మాట్లాడుతూ నాణ్యమైన సీడ్ సరఫరా చేయని హేచరీలపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనధికారిక, నిబంధనలు పాటించని హేచరీలపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇక నుంచి ప్రతి నెలా రైతులతో సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు వెల్లడించారు. 30 పైసలకే వనామీ సీడ్ సరఫరా నాణ్యమైన వనామీ సీడ్‌ను 30 పైసలకు రైతులకు అందుబాటులో ఉంచుతామని హేచరీ యజమానులు భరోసా ఇచ్చారు. నాణ్యమైన టైగర్ సీడ్ దొరకని కారణంగా ఉత్పత్తి దెబ్బతిని నష్టపోయామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సీజన్లో టైగర్ సీడ్ ఉత్పత్తిని తగ్గించాలని రఘురాం కోరగా.. హేచరీల యజమానులు ఆ మేరకు స్పందించారు. బ్రూడ్ స్టాక్ క్వాలిటీ మేనేజ్మెంట్పై సెపె్టంబర్ 29న విశాఖలో జరిగే జాతీయ స్థాయి సెమినార్లో రైతులను కూడా భాగస్వాములను చేస్తామని హేచరీ ప్రతినిధులు చెప్పారు. జాతీయ రొయ్య హేచరీల సంఘం అధ్యక్షుడు యల్లంకి రవికుమార్, జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్యక్షుడు ఐపీఆర్ మోహన్‌రాజు, సీఏఏ డైరెక్టర్ (చెన్నై) పి.శంకరరావు ఎంపెడా రీజనల్ మేనేజర్ జయభేల్ తదితరులు పాల్గొన్నారు. -
అదిరిందయ్యా.. పిల్ల రొయ్య!
పిఠాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తీర ప్రాంతంలో రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇక్కడి సముద్ర జలాలు, గాలి రొయ్యల లార్వా ఉత్పత్తికి, రొయ్య పిల్ల పెరుగుదలకు అనువుగా ఉండటంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా వందలాది హేచరీలు (రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలు) అభివృద్ధి సాధించాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని తీర ప్రాంతంలో 314 హేచరీలు ఉండగా.. ఏటా ఇక్కడ 60 బిలియన్ల రొయ్య పిల్లలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడి నుంచి పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా, కేరళ, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలకు రొయ్య పిల్లలు (ష్రింప్ సీడ్) ఎగుమతి అవుతున్నాయి. లక్ష మందికి ఉపాధి హేచరీలు, రొయ్యల చెరువులు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే కేవలం లక్ష మందికి ఉపాధి లభిస్తోంది. ఒక్కో హేచరీలో వివిధ పనులకు గాను సుమారు 150 మంది వరకు ఉపాధి పొందుతుండగా.. రొయ్యల చెరువుల నిర్వహణలో వేలాది మందికి ఉపాధి లభిస్తోంది. ఇక రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లలో ఒక్కో యూనిట్లో 500 నుంచి 1000 మంది వరకు ఉపాధి పొందుతున్నారు. ఒక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోనే 50 వరకు రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటితోపాటు ఐస్ ఫ్యాక్టరీలు, రవాణా ప్యాకింగ్ యూనిట్లలో వేలాది మందికి ఉపాధి కలుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహంతో పురోగమనం రాష్ట్రవ్యాప్తంగా 70 ఆక్వా హబ్‌లను ఏర్పాటు చేసి నాణ్యమైన మత్స్య సంపదను విక్రయించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తోంది. 10 ఎకరాలలోపు ఆక్వా చెరువులున్న రైతుల కు యూనిట్ కేవలం రూ.1.50కే సబ్సిడీ విద్యుత్ అందిస్తోంది. 10 ఎకరాలకు పైబడి ఉన్న వారికి యూనిట్ విద్యుత్ రూ.3.85కే ఇస్తోంది. ఆక్వా ఎగుమతులు సక్రమంగా నిర్వహించడాని కి ఎగుమతిదారులతో సమావేశాలు నిర్వహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చేస్తోంది. ఆక్వా రైతులకు అండగా ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ఆక్వా రైతులకు తగిన అండ లభిస్తోంది. దీంతో తీర ప్రాంతంలో రొయ్యల సాగు, హేచరీలు బాగా పెరిగాయి. ఆక్వా ఉత్పత్తులు గణనీయంగా పెరగడానికి ప్రభుత్వ ప్రోత్సాహం దోహదం చేస్తోంది. – సత్యనారాయణ, జేడీ మత్స్య శాఖ, కాకినాడ హేచరీలకు ఎల్టీ కేటగిరీగా మార్చాలి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 314 వరకు హేచరీలు ఉన్నాయి. ఏటా 60 బిలియన్ల రొయ్య పిల్లల ఉత్పత్తి జరుగుతోంది. ఇటీవల రొయ్యల ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షలు తీవ్ర ఇబ్బంది కలిగించగా సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. కేంద్రంతో చర్చించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంది. హేచరీలకు విద్యుత్ వినియోగం చాలా అవసరం. గతంలో ఎల్టీగా ఉండే వాటిని హెచ్‌టీ చేయడం వల్ల అదనపు భారం పడింది. హేచరీలు 8 నెలలు పని చేస్తే 4 నెలలు మూతపడి ఉంటాయి. పని చేసే సమయంలో విద్యుత్ భారంగా మారగా పని చేయని సమయంలోనూ మినిమం బిల్లులు వేయడం వల్ల ఆర్థిక భారం పడుతోంది. – సత్తి వీర్రెడ్డి, అధ్యక్షుడు, ఆలిండియా ష్రింప్ హేచరీస్ అసోసియేషన్ కాకినాడ చాప్టర్ -
జమునా హేచరీస్ భూములు బాధిత రైతులకు పంపిణీ
మెదక్ జోన్/ వెల్దుర్తి: మెదక్ జిల్లా మాసాయిపేట, చిన్నశంకరంపేట మండలాల్లోని వివాదాస్పద అసైన్డ్ భూములను అధికారులు బుధవారం బాధిత రైతులకు అప్పగించారు. తమ భూములను కాజేశారంటూ ఆయా మండలాల్లోని అచ్చంపేట, హకీంపేట, దరిపల్లి గ్రామాల రైతులు ప్రస్తుత బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (జమునా హేచరీస్)పై గతేడాది ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ప్రభుత్వ ఆదేశంతో సర్వే చేయించిన కలెక్టర్ హరీశ్ 66 ఎకరాల అసైన్డ్ భూములు కబ్జాకు గురై నట్లుగా ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందించారు. దీనిపై జమునా హేచరీస్ కోర్టును ఆశ్రయిం చగా, 2021 నవంబర్‌లో మరో సర్వే చేశారు. 85 ఎకరాల 19 గుంటల భూమి కబ్జాకు గురైనట్టు గుర్తించి నివేదిక అందించారు. దీంతో ఈ భూమిని తిరిగి బాధితులకు అప్పగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వం ప్రత్యేక జీఓ విడుదల చేసింది. దీంతో బుధవారం రెవెన్యూ అధికారులు మూడు సర్వే బృందాలను ఏర్పాటు చేసి బాధిత రైతులకు ఆయా సర్వే నంబర్లలో డివిజన్ల వారీగా హద్దులు చూపెట్టారు. ఈ ప్రక్రియ పరిశీలించడానికి వచ్చిన మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి బాధిత లబ్ధిదారులకు ఆ మేరకు పట్టా సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. మాసాయిపేట మండ లం అచ్చంపేట శివారులోని 77, 78, 79, 80, 81, 82 సర్వే నంబర్లలో 62 మంది బాధితులకు 84 ఎకరాల 19 గుంటలు, హకీంపేట శివారులో సర్వే నంబరు 97లో ముగ్గురు రైతులకు ఎకరం భూమికి సంబంధించి పట్టాలు అందజేశారు. పట్టాలు సరే.. నిర్మాణాల సంగతేంటి? ప్రభుత్వం పంపిణీ చేసిన పట్టాలతో రైతులు హర్షం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం అయోమయంలో ఉన్నారు. వారికి చూపించిన హద్దుల్లో హేచరీస్‌కు చెందిన శాశ్వత కట్టడాలు ఉండటంతో వాటిని ఎవరు..ఎప్పుడు తొలగిస్తారు అందులో తామెలా వ్యవసాయం చేసుకునేదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా..పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుం టారేమోనని తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి ఆధ్వ ర్యంలో పోలీసులు జమునా హేచరీస్ ముందు మోహరించారు. ఎవరైనా ఆందోళనలు చేస్తే అరెస్టు లు చేసి అక్కడి నుంచి తరలించేందుకు వీలుగా ప్రైవేట్ బస్సులు, డీసీఎంలను ఏర్పాటు చేశారు. -
ఈటల సంస్థకు నోటీసులు.. 16 నుంచి 18 వరకు భూసర్వే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూకబ్జా ఆరోపణల విచారణలో కదలిక వచ్చింది. జమునా హేచరీస్‌కు సంబంధించిన భూములను సర్వే చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఈ నెల 16, 18 తేదీల్లో నిర్వహించనున్న సర్వేకు సంబంధించి నిర్ణీత ప్రదేశానికి హాజరు కావాలని ఈటల సతీమణి జమున, కుమారుడు నితిన్‌రెడ్డిలతోపాటు సంబంధిత భూములున్న 154 మంది రైతులకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డుల శాఖ తూప్రాన్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ లక్ష్మీసుజాత సోమవారం నోటీసులు జారీ చేశారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్లు 130, 77, 78, 79, 80, 81, 82తోపాటు హకీంపేట్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 97 పరిధిలోని భూములపై సర్వే నిర్వహిస్తున్నట్లు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ భూముల సర్వే కోసం ఈ ఏడాది మేలో జారీ చేసిన నోటీసులకు కొనసాగింపుగా మరోమారు నోటీసులు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. 66 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని ప్రాథమిక నివేదిక.. ఈటల తమ భూములను కబ్జా చేశారంటూ కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. తక్షణమే విచారణ చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. భూ ఆక్రమణలపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఏసీబీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగాలకూ ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖ కూడా తమ భూములు ఏమైనా ఆక్రమణకు గురయ్యాయా అనే దానిపై విచారణ చేపట్టింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా శాఖల ఉన్నతాధికారులు సర్వే, విచారణ చేపట్టగా జమున హేచరీస్‌లో 66 ఎకరాల అసైన్డ్, సీలింగ్ భూములున్నాయని మెదక్ కలెక్టర్ అప్పట్లో ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఈ భూముల్లో షెడ్లు, రోడ్లు, భవనాలు నిర్మించారని, చెట్లు నరికారని పేర్కొన్నారు. మేలో జరగాల్సిన సర్వే.. జమునా హేచరీస్ సంస్థ అసైన్డ్, సీలింగ్ భూ ములను ఆక్రమించిందనే ఆరోపణలపై మెదక్ జిల్లా అధికారులు ఈ ఏడాది మేలో సర్వే చేపట్టారు. దీనిపై జమున హేచరీస్ హైకోర్టును ఆశ్రయించగా కోవిడ్ వ్యాప్తి తగ్గాక నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గడంతో ఈ భూములను సర్వే చేయాలని నిర్ణయించినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్ సోమవారం తెలిపారు. అసైన్డ్, సీలింగ్ భూములు ఎంత మేరకు ఆక్రమణలకు గురయ్యాయనే దానిపై ఈ సర్వేలో తేలుతుందన్నారు. -
Etela Rajender: జమున హ్యాచరీస్‌కు అటవీశాఖ నోటీసులు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మాజీమంత్రి ఈటల రాజేందర్ భూవివాదం నేపథ్యంలో విచారణ చేపట్టిన అటవీశాఖ జమున హ్యాచరీస్‌కు నోటీసులు జారీ చేసింది. హ్యాచరీస్ పరిశ్రమ కోసం రోడ్డు నిర్మిస్తున్న క్రమంలో మొత్తం 237 చెట్లు (పందిరి గుంజల సైజు) తొలగించినట్లు గుర్తించింది. ఈ మేరకు వాల్టా చట్టం కింద ఎందుకు కేసు నమోదు చేయకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని మెదక్ జిల్లా రామాయంపేట్ రేంజ్ ఆఫీసర్ కార్యాలయం నుంచి నోటీసులు పంపించారు. ఈ భూవివాదంపై రెవెన్యూ, విజిలెన్స్, ఏసీబీలతోపాటు అటవీశాఖ కూడా వారం రోజులుగా విచారణ చేస్తున్న విషయం విదితమే. జమునా హ్యాచరీస్ ఇచ్చే వివరణను బట్టి కేసు నమోదు చేస్తామని అటవీశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. వాల్టా చట్టం ప్రకారం.. నిబంధనలకు విరుద్ధంగా చెట్లు తొలగిస్తే ఆ మేరకు రెట్టింపు సంఖ్యలో, నిర్ణీత సమయంలో మొక్కలు నాటాలి. ఒక్కో మొక్క కోసం నిర్ణీత మొత్తంలో డబ్బును అటవీశాఖకు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అటవీ భూముల ఆక్రమణల్లేవు జమున హ్యాచరీస్ పరిశ్రమకు కేవలం 100 మీటర్ల దూరంలోనే రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. అయితే తమ భూములేమీ ఆక్రమణకు గురికాలేదని మెదక్ జిల్లా అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. చదవండి: Etela Rajender:రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలనుకుంటున్నారు -
Telangana High Court: సహజ న్యాయసూత్రాలను కాలరాస్తారా?
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు చెందిన జమున హ్యాచరీస్‌లో అసైన్డ్ భూముల పేరుతో మెదక్ కలెక్టర్ హడావుడిగా చేసిన విచారణను హైకోర్టు తప్పుబట్టింది. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండానే ఆగమేఘాలపై విచారణ చేపట్టడం ఏమిటని నిలదీసింది. రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించిన ఆర్టికల్ 14, 19, 21ని ఉల్లంఘించే అధికారం కలెక్టర్‌కు ఉందా? అని ప్రశ్నించింది. ఈ నెల 1న కలెక్టర్ ఇచ్చిన నివేదికను పరిగణనలోకి తీసుకోరాదని, దానితో ప్రభావితం కావొద్దని రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. జమున హ్యాచరీస్ యాజమాన్యానికి తాజాగా నోటీసులు జారీచేయాలని, వివరణ ఇచ్చేందుకు నిర్దిష్టమైన సమయం ఇవ్వాలని.. ఆ తర్వాత తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చని తేల్చిచెప్పింది. అప్పటివరకు బలవంతంగా ఎటువంటి చర్యలు చేపట్టరాదని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులి చ్చారు. తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మెదక్ కలెక్టర్ తమ కంపెనీలో విచారణ చేపట్టడాన్ని సవాల్ చేస్తూ.. జమున హ్యాచరీస్ తరఫున ఈటల రాజేందర్ కుమారుడు నితిన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి హౌస్ మోషన్ రూపంలో అత్యవసరంగా విచారించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. కనీస నిబంధనలు పాటించరా? ఏప్రిల్ 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విచారణ చేయాలని కలెక్టర్‌ను ఆదేశించడం, వెంటనే విచారణ జరిపి తర్వాతి రోజే నివేదిక సమర్పించడం జరిగిపోయిందని.. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఏ నిబంధన ప్రకారం జమునా హ్యాచరీస్ భూముల్లోకి కలెక్టర్ ప్రవేశించారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలంటూ విచారణను భోజన విరామం తర్వాతకు వాయిదా వేశారు. కలెక్టర్ చేపట్టింది ప్రాథమిక విచారణ మాత్రమేనని, రెవెన్యూ అధికారి విచారణ కోసం ఎవరి భూమిలోకి అయినా వెళ్లొచ్చని ఏజీ వివరణ ఇవ్వడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ప్రాథమిక హక్కులను, చట్ట నిబంధనలను కలెక్టర్ ఉల్లంఘిస్తున్నా చూస్తూ ఊరుకోవాలా? విచారణ చేసి ఎన్ని గంటల్లో నివేదిక ఇచ్చారు? ప్రతివాదిగా ఉన్న వ్యక్తికి నోటీసు ఇవ్వకుండా ఎలా విచారణ చేస్తారు? ఈ విషయంలో కనీస ప్రొటోకాల్ పాటించలేదు. సెక్షన్ 149, 151 ప్రకారం.. సదరు కంపెనీ యజమానికి సమాచారం ఇవ్వాలి. వారి సమక్షంలోనే విచారణ చేయాలి. కలెక్టర్ నోటీసులు జారీచేసి ఉంటే ఈ అపవాదు వచ్చేదికాదుగా. సచివాలయంలోకి ఎవరైనా ప్రవేశించాలంటే ఎటువంటి ప్రొటోకాల్ పాటించాలో.. అలాగే విచారణ జరిపే సమయంలోనూ నిబంధనల మేరకు వ్యవహరించాలి. బ్యాక్ డోర్ నుంచి కాకుండా రాజమార్గంలో వెళ్లాలి. అధికారులు ముందస్తు ప్రణాళిక ప్రకారం కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లుగా ఉంది’’ అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. మొక్కుబడి నోటీసులు వద్దు సేల్స్ ట్యాక్స్ అధికారుల తరహాలో మొక్కుబడిగా నోటీసులు జారీచేసి చర్య తీసుకుంటామంటే కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. సేల్స్ ట్యాక్స్ అధికారులు మూడు వేర్వేరు తేదీల్లో నోటీసులు జారీ చేసినట్లు చూపించి, తర్వాత చర్య తీసుకున్నామని చెప్తుంటారు. నోటీసులు ఎవరికి ఇచ్చారనేది చెప్పరు. ఈ కేసులో అలా వ్యవహరించడానికి వీల్లేదు. శుక్రవారం నోటీసులిచ్చి సోమవారానికల్లా వివరణ ఇవ్వాలంటే కుదరదు. కనీసం వారం రోజుల సమయం ఇవ్వాలి. వివరణ తీసుకున్న, విచారణ జరిపి తప్పు జరిగినట్టు నిర్ధారణ అయితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చు’’ అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మెదక్ కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌తోపాటు డీజీపీ, ఏసీబీ, విజిలెన్స్ డైరెక్టర్ జనరల్, మెదక్ ఎస్పీలను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. విచారణను జూలై 6కు వాయిదా వేశారు. ఎవరి వాదన ఏంటి? అవి అసైన్డ్ భూములే.. కలెక్టర్ వెళ్లొచ్చు: ఏజీ ‘‘జమున హ్యాచరీస్‌లో అసైన్డ్ భూములు ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల ఆధారంగానే విచారణ జరిపాం. ఆ భూములను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ చట్టం సెక్షన్ 156 ప్రకారం వాస్తవాలు తెలుసుకునేందుకు రెవెన్యూ అధికారికి ఎవరి భూమిలోకైనా ప్రవేశించే అధికారం ఉంటుంది. విచారణ సమయంలో హేచరీస్ జనరల్ మేనేజర్ అక్కడే ఉన్నారు. అయినా ముందు జాగ్రత్తగా ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదు. కలెక్టర్ చేసినది ప్రాథమిక విచారణ మాత్రమే.. చర్యలు చట్టబద్ధంగానే ఉంటాయి. ప్రాథమిక విచారణ చట్టబద్ధమేనని పేర్కొంటూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తాం’’ అని హైకోర్టులో అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదన వినిపించారు. కానీ దీనిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. నోటీసు జారీచేయకుండా విచారణ చేయవచ్చనేందుకు ఏజీ ఎటువంటి నిబంధనలను చూపించలేకపోయారని స్పష్టం చేశారు. అప్పటికప్పుడే ప్రభుత్వ భూములంటూ బోర్డు: పిటిషనర్ ‘‘అడ్వొకేట్ జనరల్ ఇది ప్రాథమిక విచారణ మాత్రమే అని చెప్తున్నారు. ఏకపక్షంగా విచారణ చేసి.. అప్పటికప్పుడే కేవలం హ్యాచరీస్ ఎదుట ఇవి ప్రభుత్వ భూములంటూ బోర్డు పెట్టారు. హ్యాచరీస్ కంపెనీ రైతులకు చెందిన 60 ఎకరాల పట్టా భూములను కొనుగోలు చేసింది. ఈ భూముల వివరాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో కూడా ఉన్నాయి. కలెక్టర్ సర్వే చేసే ముందు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారు. పెద్ద ఎత్తున పోలీసులు, రెవెన్యూ అధికారులు హ్యాచరీస్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించారు. ఇలా చట్టవిరుద్ధంగా వ్యవహరించడం ఆర్టికల్ 300 (ఎ) ప్రకారం రాజ్యాంగబద్ధ హక్కులను హరించడమే. విచారణ పేరుతో కలెక్టర్ ఇచ్చిన నివేదికను కూడా మాకు అందజేయలేదు. ప్రస్తుతం హ్యాచరీలో 1.60 లక్షల కోళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ నివేదికను చట్టవిరుద్ధంగా ప్రకటించండి. బలవంతపు చర్యలు తీసుకోకుండా, చట్టబద్ధంగా వ్యవహరించేలా ఆదేశించండి’’ అని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. చదవండి: హైకోర్టును ఆశ్రయించిన జమున హ్యాచరీస్ ఇవన్నీ పనికి రావు.. సంపూర్ణ లాక్‌డౌనే ఏకైక మార్గం -
ఫిర్యాదులు; రాష్ట్రవ్యాప్తంగా ఈటల ఆస్తులపై ఆరా!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ విషయంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల పరిధిలో దాదాపు 66 ఎకరాల భూమిని మంత్రి తమ నుంచి లాక్కున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే సీఎం ఆదేశాలతో అధికారులు ఆగమేఘాల మీద స్పందించిన విషయం తెలిసిందే. రంగంలోకి దిగిన మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ భూ ఆక్రమణలు నిజమేనని తేల్చారు. ఈ మేరకు నివేదిక కూడా ఇచ్చారు. విజిలెన్స్ విచారణ సోమవారం పూర్తి కానుంది. విజిలెన్స్ విచారణ అనంతరం రాజేందర్ విషయంలో మరిన్ని పరిణామాలు చోటుచేసుకోనున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా కలెక్టర్ ఇప్పటికే భూ కబ్జాను నిర్ధారించడంతో ఆయనపై రెవెన్యూ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కబ్జాతోపాటు బెదిరింపులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలపై రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని సమాచారం. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మాజీ మంత్రిపై కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కబ్జా భూముల్లో ఉన్న చెట్లు నరికినందున ఫారెస్టు కన్జర్వేషన్ యాక్ట్, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడం, అందులో నిర్మాణాలు, రోడ్డు నిర్మాణాలు చేపట్టడంపై కూడా రాజేందర్‌పై కేసులు నమోదవుతాయని సమాచారం. కేవలం మాసాయిపేట మండలమే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రాజేందర్ ఆస్తులపై ప్రభుత్వం ఆరా తీస్తోందని తెలిసింది. చదవండి: ‘ఈటల కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటాం’ -
‘ఈటల బావమరది సూరి బెదిరించారు’
సాక్షి, హైదరాబాద్: ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన జమునా హేచరీస్ సంస్థ మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో 66.01 ఎకరాల అసైన్డ్ భూములను కబ్జా చేసిందని జిల్లా కలెక్టర్ హరీశ్.. రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక విచారణ నివేదికలో తేల్చిచెప్పారు. హకీంపేటలోని సర్వే నం.97, అచ్చంపేటలోని సర్వే నం. 77, 78, 79, 80, 81, 82, 103లో ఆక్రమించిన అసైన్డ్ భూముల్లో పౌల్ట్రీ షెడ్లు, భవనాలు, రోడ్డును జమున హేచరీస్ నిర్మించిందని నిర్ధారించారు. తెలంగాణ అసైన్డ్ భూముల(పీఓటీ) చట్టం–1977 కింద సదరు భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంతో పాటు నిబంధనల మేరకు ఇతర చర్యలు తీసు కుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ఈటల భూకబ్జా ఆరోపణలపై శనివారం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో మెదక్ జిల్లా కలెక్టర్ ఆగమేఘాల మీద విచారణ జరిపి అదేరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రాథమిక నివేదికను పంపించారు. త్వరలో తుది నివేదిక సమర్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. ఆదివారం అనధికారికంగా బయటకు వచ్చిన ప్రాథమిక నివేదికలోని ముఖ్యాంశాలు.. ఖజానాకు భారీ నష్టం... అసైన్డ్ భూముల్లో కచ్చా రోడ్డును వేశారని, దీనికోసం చాలా చెట్లను అనుమతి లేకుండా నరికారని మెదక్ డివిజనల్ ఫారెస్టు అధికారి(డీఎఫ్‌వో) నివేదిక సమర్పించారు. నరికివేసిన చెట్ల సంఖ్యను తక్షణమే మదించి అటవీ సంరక్షణ చట్టం–1980 కింద బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ వ్యవసాయేతర భూ మార్పిడి(నాలా) చట్టం–2006 కింద అనుమతి తీసుకోకుండానే పట్టా భూముల్లో జమున హేచరీస్ భారీ పౌల్ట్రీ షెడ్డు, ప్లాట్ ఫారాలు, భవనాలు, రోడ్డు నిర్మించడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. జరిగిన నష్టాన్ని నాలా చట్టంలోని సెక్షన్ 4 కింద మదించి రెవెన్యూ రికవరీ చట్టం (ఆర్ఆర్ యాక్టు) కింద పాత బకాయిలను వసూలు చేయాలని అధికారులను ఆదేశించడం జరుగుతుందని తెలిపారు. హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో జమున హేచరీస్ కబ్జా చేసిన ప్రభుత్వ, సీలింగ్ అసైన్డ్, పట్టా భూముల జాబితాను పట్టిక రూపంలో జిల్లా కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. గ్రామం, సర్వే నంబర్, మొత్తం భూవిస్తీర్ణం, జమున హేచరీస్ అధీనంతలోని భూవిస్తీర్ణం, కబ్జా చేసిన భూ విస్తీర్ణం వివరాలను పట్టికలో పొందుపరిచారు. జమునా హేచరీస్ అధీనంలోని 55.26 ఎకరాల పట్టా భూములు సైతం విచారణ(ఎగ్జామిషన్)లో ఉన్నట్టు ఈ పట్టికలో పేర్కొనడం గమనార్హం. అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో జమునా హేచరీస్ అధీనంలోని పట్టాభూములు, సీలింగ్ అసైన్డ్ భూములకు సంబంధించిన నక్షాను సైతం నివేదికతో కలెక్టర్ జతచేశారు. ఈటల బావమరది సూరి బెదిరింపులు... ఈటల రాజేందర్ భూ వ్యవహారంలో ఆయన బావమరిది సూరి అలియాస్ సురేష్ పేరు తెరపైకి వచ్చింది. ఈటల, సూరి తమను బెదిరించి భూ కబ్జాకు పాల్పడ్డారని పలువురు ఇచ్చిన వాంగ్మూలాన్ని జిల్లా కలెక్టర్ నివేదికలో పొందుపరిచారు. మొత్తం డబ్బులు ఇవ్వకుండానే తమ భూములను కబ్జా చేశారని చాకలి బుచ్చమ్మ(1.30 ఎకరాలు), చాకలి పరుశురాం/నాగులు (1.20 ఎకరాలు), బానాపురం రాములు(3 ఎకరాలు), ఎరుకల ఎల్లయ్య(3 ఎకరాలు) స్టేట్మెంట్ ఇవ్వగా, అసలు ఎలాంటి డబ్బులు ఇవ్వకుండానే తమ భూమి లాక్కున్నారని బానాపురం దుర్గయ్య(3 ఎకరాలు), చాకలి లింగయ్య(1.2 ఎకరాలు), చాకలి క్రిష్ణ(1.2 ఎకరాలు) స్టేట్మెంట్ ఇచ్చారు. రికార్డుల ప్రకారం ఈ భూములన్నీ అసైన్డ్ భూములని కలెక్టర్ నిర్ధారించారు. తమ భూములను ఈటల కబ్జా చేసి రోడ్డు, పౌల్ట్రీ షెడ్లు, ప్రహరీ నిర్మించారని కొందరు చెప్పగా, తమ భూముల నుంచి అక్రమంగా మట్టిని తరలించుకుపోయారని మరికొందరు పేర్కొన్నారు. 20 మంది ఫిర్యాదు... బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన తమకు 1994లో ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను ఈటల రాజేందర్, ఆయన సంబంధీకులు కబ్జా చేసి పౌల్ట్రీ షెడ్లు నిర్మించారని, తీవ్ర పరిణామాలు చూడాల్సి ఉంటుందని బెదిరించారని చాకలి లింగయ్య, ఇతరులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై హకీంపేట, అచ్చంపేట గ్రామాల్లో విచారణ జరిపి క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించడం జరిగిందని నివేదకలో కలెక్టర్ పేర్కొన్నారు. దాదాపు 20 మంది తమ భూములను జమున హేచరీస్ కబ్జా చేసిందని విచారణ సందర్భంగా ఫిర్యాదు చేయడంతో పాటు తిరిగి వాటిని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. చదవండి: సీఎం కేసీఆర్ సంచలనం: ఈటల బర్తరఫ్ -
హ్యాచరీల దందాకు చెక్
కోళ్లరైతుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రైవేటు హ్యాచరీల దందాకు ప్రభుత్వం చెక్ పెట్టనుంది. బ్రాయిలర్ కోళ్ల రైతుల సమస్యలపై ప్రభుత్వం నియమించిన కమిటీ క్షేత్రస్థాయిలో పలు అంశాలను పూర్తిస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి పంపింది. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన విధివిధానాలు, నిబంధనలను అమలు చేసే యోచనలో ఉంది. పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కదలిక వచ్చింది. ఫలితంగా జిల్లాలో కోడిపిల్లలను పెంచే రైతుల కష్టాలు త్వరలో తీరనున్నాయి. సాక్షి, పలమనేరు(చిత్తూరు): జిల్లాలో బ్రాయిలర్ కోడిపిల్లల ధరలను హ్యాచరీస్ వారు ఇష్టానుసారంగా నిర్ణయిస్తున్నారు. కోళ్లకు సంబంధించిన వ్యాధుల నివారణకు కంపెనీలు పంపిణీ చేసే మందుల ధరలను వారే నిర్ణయిస్తున్నారు.కోళ్లదాణా విషయంలో నాణ్యతలేని దాణాను కంపెనీలు రైతులకు అందిస్తున్నాయి. బ్రాయిలర్ కోడిపిల్లలకు వేసే టీకాలైన లసోట, వీబీడీ, జెంటామైసిన్‌లను ప్రైవేటువారు నిపుణుల చేత వేయించడం లేదు. వాటిని రైతులకిచ్చి వెళుతుండడంతో.. అనుభవం లేని రైతులు టీకాలు సక్రమంగా వేయక కోడిపిల్లలకు వ్యాధుల బాధ తప్పడంలేదు. హ్యాచరీలు రైతులకు సరఫరా చేసే కోడిపిల్లల్లో కొంతశాతం బలహీనమైన వాటిని ఇచ్చేస్తున్నారు. నాణ్యత లేమితో నష్టపోతున్న రైతులు.. సాధారణంగా నాణ్యమైన కోడిపిల్ల 40 గ్రాముల బరువు ఉండాలి. అయితే కంపెనీ అందించే కోడిపిల్లల్లో 30శాతం పిల్లల బరువు 30 నుంచి 35 గ్రాములుగానే ఉంటోది. దీంతో కోళ్లపెంపకం రైతులకు నష్టం తప్పడం లేదు. ఫలితంగా కోళ్ల మరణాల శాతం పెరిగి ఎఫ్‌సీఆర్ (ఫీడ్ కన్వర్షన్ రేషియో) పెరగడంతో రైతులకు కంపెనీలు చెల్లించే ధరలు తగ్గుతున్నాయి. 40 నుంచి 50 రోజుల పాటు రైతు కోడిపిల్లలను పెంచినందుకు కిలోకు రూ 5కు పైగా అందాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కిలోకు రూ.4 కూడా దక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వానికి నివేదిక ఇలా.. జిల్లాలోని కోళ్ల రైతుల సమస్యలపై బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడను కలిసి విన్నవించారు. దీనిపై స్పందించిన ఆయన, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వెటర్నరీ డైరెక్టర్ సోమశేఖర్ చిత్తూరు పశుసంతతి పరిశీలన పథక సహాయసంచాలకులు డా.షేక్ అసీఫ్‌తో ఏకసభ్య కమిటీని నియమించారు. ఆయన జిల్లాలోని బ్రాయిలర్ కోడిపిల్లల పెంపకదారులైన రైతుల బాధలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పలు ప్రైవేటు హ్యాచరీల వ్యవహారాలను గమనించి నివేదికను పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకుల కార్యాలయానికి రెండ్రోజుల క్రితం సమర్పించారు. వారు ప్రభుత్వానికి ఈ నివేదికను పంపారు. సమస్యలకు పరిష్కారం ఇలా... ప్రైవేటు హ్యాచరీల ధరల నిర్ణయంపై ప్రభుత్వ అజమాయిషీ నాణ్యమైన దాణాను వెటర్నరీ శాఖ నుంచి పంపిణీ చేయడం దాణా నాణ్యతను నిర్ణయించేందుకు తిరుపతిలోని వెటర్నరీ కళాశాల న్యూట్రీషియన్ శాఖకు అప్పగించడం కోళ్లకు సోకే వ్యాధులపై జంతువ్యాధి నిర్ధారణ ప్రయోగశాల ద్వారా పరీక్షలు కోడిపిల్లలను ఇచ్చే కంపెనీలే వాక్సినేటర్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవడం వంటి సూచనలను నివేదికలో పొందుపరిచారు. మా పోరాటం ఇన్నాళ్లకు ఫలించనుంది.. కోళ్ల రైతుల కష్టాలపై చాలా ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి పాదయాత్ర చేసినపుడు ఆయనకు సమస్యను విన్నవించాం. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ద్వారా ప్రభుత్వానికి సమస్యను తెలుపగా ప్రభుత్వం కమిటీని వేసింది. – విశ్వనాథరెడ్డి, జిల్లా కోళ్లరైతు సంఘ నాయకులు, పలమనేరు హ్యాచరీల చేతుల్లో రైతులు కీలుబొమ్మలే.. హ్యాచరీలు నాణ్యతలేని కోడి పిల్లలనిచ్చినా, దాణా బాగా లేకున్నా రైతులు తీసుకోవాల్సిందే. కాదూ కూడదంటే పిల్లలను ఇవ్వరు. ఈ ప్రభుత్వం మా సమస్యలను అర్థం చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. మాకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నా. – మల్లికార్జునరెడ్డి, కోళ్లరైతు, కీలపల్లి, గంగవరం మండలం -
ఎకో హేచరీలు వచ్చేశాయ్..
సాక్షి, బాల్కొండ (నిజామాబాద్): శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఎకో హెచరీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇంతకు ముందు జాతీయ చేప పిల్లల కేంద్రంలో జార్ హెచనీ ఉండేది. జార్ హేచరీ శిథిలావస్థకు చేరడంతో ముందుగా ఆ హేచరీకి మరమ్మతులు చేపట్టడానికి అధికారులు ఆలోచన చేశారు. కానీ దానికి బదులుగా ఎకో హేచరీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జాతీయ చేప పిల్లల కేంద్రం పునరుద్ధరణ పనుల్లో భాగంగా రెండు యునిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో యూనిట్ ఖరీదు రూ. 6 లక్షల విలువ ఉంటుందని అధికారులు తెలిపారు. ఒక్కో యూనిట్లో ఒక్క రోజులో 20 లక్షల స్పాన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. జాతీయ చేప పిల్లల కేంద్రంలో మూడు కోట్ల చేప పిల్లలను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుతం నూతన హేచరీతో ఎక్కువగా చేప పిల్లల ఉత్పత్తి చేపట్టవచ్చని ఫిషరీస్ అధికారులు తెలిపారు. జిల్లాలోని చెరువులకు సరిపడా చేప పిల్లలను ఇక్కడనే ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం జాతీయ చేప పిల్లల కేంద్రం పునరుద్ధరణకు భారీగా నిధులు మంజూరు చేసింది. ఎకో హేచరీ, జార్ హెచరీకి తేడాలివే.. ఎస్సారెస్పీ చేపపిల్లల కేంద్రంలో ఇది వరకు జార్ హేచరీ ఉంది. జార్ హేచరీకి భవన నిర్మాణం అవసరం ఉంటుంది. జార్ హేచరీ ఒక్క చోటనే ఎప్పటికి ఉండేలా నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉంటుంది. మరమ్మతులు చేపట్టడం అంత సులువు కాదు. ఎకో హెచరీకి భవన నిర్మాణం అవసరం లేదు. అంతే కాకుండా ఒక్క చోటనే పర్మినెంట్‌గా నిర్మిచాల్సి న అవసరం లేదు. పెద్ద పెద్ద చెరువుల వద్ద చేప పిల్లల ఉత్పత్తి కోసం కూడా ఎకో హేచరీని తరలించవచ్చు. ఎక్కువ సామర్థ్యంలో చేప పిల్ల ల ఉత్పత్తిని చేపట్టవచ్చు. రోజుకు 20 లక్షల స్పాన్‌ను ఉత్పత్తి చేయవచ్చు. హేచరీలో ఏం చేస్తారంటే.. తల్లి చేపలను తీసుకువచ్చి ముందుగా పొదుగా వేస్తారు. తల్లి చేపల నుంచి వచ్చిన గుడ్లను తీసి హెచరీలో బాయిల్డ్ చేసి స్పాన్‌ను ఉత్పత్తి చేస్తారు. అలా వచ్చిన స్పాన్ నుంచి చేప ప్లిలలు ఉత్పత్తి అవుతాయి. సగం స్పాన్ నుంచి చేప పిల్లల ఉత్పత్తి కాక ముందే స్పాన్ చనిపోతుంది. స్పాన్ నుంచి వచ్చిన చేప పిల్లలను నీటి కుండీల్లో వేసి దాణా వేస్తూ అంగులంసైజ్ వరకు పెంచుతారు. తరువాత మత్స్యసహకార సంఘాల ద్వారా చెరువుల్లో వదిలేందుకు నూరుశాతం సబ్సిడీపై పంపిణీ చేస్తారు. -
నాటు కోళ్ల హేచరీ!
మాంసాహారుల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతున్న కొద్దీ నాటు కోళ్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతూ వస్తున్నది. అయితే, షెడ్లలో కోళ్లను ఉంచి పెంచే పద్ధతిలో ఖర్చులు అధికమైన నేపథ్యంలో లాభాలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అయితే, ఉన్నత విద్యావంతులైన అరుణ్ క్రాంతి, నవత దంపతులు ఉద్యోగాలకు వెళ్లకుండా వినూత్నంగా ఆలోచించి నాటుకోళ్ల పెంపకం చేపట్టారు. వినూత్నంగా మొలక గడ్డినే మేతగా వేస్తున్నారు. అంతేకాదు, స్వల్ప ఖర్చుతోనే నాటుకోడి పిల్లల హేచరీని నిర్వహిస్తున్నారు. నెలకు సుమారు 10 వేల నాటు కోడి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. ఖర్చులు బాగా తగ్గించుకుంటూ అధిక లాభాలు పొందుతున్నారు. తమ ప్రాంతంలో యువతకు మార్గదర్శకులుగా నిలిచారు. వినూత్నమైన ఆలోచనలు, మనోబలంతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా రాణించవచ్చనడానికి నిదర్శనం ఈ యువ జంట. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన కాపరబోయిన అరుణ్ క్రాంతి బీటెక్, ఆయన భార్య నవత ఎంబీఏ చదివారు. ఇద్దరికీ కార్పొరేట్ ఉద్యోగాలు వచ్చినప్పటికీ, వ్యవసాయం, అనుబంధ రంగాలపై అభిరుచితో కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జగిత్యాల సమీపంలోని తమ రెండెకరాల భూమిలో చుట్టూ ఇనుప మెష్ వేసి, ఒక షెడ్డు వేసుకొని, ఆరుబయటే తిరుగాడే పద్ధతిలో నాటు కోళ్లను పెంచుతున్నారు. తొలుత, 2005 నుండి 2012 వరకు ఈము పక్షుల పెంపకాన్ని చేపట్టి, మార్కెటింగ్ సమస్యల వల్ల భారీ నష్టాలను చవిచూశారు. తదనంతరం కూడా ఉద్యోగాల వైపు చూడకుండా మనోధైర్యంతో వినూత్నంగా నాటు కోళ్ల పెంపకంతోపాటు హేచరీపై దృష్టి పెట్టి నిలదొక్కుకున్నారు. నెలకు రూ. లక్ష ఆదాయం పొందేలా ఎదిగారు. 800 నాటు కోళ్లు.. 10 వేల కోడి పిల్లలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలో కోళ్ల ఫారాలను స్వయంగా పరిశీలించారు. నాటుకోళ్లను షెడ్లలో పెంచడం వల్ల వ్యాధులు వస్తున్నాయని, నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువై నష్టపోతున్నట్లు గ్రహించారు. షెడ్లలో పెంచడం వల్ల దాణా ఖర్చు ఎక్కువ అవుతుండటంతో పెద్దగా గిట్టుబాటు కావడం లేదని గుర్తించి, నాటు కోళ్లను వినూత్నంగా పెంచాలని నిర్ణయించుకున్నారు. తొలుత 100 గుడ్లతో కోళ్ల పెంపకం చేపట్టగా, నేడు 800 కోళ్లతో పాటు, నెలకు 5–10 వేల కోడి పిల్లలను అమ్మే స్థాయికి ఎదిగారు. కృత్రిమంగా గుడ్లను పొదిగే ఇంక్యుబేటర్‌ను కొనుగోలు చేయకుండా.. అందుబాటులో ఉన్న వస్తువులతో తయారు చేసుకున్నారు. 21 రోజుల్లో పిల్లలు బయటకు వస్తాయి. మరికొద్ది రోజుల పాటు లైట్ల కింద అతి జాగ్రత్తగా పెంచిన తర్వాత, కోడి పిల్లలను బయటకు వదులుతారు. ట్రేలలో పెంచే మొలక గడ్డి, ఆకుకూరలు, అజొల్లా.. ఆరు బయటకు వచ్చిన పిల్లలకు సమతుల పౌష్టికాహారంగా హైడ్రోపోనిక్ పద్ధతిలో ట్రేలలో పెంచే మొక్కజొన్నగడ్డి, జొన్న గడ్డి, గోధుమ గడ్డితోపాటు.. ఆరుబయట పొలంలో పాలకూర, ఆకుకూర, షేడ్‌నెట్ హౌస్‌లో అజొల్లాలను సొంతంగా పెంచి అందిస్తున్నారు. డక్వీడ్తోపాటు మినరల్స్ కూడా ఇస్తుంటారు. సాగు చేసిన తోటల్లో తిరుగుతూ కోళ్లు తమకు ఇష్టమైనవి తింటుంటాయి. కేవలం సాయంత్రం సమయాల్లో షెడ్లలోకి పిలిచేందుకే.. మొక్కజొన్న, సోయాబీన్, నూకలు, వరి తవుడును కలిపిన దాణా వేస్తుంటారు. సాధారణంగా పెరటి కోళ్లు పెంచే వారు పెట్టే ఖర్చులో 20% ఖర్చుతోనే వీరు మంచి ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. గ్రామాల నుంచి నాటు గుడ్ల సేకరణ నాటు కోడి పిల్లలకు డిమాండ్ రావడంతో, ప్రతి వారానికి జగిత్యాల చుట్టుపక్కల గ్రామాల నుండి 3–4 వేల గుడ్లను సేకరిస్తారు. వీటితో పాటు, తన ఫామ్‌లో కోళ్ల నుండి వచ్చిన గుడ్లను ముందుగా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తారు. తర్వాత, 6 గంటల పాటు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్ లేకుండా ఉండేందుకు ప్యూమిగేషన్ చేస్తారు. ఎందుకంటే, 21 రోజుల పాటు ఎలాంటి వైరస్ గుడ్లకు సోకకుండా కాపాడుతుంది. ఈ ప్రక్రియ పూర్తి కాగానే స్వయంగా తయారు చేసిన గుడ్లను ఉంచే పరికరంలో లైట్ల వెలుతురులో గుడ్లను పెడుతుంటారు. ఇలా.. దాదాపు ఆరు గుడ్ల నుండి పిల్లలు వచ్చే పరికరాలు ఉన్నాయి. దాదాపు నెలకు 5–10 వేల నాటు కోడి పిల్లలు అందిస్తున్నాడు. 80 రోజుల్లో కిలో–కిలోన్నర బరువు నాటు కోడి పిల్లలు కొనుగోలు చేసిన వ్యక్తులకు వీటిని ఏ రీతిన పెంచితే లాభాలు వస్తాయో కూడా వీరు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో కోడి పిల్లను రూ. 35 పెట్టి కొనుగోలు చేసి తీసుకెళ్లిన వారు.. 80 రోజుల్లో మార్కెట్లో అమ్మే వరకు ఏ రోజు ఏమి చేయాలో షెడ్యూల్ ఇస్తుంటారు. కోడి కిలో నుండి కిలోన్నర బరువు పెరగ్గానే అమ్మితే, కిలో రూ. 200 పలుకుతోంది. నాటు కోళ్లకు డిమాండ్ బాగా ఉండటంతో, వీరి నాటు కోళ్ల ఫారాన్ని ప్రతి రోజూ చాలా మంది చూసి వెళ్తుంటారు. ఓటమే రేపటి విజయానికి నాంది! ఏదో సాధించాలన్న తపనతోనే కోళ్ల పెంపకం చేపట్టాము. ఈము కోళ్ల పెంపకంతో చేతులు కాల్చుకున్నాం. విదేశీ కోళ్ల సాగులో గుణపాఠం నేర్చుకొని అత్యంత శ్రద్ధతో నాటు కోళ్లు, పిల్లల పెంపకం చేపట్టాం. ఓటమే రేపటి విజయానికి నాంది అనడానికి మేమే నిదర్శనం. ప్రతి రోజూ కోళ్ల ఫారానికి వచ్చి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. నిశితంగా గమనిస్తూ ఉంటే ఏ కోడి గుడ్డు పెడుతుందో, ఏ కోడి పెట్టడం లేదో మాకు తెలిసిపోతుంది. కోళ్లకు వివిధ రకాల గడ్డిని ట్రేలలో పెంచుతుంటాం. ఆరోగ్యంగా ఆరుబయట తిరుగాడుతూ పెరుగుతున్న నాటు కోళ్లను చూస్తే తృప్తిగా ఉంటుంది. – నవత, అరుణ్ క్రాంతి (90005 67121), జగిత్యాల కృత్రిమంగా గుడ్లను పొదిగే ఏర్పాటు విద్యుత్ దీపాల వెలుగులో నాటు కోడి పిల్లలు ట్రేలలో పెరుగుతున్న మొలక గడ్డి మొక్కజొన్న మొలక గడ్డిని తింటున్న కోళ్లు – పన్నాల కమలాకర్ రెడ్డి, సాక్షి, జగిత్యాల అగ్రికల్చర్ -
మే నాటికి వాటర్‌బేస్ హ్యాచరీ రెడీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రొయ్యల దాణా ఉత్పత్తిలో ఉన్న వాటర్‌బేస్ నెల్లూరు జిల్లాలో హ్యాచరీని ఏర్పాటు చేస్తోంది. రామతీర్థం సమీపంలో రానున్న ఈ ప్లాంటులో ఏటా 50 కోట్ల పిల్ల రొయ్యలను ఉత్పత్తి చేస్తారు. తొలి దశ ప్లాంటు ఈ ఏడాది మే నెలలో ప్రారంభం కానుంది. రెండో దశ 2019 జనవరిలో కార్యరూపంలోకి వస్తుంది. ప్రాజెక్టు కోసం మొత్తం రూ.20 కోట్లు వెచ్చిస్తున్నట్టు కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఈ మొత్తంలో సగం రుణం ద్వారా సమకూర్చుకుంటామని చెప్పారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 100 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన వివరించారు. తొలి ఏడాది రూ.10 కోట్లు: వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచే హ్యాచరీ ద్వారా కంపెనీకి ఆదాయం సమకూరనుంది. 2018–19లో రూ.10 కోట్లు, 2019–20లో రూ.25 కోట్ల ఆదాయాన్ని వాటర్‌బేస్ ఆశిస్తోంది. కాగా, దాణా తయారీకి కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్ల వార్షిక సామర్థ్యం 1,10,000 టన్నులు ఉంది. ప్రస్తుతం 50,000 టన్నులు విక్రయిస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో విక్రయాలు 60,000 టన్నులు దాటనుందని అంచనా వేస్తోంది. కంపెనీ 2017–18 ఏప్రిల్–డిసెంబరు కాలంలో రూ.277 కోట్ల టర్నోవర్‌పై రూ.27 కోట్ల నికరలాభం ఆర్జించింది. కంపెనీకి అవార్డు: వాటర్బేస్కు రొయ్యల దాణా విభాగంలో ఆసియాస్ మోస్ట్ వాల్యుయేబుల్ బిజినెస్ బ్రాండ్ అవార్డు వరించింది. సింగపూర్‌లో జరిగిన ఆసియన్ బ్రాండ్, లీడర్షిప్ కాంక్లేవ్‌లో కంపెనీ సీఈవో రమాకాంత్ ఆకుల ఈ అవార్డు అందుకున్నారు. ఐబ్రాండ్స్ 360 ఏటా ఈ అవార్డులను ప్రకటిస్తోంది. -
రొయ్యల హేచరీలలో కమిషనర్ తనిఖీలు
పిఠాపురం: తూర్పు గోదావరి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలోని రొయ్యల హేచరీలను బుధవారం మత్స్యశాఖ కమిషనర్ రాంశంకర్‌నాయక్ తనిఖీలు చేశారు. కొత్తపల్లి మండలం శ్రీరాంపురం చుట్టుపక్కల ఉన్న రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రాలను ఆయన పరిశీలించారు. అనుమతి లేని హేచరీలపై చర్యలు తీసుకుంటామని నిర్వాహకులను హెచ్చరించారు. -
యువకుడు అనుమానాస్పద మృతి
ఈతముక్కల (కొత్తపట్నం): సముద్రపు ఒడ్డున అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఈతముక్కలలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు టైలర్ కాలనీకి చెందిన షేక్ అమీద్ (22) అల్యూమినియం, రాడ్ బెండింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అమీద్‌తో పాటు మహ్మద్ సుల్తాన్, మహ్మద్ ఫక్రు, సయ్యద్ రసూల్, మరో వ్యక్తి 20 రోజులుగా స్థానికంగా నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ హేచరీలో పనిచేసేందుకు వచ్చారు. హేచరీ సముద్రానికి దగ్గరలో ఉన్నందున గురువారం రాత్రి సముద్రపు ఒడ్డున ఉన్న పడవ మీద కూర్చొని మద్యం తాగారు. రాత్రి హేచరీ దగ్గరకు వచ్చి నిద్రించారు. శుక్రవారం ఉదయం అమీద్ పక్కన లేకపోవడంతో మిగిలిన వారు అంతా వెతికారు. చివరకు సముద్రం ఒడ్డున మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై బి.నరసింహారావు మృతదేహానికి పంచనామా చేసి రిమ్స్‌కు తరలించారు. యువకుని మృతిపై అనుమానాలు అమీద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదుగురిలో సయ్యద్ రసూల్ అనే వ్యక్తి గురువారం రాత్రే నెల్లూరు వెళ్లడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ఎక్కడ గుర్తిస్తే అక్కడే పంచనామా చేస్తారు. అయితే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లేందుకు ఈతముక్కల పల్లెపాలెం రోడ్డుకు తీసుకురావడంపైనా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.