యువకుడు అనుమానాస్పద మృతి
ఈతముక్కల (కొత్తపట్నం): సముద్రపు ఒడ్డున అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మండలంలోని ఈతముక్కలలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు నెల్లూరు టైలర్ కాలనీకి చెందిన షేక్ అమీద్ (22) అల్యూమినియం, రాడ్ బెండింగ్ మేస్త్రీగా పనిచేస్తున్నాడు. అమీద్‌తో పాటు మహ్మద్ సుల్తాన్, మహ్మద్ ఫక్రు, సయ్యద్ రసూల్, మరో వ్యక్తి 20 రోజులుగా స్థానికంగా నూతనంగా నిర్మిస్తున్న ఆంజనేయ హేచరీలో పనిచేసేందుకు వచ్చారు.
హేచరీ సముద్రానికి దగ్గరలో ఉన్నందున గురువారం రాత్రి సముద్రపు ఒడ్డున ఉన్న పడవ మీద కూర్చొని మద్యం తాగారు. రాత్రి హేచరీ దగ్గరకు వచ్చి నిద్రించారు. శుక్రవారం ఉదయం అమీద్ పక్కన లేకపోవడంతో మిగిలిన వారు అంతా వెతికారు. చివరకు సముద్రం ఒడ్డున మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వీఆర్వో మస్తాన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్సై బి.నరసింహారావు మృతదేహానికి పంచనామా చేసి రిమ్స్‌కు తరలించారు.
యువకుని మృతిపై అనుమానాలు
అమీద్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదుగురిలో సయ్యద్ రసూల్ అనే వ్యక్తి గురువారం రాత్రే నెల్లూరు వెళ్లడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని ఎక్కడ గుర్తిస్తే అక్కడే పంచనామా చేస్తారు. అయితే పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రిమ్స్‌కు తీసుకెళ్లేందుకు ఈతముక్కల పల్లెపాలెం రోడ్డుకు తీసుకురావడంపైనా గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.