ఇంజినీర్‌ సుచిర్‌ బాలాజీ మృతి..మస్క్‌ కీలక ట్వీట్‌ | Elon Musk Backs Suchir Balaji Mother's Claim On Son's Death | Sakshi
Sakshi News home page

ఇంజినీర్‌ సుచిర్‌ బాలాజీ మృతి..ఇలాన్‌ మస్క్‌ కీలక ట్వీట్‌

Published Mon, Dec 30 2024 9:00 AM | Last Updated on Wed, Jan 1 2025 11:28 AM

Elon Musk Backs Suchir Balaji Mother's Claim On Son's Death

కాలిఫోర్నియా: ఓపెన్‌ఏఐ ఇంజినీర్‌ సుచిర్‌ బాలజీ మరణంపై అతడి తల్లి పూర్ణిమారావ్‌ చేస్తున్న ఆరోపణలకు ప్రముఖ బిలియనీర్‌ ఇలాన్‌ మస్క్‌(Elon Musk) మద్దతిచ్చారు. సుచిర్‌ బాలాజీ నవంబర్‌ 26న అమెరికాలోని సాన్‌ఫ్రాన్సిస్కోలోని తన అపార్ట్‌మెంట్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు.

అయితే సుచిర్‌ మరణంపై తల్లి పూర్ణిమారావ్‌ తాజాగా ఎక్స్‌(ట్విటర్‌)లో సంచలన పోస్టు చేశారు. సుచిర్‌ మృతిపై తాము ప్రైవేట్‌ డిటె‌క్టివ్‌తో చేయించిన దర్యాప్తులో భాగంగా రెండోసారి శవపరీక్ష చేశామని తెలిపారు. శవపరీక్ష ఫలితాలు పోలీసులు చెబుతున్నదానికి భిన్నంగా ఉన్నాయన్నారు. 

‘నవంబర్‌ 26న సుచిర్‌ అపార్ట్‌మెంట్‌లోకి ఎవరో ప్రవేశించారు. బాత్‌రూమ్‌లో సుచిర్‌కు ఇతరులకు మధ్య ఘర్షణ జరిగిన ఆనవాళ్లున్నాయి. రక్తపు మరకలు కూడా కనిపించాయి. ఇంతటి దారుణ హత్యను అధికారులు ఆత్మహత్యగా తేల్చారు. సుచిర్‌ అనుమానాస్పద మృతిపై ఎఫ్‌బీఐ విచారణ చేయాలి’అని పూర్ణిమారావ్‌ తన పోస్టులో డిమాండ్‌ చేశారు.  

పూర్ణిమారావ్‌ పెట్టిన ఈ పోస్టుకు బిలియనీర్‌ మస్క్‌ మద్దతు పలికారు. సుచిర్‌ది  ఆత్మహత్యలా కనిపించడం లేదని మస్క్‌ ఆమె ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. సుచిర్‌ మృతిపై తమ పోరాటానికి మద్దతివ్వాలని పూర్ణిమారావ్‌ ఈ సందర్భంగా మస్క్‌ను కోరారు. 

కాగా, సుచిర్‌ ఓపెన్‌ ఏఐ కంపెనీ చాట్‌జీపీటీ ఏఐ ప్రాజెక్టులో ఇంజినీర్‌గా పనిచేశారు. ఓపెన్‌ ఏఐ కంపెనీ కాపీరైట్‌ ఉల్లంఘనలకు పాల్పడుతోందని పనిచేస్తున్న కంపెనీపైనే ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. ఈ నేపథ్యంలోనే సుచిర్‌  మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌ కన్నుమూత
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement