నూరేళ్లూ జీవించిన ఏకైక అమెరికా అధ్యక్షుడు
వాషింగ్టన్: అమెరికా 39వ అధ్యక్షుడు, డెమొక్రటిక్ నేత జిమ్మీ కార్టర్ ఇక లేరు. ఇటీవలే 100వ పుట్టిన రోజు జరుపుకున్న ఆయన జార్జియా రాష్ట్రంలో ప్లెయిన్స్‌లోని తన నివాసంలో ఆదివారం ప్రశాంతంగా కన్నుమూశారు. అమెరికా అధ్యక్షుల్లో అత్యధిక కాలం జీవించిన రికార్డు ఆయనదే. 1977–81 మధ్య అధ్యక్షునిగా చేసిన కార్టర్ మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు దేశాధినేతలు కార్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన నాయకత్వ పటిమ తిరుగులేనిదని బైడెన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. గొప్ప వ్యక్తిత్వానికి, సానుకూల దృక్పథానికి కార్టర్ ప్రతిరూపమని కొనియాడారు. కార్టర్ అంత్యక్రియలను జనవరి 9న పూర్తి అధికార లాంఛనాలతో జరపనున్నట్టు ప్రకటించారు. రాజకీయంగా, సైద్ధాంతికంగా కార్టర్‌తో తాను తీవ్రంగా విభేదించినా ఆయన నిష్కళంక దేశభక్తుడన్నది నిస్సందేహమని ట్రంప్ పేర్కొన్నారు. కార్టర్ అంత్యక్రియలు స్వగ్రామంలో ఆయనకెంతో ఇష్టమైన సొంత వ్యవసాయ క్షేత్రంలోనే జరిగే అవకాశముంది.
రైతు బిడ్డ
జిమ్మీ కార్టర్‌గా ప్రసిద్ధుడైన జేమ్స్ ఎర్ల్ కార్టర్ జూనియర్ ఓ నికార్సైన రైతు బిడ్డ. 1924 అక్టోబర్ 1న జార్జియాలోని ప్లెయిన్స్ అనే చిన్న పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి కార్టర్ సీనియర్ ఓ రైతు. తల్లి లిలియన్ నర్సు. 1943లో అమెరికా నావల్ అకాడమీలో క్యాడెట్‌గా ఆయన కెరీర్ మొదలైంది. దీర్ఘకాలం పాటు విధులు నిర్వర్తించడమే గాక ప్రతిష్టాత్మక అణు జలాంతర్గామి కార్యక్రమానికి ఎంపికయ్యారు. 1962లో తొలిసారి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1970లో జార్జియా గవర్నర్ అయ్యారు. 1974లోనే అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ రాజీనామాకు దారితీసిన వాటర్‌గేట్ కుంభకోణం నుంచి అమెరికా అప్పటికింకా బయట పడనే లేదు. 1977 ఎన్నికల్లో నెగ్గి అమెరికా అధ్యక్షుడయ్యారు. 1979లో ఈజిప్టు, ఇజ్రాయెల్ మధ్య చరిత్రాత్మక శాంతి ఒప్పందంలో కీలకపాత్రధారిగా నిలిచారు. చైనాతో అమెరికా దౌత్య సంబంధాలకు తెర తీసిన అధ్యక్షునిగా నిలిచిపోయారు. మానవ హక్కులే మూలసూత్రంగా అమెరికా విదేశాంగ విధానాన్ని పునరి్నర్వచించారు. అయితే అఫ్గానిస్తాన్‌పై సోవియట్ యూనియన్ ఆక్రమణను అడ్డుకోలేకపోయారు. ఇరాన్ బందీల సంక్షోభమూ కార్టర్ చరిత్రపై ఓ మచ్చగా మిగిలింది.
డజన్ల కొద్దీ అమెరికన్లను ఇరాన్ తిరుగుబాటు విద్యార్థులు బందీలుగా చేసుకోవడం స్వదేశంలో ఆయన ప్రతిష్టను బాగా దెబ్బతీసింది. 1980 ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి రొనాల్డ్ రీగన్ చేతిలో ఓటమి చవిచూశారు. అలా వైట్‌హౌస్‌ను వీడినా కార్టర్ ప్రజాసేన మాత్రం నిరి్నరోధంగా కొనసాగింది. అమెరికా ప్రభుత్వం తరఫున ఉత్తర కొరియాకు శాంతి స్థాపన బృందాన్ని తీసుకెళ్లారు. అంతర్జాతీయంగా శాంతి స్థాపనకు చేసిన నిరి్వరామంగా కృషికి నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. కార్టర్‌కు ముగ్గురు పిల్లలున్నారు. ఆయన భార్య రోసలిన్ ఏడాది క్రితమే మరణించారు.
When I look at Jimmy Carter, I see a man not only for our times, but for all times. A man who embodied the most fundamental human values we can never let slip away.
And while we may never see his likes again, we would all do well to try to be a little more like Jimmy Carter. pic.twitter.com/I0xDM05xmH— President Biden (@POTUS) December 30, 2024
భారత్‌తో అనుబంధం
కార్టర్‌కు భారత్‌తో మంచి అనుబంధముంది. ఆయన తల్లి లిలియన్ పీస్ కార్ప్స్ బృందంలో భాగంగా 1960ల చివర్లో భారత్‌లో హెల్త్ వలంటీర్‌గా పని చేశారు. దాంతో కార్టర్ భారత్‌కు సహజ మిత్రునిగా పేరుబడ్డారు. మన దేశంలో పర్యటించిన మూడో అమెరికా అధ్యక్షునిగా నిలిచారు. 1977లో కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమర్జెన్సీని ఎత్తేసిన మరుసటేడాది కార్టర్ భార్యాసమేతంగా భారత్‌కు వచ్చారు. ఆ సందర్భంగా భారత పార్లమెంటులో చేసిన ప్రసంగంలో నియంతృత్వ పాలనను స్పష్టంగా వ్యతిరేకించారు. ద్వైపాక్షిక సంబంధాలను ఎంతగానో మెరుగుపరిచినదిగా ఆ పర్యటన చిరస్థాయిగా నిలిచిపోయింది. కార్టర్ దంపతులు ఢిల్లీ సమీపంలోని ఓ గ్రామాన్ని సందర్శించడం అందరినీ ఆకర్షించింది.
Comments
Please login to add a commentAdd a comment